PAK VS AUS: భారీ రికార్డుపై కన్నేసిన షాహీన్‌ అఫ్రిది | PAK VS AUS: Shaheen Afridi On Verge Of Breaking Waqar Younis Huge Record In Australia Series | Sakshi
Sakshi News home page

PAK VS AUS: భారీ రికార్డుపై కన్నేసిన షాహీన్‌ అఫ్రిది

Published Mon, Nov 4 2024 7:20 PM | Last Updated on Mon, Nov 4 2024 7:36 PM

PAK VS AUS: Shaheen Afridi On Verge Of Breaking Waqar Younis Huge Record In Australia Series

ఆస్ట్రేలియాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాక్‌ స్పీడ్‌స్టర్‌ షాహీన్‌ అఫ్రిది ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్‌లో అఫ్రిది మరో 12 వికెట్లు తీస్తే.. పాకిస్తాన్‌ ఆల్‌టైమ్‌ గేటెస్ట్‌ ఫాస్ట్‌ బౌలర్‌ వకార్‌ యూనిస్‌ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొడతాడు. వకార్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) ఆస్ట్రేలియాపై 59 వికెట్లు పడగొట్టగా.. ప్రస్తుతం షాహీన్‌ ఖాతాలో 48 వికెట్లు ఉన్నాయి. 

ఆసీస్‌పై వకార్‌ ఓ సారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. షాహీన్‌ కూడా ఓ సారి ఆసీస్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న పాకిస్తాన్‌ ఇవాళ తొలి వన్డే ఆడింది. ఈ పర్యటనలో పాక్‌ మరో రెండు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో షాహీన్‌ మరో 12 వికెట్లు పడగొట్టే అవకాశాలు లేకపోలేదు. ఈ పర్యటనలోనే షాహీన్‌ వకార్‌ యూనిస్‌ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.

షాహీన్‌ ఆల్‌రౌండ్‌ షో
మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (నవంబర్‌ 4) జరిగిన తొలి వన్డేలో షాహీన్‌ అఫ్రిది ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో షాహీన్‌ బ్యాట్‌తో, బంతితో రాణించినా పాక్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. 46.4 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది.

నసీం షా (39 బంతుల్లో 40; ఫోర్‌, 4 సిక్సర్లు), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (71 బంతుల్లో 44; 2 ఫోర్లు, సిక్స్‌), బాబర్‌ ఆజమ్‌ (44 బంతుల్లో 37; 4 ఫోర్లు), షాహీన్‌ అఫ్రిది (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్‌), ఇర్ఫాన్‌ ఖాన్‌ (35 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్‌ తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసి 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో మూడు మెయిడిన్లు ఉన్నాయి. కమిన్స్‌, జంపా, అబాట్‌, లబూషేన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌.. ఓ దశలో సునాయాసంగా గెలుపొందేలా కనిపించింది. అయితే పాక్‌ బౌలర్లు మధ్యలో పుంజుకోవడంతో ఆసీస్‌ త్వరితగతిన వికెట్లు కోల్పోయి, ఓటమి దిశగా పయనించింది. ఈ సమయంలో కమిన్స్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ (32 నాటౌట్‌) ఆడి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. కమిన్స్‌తో పాటు స్టీవ్‌ స్మిత్‌ (44), జోష్‌ ఇంగ్లిస్‌ (49) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆసీస్‌ 33.3 ఓవర్లలో ఎనిమిది కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్‌ బౌలర్లలో హరీస్‌ రౌఫ్‌ 3, షాహీన్‌ అఫ్రిది 2, నసీం షా, మొహమ్మద్‌ హస్నైన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement