కోదండరాం ఇంటి ముట్టడిని అడ్డుకున్న పోలీసులు
హాస్టల్‌లోకి చొరబడి టీఎస్‌పీ నేతల అరెస్ట్
డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల ఆందోళన
జర్నలిస్టులపై పోలీసుల దాడి.. పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా
ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (టీఎస్‌పీ) చేపట్టిన చలో ప్రొఫెసర్ కోదండరాం ఇంటి ముట్టడి కార్యక్రమంతో బుధవారం ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలికొంది. ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్‌కుమార్ యాదవ్‌తో మరో ఇద్దరు విద్యార్థి నేతలను ఉదయం 7.30 నిమిషాలకు హాస్టల్ అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్ తరలించి సాయంత్రం 6 గంటలకు విడిచి పెట్టారు.
అనంతరం అశోక్‌కుమార్ మాట్లాడుతూ వర్సిటీలకు తక్షణం వీసీలను నియమించేలా టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం సీఎం రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి ఏడు నెలలు గడుస్తున్నా, ఇంత వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. సీఎం రేవంత్ విద్యరంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా, కోదండరాం మౌనం వహించడం దారుణమని చెప్పారు.
ఈ నెల 20వ తేదీలోగా వీసీలను నియమించకుంటే 10 విశ్వవిద్యాలయాల బంద్ చేపడుతామని హెచ్చరించారు. శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న విద్యార్థులను ఓయూ అధికారుల అనుమతి లేకుండా హాస్టళ్లలోకి చొరబడి అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
మూడో రోజుకు చేరిన డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట మూడో రోజు అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు డీఎస్సీ అభ్యర్థుల నడుమ వాగ్వాదం చోటు చేసుంది. అభ్యర్థులు ఆందోళనను విరమించకపోవడంతో పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో పలువురు విద్యార్థులపై పోలీసులు చేయి చేసుకున్నారు. డీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న బీఆర్‌ఎస్ విద్యార్థి నేతలపై పోలీసులు పిడిగుద్దుల వర్షం కురిపించారు. పలువురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న 13 మంది విద్యార్థులను అరెస్ట్ చేసిన్నట్టు సీఐ రాజేందర్ తెలిపారు.
మీడియా వర్గాలపై దాడి
డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనను కవర్ చేస్తున్న ఓ చానల్ రిపోర్టర్ శ్రీ చరణ్, కెమెరామెన్ సాగర్ పై పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. గాయపడిన రిపోర్టర్ శ్రీ చరణ్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను నిరసిస్తూ రాత్రి ఓయూ పోలీస్‌స్టేషన్ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేపట్టారు.
జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఓయూ ఏసీపీ జగన్ హామీ ఇవ్వడంతో జర్నలిస్టులు ధర్నా విరమించారు. జర్నలిస్టులపై దాడిని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ, ఎస్‌ఎఫ్‌ఐ నేత రవినాయక్, పీడీఎస్‌యూ జాతీయ నాయకుడు ఎస్.నాగేశ్వర్‌రావు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు ఖండిచారు.
Comments
Please login to add a commentAdd a comment