బ్యాగు ‘బరువు’ తగ్గేదెప్పుడు? | When was reducing the school bag weight | Sakshi
Sakshi News home page

బ్యాగు ‘బరువు’ తగ్గేదెప్పుడు?

Published Mon, Feb 19 2018 2:41 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

When was reducing the school bag weight - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్కూల్‌ బ్యాగు బరువు ఇంకా తగ్గలేదు. అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు ఫైళ్లకే పరిమితం అయ్యాయి. జూలైలోనే విద్యాశాఖ బ్యాగు బరువు తగ్గింపు కోసం ఉత్తర్వులు జారీ చేసినా, వాటిని అమలు చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రకటించకపోవడంతో విద్యార్థులు అధిక బరువు మోస్తూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పడం లేదు. బ్యాగు బరువు తగ్గింపునకు యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని, అధికారులు తనిఖీలు చేసి పరిశీలించాలని విద్యాశాఖ చెప్పిందే తప్ప, అమలు చేయని యాజమాన్యాలపై ఏ చర్యలు ఉంటాయో, పక్కాగా అమలుకు అధికారులు ఏం చేయాలో స్పష్టమైన విధానం ప్రకటించలేదు. దీంతో క్షేత్ర స్థాయిలో బ్యాగు బరువే తగ్గలేదని, టీచర్లకు కనీస అవగాహనా లేదని విద్యాశాఖ ఇటీవల చేసిన సర్వేలో తేలింది. 

బరువు ఎలా ఉండాలంటే.. 
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి 12 కిలోలు, ఉన్నత పాఠశాలల్లో 12 నుంచి 17 కిలోల బరువున్న బ్యాగులను విద్యార్థులు ప్రతిరోజు మోసుకెళ్లడం, కొన్ని పాఠశాలలు బహుళ అంతస్తుల భవనాల్లో ఉండటం వల్ల అంత బరువైన బ్యాగులను మోసుకెళ్లడం వల్ల పిల్లలు వెన్ను, మోకాలు సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు విద్యాశాఖ తేల్చింది. ఇది విద్యార్థుల శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని గుర్తించింది. అందుకే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్‌ బ్యాగుతో సహా 1, 2 తరగతులకు 1.5 కిలోలు, 3, 4, 5 తరగతులకు 2 నుంచి 3 కిలోలే ఉండాలని, 6, 7 తరగతులకు 4 కిలోలకు మించకూడదని, 8, 9, 10 తరగతులకు 4.5 కిలోల నుంచి 5 కిలోల లోపే ఉండాలని పేర్కొంది. 

మార్గదర్శకాల అమలుకు దిక్కులేదు.. 
ఏ రోజు ఏ పాఠ్యపుస్తకాలను, నోటు పుస్తకాలను తీసుకురావాలో విద్యార్థులకు ముందుగానే యాజమాన్యాలు చెప్పాలని విద్యాశాఖ పేర్కొన్నా ఎక్కడా అమలు కావడం లేదు. టైంటేబుల్‌ ప్రకారమే పుస్తకాలు మోసేలా పాఠశాల జాగ్రత్త వహించాలని, పాఠశాలల్లో ర్యాక్‌లను ఏర్పాటు చేయాలని చెప్పినా ఆచరణకు నోచుకోలేదు. ఎస్‌సీఈఆర్‌టీ నిర్ధేశిత పుస్తకాలు కాకుండా ఇతర, అదనపు, బరువైన, ఖరీదైన బోధన కోసమంటూ పనికిరాని పుస్తకాలను సూచించవద్దని పేర్కొన్నా పాత పద్ధతినే అమలు చేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. 

ఇదీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి.. 
- విద్యార్థుల బ్యాగు బరువు తగ్గింపుపై ఉత్తర్వులు పాఠశాలల స్థాయికి చేరాయి. అయినా వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. 
- బ్యాగు బరువు తగ్గింపు అవసరం ప్రభుత్వ పాఠశాలల్లో ఉండదు. ప్రైవేటు పాఠశాలల్లోనే చర్యలు చేపట్టాలి. అయితే ఈ ఉత్తర్వులను ప్రైవేటు స్కూళ్లకు స్వయంగా అందజేయలేదు. మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు ఆ ఉత్తర్వుల కాపీని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు వాట్సాప్‌లో పెట్టి వదిలేశారు. 
- ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లకు బ్యాగు బరువు తగ్గింపుపై ఉత్తర్వులు వచ్చాయని తెలుసుకానీ, దాని కోసం ఏం చేయాలో తెలియదు. 
- కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) పిల్లల బ్యాగు బరువు 5–10 కిలోల వరకు ఉంది. స్కూల్‌ బ్యాగులో అవసరానికి మించిన నోటు బుక్కులు ఉన్నాయి. ఒక సబ్జెక్టుకు 4 కంటే ఎక్కువ నోటు బుక్కులున్నాయి. 
- ఉన్నత పాఠశాలల్లో బ్యాగు బరువు 6 నుంచి 10 కిలోల వరకు ఉంది. వీటిలో పాఠ్య పుస్తకాలు, ఒక్కో సబ్జెక్టుకు 3 కంటే ఎక్కువ నోటు బుక్కులు ఉన్నాయి. జిల్లాల్లో పిల్లల బ్యాగుల్లో గైడ్లు కూడా ఉన్నాయి. 
- ప్రాథమిక పాఠశాలల్లో 3–6 కిలోల వరకు బ్యాగు బరువు ఉంది. 
- మేడ్చెల్‌ జిల్లాలో కార్పొరేట్‌ సంస్థలు ఇచ్చిన డిక్షనరీలు, జనరల్‌ నాలెడ్జి పుస్తకాలు, వొకాబ్‌లరీ, నోటు బుక్కులు, నీళ్ల బాటిల్, టిఫిన్‌ బాక్సులు, రైటింగ్‌ ప్యాడ్‌ కంపాస్‌ బాక్సులు మొదలగునవి ఉన్నాయి. 
- కొన్ని జిల్లాల్లో విద్యార్థులు తమకు అవసరం లేకపోయినా పాఠ్య పుస్తకాలు, నోటుబుక్స్, అయిపోయిన నోటు బుక్స్, ఇతర పుస్తకాలు అన్నీ తెచ్చుకుంటున్నారు. 
- మేడ్చెల్, యాదాద్రి, నల్లగొండ వంటి జిల్లాల్లో పైతరగతుల విద్యార్థులు తమ తమ్ముళ్లు, చెల్లెళ్ల పుస్తకాలనూ తమ బ్యాగుల్లోనే మోసుకొస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement