దేశవాళీ చాంపియన్స్ కప్ టోర్నీలో ఐదుగురు మాజీ క్రికెటర్లకు మెంటార్లుగా అవకాశం ఇచ్చినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. మిస్బా ఉల్ హక్, సక్లెయిన్ ముస్తాక్, వకార్ యూనిస్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్‌లతో ఇందుకు గానూ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే ఎవరు ఏ జట్టుకు మార్గనిర్దేశకుడిగా ఉంటారనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.
నవతరం ఆణిముత్యాలను గుర్తించేందుకు
తొలుత వీరు చాంపియన్స్ వన్డే కప్ ద్వారా ఆయా జట్లకు మెంటార్లుగా తమ ప్రయాణం మొదలుపెడతారని తెలిపింది. ఈ విషయం గురించి పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్‌కప్ టీమ్స్ మెంటార్లుగా ఐదుగురు చాంపియన్లను నియమించడం ఎంతో సంతోషంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అపార అనుభవం గడించి.. ఆట పట్ల అంకితభావం కలిగి ఉన్న వీరు.. నవతరం ఆణిముత్యాలను గుర్తించడంలో.. వారిని మెరికల్లా తీర్చిదిద్దడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
ప్రక్షాళనలో భాగంగా కొత్తగా మూడు టోర్నీలు
అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు మధ్య వారధులుగా పనిచేస్తారని.. యువ క్రికెటర్ల నైపుణ్యాలకు సానపెట్టడంలో వీరు కీలక పాత్ర పోషించబోతున్నారని నక్వీ వెల్లడించారు. ఆట పరంగానే వ్యక్తిగతంగానూ యువ ఆటగాళ్లకు వీరు దిక్సూచిలుగా వ్యవహరిస్తారని తెలిపారు. కాగా నేషనల్ టీ20 కప్, ఖైద్- ఈ - ఆజం ట్రోఫీ, ప్రెసిడెంట్స్ ట్రోఫీ, ప్రెసిడెంట్స్ కప్, హెచ్‌బీఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ వంటి డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలు పాకిస్తాన్‌లో ఉన్నాయి.
వీటికి అదనంగా మూడు కొత్త టోర్నమెంట్లను పీసీబీ ఇటీవల ప్రవేశపెట్టింది. పురుషుల క్రికెట్‌లో చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్‌క్లాస్ కప్ పేరిట టోర్నీలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగా మొదట సెప్టెంబరు 12- 29 వరకు చాంపియన్స్ వన్డే కప్ నిర్వహించనుంది.
ఇందులో టాప్ దేశవాళీ క్రికెటర్లతో పాటు సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా పాల్గొనున్నట్లు పీసీబీ తెలిపింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలికి తీసి.. వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్ది అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పీసీబీ ఈ టోర్నమెంట్లను ప్రవేశపెట్టింది.
ఐదుగురు అనుభవజ్ఞులు
పాక్ మాజీ బ్యాటర్, 52 ఏళ్ల వకార్ యూనిస్ ఇటీవల పీసీబీ సలహాదారుగా పనిచేశాడు. మరో మాజీ ఆటగాడు సక్లెయిన్ ముస్తాక్ పాక్ జాతీయ హెడ్‌కోచ్‌గా గతంలో సేవలు అందించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, మాజీ బ్యాటర్ మిస్బా ఉల్ హక్, మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన పాక్ జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇకపై మెంటార్లుగా వీరు కొత్త అవతారం ఎత్తనున్నారు.
చదవండి: రోహిత్ కోసం మేమూ పోటీలో ఉంటాం: పంజాబ్ కింగ్స్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment