సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల శాఖ మంగళవారం ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 9 విభాగాల్లో(ఓవరాల్, ఇంజనీరింగ్, వర్సిటీ, మేనేజ్‌మెంట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, మెడికల్, లా, ఆర్కిటెక్చర్) ఈ ర్యాంకులను వెల్లడించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) ఇండియా ర్యాంకింగ్స్ 2018 పేరుతో వీటిని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 3,954 విద్యా సంస్థలను పరిశీలించిన అనంతరం ర్యాంకులను ప్రకటించింది. గతేడాది ఓవరాల్ కేటగిరీలో రాష్ట్రానికి చెందిన ఐదు విద్యా సంస్థలు టాప్–100లో ఉంటే.. ఈసారి నాలుగు విద్యా సంస్థలే ఆ అర్హత సాధించాయి.
దేశంలో టాప్ ఉన్నత విద్యా సంస్థల్లో(ఓవరాల్‌గా) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) 11వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 14వ స్థానంతో సరిపెట్టుకున్న సెంట్రల్ వర్సిటీ ఈసారి తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. ఇక హైదరాబాద్ ఐఐటీ, వరంగల్ ఎన్‌ఐటీలు తమ ప్రమాణాలను మెరుగుపరచుకుని గతేడాది కంటే మెరుగైన స్థానాలను దక్కించుకున్నాయి. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం ర్యాంకు గతేడాది కంటే ఈసారి మరింతగా పడిపోయింది. గతేడాది 38వ ర్యాంకు తెచ్చుకున్న ఉస్మానియా ఈసారి 45వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.
నల్సార్‌కు జాతీయ స్థాయిలో మూడో స్థానం
ఉన్నత విద్యా సంస్థల ర్యాంకులను గతేడాది ఆరు కేటగిరీల్లోనే ప్రకటించిన కేంద్ర మానవ వనరుల శాఖ ఈసారి న్యాయ, మెడికల్, ఆర్కిటెక్చర్ విద్యా సంస్థలను కలుపుకుని తొమ్మిది కేటగిరీల్లో ర్యాంకులను ప్రకటించింది. ఇందులో న్యాయ విద్యా సంస్థల కేటగిరీలో హైదరాబాద్‌లోని నల్సార్‌కు జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు లభించింది. మెడికల్ కేటగిరీ టాప్–100లో రాష్ట్ర విద్యా సంస్థలు ఒక్కటీ లేవు. ఇక ఆర్కిటెక్చర్ కాలేజీల కేటగిరీలో హైదరాబాద్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఏడో ర్యాంకు సాధించింది. ఫార్మసీ కాలేజీల కేటగిరీలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు ఆరో స్థానం లభించింది. ఇంజనీరింగ్ విద్యా సంస్థల కేటగిరీలో జేఎన్‌టీయూ స్థానం గణనీయంగా మెరుగుపడింది. గతేడాది 63వ ర్యాంకు దక్కించుకున్న జేఎన్‌టీయూ ఈసారి 42వ ర్యాంకును సాధించడం విశేషం.
ఐదు అంశాల ప్రాతిపదికగా ర్యాంకులు..
ప్రధానంగా ఐదు అంశాల ప్రాతిపదికగా కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో టీచింగ్, లెర్నింగ్ రిసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ అవుట్ కమ్స్, ఔట్‌రీచ్ అండ్ ఇన్‌క్లూజివిటీ, పర్సెప్షన్ ఆధారంగా 100 పాయింట్లకు లెక్కించి వచ్చిన పాయింట్ల ద్వారా ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా విద్యా సంస్థల్లో పీహెచ్‌డీ విద్యార్థులు, శాశ్వత అధ్యాపకులు, అధ్యాపక–విద్యార్థి నిష్పత్తి, సీనియర్ అధ్యాపకులు, బడ్జెట్.. దాని వినియోగం, పబ్లికేషన్స్, ప్రాజెక్టులు, ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్, పరీక్షల ఫలితాలు, ప్లేస్‌మెంట్స్, హయ్యర్ స్టడీస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టాప్ యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు చెందిన విద్యార్థుల శాతం, మహిళా విద్యార్థులు, పోటీతత్వం, పరిశోధనలు, వాటి ఫలితాలు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది.
డిగ్రీ కాలేజీల కేటగిరీలో ఒక్కటీ లేదు..
డిగ్రీ కాలేజీల కేటగిరీలో రాష్ట్రానికి చెందిన ఒక్క సంస్థకూ టాప్–100లో చోటు దక్కలేదు. 100కు పైబడిన ర్యాంకుల్లో మాత్రం పలు కాలేజీలకు స్థానం లభించింది. యూనివర్సిటీల కేటగిరీలో 101–150 ర్యాంకుల పరిధిలో కాకతీయ వర్సిటీ, ఇఫ్లూ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి, 151–200 ర్యాంకుల పరిధిలో నిజమాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీకి స్థానాలు దక్కాయి.
టీం వర్క్‌తో మెరుగైన స్థానం: జేఎన్‌టీయూ
ఈసారి ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో జేఎన్‌టీయూకు గతేడాది కంటే మెరుగైన ర్యాంకు రావడం పట్ల యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య హర్షం వ్యక్తం చేశారు. అధ్యాపకులు, సిబ్బంది టీం వర్క్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు.
సమష్టి కృషి ఫలితంగానే..: హెచ్‌సీయూ వీసీ
మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతుల మీదుగా ర్యాంకింగ్ సర్టిఫికెట్, మెమోంటోను హెచ్‌సీయూ వీసీ ప్రొఫెసర్ అప్పారావు అందుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఫ్యాకల్టీ, విద్యార్థులు, అధికారులు, నాన్‌టీచింగ్ స్టాఫ్, పూర్వ విద్యార్థుల సమష్టి కృషి ఫలితంగానే హెచ్‌సీయూ దేశంలోనే మంచి గుర్తింపును సాధించిందన్నారు. వరుసగా మూడేళ్ల పాటు ఐఐటీ హైదరాబాద్ దేశంలోని పది అత్యున్నత ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ఒకటిగా నిలవడంపై ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ యూబీ దేశాయ్ హర్షం వ్యక్తం చేశారు. పరిశోధన, బోధన, సంస్థ అభివృద్ధిలో విశిష్ట కృషి చేస్తున్న అధ్యాపక బృందానికే ఈ ఘనత దక్కుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment