అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థుల బ్యాగుల మోతకు చెక్ పడనుంది. తరగతిని బట్టి పుస్తకాల బరువుండాలని, ఒకట్రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వకూడదని మానవ వనరుల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యార్థికి ఉపశమనం
ప్రస్తుతం విద్యారంగంలో నెలకొన్న పోటీతత్వంతో ర్యాంకులే ప్రామాణికంగా భావించే పాఠశాలల యాజమాన్యాలు పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి. ప్రతిదానికో పుస్తకమంటూ విద్యార్థులపై బండెడు మోత వేశారు. ఫలితంగా ఎల్‌కేజీ, యూకేజీ నుంచి బ్యాగు నిండా పుస్తకాలు ఉంచుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఒకటోతరగతి చిన్నారి పది కేజీల బ్యాగు మోస్తున్నాడు. ఎక్కువ స్కూళ్లు బహుళ అంతస్తుల బిల్డింగుల్లో ఉండడంతో నాలుగైదు అంతస్తులు ఎక్కలేక చిన్నారులు నరకం అనుభవిస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ తీసుకున్న నిర్ణయంతో పసిపిల్లలు మోస్తున్న బరువుకు ఉపశమనం కలుగుతుంది. ఒకట్రెండు తరగతుల పిల్లల స్కూల్ బ్యాగు బరువు కేజిన్నరకు మించకూడదు. 3–5 తరగతులకు 2–3 కేజీలు, 6,7 తరగతులకు నాలుగు కేజీలు, 8,9 తరగతులకు 4.5 కేజీలు, 10వ తరగతికి ఐదు కేజీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మించరాదని స్పష్టం చేశారు.
సబ్జెక్టుల బోధన ఇలా..
1–2 తరగతులకు స్థానిక లాంగ్వేజ్‌పాటు గణితం రెండు సబ్జెక్టులు మాత్రమే బోధించాలి. ఈ ప్రకారం ఇంగ్లిష్, ఈవీఎస్ ఉండదు. 3–5 తరగతులకు లాంగ్వేజ్‌తో పాటు గణితం, ఈవీఎస్ సబ్జెక్టులు బోధించాలి. అదికూడా ఎన్‌సీఈఆర్టీ సూచించిన మేరకే పుస్తకాలుండాలి. ఒకట్రెండు తరగతులకు హోం వర్క్ ఇవ్వకూడదు. పాఠశాలల్లో ఇతరత్రా ఎలాంటి పుస్తకాలు, మెటీరియల్ ఇవ్వకూడదు. ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని మానవవనరుల శాఖ స్పష్టం చేసింది.
అమలవుతుందా..?
కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏ మేరకు అమలవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్లమెంటులో చేసిన విద్యాహక్కు చట్టానికే దిక్కూమొక్కు లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో ఏటా 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలి. ఫీజులు ఇష్టానుసారం వసూలు చేయకూడదు. క్వాలిఫైడ్ టీచర్లే స్కూళ్లలో బోధించాలి. దాదాపు కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో ఇవేవీ అమలు కాలేదు. తాజాగా మానవ వనరుల శాఖ ఇచ్చిన ఉత్తర్వులు ఏ మేరకు అమలవుతాయనే భిన్నాభిప్రాయాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment