చిత్త‘శుద్ధి’ తగ్గింది..! | Telangana 7th Position In Swachh Survekshan 2018 Rankings | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 24 2018 3:02 AM | Last Updated on Sun, Jun 24 2018 3:02 AM

Telangana 7th Position In Swachh Survekshan 2018 Rankings - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌–2018’ ర్యాంకుల్లో తెలం గాణ నగరాలు, పట్టణాలు నిరాశాజనక ప్రదర్శన కనబరిచాయి. లక్షకుపైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో టాప్‌–100లో రాష్ట్రం నుంచి ఈసారి మూడు నగరాలే చోటు దక్కించు కున్నాయి. గతేడాది జాతీయ స్థాయిలో 22వ స్థానంలో నిలిచిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ).. ఈ ఏడాది 27వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. సూర్యాపేట 45, కరీంనగర్‌ 73వ స్థానంలో నిలిచాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, భోపాల్‌ నగరాలు తొలి రెండు ర్యాంకులు, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌ మూడో ర్యాంకును సాధించాయి. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలు వరుసగా 5, 6, 7 స్థానాల్లో నిలిచాయి. ఒంగోలు 83, చిత్తూరు 95వ స్థానాల్లో నిలిచాయి.    

తెలంగాణకు 7వ స్థానం
స్వచ్ఛ సర్వేక్షన్‌ ర్యాంకుల నివేదికను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ శనివారం వెల్లడించింది. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నగరాలకు ఇండోర్‌లో పురస్కారాలు ప్రదానం చేసింది. స్వచ్ఛతలో జాతీయ స్థాయిలో జార్ఖండ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు తొలి ఐదు ర్యాంకుల సాధించగా.. తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. ఆయా రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాలు సాధించిన సగటు స్కోరు ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. పౌరుల అభిప్రాయం ప్రకారం పారిశుధ్యం మెరుగుదలలో లక్షకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో జాతీయ స్థాయిలో 14వ స్థానంలో, లక్ష లోపు జనాభా ఉన్న నగరాల విభాగంలో 26వ స్థానంలో తెలంగాణ నిలిచింది. రాష్ట్రాల వారీగా లక్షకు పైగా జనాభా ఉన్న పురపాలికల విభాగంలో 7వ స్థానంలో, లక్ష లోపు జనాభా ఉన్న పురపాలికల విభాగంలో 6వ స్థానంలో నిలిచింది. 

దక్షిణాదిలో సిద్దిపేట టాప్‌..  
ఘన వ్యర్థాల నిర్వహణలో జాతీయ స్థాయిలో ఉత్తమ నగరంగా నిలిచిన జీహెచ్‌ఎంసీ పురస్కారం అందుకుంది. ఉత్తర, దక్షిణ, ఈశాన్య, పశ్చిమ ప్రాంతాల వారీగా లక్ష లోపు జనాభా ఉన్న 4 పురపాలికలకు పురస్కారాలు అందించగా.. దక్షిణాది రాష్ట్రాల తరఫున 4 పురస్కారాల్లో మూడింటిని రాష్ట్రం కైవసం చేసుకుంది. దక్షిణాదిలో అత్యంత పరిశుభ్ర నగరంగా సిద్దిపేట, పౌరుల అభిప్రాయం ప్రకారం అత్యుత్తమ నగరంగా బోడుప్పల్, ‘నూతన ఒరవడి, ఉత్తమ విధానాల అమలు’లో పీర్జాదిగూడ పురపాలిక పురస్కారాన్ని అందుకుంది. రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, మోయర్‌ బొంతు రామ్మోహన్‌ల నేతృత్వంలోని బృందం ఈ పురస్కారాలు అందుకుంది.

రాష్ట్రం నుంచి రెండు పురపాలికలే..
జాతీయ స్థాయిలో లక్ష లోపు జనాభా ఉన్న టాప్‌–100 పురపాలికల్లో సిద్దిపేట రెండో ర్యాంకును కైవసం చేసుకోగా, భువనగిరి 49వ ర్యాంకును సాధించింది. ఈ విభాగంలో రాష్ట్రం నుంచి రెండు పురపాలికలకే స్థానం దక్కింది. మహారాష్ట్రలోని పంచ్‌గని తొలి స్థానం కైవసం చేసుకోగా, ఏపీ నుంచి ఒక్క పట్టణానికీ చోటు దక్కలేదు. దేశంలోని 61 కంటోన్మెంట్‌ బోర్డులకు ర్యాంకులకు కేటాయించగా, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు 46వ స్థానంలో నిలిచింది. జోనల్‌ ర్యాంకుల విభాగంలో దక్షిణాది ప్రాంతంలో సిద్దిపేట అగ్రస్థానంలో, భువనగిరి 3వ స్థానంలో నిలిచాయి. సిరిసిల్ల 5, పీర్జాదిగూడ 6, బోడుప్పల్‌ 8, షాద్‌నగర్‌ 12, కోరుట్ల 15, భైంసా 18వ ర్యాంకు సాధించాయి. 

జాతీయ, జోనల్‌ స్థాయిల్లో ర్యాంకులు 
దేశంలోని అన్ని పురపాలికలు, కంటోన్మెంట్‌ బోర్డుల్లో జనవరి 4 నుంచి మార్చి 10 వరకు స్వచ్ఛ సర్వేక్షన్‌–2018ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించింది. లక్షకు పైగా, లక్ష లోపు జనాభా ఉన్న నగరాలకు వేర్వేరుగా సర్వే జరిపింది. లక్షకు పైగా జనాభా ఉన్న నగరాలకు జాతీయ స్థాయిలో, లక్ష లోపు ఉన్న నగరాలకు జోన్ల వారీగా ర్యాంకులు ప్రకటించింది. 2017 జనవరి–డిసెంబర్‌ మధ్య పురపాలికలు సాధించిన పురోగతి ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది.  

4 అంశాల ఆధారంగా సర్వే    
నాలుగు ప్రధాన అంశాల ఆధారంగా 4,000 మార్కులకు సర్వే నిర్వహించారు. స్వచ్ఛ భారత్‌ కింద చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి పురపాలికల నుంచి సేకరించిన ప్రమాణ పత్రాల ఆధారంగా 1,400 మార్కులు కేటాయించారు. పత్రాల్లో,   క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో తేడాలుంటే మార్కుల్లో కోత పెట్టారు. క్షేత్రస్థాయిలో పారిశుధ్య స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించి మరో 1,200 మార్కులు, పౌరులు అందించిన సమాచారం ఆధారంగా 1,000 మార్కులు, స్వచ్ఛత యాప్‌ డౌన్‌లోడ్‌ సంఖ్య, యాప్‌ ద్వారా సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలకు 400 మార్కులు ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement