నవ్యాంధ్ర ప్రదేశ్‌లో మొదటి టాపర్
- చంద్రశేఖర్ ఐఏఎస్
మురళీనగర్: మన చంద్రశేఖరుడు ఐఏఎస్ దక్కించుకున్నాడు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు వివిధ కేంద్ర సర్వీసులు కేటాయిస్తూ డిపార్టుమెంటు ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) జాబితాను విడుదల చేసింది.
నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ప్రథమ ర్యాంకరుగా విశాఖ వాసి చంద్రశేఖర్ ఐఏఎస్ క్యాడరుకు ఎంపికయ్యారు. ఆయన సివిల్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 234 ర్యాంకు సాధించిన విషయం విదితమే. ప్రస్తుత తరంలో చంద్రశేఖర్ ఒక్కరే ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పవచ్చు. మొదట్లో సాధారణ విద్యార్థిగా ఉన్న కిల్లి చంద్రశేఖర్ అంచెలంచెలుగా తన మేధస్సుకు పదును పెట్టుకుంటూ నిరంతర సాధనతో సివిల్స్‌లోనే అత్యున్నత స్థాయి కేడర్ ఐఏఎస్‌కు ఎంపికవడం విశేషం. బీటెక్ చేసిన ఆయన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో ఎంబీఏ చేశారు.
లండన్‌లో బిజినెస్ కన్సల్టెంటుగా పనిచేస్తూ అమెరికా ఆఫర్‌ను వదిలేసి సివిల్స్ కోసం ప్రయత్నించి విజయం సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబరు 1 తేదీ నుంచి ఫౌండేషన్ కోర్సు నిమిత్తం ఉత్తరాఖండ్‌లోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ తరగతులు ఉంటాయి. ఇది రెండు నెలలు ఉంటుంది. తర్వాత కూడా ఐఏఎస్ క్యాడరుకు ఎంపికైనవారు అక్కడే పూర్తి స్థాయి శిక్షణ పొందుతారు.
ఇది స్వాతంత్య్ర దినోత్సవ కానుక
నాకు ఐఏఎస్ క్యాడరు కేటాయించడం ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా భావిస్తున్నాను. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో మొదటి స్థానంలో నిలిచి సివిల్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. శిక్షణ అనంతరం నాకు కేటాయించే విధులను సమర్థవంతంగా నిర్వహించి పేద ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందించాలని భావిస్తున్నాను.
-కిల్లి చంద్రశేఖర్, విశాఖపట్నం