సంపాదనలో కాదు... సేవలోనే తృప్తి | i have fully satisfied of 10 times salary decrease | Sakshi
Sakshi News home page

సంపాదనలో కాదు... సేవలోనే తృప్తి

Published Fri, Mar 21 2014 2:38 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

i have fully satisfied of 10 times salary decrease

 సాక్షి ప్రతినిధి, ఖమ్మం : అన్నింటికన్నా సమాజంలో గౌరవంగా బతకడమే ముఖ్యమని అంటున్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ కడ వేరు సురేంద్రమోహన్. ఎంత సంపాదించినా  లభించని తృప్తి ప్రజాసేవలో ఉంటుందని, మన కోసం మనం బతికిన దాని కన్నా... పరుల కోసం ఏం చేశాం? సమాజానికి ఏం తిరిగిచ్చామన్నదే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థానాలకు వెళ్లడం నేటి యువతకు పెద్ద కష్టమేమీ కాదని, అయితే కఠోర శ్రమ, సమయపాలన ముఖ్యమని ఆయన చెప్పారు. జిల్లాలో మంచి అధికారిగా అనతికాలంలోనే గుర్తింపు పొందిన నల్లగొండ జిల్లాకు చెందిన ఈ యువ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విశేషాలివి....
 సాక్షి: జేసీగా జిల్లాలో ఏడాది పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు. ఇక్కడ పనిచేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
 జేసీ: జిల్లాకు రాకముందు 10 ఏళ్ల పాటు క్షేత్రస్థాయికి దూరంగా ఉన్నాను. ఐదేళ్లు విదేశాల్లో పనిచేయగా, మరో ఐదేళ్లు హైదరాబాద్‌లోని వివిధ డెరైక్టరేట్ కార్యాలయాల్లో పనిచేశాను. నాకు ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నందువల్ల ఐఏఎస్ వచ్చిన తర్వాత రాష్ట్రస్థాయిలో వివిధ హోదాల్లో పనిచేసేందుకు ఆఫర్లు వచ్చాయి. అయినా నేను ఇష్టపడలేదు.

అసలు నేను ఇంజనీరింగ్ వదిలి ఐఏఎస్‌కు వచ్చింది కలెక్టర్ అయ్యేందుకే. కొన్నాళ్లు అక్కడ పనిచేసి మళ్లీ జేసీగా రావచ్చు. కానీ నా బ్యాచ్‌మెట్స్ కన్నా జూనియర్ అవుతాను. వాళ్లు నాకన్నా ముందుకు వెళ్లిపోతారు. అందుకే ఎన్ని ఆఫర్లు వచ్చినా వదులుకుని జాయింట్‌కలెక్టర్‌గా పని చేసేందుకే మొగ్గుచూపాను. ఇక్కడకు వచ్చిన సంవత్సర కాలంలోనే నాకు రెండు, మూడేళ్లలో వచ్చే అనుభవం వచ్చింది. ఈ జిల్లాలో అన్ని అంశాలూ ఉన్నాయి. సాగునీటి నుంచి గిరిజన సంప్రదాయాల వరకు అన్నింటి సమాహారమే ఈ జిల్లా. అందుకే ఇక్కడ పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం.

 సాక్షి: జేసీ అంటే ముఖ్యంగా రెవెన్యూ, భూ సమస్యలు ఎక్కువగా ఉంటాయి కదా.. ఎలా పరిష్కరించేవారు?
 జేసీ: నేను ఇక్కడకు వచ్చిన తర్వాత ఏడాది కాలంలో 25వేల ఎకరాల భూ సమస్యలు పరిష్కరించారు. ఎస్సీ, ఎస్టీలవి, ముఖ్యంగా 30-40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూవివాదాలకు తెరదించాం. జంగ్‌సిపాయి, పట్వారీపట్టేదార్, ఇనాం భూములు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. భూసమస్యను పరిష్కరించాలంటే ఆ భూమికి సరిహద్దులు చూపి అన్ని డాక్యుమెంట్లు సదరు పట్టాదారునికి అందజేయడమే. అలా కాకుండా కేవలం పేపర్ మీద చూపించి పరిష్కరించామని కూడా చెప్పుకోవచ్చు.

 కానీ మేం అలా చేయలేదు. భూములు సర్వే చేసేందుకు సర్వేయర్ల కొరత ఉందన్న కారణంతో ట్రింబుల్ జీపీఎస్ సర్వే ద్వారా భూములను కొలిచాం. ఈ విధానాన్ని ఉపయోగించడం రాష్ట్రంలోనే తొలిసారి. ఒక్కసారి ప్రభుత్వం నుంచి హక్కులు తీసుకున్న తర్వాత సదరు యజమాని ఇంకెప్పుడూ డాక్యుమెంట్ల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగొద్దు. అలా పనిచేయడం నాకు తృప్తినిచ్చింది.

 సాక్షి: మీకు ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా... దాన్నెలా ఉపయోగించుకున్నారు?
 జేసీ:నాకు వ్యక్తిగతంగా ఐటీ అంటే చాలా ఇష్టం. ఎక్కడో అమెరికాలోనో, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఐటీ ఉపయోగించడం పెద్ద గొప్పేమీ కాదు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి జీవితాలు సులభతరమయ్యేందుకు ఐటీ ఉపయోగపడాలి. ‘మీసేవ’ కార్యాలయాల ద్వారా అందించే ప్రభుత్వ సేవల కోసం తహశీల్దార్లకు ఐటీ శిక్షణనిచ్చాం. ప్రతి తహశీల్దార్ కార్యాలయాన్ని బలోపేతం చేశాం. పంటసాగు లెక్కలు కూడా ఆన్‌లైన్ చేసేశాం. రికార్డుల నిర్వహణలో వీఆర్వో, వీఆర్‌ఏలకు శిక్షణనిచ్చాం.  దాదాపు రూ.5లక్షల వ్యయంతో కలెక్టర్ కార్యాలయంలో ఐటీ శిక్షణ కేంద్రాన్నే ఏర్పాటు చేశాం. మొత్తం మీద మానవ వనరుల సమూహాన్ని తయారుచేశాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక కోణంలో వినియోగించుకుంటున్నాం.

 సాక్షి: సాంకేతిక పరిజ్ఞానంలో సామాజిక కోణమా?
 జేసీ: (నవ్వుతూ) అవునండీ... గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ‘మీసేవా’ కేంద్రాలను ఐదు శాతం మాత్రమే గిరిజనులు నిర్వహించేవారు. దానిని మార్పుచేసి 29 మండలాల్లో 29 మంది గిరిజనులకు మీసేవ నిర్వహించే అవకాశం కల్పించాం. వికలాంగులకు కూడా మీసేవ కేంద్రా లు ఇచ్చాం. జిల్లాలో 21 మండలాల్లో ఇప్పటికే వికలాంగులు మీసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రీవెన్స్‌లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించినప్పుడు కూడా చాలా తృప్తి కలుగుతుంది.

 సాక్షి: లక్షల జీతం వచ్చే ఐటీ రంగాన్ని వదిలి ఐఏఎస్ ఎందుకు కావాలనుకున్నారు?
 జేసీ: మాది నల్లగొండ జిల్లా. కట్టంగూరు నా స్వగ్రామం. నాన్న టీచర్‌గా పనిచేసేవారు. మా జిల్లాలో టీచర్ కావడం అంటే ఐఏఎస్, సీఎం అయినట్లే. నేను సర్వేల్ గురుకులం విద్యార్థిని. ఇంటర్ నాగార్జునసాగర్ ఏపీఆర్‌జేసీలో చేశాను. జిల్లా నలుమూలల నుంచి ప్రతిభ గల విద్యార్థులు ఆ రెండు చోట్లే చదువుకునేవారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ వరంగల్ ఆర్‌ఈసీలో చేశాను. ఎంటెక్ ఢిల్లీ ఐఐటీలో చేశాను. ఆ తర్వాతే ఐఏఎస్ కావాలన్న కోరిక కలిగింది.

 నేను అమెరికాలో ఉద్యోగానికి వెళ్లకముందు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగిగా నెలకు రూ.18వేల జీతం వచ్చేది. ఆ తర్వాత అమెరికా వెళ్లి నెలకు రూ.5లక్షల వరకు జీతం అందుకున్నాను. కొద్ది రోజులు బాగానే ఉంది. ఓ రెండేళ్ల పాటు అయితే అసలు ఇండియా వచ్చే పనిలేదనుకున్నా. కానీ కొంతకాలం తర్వాత మన పని ఎంతమంది జీవితాలను ఉద్ధరిస్తోంది అనే స్ఫృహ నాకు వచ్చింది. మన జీవితం మనం గడపడం పెద్ద విషయమేమీ కాదు. ఇతరుల కోసం ఏం చేశామన్నదే తృప్తినిస్తుంది. ఇప్పుడు నాకు వస్తున్నది నెలకు రూ.50వేల లోపే. అంటే అమెరికాలో వచ్చిన దాని కన్నా 10 రెట్లు తక్కువే. కానీ సేవలో మాత్రం అమెరికా కన్నా పదిరెట్లు తృప్తి ఉంది. మనల్ని తయారుచేసిన సమాజానికి మనం ఎంతో కొంత తిరిగివ్వాలి.

 సాక్షి: మీకు ప్రణాళికాబద్ధంగా పనిచేయడం ఎప్పటి నుంచి అలవడింది? యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి?
 జేసీ: ప్రణాళిక అంటే నాకేమీ దీర్ఘకాలిక లక్ష్యాలుండేవి కావు. టెన్త్ తర్వాత ఏపీఆర్‌జేసీ సీటు, ఆ తర్వాత ఇంజనీరింగ్, ఆ తర్వాత ఎంటెక్, తర్వాత ఐఏఎస్.... ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకునేవాడిని. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే ఆస్తులు లేకపోయినా, తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా ఉన్నత స్థానానికి చేరొచ్చు.

యువత ఆ అవకాశాలు వెతికి పట్టుకోగలగాలి. మంచి శ్రమ ఉండాలి. సమయం వృధా చేసుకోకుండా పెడదారి పట్టకుండా జాగ్రత్త పడాలి. నలుగురికి నీడనివ్వాలి. తల్లిదండ్రులకు మంచి పేరు తే వాలి. మీ కుటుంబంలో, సమాజంలో గౌరవం సంపాదించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement