rankings
-
ఆన్లైన్ విద్యలో నాణ్యతకు పట్టం
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ విద్య విస్తరిస్తోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత సంప్రదాయ విశ్వవిద్యాలయాలు డిజిటల్ విద్యపై దృష్టి కేంద్రీకరించాయి. అయితే ఇప్పటి వరకు ఆన్లైన్ విద్య నాణ్యతను కొలవడానికి సరైన ప్రమాణాలు లేవు. కానీ, తొలిసారిగా ఇటీవల టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆన్లైన్ లెర్నింగ్ ర్యాంకింగ్స్–2024ను ప్రకటించింది. ఇందులో ప్రపంచంలో 11 యూనివర్సిటీలకు గోల్డ్ స్టేటస్ ర్యాంకును ఇచి్చంది. ఇందులో భారతదేశం నుంచి మానవ్ రచన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టడీస్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలు ‘బంగారు’ హోదా పొందాయి. దేశంలో ఏడు వర్సిటీలకు ర్యాంకులు... ఆన్లైన్ విద్యలో గోల్డ్ కేటగిరీలో 11 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇందులో యూఎస్ఏ నుంచి మూడు, యూకే, భారత్ నుంచి రెండు చొప్పున, రష్యా, హంగేరీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి ఒక్కొక్క యూనివర్సిటీ ఉన్నాయి.భారత్ నుంచి శూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్‌కు సిల్వర్ స్టేటస్ సాధించగా, అమిటీ యూనివర్సిటీ (నోయిడా), కేఎల్ యూనివర్సిటీ (ఏపీ), లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ (పంజాబ్), మణిపాల్ వర్సిటీ (జైపూర్) బ్రాంజ్ స్టేటస్ పొందాయి. ఈ ర్యాంకింగ్స్‌తో భారత్ యూనివర్సిటీలు ఆన్లైన్ విద్యను అందించడంలో పురోగతిని కనబరుస్తున్నాయని స్పష్టమవుతోంది. వీటి ఆధారంగానే ర్యాంకులు ఆన్లైన్ అభ్యాసానికి అంకితమైన సిబ్బంది, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంతృప్తి, విద్యార్థుల్లో పురోగతి, కోర్సుల సిఫారసు వంటి అంశాలను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ పరిశీలించి ర్యాంకులు కేటాయించింది. మొత్తం ప్రపంచంలో 14 యూనివర్సిటీలు వెండి, 31 కాంస్య పతకాల కేటగిరీలో నిలిచాయి. మరో 64 సంస్థలు డేటా సమర్పించినప్పటికీ పూర్తి ఎంట్రీ అవసరాలను తీర్చలేదు. కాబట్టి వాటికి రిపోర్టర్ హోదా కల్పిoచింది. అయితే ఆన్లైన్ విద్యను అందిస్తున్న యూనివర్సిటీ అభ్యాసకులు టెక్నాలజీ యాక్సెస్, టైమ్‌జోన్, భాషా ప్రావీణ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోల్డ్ స్టేటస్ పొందిన యూనివర్సిటీలు... » అమెరికన్ యూనివర్సిటీ(యూఎస్) » అరిజోనా స్టేట్ వర్సిటీ(యూఎస్) » హెచ్ఎస్ఈ వర్సిటీ (రష్యా) » మానవ్ వర్సిటీ (భారత్) » మాస్సే వర్సిటీ (న్యూజిలాండ్) » ఓపీ జిందాల్ (భారత్) » సెంట్రల్ఫ్లోరిడా వర్సిటీ (యూఎస్) » వర్సిటీ ఆఫ్ ఎసెక్స్ (యూకే) » లివర్‌పూల్ వర్సిటీ (యూకే) » సౌత్ ఆస్ట్రేలియావర్సిటీ (ఆ్రస్టేలియా) » వర్సిటీ ఆఫ్ స్జెడ్ (హంగేరి) -
2024 విజికీ మీడియా విజిబిలిటీ ర్యాంకింగ్స్: రిలయన్స్ టాప్
ఆదాయం, లాభాలు, మార్కెట్ వాల్యూ, సామాజిక ప్రభావం వంటి వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. 2024 విజికీ వెలువరించిన న్యూస్ స్కోర్ ర్యాంకింగ్‌లో సంస్థ ప్రథమ స్థానంలో నిలిచింది. భారతదేశంలోని ప్రముఖ FMCG లేదా బ్యాంకింగ్ & ఫైనాన్స్ కంపెనీల కంటే కూడా రిలయన్స్ విజిబిలిటీ చాలా ఎక్కువగా ఉందని ఏఐ బేస్డ్ మీడియా ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది.రిలయన్స్ సంస్థ.. 2024 న్యూస్ స్కోర్‌లో 100కి 97.43 స్కోర్ చేసింది. ఈ స్కోర్ 2023 (96.46), 2022 (92.56), 2021 (84.9) కంటే ఎక్కువని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే సంస్థ ప్రతి ఏటా వృద్ధి నమోదు చేస్తూనే ఉంది. రిలయన్స్ కంపెనీ విజికీ న్యూస్ స్కోర్ వార్షిక ర్యాంకింగ్స్‌లో మొదటి నుంచి గత ఐదేళ్లలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.విజికీ న్యూస్ స్కోర్ అనేది న్యూస్ పరిమాణం, హెడ్లైన్ ప్రజెంటేషన్, పబ్లికేషన్ రీచ్ & రీడర్షిప్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్.. మీడియా ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి బ్రాండ్లు, వ్యక్తుల కోసం వార్తల దృశ్యమానతను కొలవడానికి ప్రపంచంలోని మొట్టమొదటి ప్రామాణిక కొలమానం.రిలయన్స్ తరువాత ర్యాంకింగ్‌లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (89.13), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (86.24), వన్97 కమ్యూనికేషన్స్ (84.63), ఐసీఐసీఐ బ్యాంక్ (84.33), జొమాటో (82.94) ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్ ఏడో స్థానంలో ఉండగా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ITC తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 40వ స్థానంలో ఉంది. -
తిలక్ @3
దుబాయ్: దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో రెండు సెంచరీలతో విజృంభించిన భారత యువ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. సఫారీలపై ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన తిలక్ వర్మ ఐసీసీ బుధవారం విడుదల చేసిన టి20 బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–10లోకి ప్రవేశించడమే కాకుండా... కెరీర్ అత్యుత్తమంగా 3వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో తిలక్ 69 స్థానాలు ఎగబాకడం విశేషం. ఈ జాబితాలో ఆ్రస్టేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (855 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా... ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ (828 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్ గల ఆటగాడిగా తిలక్ వర్మ (806 పాయింట్లు) నిలవగా... సూర్యకుమార్ (788 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పరిమితమయ్యాడు. భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (8వ ర్యాంక్) కూడా టాప్–10లో చోటు దక్కించుకున్నాడు. ఇదే సిరీస్‌లో రెండు సెంచరీలతో సత్తా చాటిన ఓపెనర్ సంజూ సామ్సన్ 22వ ర్యాంక్‌కు చేరాడు.నాలుగు నెలల తర్వాత... ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా నాలుగు నెలల తర్వాత మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జూన్ 29న తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్ కు ఎగబాకిని పాండ్యా ఆ తర్వాత తన టాప్ ర్యాంక్‌ను కోల్పోయాడు.అయితే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అటు బ్యాట్‌తో ఇటు బంతితో రాణించిన హార్దిక్ 244 పాయింట్లతో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి అత్యుత్తమంగా రవి బిష్ణోయ్ ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. -
టాప్–20 నుంచి కోహ్లి, రోహిత్ అవుట్
దుబాయ్: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఘోరంగా విఫలం కావడంతో ఆ ప్రభావం వారిద్దరి ర్యాంకింగ్స్‌పై కూడా పడింది. బుధవారం విడుదలైన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి, రోహిత్ శర్మ టాప్–20లో చోటు కోల్పోయారు. కోహ్లి ఎనిమిది స్థానాలు దిగజారి 22వ ర్యాంక్‌లో, రోహిత్ రెండు స్థానాలు పడిపోయి 26వ ర్యాంక్‌లో నిలిచారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో కోహ్లి 93 పరుగులు, రోహిత్ 91 పరుగులు సాధించడం గమనార్హం. మరోవైపు భారత్‌కే చెందిన యశస్వి జైస్వాల్ ఒక స్థానం పడిపోయి నాలుగో ర్యాంక్‌లో నిలువగా... రిషబ్ పంత్ ఐదు స్థానాలు మెరుగై ఆరో ర్యాంక్‌లోకి వచ్చాడు. శుబ్‌మన్ గిల్ నాలుగు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌లో నిలిచాడు. -
ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్: టాప్–10లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు. టాప్–10లో భారత్ నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మ ఒక స్థానం పడిపోయి 751 రేటింగ్ పాయింట్లతో ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 740 రేటింగ్ పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. విరాట్ కోహ్లి రెండు స్థానాలు పురోగతి సాధించి 737 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 881 పాయింట్లతో తన ‘టాప్ ర్యాంక్’ను నిలబెట్టుకోగా... విలియమ్సన్ (న్యూజిలాండ్; 859 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో, మిచెల్ (న్యూజిలాండ్; 768 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ మూడు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌ను అందుకున్నాడు. పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఆరు స్థానాలు పడిపోయి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ అశి్వన్ 870 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 847 పాయింట్లతో హాజల్‌వుడ్ (ఆ్రస్టేలియా), బుమ్రా (భారత్) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. -
సినెర్... కొత్త నంబర్‌వన్
పారిస్: ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇటలీ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్ తన కెరీర్లో గొప్ప ఘనత సాధించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సినెర్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 9,525 పాయింట్లతో నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. టెన్నిస్‌లో కంప్యూటర్ ఆధారిత ర్యాంకింగ్స్ (1973 నుంచి) మొదలయ్యాక వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న తొలి ఇటలీ ప్లేయర్‌గా 22 ఏళ్ల సినెర్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది సినెర్ 33 మ్యాచ్‌ల్లో గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోపాటు మయామి మాస్టర్స్ సిరీస్, రోటర్‌డామ్ ఓపెన్‌లో అతను విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లో ఓడిపోయాడు. గతవారం వరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన కార్లోస్ అల్కరాజ్ ఒక స్థానం పురోగతి సాధించి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో నగాల్ భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ 77వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆదివారం జర్మనీలో జరిగిన నెకర్ కప్ టోరీ్నలో విజేతగా నిలిచిన సుమిత్ 18 స్థానాలు పురోగతి సాధించాడు. తాజా ర్యాంక్ కారణంగా సుమిత్ వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఖాయమైంది. -
దేశంలో ఐఐటీ బాంబే టాప్
సాక్షి, అమరావతి: భారతీయ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. ప్రతిష్టాత్మక క్యూఎస్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్–2025లో భారతీయ వర్సిటీలు మెరుగైన ర్యాంకింగ్స్ దక్కించుకున్నాయి. గతేడాదితో పోలిస్తే 61 శాతం భారతీయ వర్సిటీలు తమ ర్యాంకులను మెరుగుపర్చుకోగా.. 24 శాతం వర్సిటీలు పాత ర్యాంకులనే పొందాయి. కేవలం 9 శాతం వర్సిటీల ర్యాంకులు క్షీణించాయి. అలాగే మూడు కొత్త విశ్వవిద్యాయాలకు క్యూఎస్ ర్యాంకింగ్స్ జాబితాలో చోటు దక్కింది. జాతీయ స్థాయిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) బాంబే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)–బెంగళూరు, ఐఐటీ ఖరగ్‌పూర్ నిలిచాయి. మెరుగైన ర్యాంకింగ్స్.. ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితాలో ఐఐటీ బాంబే గతేడాది 149వ స్థానంలో ఉండగా.. ఈసారి 118వ ర్యాంక్ దక్కించుకుంది. ఐఐటీ ఢిల్లీ 197వ స్థానం నుంచి 150కి చేరుకుంది. ఐఐఎస్సీ 225 నుంచి 211వ ర్యాంక్‌కు ఎగబాకింది. ఐఐటీ ఖరగ్‌పూర్ 271 నుంచి 222కు, ఐఐటీ మద్రాస్ 278 నుంచి 263వ ర్యాంకులకు చేరుకున్నాయి. ఐఐటీ కాన్పూర్ ర్యాంకు గతేడాది కంటే స్వల్పంగా తగ్గి 227వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం గణనీయమైన పురోగతి కనబర్చింది. ఈ వర్సిటీ 407వ ర్యాంక్ నుంచి 328వ ర్యాంకుకు చేరుకొని దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. ఐఐటీ రూరీ్కకి 335, ఐఐటీ గౌహతికి 477, అన్నా వర్సిటీలకు 383వ ర్యాంక్ వచి్చంది. ఐఐటీ ఇండోర్ 454 నుంచి 477వ ర్యాంక్‌కు పడిపోయింది. జాతీయ స్థాయిలో మొదటి 15 స్థానాల్లో ఐఐటీ వారణాసి (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 531వ స్థానం), జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ(580), శూలినీ వర్సిటీ ఆఫ్ బయో టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ (587) వర్సిటీలున్నాయి. ఈ ఏడాది కొత్తగా సింబయాసిస్ ఇంటర్నేషనల్(డీమ్డ్) వర్సిటీ 641–650 ర్యాంకు పరిధిలో.. అలాగే దేశంలో 16వ స్థానం దక్కించుకుంది. టాప్–20లో ఐఐటీ హైదరాబాద్ (681–690), చండీగఢ్ వర్సిటీ (691–700), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి (701–710), యూనివర్సిటీ ఆఫ్ ముంబై (711–720) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–వెల్లూరు (791–800), ఎస్ఆర్ఎం చెన్నై (1,000–1,200) చోటు దక్కించుకున్నాయి. 13 ఏళ్లుగా వరల్డ్ నంబర్ వన్‌గా ఎంఐటీ ప్రపంచవ్యాప్తంగా క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరుసగా 13వసారి ఎంఐటీ అత్యుత్తమ ఇన్స్టిట్యూట్గా టైటిల్‌ను నిలుపుకుంది. మొత్తం 1,500 విశ్వవిద్యాలయాలకు ర్యాంకులను కేటాయించగా.. అమెరికా నుంచి అత్యధికంగా 197, బ్రిటన్ నుంచి 90, మెయిన్ ల్యాండ్ చైనా నుంచి 71 వర్సిటీలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి.క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ –10 కళాశాలలు/విశ్వవిద్యాలయాలుమసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం హార్వర్డ్ విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ఈటీహెచ్ జూరిచ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -
దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా భారతీయ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (సీడబ్ల్యూయూఆర్)లో 65 భారతీయ వర్సిటీలు, ఐఐటీ, ఐఐఎంలు చోటు దక్కించుకున్నాయి. ప్రపంచంలో మొత్తం రెండువేల విశ్వవిద్యాలయాలకు సీడబ్ల్యూయూఆర్–2024 ఎడిషన్‌లో ర్యాంకులు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే భారత్‌కు చెందిన 32 ఉన్నత విద్యా సంస్థల ర్యాంకులు మెరుగవ్వగా.. మరో 33 సంస్థల ర్యాంకులు స్వల్పంగా క్షీణించాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–అహ్మదాబాద్ (ఐఐఎం–ఏ) దేశంలోనే అగ్రశేణి విద్యా సంస్థగా నిలిచింది. అంతర్జాతీయంగా గతేడాది 419వ ర్యాంకు నుంచి ప్రస్తుతం 410కి చేరుకోవడం విశేషం. తగ్గిన ర్యాంకులు..20,966 విద్యా సంస్థల నుంచి అత్యుత్తమ విద్యా సేవలందించే రెండువేల వర్సిటీలను గుర్తించి సీడబ్ల్యూయూఆర్ ర్యాంకులు ప్రకటించింది. టాటా ఇన్స్టిట్యూట్తో సహా దేశంలోని టాప్–10 ఇన్స్టిట్యూట్లలో ఏడింటి ర్యాంకులు క్షీణించాయి. ఐఐఎం–అహ్మదాబాద్ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిలిచింది. గతేడాది 494వ ర్యాంకు నుంచి 501కు, ఐఐటీ–ముంబై 554 నుంచి 568వ ర్యాంకు, ఐఐటీ–మద్రాస్ 570 నుంచి 582, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వర్సిటీ 580 నుంచి 606కు, ఐఐటీ–ఢిల్లీ 607 నుంచి 616, ఢిల్లీ వర్సిటీ 621 నుంచి 622, పంజాబ్ వర్సిటీ 759 నుంచి 823కు క్షీణించాయి. మరోవైపు.. ఐఐటీ–ఖరగ్‌పూర్ తన స్థానాన్ని 721 నుంచి 704కు, అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ 866 నుంచి 798కు మెరుగుపర్చుకుంది.టాప్‌లో అమెరికా వర్సిటీలు..సెంటర్ ఫర్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్‌లో టాప్–10లో అన్నీ అమెరికా విశ్వవిద్యాలయాలే నిలిచాయి. అమెరికాకు చెందిన 90 విద్యా సంస్థలు ర్యాంకుల్లో మెరుగుదలను సాధించగా 23 స్థిరంగా, 216 వర్సిటీల ర్యాంకులు క్షీణించాయి. అలాగే, యూకేలో కేవలం 28 సంస్థలు మాత్రమే స్థానాలను మెరుగుపర్చుకోగా, 57 సంస్థల ర్యాంకులు పడిపోయాయి. జర్మనీకి చెందిన మ్యూనిచ్ విశ్వవిద్యాలయం 46వ స్థానంలో ఉన్నా జర్మనీలోని 55 వర్సిటీల ర్యాంకులు దిగజారాయి. వీటికి విరుద్ధంగా చైనాలో 95% వర్సిటీలు గతేడాది కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాయి. సింఘువా వర్సిటీ 43వ స్థానంలో నిలిచింది. వెయ్యిలోపు భారత్‌లోని వర్సిటీల ర్యాంకులు..పంజాబ్ వర్సిటీ (823), ఐఐటీ–కాన్పూర్ (842), ఎయిమ్స్–ఢిల్లీ (874), ఐఐటీ–రూర్కీ (880), బెనారస్ హిందూ వర్సిటీ (891), హోమీబాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ (903), జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ (927), జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ (951), ఐఐటీ–గౌహతి (966) ర్యాంకులు సాధించాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు 1,299, ఐఐటీ–హైదరాబాద్‌కు 1,327 ర్యాంకులు వచ్చాయి.టాప్–10 వర్సిటీలు అమెరికావే.. » హార్వర్డ్ వర్సిటీ » మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ» స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం» యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి» యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్» ప్రిన్స్టన్ వర్సిటీ» కొలంబియా విశ్వవిద్యాలయం» యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా» యేల్ వర్సిటీ» కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -
అశ్విని –తనీషా జోడీ ర్యాంక్‌లో పురోగతి
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ పురోగతి సాధించింది. తాజా ర్యాంకింగ్స్‌లో అశ్విని –తనీషా ద్వయం నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 28వ ర్యాంక్‌కు చేరుకుంది. గతవారం లక్నోలో జరిగిన సయ్యద్ మోడి ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టో ర్నీలో అశ్విని –తనీషా జోడీ రన్నరప్‌గా నిలిచింది. -
Sexiest Bald Man of 2023: ఈ యేడు బట్టతల అందగాడు ఇతడే..
బట్టతల వచ్చినందుకు చాలా మంది మగవారు బాధపడుతూ ఉంటారు. తలపై వెంట్రుకలు లేని తమను ఎవరు చూస్తారని చింతిస్తూ ఉంటారు. కానీ బట్టతల ఉన్నవారికీ ఫ్యాన్స్ ఉన్నారు. గూగుల్‌లో బట్టతల అందగాళ్ల కోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ సెర్చ్ ట్రాఫిక్, శారీరక లక్షణాల ఆధారంగా ఒక కొత్త అధ్యయనం ప్రకారం బ్రిటిష్ ప్రిన్స్ విలియం (Prince William) "2023లో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్"గా ఎంపికయ్యాడు. అమెరికన్ యాక్టర్ విన్ డీజిల్, హాలీవుడ్ నటుడు జాసన్ స్టాథమ్లను అధిగమించి టాప్‌లో నిలిచాడు. బట్టతల సెలబ్రిటీలను షర్టు లేకుండా చూడటానికి ఇంటర్నెట్లో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారన్న దానిపై రీబూట్ అనే సంస్థ అధ్యయనం చేసి ర్యాంకులు రూపొందించింది. బట్టతల సెలబ్రిటీల ఎత్తు, నెట్‌వర్త్, ముఖ నిష్పత్తి, బట్టతల మెరుపు తదితర అంశాలను కూడా ఈ అధ్యయనం పరిగణనలోకి తీసుకుంది. ఈ "సెక్సీ" స్కోర్‌లో 10కి 9.88 స్కోర్‌తో ప్రిన్స్ విలియం అగ్రస్థానంలో నిలిచాడు. మిర్రర్ కథనం ప్రకారం.. సెలబ్రిటీల వాయిస్ ఫ్రీక్వెన్సీని కూడా ఈ అధ్యయనం పరిశీలించింది. అధ్యయనం మేరకు ప్రిన్స్ విలియం నెట్‌వర్త్ దాదాపు 100 మిలియన్ డాలర్లు (రూ.832 కోట్లు), ఎత్తు 1.91 మీటర్లు. ఇక వాయిస్ వియషంలో 10కి 9.91 స్కోర్, బట్టతల మెరుపులో 8.90 స్కోర్ సాధించాడు. మరోవైపు అమెరిన్ యాక్టర్ విన్ డీజిల్ 8.81 టోటల్ స్కోరుతో రెండవ స్థానంలో, జాసన్ స్టాథమ్ 8.51 స్కోరుతో మూడో స్థానంలో నిలిచారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 7.12 స్కోర్‌తో ఐదో స్థానంలో ఉన్నారు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో మనిక బత్రా
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 31వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది మనిక దోహా డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో సెమీఫైనల్‌కు, ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 82వ ర్యాంక్‌లో ఉంది. -
సింధు ర్యాంక్‌లో పురోగతి
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు రెండు స్థానాలు పురోగతి సాధించింది. తాజా ర్యాంకింగ్స్‌లో సింధు 17 నుంచి 15వ స్థానానికి చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ 9వ ర్యాంక్‌లో, లక్ష్య సేన్ 11వ ర్యాంకుల్లో కొనసాగుతుండగా...శ్రీకాంత్ ఒక స్థానం పడిపోయి 20వ ర్యాంక్ లో నిలిచాడు. గతవారం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన ప్రియాన్షు రజావత్ మూడు స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. -
ఆరో స్థానానికి ఎగబాకిన మంధాన.. 17వ ర్యాంక్‌కు పడిపోయిన సింధు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఒక స్థానం మెరుగుపర్చుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో స్మృతి 704 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. భారత కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు స్థానాలు పడిపోయి 702 పాయింట్లతో ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకుంది. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రాజేశ్వరి గైక్వాడ్ తొమ్మిదో ర్యాంక్‌లో, ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ ఏడో ర్యాంక్‌లో ఉన్నారు. 17వ ర్యాంక్‌కు పడిపోయిన సింధు ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయిన భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ప్రదర్శన ఆమె ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపిస్తోంది. గతవారం యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన పీవీ సింధు... మంగళవారం విడుదల చేసిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు పడిపోయింది. గతవారం 12వ ర్యాంక్‌లో నిలిచిన సింధు తాజాగా 17వ ర్యాంక్‌కు చేరుకుంది. గత పదేళ్లలో సింధు అత్యల్ప ర్యాంక్ ఇదే కావడం గమనార్హం. సింధు చివరిసారి 2013 జనవరిలో 17వ ర్యాంక్‌లో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 12 టోర్నీలు ఆడిన సింధు మాడ్రిడ్ మాస్టర్స్ టోరీ్నలో రన్నరప్‌గా నిలిచింది. మలేసియా మాస్టర్స్ టోర్నీ, కెనడా ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. ప్రస్తుతం కొరియా ఓపెన్ టోరీ్నలో సింధు బరిలో ఉంది. కొత్త కోచ్‌గా హఫీజ్ హషీమ్ పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ప్రారంభం కావడంతో పీవీ సింధు కొత్త వ్యక్తిగత కోచ్‌ను నియమించుకుంది. 2003 ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, మలేసియా మాజీ ప్లేయర్ మొహమ్మద్ హఫీజ్ హషీమ్ తన వ్యక్తిగత కోచ్‌గా వ్యవహరిస్తాడని మంగళవారం సింధు ట్విటర్ వేదికగా ప్రకటించింది. -
జాతీయ ర్యాంకుల్లో పడిపోయిన రాష్ట్ర యూనివర్సిటీలు.. కారణం అదేనా!
సాక్షి, హైదరాబాద్: అధ్యాపకుల కొరత రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు మరోసారి రుజువైంది. తాజాగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023) నివేదికలో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియాతోపాటు జేఎన్టీయూహెచ్ ర్యాంకులు కూడా తగ్గాయి. జాతీయ ఓవరాల్ ర్యాంకుల్లోనే కాదు.. పరిశోధన, యూనివర్సిటీ స్థాయి ప్రమాణాల్లోనూ విశ్వవిద్యాలయాలు వెనుకంజలో ఉన్నాయి. అన్నింటికన్నా ఐఐటీ–హైదరాబాద్ అన్ని విభాగాల్లోనూ దూసుకుపోవడం విశేషం. గత మూడేళ్ల విద్యా ప్రమాణాల ఆధారంగా ఎన్ఐఆర్ఎఫ్ ఏటా ర్యాంకులు ఇస్తుంది. ఐఐటీ–హైదరాబాద్ దూకుడు.. ఓయూ వెనక్కు జాతీయస్థాయిలో వంద యూనివర్సిటీల్లో ఐఐటీ–హైదరాబాద్ గత ఏడాది మాదిరిగానే 14వ స్థానంలో నిలిచింది. ఈ సంస్థలో 2019లో 144 మంది రూ.17 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. 2020–21లో 185 మంది రూ.16 లక్షలకుపైగా, 2021–22లో 237 మంది రూ.20 లక్షలకుపైగా ప్యాకేజీతో ఉపాధి పొందారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోనూ విద్యార్థులు అత్యధికంగా రూ.40 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. నిట్ వరంగల్‌లో అత్యధికంగా యూజీ విద్యార్థులు ఉపాధి అవకాశాలు సొంతం చేసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో ఈ సంస్థ మంచి ప్రమాణాలు నెలకొల్పినట్టు నివేదిక పేర్కొంది. అయినప్పటికీ ఈ సంస్థలో అధ్యాపకుల కొరత వల్ల రీసెర్చ్‌లో వెనుకబడింది. ఫలితంగా నిట్ వరంగల్ జాతీయర్యాంకు 2022లో 45 ఉండగా, ఈసారి 53కు చేరింది. ఉస్మానియా వర్సిటీ ఓవరాల్ ర్యాంకులో గత ఏడాది 46 ఉంటే, ఈసారి 64 దక్కింది. ఇక్కడా పరిశోధనల్లో నెలకొన్న మందకొడితనమే జాతీయ ర్యాంకుపై ప్రభావం చూపింది. ఈసారి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు ఓవరాల్ ర్యాంకులో గతంలో మాదిరిగానే 20వ ర్యాంకు వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10 ర్యాంకుతో నిలకడగా ఉంది. హైదరాబాద్ ట్రిపుల్ఐటీ జాతీయస్థాయిలో 84వ ర్యాంకు పొందింది. చదవండి: విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో హైదరాబాద్‌కు దక్కని చోటు ఇంజనీరింగ్‌లో వెనుకబాటుతనం ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ సరికొత్త బోధన విధానాలతో 9లో ఉన్న ర్యాంకును 8కి తేగలిగింది. ఎక్కువ ఇంజనీరింగ్ అనుబంధ కాలేజీలున్న జేఎన్టీయూ–హెచ్ 76 నుంచి 98కి పడిపోయింది. నిట్ వరంగల్ 21వ ర్యాంకుతో నిలిచింది. ఈసారి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ జాతీయస్థాయి కాలేజీల విభాగంలో 98 ర్యాంకును సాధించింది. పరిశోధన విభాగంలో ట్రిపుల్ఐటీ హైదరా బాద్ ర్యాంకు 12 నుంచి 14కు చేరింది. అధ్యాపకుల కొరతే కారణం: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో వెనుకబడటానికి ప్రధాన కారణం అధ్యాపకుల కొరత. కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడం వల్ల పరిశోధనలో వెనుకబడిపోతున్నాం. అయినప్పటికీ బోధనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. -ప్రొ.డి.రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ ర్యాంకు సాధించని వ్యవసాయ వర్సిటీ దేశంలో టాప్–40 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చోటు దక్కలేదు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో వ్యవసాయ వర్సిటీ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై వర్సిటీ వర్గాలను ఆరా తీయగా, సమాధానం లభించలేదు. వర్సిటీ ప్రమాణాలు తగ్గుతున్నాయన్న చర్చ జరుగుతోంది. అడ్రస్ లేని మెడికల్ కాలేజీలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో దేశంలో టాప్ 50లో చోటు దక్కని వైనం సాక్షి, హైదరాబాద్: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చేసిన దేశంలోని టాప్–50 మెడికల్ కాలేజీల్లో రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క మెడికల్ కాలేజీ చోటు దక్కించుకోలేకపోయింది. రాష్ట్రం నుంచి నాలుగు కాలేజీలు... ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, కరీంనగర్‌లోని చలిమెడ ఆనందరావు మెడికల్ కాలేజీ, హైదరాబాద్‌కు చెందిన మల్లారెడ్డి, అపోలో మెడికల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. మిగిలిన కాలేజీలకు కనీసం దరఖాస్తు చేసుకునే స్థాయి కూడా లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. టాప్–50 ర్యాంకింగ్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్ మొదటి ర్యాంకు, చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రెండో ర్యాంకు, తమిళనాడులోని వెల్లూరుకు చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజీ మూడో ర్యాంకు, బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నాలుగో ర్యాంకు, పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐదో ర్యాంకు సాధించాయి. డెంటల్ ర్యాంకుల్లో మాత్రం తెలంగాణకు ఊరట కలిగింది. సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజీ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌కు 33 ర్యాంకు దక్కింది. 176 మెడికల్ కాలేజీలు, 155 డెంటల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్రంలో వైద్య పరిశోధన దాదాపు ఎక్కడా లేదని, అలాగే, విద్యార్థులు–అధ్యాపకుల నిష్పత్తి కూడా దారుణంగా ఉందన్న విమర్శలున్నాయి. -
నెట్ స్పీడ్‌లో ఎవరెక్కడ? ఎగబాకిన భారత్ ర్యాంక్
ఇంటర్నెట్ లేనిదే నిమిషం గడవని పరిస్థితి. ఎంటర్టైన్మెంట్ నుంచి ఆన్లైన్ చదువుల దాకా.. ఆర్థిక లావాదేవీల నుంచి నిత్యావసరాల బుకింగ్ దాకా.. స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్.. ఏదైనా ఇంటర్నెట్ అత్యవసరంగా మారిపోయింది. ఈ ఇంటర్నెట్ ఎంత వేగంగా ఉంటే.. మన పని అంత వేగంగా పూర్తవుతుంది. ఈ క్రమంలో ఊక్లా సంస్థకు చెందిన స్పీడ్‌టెస్ట్ వెబ్సైట్.. ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో సగటు ఇంటర్నెట్ వేగం ఎంత అన్నదానిపై ర్యాంకింగ్స్ ఇచ్చింది. ♦ మొబైల్ ఇంటర్నెట్ విభాగంలో 36.35 ఎంబీపీఎస్ స్పీడ్‌తో భారత్ 60వ స్థానంలో నిలిచింది. మార్చిలో భారత్ ర్యాంకు 64కాగా.. నెలలో నాలుగు స్థానాలు ఎగబాకింది. ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో 51.12 ఎంబీపీఎస్‌తో 83వ స్థానంలో నిలిచింది. మార్చితో పోలిస్తే ఒక ర్యాంకు ఎగబాకింది. ♦ మొబైల్ ఇంటర్నెట్కు సంబంధించి 138 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా.. యెమెన్ (3.38 ఎంబీపీఎస్), అఫ్గానిస్తాన్ (4.46), క్యూబా (4.48), వెనెజువెలా (6.90), హైతీ (8.03) అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ♦ ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి 180 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా.. క్యూబా (1.97 ఎంబీపీఎస్), అఫ్గానిస్తాన్ (2.31), సిరియా (3.93), తుర్క్మెనిస్తాన్ (4.03), యెమెన్ (4.29) అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ♦ ప్రపంచవ్యాప్తంగా సగటున మొబైల్ ఇంటర్నెట్ వేగం 42.07 ఎంబీపీఎస్కాగా.. ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ వేగం 80.12 ఎంబీపీఎస్ కావడం గమనార్హం. ♦ ప్రపంచంలో సగటున 100 ఎంబీపీఎస్ కంటే ఎక్కువ నెట్ స్పీడ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. మొబైల్ ఇంటర్నెట్లో కేవలం పది దేశాలు, ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో కేవలం 33 దేశాలు మాత్రమే ఈ వేగాన్ని అందుకున్నాయి. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ క్రికెటర్
ఐర్లాండ్ యువ క్రికెటర్ హ్యారీ టెక్టార్ చరిత్ర సృష్టించాడు. తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తన దేశం తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు (722) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐర్లాండ్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఘనత పాల్ స్టిర్లింగ్ పేరిట ఉండేది. 2021 జూన్‌లో స్టిర్లింగ్ 697 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఈ రేటింగ్ పాయింట్లే చాలాకాలం పాటు ఐర్లాండ్ తరఫున అత్యధికంగా కొనసాగాయి. మే 12న బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో (113 బంతుల్లో 140; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) శతక్కొట్టడం ద్వారా స్టిర్లింగ్ రికార్డును బద్దలుకొట్టిన టెక్టార్.. తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి (7వ ర్యాంక్) కూడా చేరాడు. ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. సౌతాఫ్రికా రస్సీ వాన్‌డెర్ డస్సెన్, పాక్ ఫఖర్ జమాన్, పాక్‌కే చెందిన ఇమామ్ ఉల్ హాక్, ఇండియా శుభ్‌మన్ గిల్, ఆసీస్ డేవిడ్ వార్నర్, ఐర్లాండ్ హ్యారీ టెక్టార్, టీమిండియా విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా డికాక్, టీమిండియా రోహిత్ శర్మ టాప్-10లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇటీవలే బంగ్లాదేశ్‌తో ముగిసిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఐర్లాండ్ 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే ఫలితం తేలకపోగా.. హ్యారీ టెక్టార్ సెంచరీ చేసిన మ్యాచ్‌లో, మూడో వన్డేలో ఐర్లాండ్ ఓటమిపాలైంది. ఐర్లాండ్.. జూన్, జులై నెలల్లో జింబాబ్వేలో జరిగే వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. క్వాలిఫయర్స్‌లో ఐర్లాండ్‌తో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఒమన్, నేపాల్, శ్రీలంక, యుఎస్ఏ, యూఏఈ, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ 10 జట్లలోని రెండు జట్లు అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనున్నాయి. చదవండి: శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు -
దేశంలోనే అట్టడుగున మన డిస్కంలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి రేటింగ్, ర్యాంకింగ్స్‌లో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు మరోసారి దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచాయి. దేశంలోని 51 డిస్కంలలో టీఎస్ఎన్పి డీసీఎల్ 47వ ర్యాంకు, టీఎస్ఎస్పీడీసీఎల్ 43వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాయి. ఈ మేరకు డిస్కంల 11వ వార్షిక రేటింగ్స్, ర్యాంకింగ్స్ నివేదికను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మెరుగైన రేటింగ్, ర్యాంకింగ్ కలిగి ఉంటేనే డిస్కంలకు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు లభించనున్నాయి. ఈ మేరకు కేంద్రం లంకె పెట్టడంతో ఈ రేటింగ్స్ కీలకంగా మారాయి. రాష్ట్ర డిస్కంలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. డీ–గ్రేడ్‌కి అడుగు దూరంలో ... డిస్కంల ఆర్థిక సుస్థిరతకు 75, పనితీరు సమర్థతకు 13, బయటి నుంచి ప్రభుత్వం/ఈఆర్సీల మద్దతుకు 12 కలిపి మొత్తం 100 స్కోరుకిగాను ఆయా డిస్కంలు సాధించిన స్కోరు ఆధారంగా వాటికి.. ఏ+, ఏ, బీ, బీ–, సీ, సీ–, డీ అనే గ్రేడులను కేటాయించింది. కీలక అంశాల్లో డిస్కంల వైఫల్యాలకు నెగెటివ్ స్కోర్‌ను సైతం కేటాయించింది. ఎస్పీడీసీఎల్ 10.8 స్కోరు సాధించి ‘సీ–’ గ్రేడ్‌ను, ఎన్‌పి డీసీఎల్ 6.6 స్కోరును సాధించి ‘సీ–’ గ్రేడ్‌ను పొందింది. చిట్టచివరి స్థానమైన ‘డీ గ్రేడ్’లో మేఘాలయ డిస్కం మాత్రమే నిలిచింది. దేశం మొత్తం బకాయిల్లో 15% మనవే... జెన్కో, ట్రాన్స్‌కోలకు దేశంలోని అన్ని డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు 2021–22 నాటికి రూ.2.81 లక్షల కోట్లకు ఎగబాకినట్టు కేంద్రం పేర్కొంది. అందులో ఎస్పీడీసీఎల్ వాటా ఏకంగా 10.3 శాతం కాగా, ఎన్పీడీసీఎల్ వాటా 4.3 శాతం కావడం గమనార్హం. జెన్కోల నుంచి డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను 45 రోజుల్లోగా చెల్లించాల్సి ఉండగా ఎస్పీడీసీఎల్ 375 రోజులు, ఎన్పీడీసీఎల్ 356 రోజుల కిందటి నాటి బిల్లులను బకాయిపడ్డాయి. అంటే మన డిస్కంలు విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిల చెల్లింపులకు కనీసం ఏడాది సమయాన్ని తీసుకుంటున్నాయి. -
టాప్ అక్రెడిటేషన్ వ్యవస్థల్లో భారత్.. జీక్యూఐఐలో అయిదో ర్యాంకు
న్యూఢిల్లీ: నాణ్యతపరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించి అత్యుత్తమ అక్రెడిటేషన్ వ్యవస్థలు ఉన్న టాప్ అయిదు దేశాల జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది. 184 దేశాల లిస్టులో అయిదో స్థానంలో నిల్చింది. గ్లోబల్ క్వాలిటీ ఇన్ఫ్రా ఇండెక్స్ (జీక్యూఐఐ) 2021 ర్యాంకింగ్‌లు ఇటీవల విడుదలయ్యాయి. సూచీ ప్రకారం ప్రామాణీకరణలో భారత్ తొమ్మిదో స్థానంలో, మెట్రాలజీ విషయంలో 21వ ర్యాంకులోనూ ఉంది. ఈ జాబితాలో జర్మనీ అగ్రస్థానంలో ఉండగా, అమెరికా, చైనా, ఇటలీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టాప్ అయిదు అక్రెడిటింగ్ వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌కు గుర్తింపు లభించడంపై భారతీయ నాణ్యతా మండలి (క్యూసీఐ) హర్షం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యంలో నాణ్యతపరమైన మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమాణాల అమలుకు తోడ్పడే సంస్థలను నియమించేందుకు జాతీయ అక్రెడిటేషన్ సంస్థ పాటించే ప్రక్రియను అక్రెడిటేషన్గా వ్యవహరిస్తారు. నిర్దిష్ట సంవత్సరం ఆఖరు వరకూ ఉన్న డేటాను ఆ తదుపరి సంవత్సరంలో సేకరించి, విశ్లేషించి, ఏడాది ఆఖరున ర్యాంకింగ్‌లు విడుదల చేస్తారు. డిసెంబర్ 2021 ఆఖరు వరకు గల డేటాను 2022లో ఆసాంతం సేకరించి, విశ్లేషించి, 2021 ర్యాంకింగ్‌లు ఇచ్చారు. స్వతంత్ర కన్సల్టింగ్ సంస్థలు మెసోపార్ట్నర్, అనలిటికర్ ఈ జీక్యూఐఐ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాయి. -
వైద్య సేవల్లో తెలంగాణ థర్డ్ ప్లేస్.. యూపీ స్థానం తెలుసా అంటూ హరీష్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైద్యరంగంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతను మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ డయాగ్నాస్టిక్స్పై నేషనల్ హెల్త్ మినిస్ట్రీ నుంచి ప్రశంసలు అందినట్టు మంత్రి తెలిపారు. ఈ సందర్బంగా ఆరోగ్య శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ మీడియాతో మాట్లాడుతూ.. పల్లె దవాఖానాల ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వ పనితీరును కేంద్రం ప్రశంసించింది. ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న 3వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. బీజేపీ అధికారంలో ఉన్న యూపీ చివరి స్థానంలో ఉంది. కేసీఆర్ కిట్ ద్వారా 13.91 లక్షల మందికి ప్రయోజనం కలిగింది. 2014 నాటికి రాష్ట్రంలో శిశు మరణాల రేటు 39 కాగా.. ప్రస్తుతానికి 21కి తగ్గిందని వెల్లడించారు. వైద్య రంగానికి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి టెలి కన్సల్టెన్సీ సేవలు అందించాము. టీబీ నియంత్రణ, నిర్మూలనలో తెలంగాణకు అవార్డు దక్కింది. నిమ్స్‌లో బెడ్ల సంఖ్యను 1489 నుంచి 3489కి పెంచాము. తెలంగాణలో ప్రస్తుతం 22 జిల్లాల్లో డయాగ్నోస్టిక్స్ హబ్స్ ఉన్నాయి. గత ఏడాది రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు విద్యతో పాటు వైద్యం కూడా అందుబాటులోకి వస్తుంది. వరంగల్‌లో రూ.11వందల కోట్లతో 2వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నాము. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. పేద మహిళలకు న్యూట్రీషన్ కిట్స్ కూడా అందజేస్తున్నామని తెలిపారు. వసతులు పెంచడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ఎన్సీడీసీ స్క్రీనింగ్ ద్వారా ఇంటి వద్దకు వెళ్లి పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. -
Table Tennis: కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో మనిక బత్రా.. ఆకుల శ్రీజ పురోగతి
Manika Batra: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్‌కు చేరుకుంది. జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ నాలుగు స్థానాలు పురోగతి సాధించి 72వ ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ కుర్రాడు స్నేహిత్ 136వ ర్యాంక్ లో ఉన్నాడు. సత్యన్ 39వ ర్యాంక్‌తో భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. ఇది కూడా చదవండి: రామ్‌కుమార్‌కు మిశ్రమ ఫలితాలు పుణే: టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రామ్‌కుమార్ 3–6, 7–5, 3–6తో ప్రపంచ 62వ ర్యాంకర్ పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. అయితే డబుల్స్ తొలి రౌండ్లో రామ్‌కుమార్–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీ 7–6 (7/5), 6–7 (4/7), 11–9తో రోహన్ బోపన్న (భారత్)–జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్) ద్వయంపై ‘సూపర్ టైబ్రేక్’లో నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇతర మ్యాచ్‌ల్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ 7–6 (7/1), 5–7, 7–10తో మూడో సీడ్ సాదియో దుంబియా–రిబూల్ (ఫ్రాన్స్) జంట చేతిలో... పురవ్ రాజా–దివిజ్ శరణ్ (భారత్) ద్వయం 4–6, 3–6తో జీవన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ చేతిలో ఓడిపోయాయి. చదవండి: జంపా మన్కడింగ్.. క్రీజు దాటినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! ఎందుకో తెలుసా? -
మరింత దిగజారిన కోహ్లీ
-
ఐసిసి ర్యాంకింగ్స్.. సత్తాచాటిన కెప్టెన్, వైస్ కెప్టెన్?
-
నయా నంబర్‌వన్..డానిల్ మెద్వెదెవ్
లండన్: టెన్నిస్ రాకెట్ పట్టిన ఎవరికైనా కెరీర్లో రెండు లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ఏదైనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విజేతగా నిలువడం... రెండోది ఏనాటికైనా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకోవడం... రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్ ఈ రెండు లక్ష్యాలను అందుకున్నాడు. గత ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న 26 ఏళ్ల మెద్వెదెవ్ సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ప్రపంచ తాజా ర్యాంకింగ్స్‌లో అధికారికంగా నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించాడు. 