ఎంసెట్‌లో జిల్లాకు ర్యాంకులు
- ఇంజినీరింగ్‌లో 4వ ర్యాంకు
- మెడిసిన్‌లో 5వ ర్యాంకు
- ఎంసెట్ టాపర్ల విద్యాభ్యాసం ఇక్కడే
విజయవాడ : విద్యలవాడ విజయవాడ ఎంసెట్ ఫలితాల్లోనూ సత్తా చాటింది. జిల్లాకు చెందిన విద్యార్థులు వి.మనోజ్ఞితరెడ్డి మెడిసిన్‌లో ఐదో ర్యాంకు సాధించగా, ఇంజినీరింగ్‌లో ఎన్.దివాకర్‌రెడ్డి నాలుగో ర్యాంకు, పాల శ్రీ సూర్య ప్రహర్ష తొమ్మిదో ర్యాంకు సాధించి తమ ప్రతిభ చాటారు. వీరితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 15 మంది ఇంజినీరింగ్‌లో 50 లోపు ర్యాంకులు పొందగా, మెడిసిన్‌లో పది మంది ఉన్నారు.
మెడిసిన్‌లో రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించిన గుర్రం సాయి శ్రీనివాస్, రెండో ర్యాంకర్ భాస్కర్ దివ్య, ఆరో ర్యాంకర్ సేగు భరత్‌కుమార్, తొమ్మిదో ర్యాంకర్ సాయి హర్షతేజ, పదో ర్యాంకర్ సాయి నిఖిల్ గంటాలు నగరంలోని శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు కావడం విశేషం. ఇంజినీరింగ్‌లో సైతం మొదటి పది ర్యాంకుల్లో ఐదుగురు విద్యార్థులు నగరంలోనే విద్య నభ్యసించారు.
కార్పొరేట్ కళాశాలల హవా...
ఎంసెట్ ఫలితాల్లోను కార్పొరేట్ కళాశాలల హవా కొనసాగింది. ఇంజినీరింగ్, మెడిసిన్‌లలో ర్యాంకులు సాధించిన వారిలో అధిక శాతం మంది నగరంలోని కార్పొరేట్ కళాశాలల్లో చదివిన విద్యార్థులే. ఇంజినీరింగులో వందలోపు ర్యాంకులు సాధించిన వారిలో నగరంలో చదివినవారు 40 మంది వరకూ ఉండగా, మెడిసిన్‌లో 35 మందికి పైగా ఉన్నారు. మెడిసిన్‌లో శ్రీ చైతన్య తనకు తిరుగులేదని నిరూపించింది. మొదటి ఐదు ర్యాంకుల్లో ముగ్గురు ఆ విద్యాసంస్థల్లో నగరంలో చదివినవారే కావడం విశేషం.
మారనున్న ర్యాంకులు
సోమవారం ప్రకటించిన ఎంసెట్ ర్యాం కులు ఇంటర్మీడియెట్ మార్కులతో కలిపి ప్రకటించే సమయానికి మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఫస్ట్ ర్యాంకు సాధించినవారు, ఇంటర్ మార్కులు కలిపి ర్యాంకు ప్రకటించేటప్పుడు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ఏటా ఇదే విధంగా జరుగుతోంది.
మెడిసిన్‌లో హనీషా ప్రతిభ
విజయవాడలోని శ్రీధర్ ఇంటర్నేషనల్ డెంటల్ ఆస్పత్రి అధినేత డాక్టర్ ఆరుమళ్ల శ్రీధర్‌రెడ్డి కుమార్తె హనీషా ఎంసెట్ మెడిసిన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచింది. శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివిన ఆమె సోమవారం ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో 69వ ర్యాంకు సాధించింది.