అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడంపై ఆ జట్టు కెప్టెన్ మిస్బావుల్-హక్ హర్షం వ్యక్తం చేశాడు.
లాహోర్: అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ జట్టు తొలిసారి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడంపై ఆ జట్టు కెప్టెన్ మిస్బావుల్-హక్ హర్షం వ్యక్తం చేశాడు. ఇది తమ సుదీర్ఘ నిరీక్షణలో భాగమైనా, ఈ ర్యాంకును కాపాడుకోవాలంటే తీవ్రపోటీ తప్పదనే వాస్తవాన్ని మిస్బా అంగీకరించాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న నిలకడను కొనసాగిస్తే తప్పకుండా మరింత కాలం నంబర్ వన్గానే కొనసాగుతామనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఇది తన టెస్టు కెరీర్లోనే గర్వించదగ్గ క్షణమని మిస్బా సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తమ జట్టు సమష్టి కృషికి తగిన ఫలితమన్నాడు.
టీమిండియా-వెస్టిండీస్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. దీంతో గతవారం టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న టీమిండియా.. వారం రోజుల్లోనే ఆ ర్యాంకును కోల్పోయింది. నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకోవాలంటే విరాట్ కోహ్లి సేన కచ్చితంగా గెలవాల్సిన టెస్టు వర్షార్పణం అయ్యింది. దీంతో అంతకుముందు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను 2-2 తో డ్రా చేసుకున్న పాకిస్తాన్ రెండో స్థానం నుంచి నంబర్ వన్ కు చేరింది. గత ఐదు సంవత్సరాల్లో దక్షిణాఫ్రికా, శ్రీలంకపై మాత్రమే పాకిస్తాన్ టెస్టు సిరీస్ లను కోల్పోగా, మిగతా అన్నింటా విజయం సాధించింది.