సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలకు ‘ఐటీ’ టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడు ఏ కాలేజీపై ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్లు దాడి చేయనున్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ జరుగుతుండటం, శివారు జిల్లాల్లోని మెజార్టీ కాలేజీలు రాజకీయ నేతలు, వారి బినామీలు, బంధువులకు సంబంధించినవే కావడం ఇందుకు కారణం.
శివారులోని ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి సమీప బంధువుకు సంబంధించిన పెట్టుబడులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ ప్రజాప్రతినిధి సహా బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహిస్తుండటం, వారు పెట్టుబడులు పెట్టిన కాలేజీలు, ఆస్పత్రులు, ఇతర సంస్థలపై దాడులు నిర్వహిస్తుండటంతో యాజమాన్యాలు సహా పరిపాలనా విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులు ఐటీ పేరు చెబితేనే హడలెత్తిపోతుండటం గమనార్హం.
మెజార్టీ కాలేజీలు వారివే..
రాష్ట్ర వ్యాప్తంగా 179 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, వీటిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే 80కిపైగా ఉన్నట్లు అంచనా. మెజార్టీ కాలేజీలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, వారి బంధువులకు సంబంధించినవే. ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, ఆస్పత్రులు, ఇతర విద్యా సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు బంధువులు వాటాదారులుగా ఉన్న ఇతర కాలేజీల్లోని లావాదేవీలపై కూడా ఐటీ దృష్టి సారించింది.
ఐటీ దాడులతో ఆయా యాజమాన్యాలు అప్రమత్తమవుతున్నాయి. ఇన్‌కం ట్యాక్స్ అధికారులు కాలేజీలో అడుగు పెట్టక ముందే కీలక డాక్యుమెంట్లు, రికార్డులు, హార్డ్ డిస్కులను రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత రెండు రోజుల నుంచి ఆయా కాలేజీలు గుర్తింపు కార్డు ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు మినహా ఇతర వ్యక్తులను వీటి ప్రాంగణంలోకి అడుగుపెట్టనివ్వకపోవడం గమనార్హం.
విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు..
ఇంజినీరింగ్ విద్యకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తమ పిల్లలను క్యాంపస్ ప్లేస్‌మెంట్లు ఎక్కువగా ఉండే కాలేజీల్లో చదివించేందుకు తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లోని ఈ బలహీనతను యాజమాన్యాలు ఆసరాగా చేసుకుంటున్నాయి. ఎంసెట్, జేఈఈలలో ఉత్తమ ర్యాంకులు సాధించి కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థుల నుంచి కూడా ల్యాబ్, ప్రాక్టికల్స్, లైబ్రరీ, ఇతర ఫీజుల పేరుతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయి. విద్యార్థులు చెల్లించిన ఫీజులకు సంబంధించిన రసీదులు కూడా ఇవ్వడం లేదు.
ఇక మేనేజ్‌మెంట్ కోటాలో ఉన్న సీట్లను ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు పది రెట్లకు అదనంగా అమ్ముతున్నారు. వీరు ఫీజు చెల్లింపు సమయంలో బ్యాంకు చెక్కులు, ఏటీఎం, పేటీఎం సేవలను నిరాకరిస్తున్నారు. నగదు రూపంలోనే ఈ ఫీజులు వసూలు చేస్తున్నారు. తాజాగా శివారులోని ఓ ప్రముఖ కాలేజీ యాజమాన్యం సహా మేడ్చల్ జిల్లాలోని కాలేజీల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు వస్తున్నాయి. ఐటీ అధికారులు ఫోన్ చేసి ఆరా తీస్తే.. అడ్మిషన్ సమయంలో ఎలాంటి డొనేషన్లు చెల్లించలేదని చెప్పాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తుండటం గమనార్హం.
‘వర్ధమాన్’లో సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం
శంషాబాద్ రూరల్: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడుల్లో భాగంగా శంషాబాద్ మండలంలోని కాచారం సమీపంలో ఉన్న వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి వర్ధమాన్ కళాశాలకు వైస్ చైర్మన్‌గా ఉన్నారు. దీంతో ఈ కళాశాలలో గురువారం మధ్యాహ్నం వరకు ఐటీ అధికారులు సోదాలు జరిపారు. విద్యార్థులు, కళాశాల సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించి ప్రత్యేక పహారాతో ఐటీ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment