♦ పలు ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతుల నిరాకరణ
♦ వాటిల్లోని విద్యార్థులకు వేరే కళాశాలల్లో అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో పలు బ్రాంచీలకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆయా బ్రాంచీల్లోని విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి తరలించనున్నారు. ఆరు కాలేజీలకు చెందిన దాదాపు 400 మంది విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేర్చించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. 2015-16 విద్యా సంవత్సరం ప్రవేశాల్లో భాగంగా జేఎన్‌టీయూహెచ్ వివిధ కాలేజీలకు అనుమతులను నిరాకరించింది. దానిపై యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆయా కాలేజీలను ప్రవేశాల కౌన్సెలింగ్‌లో పెట్టాలని, జేఎన్‌టీయూహెచ్‌తో పాటు ఏఐసీటీఈ ప్రతినిధులతో కూడిన బృందాలు తనిఖీలు చేసి నివేదికల ఆధారంగా ఆ ప్రవేశాలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.
ఏఐసీటీఈ, జేఎన్‌టీయూహెచ్ బృందాలు తనిఖీలు చేసి ఇచ్చిన నివేదికలపై ఏఐసీటీఈ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆరు కాలేజీల్లోని పలు బ్రాంచీలకు అనుమతులను నిరాకరించింది. వాటి ప్రకారం ఆయా కాలేజీల్లో చేరిన విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేర్పించేందుకు ఉన్నత విద్యా మండలి, జేఎన్టీయూహెచ్‌లు చర్యలు చేపట్టాయి. వచ్చే నెల 7 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోగానే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించాయి. కాగా, అరబిందో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డీఆర్‌కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, డీఆర్‌కే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హర్షిత్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, హస్విత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పలు బ్రాంచీలు రద్దయినట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడించారు. ఆర్‌కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో మెకానికల్‌లో సీట్లు తగ్గించారు.
ఆ విద్యార్థులు వేరే కాలేజీల్లోకి
Published Tue, Apr 12 2016 3:57 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM
Advertisement
Advertisement