27 నుంచి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తనిఖీలు! | Inspection in the Engineering College From 27! | Sakshi
Sakshi News home page

27 నుంచి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తనిఖీలు!

Published Thu, Feb 16 2017 3:12 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

27 నుంచి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తనిఖీలు!

27 నుంచి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తనిఖీలు!

కసరత్తు చేస్తున్న జేఎన్టీయూ
రానున్న ఏప్రిల్‌లో అనుబంధ గుర్తింపు ప్రక్రియ!


సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తగిన స్థాయిలో ఫ్యాకల్టీ, సదుపాయాలను పరిశీలించేందుకు ఈనెల 27వ తేదీ నుంచి తనిఖీలు నిర్వహించాలని జేఎన్‌టీయూహెచ్‌ నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన కసరత్తు ప్రారంభించింది. అనుబంధ గుర్తింపు కోసం జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు కాలేజీల దరఖాస్తులను స్వీకరించిన జేఎన్‌టీయూహెచ్‌.. ఈనెల 2 నుంచి ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. 2వ తేదీ నుంచి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో ఈ నెల 27 నుంచే ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీల (ఎఫ్‌ఎఫ్‌సీ) ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రక్రియను ఏప్రిల్‌ నెలాఖరు వరకు పూర్తి చేసి, ఆ నెలాఖరు నుంచే 2017–18 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం అనుబంధ గుర్తింపు జారీని ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. మరోవైపు ఇంజనీరింగ్‌ కాలేజీలకు గుర్తింపు (రికగ్నైజేషన్‌) ఇచ్చేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఈనెల 9 వరకు దరఖాస్తులను స్వీకరించింది. ఆయా కాలేజీల్లో సదుపాయాలు, ఫ్యాకల్టీ తదితర అంశాలపై చేపట్టిన తనిఖీల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.

భారీగా తగ్గనున్న సీట్లు!
వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్‌ సీట్లు భారీగా తగ్గనున్నాయి. ఇప్పటికే 11 కాలేజీలు మొత్తంగా ప్రవేశాలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా, 80కి పైగా కాలేజీలు పలు బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇక వివిధ బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకునేందుకు మరో 10కి పైగా కాలేజీల నుంచి జేఎన్‌టీయూకు విజ్ఞప్తులు వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో మొత్తంగా 20 వేల వరకు సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. 2016–17లో రాష్ట్రంలోని 219 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1.04 లక్షల సీట్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. 75 వేల వరకే సీట్లు భర్తీ అయ్యాయి. ఈసారి సీట్ల సంఖ్య లక్ష లోపే ఉండే అవకాశాలున్నాయి. అయితే ఈసారి ఫ్యాకల్టీ విషయంలో కాలేజీలకు ఊరటనిచ్చేలా జేఎన్టీయూ నిర్ణయం తీసుకుంది. కాలేజీలకు గుర్తింపు లభించిన సీట్ల ప్రకారం కాకుండా, కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీ ఉన్నారా, లేదా? అన్నది పరిశీలిస్తామని జేఎన్టీయూ స్పష్టం చేసింది. దీంతో అవసరం లేకపోయినా ఫ్యాకల్టీ నియమించాల్సిన పరిస్థితి తప్పింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement