Human Resources Department
-
మనోళ్లు గొప్ప పనోళ్లు
సాక్షి, అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రమైక జీవన సౌందర్యం వెల్లివిరుస్తోంది. పనిచేసే వయసుగా భావించే 25 నుంచి 59 ఏళ్లలోపు వారు జనాభాలో 70 శాతానికి పైగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక వృద్ధికి కీలకమైన పనిచేసే మానవ వనరులు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నట్టు తేలింది. జాతీయ సగటుతో పోలిస్తే ఈ రెండు రాష్ట్రాల్లో ఆ వయస్కులు ఎక్కువగా ఉన్నారు. జాతీయ జనాభా గణన ఆధారంగా ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం’ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ‘సెన్సస్ కమిషనర్–రిజిస్ట్రార్ జనరల్’ కార్యాలయం గణాంకాల ఆధారంగా రూపొందించిన ఆ నివేదికలోని ప్రధాన అంశాలివీ.. దేశ సగటు 66 శాతం ► దేశవ్యాప్తంగా శ్రమించే మానవ వనరులు పెరుగుతుండటం శుభసూచకం. 25 నుంచి 59 ఏళ్ల లోపు వారు దేశ జనాభాలో 66 శాతం మంది ఉన్నారు. ► అంటే జనాభాలో మూడింట రెండొంతుల మంది పనిచేసే వయసు వారే కావడం విశేషం. ► దేశంలోని 12 రాష్ట్రాల్లో ఈ వయస్కుల వారు మూడింట రెండొంతుల మంది ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ► 2013లో దేశంలో 4 రాష్ట్రాల్లో మాత్రమే ఈ వయసు వారి జనాభా మూడింట రెండొంతులు ఉండేది. ఇప్పుడు 12 రాష్ట్రాలకు పెరగడం గమనార్హం. ► ఈ పరిణామం ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పనిచేసే వారు ఎక్కువమంది ఉంటే వారిపై ఆధారపడే వారు తక్కువ మంది ఉంటారు. ► ఎక్కువ జనాభా ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములైతే.. కుటుంబాలు అభివృద్ధి చెంది దేశ ప్రగతికి సహకరిస్తుంది. ► మొత్తం దేశ జనాభాలో 25 ఏళ్లలోపు వయసు వారు 25.90 శాతం మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరి శాతం 27.50 కాగా.. పట్టణ ప్రాంతాల్లో 22.60 శాతం. ∙60 ఏళ్లు దాటిన వారు 8.10 శాతం మంది ఉన్నారు. అగ్రపథంలో తెలుగు రాష్ట్రాలు ► పనిచేసే జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలు దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో ఉండటం విశేషం. ► పనిచేసే వయస్కులు తెలంగాణలో 71.10%, ఆంధ్రప్రదేశ్‌లో 70.90% మంది ఉన్నారు. ► 69.90 శాతంతో మూడో స్థానంలో ఢిల్లీ.. 59.90% మందితో చివరి స్థానంలో బిహార్ -
‘ఉన్నత’ పరీక్షలు తప్పనిసరి
సాక్షి, అమరావతి: డిగ్రీ సహా ఉన్నత విద్యాకోర్సులకు సంబంధించి పరీక్షలు, మూల్యాంకనం, ఫలితాల వెల్లడి తప్పనిసరని కేంద్ర మానవ వనరుల శాఖతోపాటు యూజీసీ స్పష్టం చేస్తోంది. కరోనా నేపథ్యంలో పరీక్షలు ఇప్పటికిప్పుడు నిర్వహించకున్నా ఫైనలియర్ విద్యార్థుల పరీక్షలను నిర్వహించాల్సిన అవసరముందని పేర్కొంటున్నాయి. డిగ్రీ తదితర ఉన్నతవిద్యాకోర్సుల ఫైనలియర్ విద్యార్థులకు సెప్టెంబర్ ఆఖరులోగా పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం చేపట్టి ఫలితాలు వెల్లడించాలని యూజీసీ ఇటీవల ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ దృష్ట్యా పరీక్షలపై పునరాలోచించాలని తమిళనాడు వంటి రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. ఢిల్లీ ప్రభుత్వం ఏకంగా యూనివర్సిటీల పరిధిలోని పరీక్షలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో యూజీసీ తాజా సూచనలు చేసింది. పరీక్షలు తప్పనిసరి ఎందుకంటే..? ► డిగ్రీ తదితర ఉన్నతవిద్య కోర్సుల పరీక్షలను నిర్వహించి మూల్యాంకనం చేయడం ద్వారా అభ్యర్థుల ప్రమాణాలు,సామర్థ్యాల ఫలితాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ► పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల విద్యార్థులు చాలా నష్టపోతారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మెరిట్ విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ► పరీక్షల నిర్వహణతో మెరిట్ అభ్యర్థులకు జారీచేసే సర్టిఫికెట్ల ఆధారంగా ప్రయోజనాలు చేకూరతాయి. పరీక్షలు లేకుంటే వీటిని కోల్పోతారు. ► పరీక్షల వల్ల మెరుగైన ఉద్యోగావకాశాలు, పైస్థాయి విద్యాభ్యాసానికి వెళ్లేవారికి మెరుగైన స్కాలర్షిప్లు లభించే అవకాశాలుంటాయి. ► ఈ నేపథ్యంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్, లేదా రెండు మోడ్లలో కలిపి అయినా పరీక్షలు పూర్తిచేసి మూల్యాంకనం చేయడం తప్పనిసరి. జాగ్రత్తలు తప్పనిసరి.. ► పరీక్షల నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలపై యూజీసీ ఇప్పటికే ఉన్నత విద్యాసంస్థలకు పలు సూచనలు చేసింది. వీటిని తప్పక పాటిస్తూ పరీక్షలు పూర్తి చేయాలని స్పష్టం చేస్తోంది. ► పరీక్షలు జరిగే భవన ప్రాంగణం మొత్తం శానిటైజేషన్ చేసి, థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. భౌతిక దూరాన్ని పాటించేలా చూడడంతో పాటు మాస్కులు, గ్లౌజ్‌లు సిద్ధం చేసుకోవాలి. ► చుట్టు పక్కల ప్రాంతాల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయా? తదితర అంశాలను పరిశీలించాలి. ► పరీక్షల సమయంలో విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా హాల్‌టికెట్లు, ఐడీ కార్డులనే పాస్లుగా పరిగణించేలా ఏర్పాట్లు చేయాలి. ► ఇన్విజిలేటర్లకు, ఇతర సిబ్బందికి పాస్‌లు ఇచ్చేలా సంబంధిత అధికారులతో మాట్లాడాలి. ► గోడలు, తలుపులు, గేట్లతో సహా పరీక్ష కేంద్రాన్ని క్రిమిసంహారక మందుతో పిచికారీ చేయాలి. సిబ్బందికి మాస్కులు, గ్లౌజ్‌లు రోజూ అందించాలి. పరీక్ష కేంద్రాలు, గదుల ప్రవేశద్వారాల వద్ద శానిటైజర్ బాటిళ్లను ఉంచాలి. ► చేతులు శుభ్రం చేసుకొనేందుకు ద్రవ హ్యాండ్‌వాష్‌లను ఉంచాలి. ► ప్రతి సెషన్‌కు ముందు, తరువాత పరీక్ష కేంద్రంలోని కుర్చీలు, బల్లలన్నిటినీ శానిటైజ్ చేయించాలి. ► వాష్ రూమ్‌లన్నీ శుభ్రం చేసి క్రిమిసంహారక మందు స్ప్రే చేయాలి. ► డోర్ హ్యాండిల్స్, స్టెయిర్‌కేస్ రెయిలింగ్, లిఫ్ట్ బటన్లను శానిటైజర్‌తో శుభ్రం చేయాలి. ► పరీక్షలు నిర్వహించే సిబ్బంది, హాజరయ్యే విద్యార్థులు తమ ఆరోగ్య స్థితి గురించి సెల్ఫ్ డిక్లరేషన్ అందించాలి. ఇందుకు నిరాకరిస్తే పరీక్షలకు అనుమతించరాదు. ► సిబ్బంది, విద్యార్థులు ఆరోగ్యసేతు యాప్‌ను కలిగి ఉండాలి. పరీక్షకు వచ్చేవారికి మాస్కులు, గ్లౌజ్‌లు ప్రతిరోజూ కొత్తవి అందించాలి. ► విద్యార్థులు, సిబ్బంది వెళ్లేటప్పుడు ఒక్కొక్కరి మధ్య 2 మీటర్ల మేర భౌతికదూరం పాటించేలా చూడాలి. -
కోవిడ్-19 : ఇకముందూ ఇంటి నుంచే పని
ముంబై/న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 ప్రతాపంతో పలు కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. అయితే కరోనా మహమ్మారి భయాలు క్రమంగా వైదొలగినా నయా పనిసంస్కృతి మాత్రం కొనసాగుతుందని కార్పొరేట్ కంపెనీలు చెబుతున్నాయి. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం (డబ్ల్యూఎఫ్‌హెచ్) సంస్థకూ, ఉద్యోగులకూ ప్రయోజనకరమని దిగ్గజ కంపెనీల మానవ వనరుల విభాగాధిపతులు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా ఉద్యోగులకు గంటల తరబడి కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రయాణ సమయం ఆదా అవుతుందని, పని-జీవితం సమన్వయపరుచుకోవడంలో వెసులుబాటు లభిస్తుందని ఇక యాజమాన్యాలకు నిర్వహణ ఖర్చు తగ్గడం, ఉత్పాదకత పెరగడం వంటి ప్రయోజనాలు చేకూరతాయని వారు చెప్పుకొచ్చారు. వర్చువల్ పనిప్రదేశాలదే భవిష్యత్ అని యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్పీజీ గ్రూప్, వేదాంత, ఈవై, కాగ్నిజెంట్, టైటాన్, డెలాయిట్, విర్ల్‌పూల్, పేటీఎం, సెయింట్ గోబెయిన్ ఇండియా వంటి పలు ప్రముఖ కంపెనీల హెచ్ఆర్ హెడ్స్ అభిప్రాయపడ్డారు. చదవండి : ఐటీకి మహమ్మారి ముప్పు ఇంటి నుంచి పనిచేసే విధానం ఇక ముందు కొనసాగుతుందని యాక్సిస్ బ్యాంక్ హెచ్ఆర్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజ్‌కమల్ వెంపటి అన్నారు. కస్టమర్లతో భేటీ అవసరం లేని పనులన్నీ మారుమూల నుంచీ చక్కబెట్టవచ్చని..దాదాపు 30 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయవచ్చని చెప్పారు. డబ్ల్యూఎఫ్‌హెచ్ ద్వారా సులభతర వాణిజ్యంతో పాటు వ్యయాల తగ్గింపు కలిసివస్తుందని ఈవై ఇండియా పార్టనర్, టాలెంట్ లీడర్ సందీప్ కోహ్లి అన్నారు. చాలా దేశాల్లో డబ్ల్యూఎఫ్‌హెచ్ ఓ సానుకూల పనివిధానంగా అందరూ ఆమోదించడం మనం చూస్తున్నామని కాగ్నిజెంట్ ఇండియా చీఫ్ రాంకుమార్ రామమూర్తి చెప్పుకొచ్చారు. గతంలో ఈ విధానాన్ని అనుసరించని వారు సైతం సాంకేతిక సదుపాయాలు మెరుగైన క్రమంలో వారికి ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఉండబోవని ఆర్పీజీ గ్రూప్ హెడ్ (నైపుణ్యాభివృద్ధి) అజర్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. -
బ్యాగుల మోతకు చెక్
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థుల బ్యాగుల మోతకు చెక్ పడనుంది. తరగతిని బట్టి పుస్తకాల బరువుండాలని, ఒకట్రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వకూడదని మానవ వనరుల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థికి ఉపశమనం ప్రస్తుతం విద్యారంగంలో నెలకొన్న పోటీతత్వంతో ర్యాంకులే ప్రామాణికంగా భావించే పాఠశాలల యాజమాన్యాలు పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి. ప్రతిదానికో పుస్తకమంటూ విద్యార్థులపై బండెడు మోత వేశారు. ఫలితంగా ఎల్కేజీ, యూకేజీ నుంచి బ్యాగు నిండా పుస్తకాలు ఉంచుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఒకటోతరగతి చిన్నారి పది కేజీల బ్యాగు మోస్తున్నాడు. ఎక్కువ స్కూళ్లు బహుళ అంతస్తుల బిల్డింగుల్లో ఉండడంతో నాలుగైదు అంతస్తులు ఎక్కలేక చిన్నారులు నరకం అనుభవిస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ తీసుకున్న నిర్ణయంతో పసిపిల్లలు మోస్తున్న బరువుకు ఉపశమనం కలుగుతుంది. ఒకట్రెండు తరగతుల పిల్లల స్కూల్ బ్యాగు బరువు కేజిన్నరకు మించకూడదు. 3–5 తరగతులకు 2–3 కేజీలు, 6,7 తరగతులకు నాలుగు కేజీలు, 8,9 తరగతులకు 4.5 కేజీలు, 10వ తరగతికి ఐదు కేజీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మించరాదని స్పష్టం చేశారు. సబ్జెక్టుల బోధన ఇలా.. 1–2 తరగతులకు స్థానిక లాంగ్వేజ్పాటు గణితం రెండు సబ్జెక్టులు మాత్రమే బోధించాలి. ఈ ప్రకారం ఇంగ్లిష్, ఈవీఎస్ ఉండదు. 3–5 తరగతులకు లాంగ్వేజ్‌తో పాటు గణితం, ఈవీఎస్ సబ్జెక్టులు బోధించాలి. అదికూడా ఎన్సీఈఆర్టీ సూచించిన మేరకే పుస్తకాలుండాలి. ఒకట్రెండు తరగతులకు హోం వర్క్ ఇవ్వకూడదు. పాఠశాలల్లో ఇతరత్రా ఎలాంటి పుస్తకాలు, మెటీరియల్ ఇవ్వకూడదు. ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని మానవవనరుల శాఖ స్పష్టం చేసింది. అమలవుతుందా..? కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏ మేరకు అమలవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్లమెంటులో చేసిన విద్యాహక్కు చట్టానికే దిక్కూమొక్కు లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో ఏటా 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలి. ఫీజులు ఇష్టానుసారం వసూలు చేయకూడదు. క్వాలిఫైడ్ టీచర్లే స్కూళ్లలో బోధించాలి. దాదాపు కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో ఇవేవీ అమలు కాలేదు. తాజాగా మానవ వనరుల శాఖ ఇచ్చిన ఉత్తర్వులు ఏ మేరకు అమలవుతాయనే భిన్నాభిప్రాయాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. -
పడిపోయిన ఓయూ ర్యాంకు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల శాఖ మంగళవారం ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 9 విభాగాల్లో(ఓవరాల్, ఇంజనీరింగ్, వర్సిటీ, మేనేజ్మెంట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, మెడికల్, లా, ఆర్కిటెక్చర్) ఈ ర్యాంకులను వెల్లడించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ఇండియా ర్యాంకింగ్స్ 2018 పేరుతో వీటిని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 3,954 విద్యా సంస్థలను పరిశీలించిన అనంతరం ర్యాంకులను ప్రకటించింది. గతేడాది ఓవరాల్ కేటగిరీలో రాష్ట్రానికి చెందిన ఐదు విద్యా సంస్థలు టాప్–100లో ఉంటే.. ఈసారి నాలుగు విద్యా సంస్థలే ఆ అర్హత సాధించాయి. దేశంలో టాప్ ఉన్నత విద్యా సంస్థల్లో(ఓవరాల్‌గా) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) 11వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 14వ స్థానంతో సరిపెట్టుకున్న సెంట్రల్ వర్సిటీ ఈసారి తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. ఇక హైదరాబాద్ ఐఐటీ, వరంగల్ ఎన్ఐటీలు తమ ప్రమాణాలను మెరుగుపరచుకుని గతేడాది కంటే మెరుగైన స్థానాలను దక్కించుకున్నాయి. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం ర్యాంకు గతేడాది కంటే ఈసారి మరింతగా పడిపోయింది. గతేడాది 38వ ర్యాంకు తెచ్చుకున్న ఉస్మానియా ఈసారి 45వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. నల్సార్‌కు జాతీయ స్థాయిలో మూడో స్థానం ఉన్నత విద్యా సంస్థల ర్యాంకులను గతేడాది ఆరు కేటగిరీల్లోనే ప్రకటించిన కేంద్ర మానవ వనరుల శాఖ ఈసారి న్యాయ, మెడికల్, ఆర్కిటెక్చర్ విద్యా సంస్థలను కలుపుకుని తొమ్మిది కేటగిరీల్లో ర్యాంకులను ప్రకటించింది. ఇందులో న్యాయ విద్యా సంస్థల కేటగిరీలో హైదరాబాద్‌లోని నల్సార్‌కు జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు లభించింది. మెడికల్ కేటగిరీ టాప్–100లో రాష్ట్ర విద్యా సంస్థలు ఒక్కటీ లేవు. ఇక ఆర్కిటెక్చర్ కాలేజీల కేటగిరీలో హైదరాబాద్‌లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఏడో ర్యాంకు సాధించింది. ఫార్మసీ కాలేజీల కేటగిరీలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు ఆరో స్థానం లభించింది. ఇంజనీరింగ్ విద్యా సంస్థల కేటగిరీలో జేఎన్టీయూ స్థానం గణనీయంగా మెరుగుపడింది. గతేడాది 63వ ర్యాంకు దక్కించుకున్న జేఎన్టీయూ ఈసారి 42వ ర్యాంకును సాధించడం విశేషం. ఐదు అంశాల ప్రాతిపదికగా ర్యాంకులు.. ప్రధానంగా ఐదు అంశాల ప్రాతిపదికగా కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో టీచింగ్, లెర్నింగ్ రిసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ అవుట్ కమ్స్, ఔట్రీచ్ అండ్ ఇన్‌క్లూజివిటీ, పర్సెప్షన్ ఆధారంగా 100 పాయింట్లకు లెక్కించి వచ్చిన పాయింట్ల ద్వారా ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా విద్యా సంస్థల్లో పీహెచ్డీ విద్యార్థులు, శాశ్వత అధ్యాపకులు, అధ్యాపక–విద్యార్థి నిష్పత్తి, సీనియర్ అధ్యాపకులు, బడ్జెట్.. దాని వినియోగం, పబ్లికేషన్స్, ప్రాజెక్టులు, ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్, పరీక్షల ఫలితాలు, ప్లేస్‌మెంట్స్, హయ్యర్ స్టడీస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టాప్ యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు చెందిన విద్యార్థుల శాతం, మహిళా విద్యార్థులు, పోటీతత్వం, పరిశోధనలు, వాటి ఫలితాలు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. డిగ్రీ కాలేజీల కేటగిరీలో ఒక్కటీ లేదు.. డిగ్రీ కాలేజీల కేటగిరీలో రాష్ట్రానికి చెందిన ఒక్క సంస్థకూ టాప్–100లో చోటు దక్కలేదు. 100కు పైబడిన ర్యాంకుల్లో మాత్రం పలు కాలేజీలకు స్థానం లభించింది. యూనివర్సిటీల కేటగిరీలో 101–150 ర్యాంకుల పరిధిలో కాకతీయ వర్సిటీ, ఇఫ్లూ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి, 151–200 ర్యాంకుల పరిధిలో నిజమాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీకి స్థానాలు దక్కాయి. టీం వర్క్‌తో మెరుగైన స్థానం: జేఎన్టీయూ ఈసారి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో జేఎన్టీయూకు గతేడాది కంటే మెరుగైన ర్యాంకు రావడం పట్ల యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య హర్షం వ్యక్తం చేశారు. అధ్యాపకులు, సిబ్బంది టీం వర్క్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. సమష్టి కృషి ఫలితంగానే..: హెచ్‌సీయూ వీసీ మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతుల మీదుగా ర్యాంకింగ్ సర్టిఫికెట్, మెమోంటోను హెచ్‌సీయూ వీసీ ప్రొఫెసర్ అప్పారావు అందుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఫ్యాకల్టీ, విద్యార్థులు, అధికారులు, నాన్‌టీచింగ్ స్టాఫ్, పూర్వ విద్యార్థుల సమష్టి కృషి ఫలితంగానే హెచ్‌సీయూ దేశంలోనే మంచి గుర్తింపును సాధించిందన్నారు. వరుసగా మూడేళ్ల పాటు ఐఐటీ హైదరాబాద్ దేశంలోని పది అత్యున్నత ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ఒకటిగా నిలవడంపై ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ యూబీ దేశాయ్ హర్షం వ్యక్తం చేశారు. పరిశోధన, బోధన, సంస్థ అభివృద్ధిలో విశిష్ట కృషి చేస్తున్న అధ్యాపక బృందానికే ఈ ఘనత దక్కుతుందన్నారు. -
యువతను డ్రగ్స్‌కు దూరం చేసేందుకు విధానం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని యువతరాన్ని డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నట్లు సుప్రీం కోర్టుకు కేంద్రం నివేదించింది. ఇప్పటికే ఓ ఉన్నతస్థాయి కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. డ్రగ్స్ నిరోధానికి, యువతరం డ్రగ్స్ బారినపడకుండా తీసుకుంటున్న చర్యలపై 2018 జనవరి చివరికి నివేదిక సమర్పించాలని ఉన్నతస్థాయి కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎం.ఖన్వీల్కర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి ఆస్తులను జప్తు చేసేలా కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూ.10 కోట్ల కన్నా ఎక్కువ విలువ చేసే డ్రగ్స్ పట్టుపడ్డప్పుడు విదేశీయులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల ప్రమేయముంటే, దర్యాప్తు సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దీంతో కేంద్ర మానవ వనరుల శాఖ కౌంటర్‌ను కోర్టుకు సమర్పించింది. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజా విచారణ సందర్భంగా కేంద్రం తరఫు అదనపు సాలిసిటర్ జనరల్ మనీందర్‌సింగ్ వాదిస్తూ.. యువతరాన్ని డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు నిర్దిష్ట విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. -
మధ్యాహ్న భోజనానికి ఆధార్ తప్పనిసరి
న్యూఢిల్లీ: మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి, లబ్ధిదారులైన విద్యార్థులకు ఆధార్ కార్డును తప్పనిసరిచేస్తూ మానవ వనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యకు చెందిన సబ్సిడీ పథకాలను కేంద్రం ఆధార్‌తో అనుసంధానిస్తుండటంతో పథకంలో పారదర్శకత పెంచేందుకే ఈ చర్య చేపట్టారు. మానవ వనరుల శాఖ అధీనంలో పనిచేసే ది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ(డీఎస్ఈఎల్) ఆధార్‌లేని వారికి కార్డు పొందేందుకు జూన్ 30 వరకు గడువిచ్చింది. విద్యార్థులంతా తమ ఆధా ర్ వివరాలను సమర్పించాలని కోరుతూ పాఠశాలలకు నోటిఫికేషన్ పిస్తామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ పథకంలో పనిచేస్తున్న వంటవాళ్లు, సహాయకులను కూడా లబ్ధిదారులుగానే పరిగణిస్తామని కాబట్టి వారికీ ఆధార్ ఉండాలని ఆయన వెల్లడించారు. -
‘ప్రతివాదిగా రాష్ట్రపతి’పై వైఖరి చెప్పండి
హెచ్‌సీయూ వ్యాజ్యంలో కేంద్రానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయు) వైస్ చాన్సలర్‌గా అప్పారావు తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో రాష్ట్రపతిని ప్రతివాదిగా చేర్చే విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని కేంద్రాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పారావు బాధ్యతలు చేపట్టేందుకు మానవ వనరుల శాఖ అనుమతిని సవాలు చేస్తూ, ఆయన్ను మరో చోటుకు బదిలీ చేయడంతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయకుండా హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ను ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడం తెలిసిందే. -
ఇంజనీరింగ్‌కూ నీట్ తరహా పరీక్ష!
అన్ని ఐఐటీల్లో ప్రవేశానికీ ఇదే ప్రామాణికం న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ ప్రవేశాలకూ దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష (మెడిసిన్ కు నీట్ తరహాలో) నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల శాఖ భావిస్తోంది. 2018–19 విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమల్లోకి తేవాలని చూస్తోంది. విధివిధానాలు రూపొందించాలని ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)కి సూచించింది. ఇప్పటికే ఐఐటీల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పరీక్షను కూడా ఇదే గొడుగు కిందకు తీసుకొచ్చే వీలుంది. విద్యావిధానంలో ఉన్నతస్థాయి సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు, డీమ్డ్ వర్సిటీలనుంచి సలహాలు కోరే వీలుంది. దీనికితోడు విద్యార్థులు అనవసరంగా చాలా పరీక్షలకు హాజరవుతున్నందున వారిపై ఒత్తిడిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్చార్డీ వర్గాలు తెలిపాయి. ఒకే ప్రవేశ పరీక్షను ఏడాదిలో పలుమార్లు నిర్వహించాలని.. దీనికి తోడు భిన్న భాషలను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. -
టెట్ వాయిదా
♦ ‘పరీక్ష’పై కేంద్రం కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిర్ణయం ♦ మరింత ఆలస్యం కానున్న డీఎస్సీ సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) మళ్లీ వాయిదా పడింది. ఏప్రిల్ 9న నిర్వహించ తలపెట్టిన ఈ పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జి.కిషన్ సోమవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా టెట్ పరీక్షల కోసం అవలంబిస్తున్న నిబంధనల విశ్లేషణ, పరీక్ష నిర్వహణ విధానం, ఉపాధ్యాయుల ఎంపిక తదితర అంశాలపై అధ్యయనానికి కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా ఉపాధ్యాయుల ఎంపికలో ప్రమాణాలు పాటించేందుకు సీబీఎస్ఈతో సహా అన్ని రాష్ట్రాల విద్యాశాఖలు ఇప్పటికే ఏడు సార్లు టెట్ నిర్వహించాయని, అయితే ఈ పరీక్షల్లో పలు సమస్యలు ఉత్పన్నమైనట్లు కేంద్రం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని మానవ వనరుల శాఖ ఆదేశించిందని, కమిటీ నివేదిక అనంతరం రూపొందించే నూతన నిబంధనల మేరకు టెట్ నిర్వహణపై తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరింత ఆలస్యం కానున్న డీఎస్సీ టెట్ వాయిదాపడడంతో ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహించే డీఎస్సీ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇచ్చేందుకు మూడు నెలల సమయం ఉంది. ఆ నివేదిక వచ్చాక టెట్ నిర్వహించే అవకాశం ఉంది. టెట్ నిర్వహించకుండా డీఎస్సీ పరీక్షలు జరిగే అవకాశం లేకపోవడంతో ఇప్పట్లో ఉపాధ్యాయుల నియామకం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. -
ఉద్యోగంలో ఎదుగుదలకు ’కెరీర్ ప్లాన్’
కొందరు ఉద్యోగులు కార్యాలయంలో కష్టపడి పనిచేస్తుంటారు. అయినా, కెరీర్లో ఆశించినంతగా ఎదగలేకపోతుంటారు. చేరినప్పుడు ఏ దశలో ఉన్నారో తర్వాత కూడా అదే దశలో కొనసాగుతుంటారు. తమ స్థానాన్ని మెరుగుపర్చుకోలేక నిరాశ నిస్పృహ లకు లోనవుతుంటారు. చాలా సంస్థలు తమ ఉద్యోగుల కోసం కెరీర్ ప్లాన్‌ను రూపొంది స్తాయి. ఆ ప్రణాళికను సక్రమంగా అనుసరిం చే వారు ఉద్యోగంలో ఉన్నతస్థాయికి చేరుకుం టారు. అయితే, ఇలాంటి ప్లాన్ కంపెనీలో లేకపోతే ఉద్యోగులు తామే సొంతంగా తయారు చేసుకొని, నిజాయతీగా అమలు చేయాలి. కెరీర్ లక్ష్యాలు మీరు ఇప్పటివరకు సాధించిన విజయాలు, మీకు ఆసక్తి ఉన్న అంశాలను గుర్తించండి. వాటితో ఒక జాబితాను తయారు చేసుకోండి. మీ రంగంలో, మీ విభాగంలో విజయవంతమైన వ్యక్తులు తమ కెరీర్‌ను మలచుకున్న విధానాన్ని అధ్యయనం చేయండి. సక్సెస్ సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు, అర్హతలు, అనుభవాలను గుర్తించి, అర్థం చేసుకోండి. ఉద్యోగంలో మరో స్థాయికి చేరడానికి తక్కువ సమయంలో నేర్చుకోవాల్సిన అంశాలేమిటో తెలుసుకోండి. మేనేజర్‌తో చర్చించాలి మీరు తయారు చేసుకున్న భవిష్యత్తు ప్రణాళికపై కంపెనీ మేనేజర్‌తో చర్చించండి. ప్రస్తుతం మీరు నిర్వర్తిస్తున్న బాధ్యతలు, మీ పనితీరుపై వారి అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి. పనితీరును మెరుగుపర్చుకోవడానికి ఏం చేయాలో అడగండి. సంస్థలో పైకి ఎదగడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? అందుకోసం ఏం చేయాలి? అనేదానిపై మేనేజర్‌తో సంప్రదింపులు జరపాలి. అర్హతలు పెంచుకోవాలి సంస్థలో ఉద్యోగులు తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవాలంటే.. అర్హతలు, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. ఇందుకోసం అవసరమైతే ఏదైనా ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ లో సంబంధిత కోర్సులో చేరాలి. తగిన శిక్షణ పొందాలి. పనితీరు మెరుగైతే గుర్తింపు తప్పనిసరిగా లభిస్తుంది. కెరీర్ గ్రోత్ విధానం లేకపోతే కంపెనీలో కెరీర్ గ్రోత్ కల్పించేందుకు ఒక విధానమం టూ లేకపోతే.. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవా ల్సిన పనిలేదు. ఈ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. వారి నుంచి స్పందన లేకపోతే మానవ వనరుల విభాగం మేనేజర్ తో మాట్లాడాలి. అవసరమైతే యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లాలి. ఉద్యోగంలో ఎదుగుదలకు వీలు కల్పించాలని అభ్యర్థించాలి. సమీక్షించుకోండి మీ పనితీరు, వ్యవహారశైలి సక్రమంగా ఉన్నప్పటికీ అవకాశాలు లభించకపోతే పరిస్థితిని సమీక్షించుకోండి. మీకు జరుగుతున్న అన్యాయాన్ని పై అధికారులకు తెలియజేయండి. జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కింది పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. పోస్టుల వివరాలు అసిస్టెంట్ ఇంజనీర్ అర్హతలు: సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం అవసరం. డిప్యూటీ సూపరింటెండింగ్ ఎపిగ్రఫిస్ట్ అర్హతలు: తెలుగు/కన్నడం/తమిళం/మలయాళంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. స్పెషలిస్ట్(గ్రేడ్-3) అర్హతలు: ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో ఎండీ/డీఎన్బీ డిగ్రీ ఉండాలి. మూడేళ్ల క్లినికల్ అనుభవం అవసరం. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ అర్హతలు: ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ/ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం అవసరం. అడిషనల్ గవర్నమెంట్ అడ్వొకేట్ అర్హతలు: బీఎల్/ఎల్ఎల్బీ ఉండాలి. సంబంధిత విభాగంలో పదమూడేళ్ల అనుభవం ఉండాలి. డిప్యూటీ గవర్నమెంట్ అడ్వొకేట్ అర్హతలు: బీఎల్/ఎల్ఎల్బీ ఉండాలి. సంబంధిత విభాగంలో పదేళ్ల అనుభవం ఉండాలి. అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా బీఎల్/ఎల్ఎల్బీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి. సీనియర్ వెటర్నరీ ఆఫీసర్ అర్హతలు: వెటర్నరీ సైన్స్ డిగ్రీ ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం అవసరం. మెడికల్ ఆఫీసర్ అర్హతలు: ఆయుర్వేద మెడిసిన్‌లో డిగ్రీ ఉండాలి. పై అన్ని పోస్టులకు నిర్దేశిత వయోపరిమితి తప్పనిసరిగా ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.. చివరి తేది: అక్టోబర్ 2 వెబ్సైట్: http://upsconline.nic.in/ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) సూపర్ స్పెషాలిటీ పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంసీహెచ్ (కార్డియోథోరాసిక్ సర్జరీ) సీట్ల సంఖ్య: 4, వ్యవధి: మూడేళ్లు. అర్హత: జనరల్ సర్జరీలో ఎమ్మెస్/ ఎండీ డిగ్రీ ఉండాలి. డీఎం (క్లినికల్ ఫార్మకాలజీ) సీట్ల సంఖ్య: 1. వ్యవధి: మూడేళ్లు. అర్హత: ఫార్మకాలజీలో ఎండీ/ డీఎన్బీ డిగ్రీ ఉండాలి. ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: సెప్టెంబరు 20 వెబ్సైట్: http://nims.edu.in ఐఐటీ-హైదరాబాద్‌లో బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రాం ఐఐటీ-హైదరాబాద్ అడ్వాన్స్డ్ బిజినెస్ అనలిటిక్స్ సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ ఇవ్వనుంది. సీఎస్ఈ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డిసెంబ రు 24 నుంచి 28వ వరకు ఈ శిక్షణ కార్య క్రమం నిర్వహించనున్నారు. అనలిటిక్స్‌పై అప్‌గ్రేడ్ నాలెడ్జ్‌ను కోర్సులో బోధిస్తారు. బిజినెస్ అనలిటిక్స్‌కు ప్రస్తుతం ఇన్సూరెన్స్, మెడికల్, క్రెడిట్ ఇండస్ట్రీస్, ఆన్లైన్ షాపింగ్, రిటైల్ ఇండస్ట్రీలో డిమాండ్ ఉంది. కోర్సులో భాగంగా ఫ్రీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, స్టాటిస్టికల్ కంప్యూటింగ్, గ్రాఫిక్స్ వంటి అంశాలపై శిక్షణనిస్తామని నిర్వాహకులు తెలిపారు. వెబ్సైట్: www.iith.ac.in/BA2014Dec/ పోటీ పరీక్షల్లో పాలిటీలో అత్యధిక స్కోర్ సాధించడం ఎలా? - ఎస్.సుధీర్‌కుమార్, తార్నాక ప్రతి పోటీ పరీక్షలో పాలిటీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అభ్యర్థి విజయాన్ని నిర్దేశించడం లో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఇండియన్ పాలిటీపై అవగాహన పెంచుకోవాలంటే సబ్జెక్ట్‌ను విశ్లేషణాత్మకంగా, లోతుగా అధ్యయనం చేయాలి. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రపై అవగాహన పెంచుకోవాలి. ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని చదువుతున్నప్పుడు వర్తమాన అంశాలకు అన్వయిస్తూ, తులనాత్మకంగా చదవాలి. ఉదాహరణకు పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు మంత్రి మండలి సలహా మేరకు అధికరణం 123 ప్రకారం రాష్ర్టపతి ఆర్డినెన్స జారీ చేస్తారు. ఇటీవల ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే విషయంలో ఈ విధానాన్ని అనుసరించారు. ఈ నేపథ్యంలో రాష్ర్టపతి ఆర్డినెన్స ఏవిధంగా జారీచేశారు? దీంట్లో మంత్రి మండలి పాత్ర ఏమిటి? అది తర్వాత చట్టంగా ఎలా మారింది? పార్లమెంట్ పాత్ర ఏమిటి? ఆర్డినెన్స గరిష్ఠ కాలపరిమితి ఎంత? తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఇండియన్ పాలిటీకి సంబంధించి రాజ్యాంగ రూపకల్పన, లక్షణాలు; ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు; కేంద్ర కార్యనిర్వాహక, శాసన నిర్మాణ, న్యాయ వ్యవస్థలు; రాష్ర్ట ప్ర భుత్వం; కేంద్ర, రాష్ర్ట సంబంధాలు; స్థానిక ప్రభుత్వాలు; రాజకీయ పార్టీలు; ఎన్నికల సంస్కరణలు; వివిధ సంస్థలు మొదలైన అంశాలపై అవగాహన ఉండటం తప్పనిసరి. సబ్జెక్ట్‌ను క్రమ పద్ధతిలో, లోతుగా అధ్యయనం చేస్తే పోటీ పరీక్షల్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఇన్పుట్స్: కె. కాంతారెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