2020 ఫిబ్రవరి నుంచి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను రెండో స్థానానికి నెట్టేసి మెద్వెదెవ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్ 8,615 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. జొకోవిచ్ 8,465 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. ‘వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. రాకెట్ పట్టినప్పటి నుంచి నా లక్ష్యాల్లో ఇదొకటి. టాప్ ర్యాంక్ చేరుకున్నాక నాకు శుభాకాంక్షలు తెలుపుతూ చాలా మంది సందేశాలు పంపించారు. వారందరికీ ధన్యవాదాలు’ అని మెద్వెదెవ్ వ్యాఖ్యానించాడు. ► పురుషుల టెన్నిస్‌లో ‘బిగ్ ఫోర్’గా పేరొందిన ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ (సెర్బియా), ఆండీ ముర్రే (బ్రిటన్)లలో ఎవరో ఒకరు 2004 ఫిబ్రవరి 2 నుంచి ఇప్పటి వరకు ‘టాప్’ ర్యాంక్‌లో కొనసాగుతూ వస్తున్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ నలుగురు కాకుండా మెద్వెదెవ్ రూపంలో మరో ప్లేయర్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలువడం విశేషం. ► ఆండీ ముర్రే (2016 నవంబర్ 7) తర్వాత కొత్త నంబర్‌వన్ ర్యాంకర్‌గా మెద్వెదెవ్ నిలిచాడు. ► యెవ్గెనీ కఫెల్నికోవ్ (1999; మే 3), మరాత్ సఫిన్ (2000, నవంబర్ 20) తర్వాత ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ పొందిన మూడో రష్యా ఆటగాడిగా మెద్వెదెవ్ గుర్తింపు పొందాడు. నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాక కఫెల్నికోవ్ వరుసగా ఆరు వారాలు, సఫిన్ వరుసగా తొమ్మిది వారాలు టాప్ ర్యాంక్‌లో ఉన్నారు. ► 1996 ఫిబ్రవరి 11న మాస్కోలో జన్మించిన మెద్వెదెవ్ 2014లో ప్రొఫెషనల్‌గా మారాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెద్వెదెవ్ 2016 నవంబర్‌లో తొలిసారి టాప్–100లోకి వచ్చాడు. అనంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆరేళ్ల వ్యవధిలో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు. ► ఇప్పటివరకు మెద్వెదెవ్ మొత్తం 13 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. ఇందులో ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీ (యూఎస్ ఓపెన్–2021), నాలుగు మాస్టర్స్ సిరీస్ టైటిల్స్, సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్ టైటిల్ (2020) ఉన్నాయి. ► 1973 ఆగస్టులో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న 27వ ప్లేయర్ మెద్వెదెవ్ కావడం విశేషం. -
ICC T20 Rankings: టీమిండియా నెంబర్‌వన్.. ఆరేళ్ల తర్వాత
దుబాయ్: ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. ఆదివారం వెస్టిండీస్‌తో సిరీస్‌ను 3–0తో గెలుచుకున్న అనంతరం భారత్ నంబర్‌వన్‌గా (269 రేటింగ్ పాయింట్స్) నిలిచింది. ఇప్పటి వరకు నంబర్‌వన్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను రెండో స్థానానికి పడేసి రోహిత్ సేన ముందంజ వేసింది. ఇంగ్లండ్‌కు కూడా సమానంగా 269 రేటింగ్ పాయింట్లే ఉన్నా... 39 మ్యాచ్‌ల ద్వారా పాయింట్లపరంగా భారత్ (10,484), ఇంగ్లండ్‌కంటే (10,474) పది పాయింట్లు ఎక్కువగా ఉండటంతో అగ్రస్థానం దక్కింది. ఈ జాబితాలో పాకిస్తాన్ (266) మూడో స్థానంలో నిలిచింది. గతంలో భారత్ 2016లో చివరిసారిగా నంబర్‌వన్‌గా నిలిచింది. రెండు నెలల పాటు ఆ స్థానంలో ఉన్న జట్టు ఆ తర్వాత వెనుకబడిపోయింది. ప్రస్తుత ర్యాంకింగ్స్ పీరియడ్‌లో 5–0తో న్యూజిలాండ్‌తో, 2–1తో ఆ్రస్టేలియాపై, 3–2తో ఇంగ్లండ్‌పై, 3–0తో న్యూజిలాండ్‌పై, 3–0తో వెస్టిండీస్‌పై సాధించిన విజయాల కారణంగా భారత్‌కు టాప్ ర్యాంక్ లభించింది. -
ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన ఐపీఎల్.. రెండో స్థానంలో సమ్మర్ ఒలింపిక్స్
క్యాచ్‌రిచ్ లీగ్‌గా ముద్రపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోయింది. యుగోవ్స్ 2022 స్పోర్ట్స్ బజ్ ర్యాంకింగ్స్‌లో ఐపీఎల్ అగ్రస్థానంలో నిలించింది. రెండో స్థానంలో టోక్యో ఒలింపిక్స్(సమ్మర్ ఒలింపిక్స్) నిలవగా.. మూడోస్థానంలో ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ మూడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినట్లు యుగోవ్స్ తెలిపింది. ఇక ఐపీఎల్ 14వ సీజన్ తొలి అంచె పోటీలు మనదగ్గరే జరగ్గా.. కరోనా విజృంభణతో రెండో అంచె పోటీలు యూఏఈ వేదికగా జరిగింది. అయినప్పటికి భారత అభిమానులను అలరించిన ఐపీఎల్ 50.8 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. కాగా యుగోవ్స్ స్పోర్ట్స్ ర్యాంకింగ్స్‌లో ఐపీఎల్ తొలిస్థానంలో నిలవడం వరుసగా రెండోసారి. గతేడాది ప్రకటించిన ర్యాంకింగ్స్‌లోనూ ఐపీఎల్‌దే తొలిస్థానం. ►ఇక ఐపీఎల్ తర్వాత ఇండియాలో అత్యంత ఎక్కువ జనాధరణ పొందింది టోక్యో ఒలింపిక్స్. 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా కారణంగా మరుసటి ఏడాదికి వాయిదా పడ్డాయి. దీంతో గతేడాది ఆగస్టులో నిర్వహించిన టోక్యో ఒలింపిక్స్‌లో ఎన్నడూ లేనంతగా మనకు ఏడు పతకాలు రావడం విశేషం. ఇందులో నీరజ్ చోప్రా స్వర్ణం గెలవడం చరిత్రలో నిలిచిపోయింది. 49.2 పాయింట్లతో .. కేవలం 1.6 పాయింట్ల తేడాతో తొలిస్థానం కోల్పోయినప్పటికి.. రెండోస్థానంలో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. ►సాధారణంగా ఐసీసీ టోర్నీలు జరిగితే ఇండియాలో ఎక్కువమంది చూస్తుంటారు. కానీ గతేడాది జరిగిన ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో టీమిండియా నిరాశపరిచింది. సూపర్-12 దశలోనే ఇంటిబాట పట్టినప్పటికి.. ఐసీసీ టోర్నీని ఇండియా అభిమానులు ఆదరించారని సర్వేలో తేలింది. 45.9 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచిన ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్.. అంతకముందు ఇచ్చిన స్కోరు కంటే 0.4 మాత్రమే తక్కువగా ఉండడం విశేషం. ►ఈ మూడింటి తర్వాత ఫుట్‌బాల్ వరల్డ్‌కప్(28.3 పాయింట్లు), ఇండియన్ సూపర్ లీగ్(20.4 పాయింట్లు), వింబుల్డన్ చాంపియన్‌షిప్(టెన్నిస్, 18 పాయింట్లు) వరుసగా 4,5,6 స్థానాల్లో నిలవగా.. ప్రొ కబడ్డీ లీగ్ 17.9 పాయింట్లతో ఏడోస్థానం.. ఏసియన్ గేమ్స్ 15.3 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. ఇక తొమ్మిదో స్థానంలో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) 13.3.. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 13 పాయింట్లతో తొమ్మిది, 10 స్థానాల్లో ఉన్నాయి. ఇక యుగోవ్స్ తమ ర్యాంకింగ్స్‌ను స్పోర్ట్స్ ఇండెక్స్ రోజువారీగా బ్రాండ్ల పట్ల ప్రజల అవగాహనను కొలమానంలోకి తీసుకొని నిర్థారణ చేస్తుంది.