Misbah-ul-Haq: బలిపశువుల కోసం వెతకడమే పని.. పైపై మెరుగులు చాలవు.. | Misbah ul Haq Slams Pakistan Selectors On T20 World Cup Squad | Sakshi
Sakshi News home page

Misbah-ul-Haq: బలిపశువుల కోసం వెతకడమే పని.. పైపై మెరుగులు చాలవు.. అసలేంటి ఇదంతా?

Published Thu, Oct 21 2021 3:18 PM | Last Updated on Thu, Oct 21 2021 3:30 PM

Misbah ul Haq Slams Pakistan Selectors On T20 World Cup Squad - Sakshi

Misbah-ul-Haq questions Pakistan selectors on T20 World Cup squad: ‘‘అవసరమైన విషయాలపై మనం దృష్టి పెట్టం. మూలాల నుంచి అభివృద్ధి చేయాల్సిన సత్యాన్ని గుర్తించం. దేశవాళీ క్రికెట్‌పై దృష్టి పెట్టకుండా.. జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు ఆశిస్తాం. అనుకున్న ఫలితాలు రాకపోతే... బలిపశువుల కోసం వెదుకుతాం. మనకు ఓపిక ఉండదు. ప్రణాళిక అంతకంటే ఉండదు. కానీ... ఆశించిన ఫలితాలు మాత్రం రావాలి’’ అంటూ పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, మాజీ కోచ్‌ మిస్సా ఉ​ల్‌ హక్‌ పాక్‌ క్రికెట్‌ బోర్డును ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశాడు.

అదే విధంగా  ఆటను ఎలా అభివృద్ధి చేయాలన్న విషయం కంటే కూడా... పైపై మెరుగులు దిద్దేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా వెస్టిండీస్‌ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. పాక్‌ హెడ్‌ కోచ్‌ మిస్బా, బౌలింగ్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందు వీరిద్దరు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాజీనామా అనంతరం తొలిసారిగా పాక్‌ జట్టు గురించి మీడియాతో మాట్లాడిన మిస్బా... పీసీబీ తీరును ఎండగట్టాడు. 

‘‘దురదృష్టవశాత్తూ... బలిపశువుల కోసం వెతకడం పాకిస్తాన్‌ క్రికెట్‌లో ఓ ఆనవాయితీగా మారింది. ఒక మ్యాచ్‌ లేదంటే, సిరీస్‌ ఓడిపోయిన అనంతరం.. తమను తాము కాపాడుకునేందుకు కొంతమంది ఇలా చేస్తారు. ఇది ఇలాగే కొనసాగితే మన తలరాత అస్సలు మారదు. పైపై మెరుగులతో ఎక్కువ రోజులు నెట్టుకురాలేము. కోచ్‌లను, ఆటగాళ్లను మార్చినంతం మాత్రాన... సమస్య పరిష్కారం కాదు. మూలాల నుంచే ప్రక్షాళన జరగాలి’’ అని చురకలు అంటించాడు.

ఇక టీ20 వరల్డ్‌కప్‌ జట్టు ఎంపిక గురించి మిస్బా స్పందిస్తూ... ‘‘అసలేం జరుగుతోంది? తొలుత కొంతమంది ఆటగాళ్ల పేర్లను ప్రకటిస్తారు. ఆ తర్వాత 10 రోజులకే యూటర్న్‌ తీసుకుంటారు. తొలుత డ్రాప్‌ చేసిన ఆటగాళ్లను మళ్లీ జట్టుకలోకి తీసుకుంటారు. ఇదంతా ఏంటి?’’ అని ప్రశ్నించాడు. కాగా 15 మంది సభ్యులు, ముగ్గురు రిజర్వు ప్లేయర్లతో జట్టును ప్రకటించిన పీసీబీ.. ఆ తర్వాత మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. అనంతరం సొహైబ్‌ మక్సూద్‌ గాయపడిన నేపథ్యంలో అతడి స్థానంలో వెటరన్‌ ప్లేయర్‌ షోయబ్‌ మాలిక్‌కు అవకాశం ఇచ్చింది. 

చదవండి: T20 World Cup Ind vs Pak: ఎల్లప్పుడూ మనదే విజయం.. ఈసారి కూడా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement