All India Council for Technical Education
-
స్కిల్డు ఫోర్సు పేరిట... లక్ష మందికి నైపుణ్య శిక్షణ
సాక్షి, అమరావతి: దేశంలోని లక్ష మందికి పైగా విద్యార్థులకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణ కోసం ఇంటర్న్‌షిప్‌ను అందించనున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకటించింది. స్కిల్డు ఫోర్సు పేరిట ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది. అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ టెక్నాలజీ సంస్థ అయిన సిస్కో, మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్(ఎంజీఎన్సీఆర్ఈ), ఆరెస్బీ ట్రాన్స్మిషన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వంటి సంస్థల ద్వారా ఈ శిక్షణ ఇప్పించనుంది. ఉన్నత విద్యనభ్యసించే ఆసక్తిగల విద్యార్థులు ఇంటర్న్‌షిప్.ఏఐసీటీఈఇండియా.ఓఆర్జీ’ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఏఐసీటీఈ సూచించింది. తరగతి గది పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా అమలు చేయడం ద్వారా విద్యార్థులకు సరైన నైపుణ్యావగాహనకు అవకాశం ఉంటుందని ఏఐసీటీఈ అభిప్రాయం. సాంకేతిక విద్యనభ్యసించే వారే కాకుండా ఇతర కోర్సుల వారికీ ఈ ఇంటర్న్‌షిప్ మేలు చేయనుంది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ దేశంలో లక్ష మందికి ఏఐసీటీఈ నైపుణ్య శిక్షణకు ఏర్పాట్లు చేస్తుండగా.. అంతకు మించి ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందిస్తుండటం విశేషం. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా లక్షలాది మందికి ప్రముఖ సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలు అమలు చేయిస్తున్నారు. అంతేగాకుండా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ద్వారా ప్రత్యేకంగా పలు ఐటీ ఆధారిత కోర్సులనూ అందిస్తున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా 40కి పైగా ఐటీ కోర్సుల్లో ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తోంది. రాష్ట్రంలోని 1.60 లక్షల మందిని ఇప్పటికే ఈ కోర్సులకు ఎంపిక చేశారు. వాస్తవానికి ఈ ప్రత్యేక కోర్సులు అభ్యసించాలంటే ఒక్కో విద్యార్థికి రూ.10 వేల నుంచి 15 వేల వరకూ ఖర్చవుతుంది. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వమే ఈ కోర్సులను ఉచితంగా విద్యార్థులకు అందిస్తోంది. దీనికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి రూ.37 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ శిక్షణ కోసం ఉన్నత విద్యా మండలి, మైక్రోసాఫ్ట్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. (చదవండి: వైకల్యంతో పుట్టాడని వదిలేశారు!) -
16 ఇంజనీరింగ్ కాలేజీలు మూత!
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 16 ఇంజనీరింగ్ కాలేజీలు మూత పడనున్నాయి. దీంతో వాటిల్లో ఉన్న దాదాపు 4 వేల సీట్లు రద్దు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 201 ఇంజనీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు ఇవ్వగా, మరో 16 కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. ఆయా కాలేజీల్లోని దాదాపు 4 వేల సీట్లలో మొదటి సంవత్సరం ప్రవేశాలు వద్దని జేఎన్టీయూకు దరఖాస్తు చేశాయి. గత నాలుగేళ్లుగా వాటిల్లో పెద్దగా ప్రవేశాలు లేకపోవడం, గతేడాది అన్ని బ్రాంచీల్లో కలిపి 70లోపే ప్రవేశాలు ఉండటం, అంతకుముందు సంవత్సరాల్లోనూ పరిస్థితి అలాగే ఉండటంతో ఆ కాలేజీలన్నీ మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఈ విద్యా సంవత్సరం ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే అవకాశం లేదు. మరోవైపు వరుసగా మూడేళ్లు 30 శాతం కంటే తక్కువ ప్రవేశాలు ఉంటే సగం సీట్లకే అనుమతి ఇస్తామని ఏఐసీటీఈ గతంలోనే స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర యూనివర్సిటీలు మాత్రం 25 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయ్యే కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతించమని తెలిపింది. ఈసారి ఆ నిబంధనను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నాయి. -
జాబ్ లేని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇంతమందా?
న్యూఢిల్లీ : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత ఏ ఏడాదికాఏడాది పెరిగిపోతుంది. గ్రాడ్యుయేట్ పట్టా పొంది కాలేజీ నుంచి బయటికి వచ్చే వారిలో అరకొరమందికే ఉద్యోగాలు లభ్యమవుతున్నాయి. మిగతా వారందరూ నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఎంతమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారనే విషయంపై ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గణాంకాలు విడుదల చేసింది. ఈ వివరాల్లో దేశవ్యాప్తంగా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా పొందిన వారిలో 60 శాతం మందికి పైగా అంటే ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులేనని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలిపింది. ఒక శాతం మంది కంటే తక్కువమందే సమ్మర్ ఇంటర్న్ షిప్ లో పాల్గొంటున్నారని పేర్కొంది. కేవలం 15 శాతం ఇంజనీరింగ్ ప్రొగ్రామ్స్ నే ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తున్నాయని వెల్లడైంది. ఈ పరిస్థితిని మార్చడానికి మానవ వనరుల అభివృద్ధి శాఖా టెక్నాలజీ ఎడ్యుకేషన్ ను పునరుద్ధరించడానికి ప్లాన్ చేస్తోంది. 2018 జనవరి నుంచి టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటికీ కలిపి ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని భావిస్తోంది. ఎంహెచ్ఆర్డీ సీనియర్ అధికారుల ప్రకారం పూర్తిగా కంప్యూటర్ ఆధారితంగా నేషనల్ టెస్టింగ్ సర్వీసు ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఇంజనీరింగ్ ప్రొగ్రామ్స్ కు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ మాదిరిగా.. మెడికల్ కోర్సులకు కూడా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)ను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. -
27 నుంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు!
⇒ కసరత్తు చేస్తున్న జేఎన్టీయూ ⇒ రానున్న ఏప్రిల్‌లో అనుబంధ గుర్తింపు ప్రక్రియ! సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో తగిన స్థాయిలో ఫ్యాకల్టీ, సదుపాయాలను పరిశీలించేందుకు ఈనెల 27వ తేదీ నుంచి తనిఖీలు నిర్వహించాలని జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన కసరత్తు ప్రారంభించింది. అనుబంధ గుర్తింపు కోసం జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు కాలేజీల దరఖాస్తులను స్వీకరించిన జేఎన్టీయూహెచ్.. ఈనెల 2 నుంచి ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. 2వ తేదీ నుంచి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో ఈ నెల 27 నుంచే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రక్రియను ఏప్రిల్ నెలాఖరు వరకు పూర్తి చేసి, ఆ నెలాఖరు నుంచే 2017–18 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం అనుబంధ గుర్తింపు జారీని ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. మరోవైపు ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు (రికగ్నైజేషన్) ఇచ్చేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఈనెల 9 వరకు దరఖాస్తులను స్వీకరించింది. ఆయా కాలేజీల్లో సదుపాయాలు, ఫ్యాకల్టీ తదితర అంశాలపై చేపట్టిన తనిఖీల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. భారీగా తగ్గనున్న సీట్లు! వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ సీట్లు భారీగా తగ్గనున్నాయి. ఇప్పటికే 11 కాలేజీలు మొత్తంగా ప్రవేశాలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా, 80కి పైగా కాలేజీలు పలు బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇక వివిధ బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకునేందుకు మరో 10కి పైగా కాలేజీల నుంచి జేఎన్టీయూకు విజ్ఞప్తులు వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో మొత్తంగా 20 వేల వరకు సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. 2016–17లో రాష్ట్రంలోని 219 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1.04 లక్షల సీట్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. 75 వేల వరకే సీట్లు భర్తీ అయ్యాయి. ఈసారి సీట్ల సంఖ్య లక్ష లోపే ఉండే అవకాశాలున్నాయి. అయితే ఈసారి ఫ్యాకల్టీ విషయంలో కాలేజీలకు ఊరటనిచ్చేలా జేఎన్టీయూ నిర్ణయం తీసుకుంది. కాలేజీలకు గుర్తింపు లభించిన సీట్ల ప్రకారం కాకుండా, కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీ ఉన్నారా, లేదా? అన్నది పరిశీలిస్తామని జేఎన్టీయూ స్పష్టం చేసింది. దీంతో అవసరం లేకపోయినా ఫ్యాకల్టీ నియమించాల్సిన పరిస్థితి తప్పింది. -
ఇంజనీరింగ్‌కూ నీట్ తరహా పరీక్ష!
అన్ని ఐఐటీల్లో ప్రవేశానికీ ఇదే ప్రామాణికం న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ ప్రవేశాలకూ దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష (మెడిసిన్ కు నీట్ తరహాలో) నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల శాఖ భావిస్తోంది. 2018–19 విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమల్లోకి తేవాలని చూస్తోంది. విధివిధానాలు రూపొందించాలని ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)కి సూచించింది. ఇప్పటికే ఐఐటీల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పరీక్షను కూడా ఇదే గొడుగు కిందకు తీసుకొచ్చే వీలుంది. విద్యావిధానంలో ఉన్నతస్థాయి సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు, డీమ్డ్ వర్సిటీలనుంచి సలహాలు కోరే వీలుంది. దీనికితోడు విద్యార్థులు అనవసరంగా చాలా పరీక్షలకు హాజరవుతున్నందున వారిపై ఒత్తిడిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్చార్డీ వర్గాలు తెలిపాయి. ఒకే ప్రవేశ పరీక్షను ఏడాదిలో పలుమార్లు నిర్వహించాలని.. దీనికి తోడు భిన్న భాషలను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. -
ఆ విద్యార్థులు వేరే కాలేజీల్లోకి
♦ పలు ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతుల నిరాకరణ ♦ వాటిల్లోని విద్యార్థులకు వేరే కళాశాలల్లో అడ్మిషన్లు సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో పలు బ్రాంచీలకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆయా బ్రాంచీల్లోని విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి తరలించనున్నారు. ఆరు కాలేజీలకు చెందిన దాదాపు 400 మంది విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేర్చించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. 2015-16 విద్యా సంవత్సరం ప్రవేశాల్లో భాగంగా జేఎన్టీయూహెచ్ వివిధ కాలేజీలకు అనుమతులను నిరాకరించింది. దానిపై యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆయా కాలేజీలను ప్రవేశాల కౌన్సెలింగ్‌లో పెట్టాలని, జేఎన్టీయూహెచ్తో పాటు ఏఐసీటీఈ ప్రతినిధులతో కూడిన బృందాలు తనిఖీలు చేసి నివేదికల ఆధారంగా ఆ ప్రవేశాలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ బృందాలు తనిఖీలు చేసి ఇచ్చిన నివేదికలపై ఏఐసీటీఈ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆరు కాలేజీల్లోని పలు బ్రాంచీలకు అనుమతులను నిరాకరించింది. వాటి ప్రకారం ఆయా కాలేజీల్లో చేరిన విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేర్పించేందుకు ఉన్నత విద్యా మండలి, జేఎన్టీయూహెచ్లు చర్యలు చేపట్టాయి. వచ్చే నెల 7 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోగానే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించాయి. కాగా, అరబిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డీఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, డీఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హర్షిత్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, హస్విత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పలు బ్రాంచీలు రద్దయినట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడించారు. ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో మెకానికల్‌లో సీట్లు తగ్గించారు. -
తనిఖీ బృందాల నివేదికలను పరిగణనలోకి తీసుకోండి
ఏఐసీటీఈ, జేఎన్టీయూలకు హైకోర్టు ధర్మాసనం ఆదేశం నివేదికల ఆధారంగా అప్రూవల్, అఫిలియేషన్లపై నిర్ణయం తీసుకోండి వ్యతిరేక నిర్ణయం ఉంటే రాతపూర్వకంగా ఇంజనీరింగ్ కాలేజీలకు తెలపండి ఇరువురి నిర్ణయాలు తమ తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టీకరణ విచారణ 30కి వాయిదా హైదరాబాద్: తమ ఆదేశాల మేరకు 99 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి తయారు చేసిన నివేదికల ఆధారంగా ఆ కాలేజీల అప్రూవల్ గురించి, అదే సమయంలో వాటి అఫిలియేషన్ విషయంలో తగిన నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు మంగళవారం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) హైదరాబాద్‌లను ఆదేశించింది. తనిఖీ నివేదికల పరిశీలన తరువాత ఏదైనా కాలేజీకి అప్రూవల్‌ను ఉపసంహరించడం గానీ, అఫిలియేషన్‌ను తిరస్కరించడం గానీ చేస్తే, అందుకుగల కారణాలను రాతపూర్వకంగా ఆ కాలేజీకి తెలపడంతో పాటు ఆ కాలేజీకి తనిఖీ బృంద నివేదికనూ అందజేయాలని ఏఐసీటీఈ, జేఎన్టీయూలకు హైకోర్టు స్పష్టం చేసింది. అప్రూవల్, అఫిలియేషన్లపై ఏఐసీటీఈ, జేఎన్టీయూ తీసుకునే నిర్ణయాలు ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐసీటీఈ అనుమతి ఉండి ఈ విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ పొందలేకపోయిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ జేఎన్టీయూ అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, అఫిలియేషన్ కోసం హైకోర్టును ఆశ్రయించిన కాలేజీల్లో నిబంధనల మేరకు బోధనా సిబ్బంది, ల్యాబ్‌లు ఉన్నాయో లేదో తనిఖీ చేయాలంటూ ఏఐసీటీఈ, జేఎన్టీయూ ప్రతినిధులతో 25 బృందాలను ఏర్పాటు చేస్తూ ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ అప్పీళ్లను ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా జేఎన్టీయూ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. 99 కాలేజీల తనిఖీలకు సంబంధించిన 99 నివేదికలను ఆయన కోర్టు ముందుంచారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం.. తమకు అందించిన నివేదికలను ఏఐసీటీఈకి అందజేస్తున్నామని, వాటిని పరిశీలించిన తరువాత అప్రూవల్‌పై నిర్ణయం తీసుకోవాలంది. అలాగే జేఎన్టీయూ సైతం అఫిలియేషన్‌పై నిర్ణయం తీసుకోవాలంద. అప్రూవల్‌ను ఉపసంహరించాలని ఏఐసీటీఈ భావిస్తే, అది ఏఐసీటీఈ చట్టం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగానే ఉండాలని ధర్మాసనం తెలిపింది. అఫిలియేషన్ వద్దన్న కాలేజీలను కేసుల విచారణ జాబితా నుంచి తొలగిస్తున్నామంది. అలాగే తనిఖీల నిమిత్తం జేఎన్టీయూ వద్ద రూ.2 లక్షలు డిపాజిట్ చేయని కాలేజీలు, వారంలోపు ఆ మొత్తాలను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో వారి పిటిషన్లను కొట్టేస్తామంది. అటు ఏఐసీటీఈ, ఇటు జేఎన్టీయూ తమ నిర్ణయాలను కోర్టు ముందుంచాలని, వాటిని పరిగణనలోకి తీసుకుని కేసు వాస్తవాల ఆధారంగా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది. -
వద్దంటే ఇంజనీరింగ్ సీట్లు!
