అన్ని ఐఐటీల్లో ప్రవేశానికీ ఇదే ప్రామాణికం
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ ప్రవేశాలకూ దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష (మెడిసిన్ కు నీట్ తరహాలో) నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల శాఖ భావిస్తోంది. 2018–19 విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమల్లోకి తేవాలని చూస్తోంది. విధివిధానాలు రూపొందించాలని ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)కి సూచించింది. ఇప్పటికే ఐఐటీల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పరీక్షను కూడా ఇదే గొడుగు కిందకు తీసుకొచ్చే వీలుంది.
విద్యావిధానంలో ఉన్నతస్థాయి సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు, డీమ్డ్ వర్సిటీలనుంచి సలహాలు కోరే వీలుంది. దీనికితోడు విద్యార్థులు అనవసరంగా చాలా పరీక్షలకు హాజరవుతున్నందున వారిపై ఒత్తిడిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్చార్డీ వర్గాలు తెలిపాయి. ఒకే ప్రవేశ పరీక్షను ఏడాదిలో పలుమార్లు నిర్వహించాలని.. దీనికి తోడు భిన్న భాషలను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.