తెలంగాణలో 15 వేలకుపైగా అదనపు సీట్లు, ఆరు కొత్త కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి సీట్లు, కాలేజీలు వద్దని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా పట్టించుకోని వైనం హైదరాబాద్: ఉన్న రోగానికి మందెక్కువేస్తే.. కొత్త రోగం పట్టుకున్నట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) వ్యవహారం కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఎక్కువైపోయాయి బాబో అన్నా వినకుండా.. తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అదనపు సీట్లకు ఏఐసీటీఈ అనుమతులు ఇస్తూనే ఉంది. విద్యార్థులు చేరక వందల సంఖ్యలో కళాశాలలు మూసివేతకు దగ్గరవుతోంటే.. మరిన్ని కొత్త కాలేజీలకు అనుమతులు ఇస్తోంది. ఇప్పటికే విద్యార్థులు చేరతారనే ఆశలేక ఈ విద్యా సంవత్సరంలో తమకు అడ్మిషన్లు చేయవద్దని 17 ఇంజనీరింగ్ కళాశాలలు విజ్ఞప్తి చేసుకున్నాయి కూడా. ఇంజనీరింగ్‌లో సీట్లు వద్దంటున్నా గత ఏడాది పలు కొత్త కాలేజీలకు అనుమతులు ఇచ్చిన ఏఐసీటీఈ.. ఈ సారి భారీ సంఖ్యలో అదనపు సీట్లకు, ఆరు కొత్త కాలేజీలకు అనుమతులు ఇచ్చింది. మొత్తంగా తెలంగాణలో ఉన్న కాలేజీల్లో 15 వేలకు పైగా అదనపు సీట్లతో పాటు.. 1,680 సీట్లతో ఆరు కొత్త కాలేజీలు ఈ ఏడాది ప్రారంభం కానున్నాయి. వీటన్నింటినీ కౌన్సెలింగ్‌లో చేర్చేందుకు త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే యనుంది కూడా. అయితే కొత్త కాలేజీలు, అదనపు సీట్లు అవసరం లేదని, అనుమతులు ఇవ్వొద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట స్వయంగా ఏఐసీటీఈకి లేఖ రాసింది. అయినా ఏఐసీటీఈ దానిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికే కొన్నేళ్లుగా విద్యార్థులు చేరక పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడ్డాయి. ప్రస్తుత 2014-15 విద్యా సంవత్సరంలోనూ 17 కాలేజీలు తమకు ప్రవేశాలు అవసరం లేదని విజ్ఞప్తి చేసుకోవడం గమనార్హం. విభజన, ‘ఫీజు’తో మరింత దెబ్బ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాలేజీల్లోనే సీట్లు నిండే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటివరకు ఏటా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు దాదాపు 40 వేల మంది వరకు తెలంగాణలోని వివిధ కాలేజీల్లో చేరేవారు. కానీ వారికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వబోమని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఈసారి వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. దీనివల్ల తెలంగాణ ప్రాంతంలో చాలా కాలేజీలు మూతపడే అవకాశం కనిపిస్తోంది. అసలు గత ఏడాది 32 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరకపోగా.. ఒకటి నుంచి 5 మందిలోపు మాత్రమే విద్యార్థులు చేరినవి 14 కాలేజీలున్నాయి. మరో 14 కాలేజీల్లో ఆరు నుంచి పది మందిలోపు విద్యార్థులే చేరగా, 19 కళాశాలల్లో ఇరవై మందిలోపే విద్యార్థులు చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో 15 వేలకు పైగా సీట్లు పెరగడంతో మరిన్ని కాలేజీల మూసివేత తప్పకపోవచ్చనే ఆందోళన నెలకొంది. గత ఏడాది సీట్లు, ప్రస్తుత సీట్ల వివరాలు.. గత ఏడాది తెలంగాణలోని 330 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,66,845 సీట్లు అందుబాటులో ఉండగా, ఈసారి 319 కాలేజీల్లో 1,84,779 సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. గత ఏడాది కౌన్సెలింగ్‌లో పాల్గొన్న 330 కాలేజీల్లో 17 కాలేజీలు ఈసారి తమకు ప్రవేశాలు అవసరం లేదని పేర్కొన్నాయి. అ యినా మూడు ప్రైవేటు, మూడు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ 367 ఇంజనీరింగ్, 183 బీఫార్మసీ, 457 ఎంబీ ఏ, 147 ఎంసీఏ కాలేజీలకు కూడా అనుమతులు ఇచ్చింది. -
కౌన్సెలింగ్ మరింత ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈనెల 29 నుంచి నిర్వహించాలనుకున్న కౌన్సెలింగ్ మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి నెలకొంది. కొత్త కాలేజీలు, అదనపు సీట్ల పెంపునకు సంబంధించిన అనుమతుల గడువును అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) మరో ఐదు రోజులు పెంచడమే ఇందుకు కారణం. ఈ గడువును ఈనెల 15 నుంచి 20 వరకు పెంచారు. దీంతో వీలైతే జూలై మొదటి వారంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాలేజీలకు ఏఐసీటీఈ నుంచి అనుమతులు వచ్చాక, ఉభయ రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు వాటికి గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాతే ఆ కాలేజీలను కౌన్సెలింగ్‌లో ప్రవేశాలకు అనుమతిస్తారు. దీనికితోడు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి రెండు ప్రభుత్వాల నుంచి ఇంకా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. కాగా, వివిధ పీజీ కోర్సులు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, లా, పోస్టు గ్రాడ్యుయేషన్ లా, ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈ) కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఇందుకు శుక్రవారం షెడ్యూలు ఖరారు చేసింది. -
మార్గదర్శకాల్లో ‘ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్’ వద్దు!
ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ప్రవాస భారతీయుల(ఎన్ఆర్ఐ) కోటాను 15 శాతానికి పెంచేందుకు ఒప్పుకున్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ).. ఇంజనీరింగ్ ప్రవేశాల మార్గదర్శకాల్లో ‘ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్’ అనే పదాన్ని చేర్చేందుకు మాత్రం అంగీకరించలేదు. ఉన్నత విద్యాశాఖ అధికారులు సంప్రదించిన సందర్భంగా ఏఐసీటీఈ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు మంగళవారం ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ అనే పదాన్ని ఇంజనీరింగ్ ప్రవేశాల మార్గదర్శకాల్లో చేర్చేలా ప్రముఖ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం స్పాన్సర్డ్ అనే పదాన్ని చేర్చడానికి వీల్లేదని, ఆ పదాన్ని చేర్చితే ప్రముఖ కాలేజీలు సీట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. మేనేజ్మెంట్ కోటాలో చేరే విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను తెలుసుకునేందుకు.. ఫీజు చెల్లిస్తారా? లేదా? అనే అంశాలపై ఓ అవగాహనకు వచ్చేందుకు విద్యార్థులను ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ అనే పదాన్ని మార్గదర్శకాల్లో చేర్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాయి. -
ఆ అధికారాలను మాకు ఇవ్వండి
యూజీసీకి రాష్ట్ర ఉన్నత విద్యామండలి లేఖ ఏఐసీటీఈ అధికారాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన ఫలితం యూజీసీలో సలహా విభాగంగా కొనసాగనున్న ఏఐసీటీఈ రాష్ట్రంలో వృత్తివిద్యా కాలేజీలపై అధికారం ఎవరిదనే చర్చ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి విద్యా కాలేజీల పర్యవేక్షణ, కొత్త కాలేజీలకు అనుమతులు, అదనపు సీట్ల మంజూరు వంటి బాధ్యతలను ఇన్నాళ్లుగా నిర్వర్తించిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అధికారాలన్నింటిని తమకు అప్పగించాలని రాష్ట్ర ఉన్న త విద్యా మండలి తాజాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి లేఖ రాసింది. వృత్తి విద్యా కాలేజీల పర్యవేక్షణ, అనుమతుల వంటి వ్యవహారాలపై ఏఐసీటీఈకి అధికారం లేదని, అది కేవలం సలహా విభాగం మాత్రమేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ మేరకు ఆ అధికారాలను తనకు అప్పగించాలంటూ యూజీసీని ఉన్నత విద్యా మండలి కోరింది. దీనిపై యూజీసీ నుంచి నిర్ణయం త్వరలోనే వస్తుందని విద్యా మం డలి వర్గాలు భావిస్తున్నాయి. అలాగే.. గతంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (దూరవిద్యా మండలి) ఉండగా.. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ దానిని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బోర్డు పేరుతో యూజీసీలో ఒక విభాగంగా చేర్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏఐసీటీఈని కూడా యూజీసీలో ఒక సలహా విభాగంగానే కొనసాగించాలని యూజీసీ వర్గాలు భావిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి వర్గాలకు సమాచారం అందింది. ఈ పరిస్థితుల్లో వృత్తి విద్యా కాలేజీల వ్యవహారాలను ఇకపై యూనివర్సిటీలకు అప్పగిస్తారా? లేదా? అనే అంశంపైనా చర్చ జరుగుతోంది. అయితే స్థానికంగా యూనివర్సిటీలు ఉన్నా.. అవి పర్యవేక్షక విభాగాలుగా కొనసాగుతాయని, ఆ అధికారాలను తనకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నత విద్యా మండలి కోరింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే అనుమతుల వ్యవహారాలను చూస్తే.. అవి ఉన్నత విద్యా మండలి నేతృత్వంలోనే కొనసాగుతాయని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి దీనిపై తుది నిర్ణయం రావాల్సి ఉంది.