అటు మూత.. ఇటు కోత | CM YS Jagan Welfare Schemes Helping Students Education | Sakshi
Sakshi News home page

అటు మూత.. ఇటు కోత

Published Mon, Feb 13 2023 3:13 AM | Last Updated on Mon, Feb 13 2023 3:13 AM

CM YS Jagan Welfare Schemes Helping Students Education - Sakshi

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏటా కనీసం 50కిపైగా ఇంజనీరింగ్‌ కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకుంటున్నాయి. మరికొన్ని వేల సంఖ్యలో కోర్సులను రద్దు చేసుకుంటున్నాయి. ఇబ్బడిముబ్బడిగా కాలేజీలు ఏర్పాటు కావడం, కొన్ని కోర్సులకే ఆదరణ ఉండటం, చేరికలు తగ్గి కాలేజీల నిర్వహణ భారంగా మారడం, నైపుణ్యాలు కొరవడి ప్లేస్‌మెంట్లు తగ్గిపోవడం ఈ దుస్థితికి కారణమని నిపుణుల కమిటీలు స్పష్టం చేస్తున్నాయి. నిపుణుల కమిటీల సూచనల మేరకు ఏఐసీటీఈ 2019లో కొత్త కాలేజీలకు అనుమతులపై మారటోరియం విధించింది.

2014–15 నుంచి జాతీయస్థాయిలో 767 ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడినట్లు అఖిల భారత సాంకేతిక విద్యామండలి 2021–22 నివేదికలో వెల్లడించింది. మరికొన్ని కాలేజీలు ఆదరణ లేకపోవడంతో 10,539 కోర్సులను రద్దు చేసుకున్నాయి. 2021–22 నాటికి దేశంలో ఇంజనీరింగ్‌ తదితర సాంకేతిక కోర్సుల్లో 24 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2014–15లో మొత్తం సీట్ల సంఖ్య 31.8 లక్షలు కాగా తరువాత నుంచి ఏటా తగ్గుతూ వస్తోంది. ఏడెనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల్లో సగం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి.

ఇదీ జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్‌ కాలేజీలు, కోర్సుల పరిస్థితి 

నేడు రాష్ట్రంలో వెన్నుతట్టి ప్రోత్సాహం
విద్యారంగ సంస్కరణలు చేపట్టి ఉన్నత చదువులు ఏమాత్రం భారం కాకుండా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నారు. విద్యార్థి చదువుకు అయ్యే మొత్తం ఫీజును జగనన్న విద్యాదీవెన కింద ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రతి త్రైమాసికంలో నిర్దిష్టంగా చెల్లిస్తూ చదువులకు భరోసా కల్పిస్తోంది.

అంతేకాకుండా వసతి దీవెన కింద రూ.20 వేలు చొప్పున విద్యార్థులకు అందజేస్తోంది. మరోవైపు గత సర్కారు బకాయిపెట్టిన ఫీజులను కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించి విద్యార్థులను ఆదుకుంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక 2019 తరువాత రాష్ట్రం నుంచి ఒక్క  ఇంజనీరింగ్‌ కాలేజీ కూడా మూసివేత కోసం దరఖాస్తు చేయలేదని ఏఐసీటీఈ గణాంకాలు పేర్కొంటున్నాయి.  

► అన్ని కాలేజీల్లో నిబంధనల ప్రకారం సదుపాయాలు, బోధనా సిబ్బంది, న్యాక్‌ అక్రిడిటేషన్‌ తప్పనిసరి.  
► సిలబస్‌లో సంస్కరణలు. కాలేజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి. 
► ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి. స్కిల్‌ ఆధారంగా 30 శాతం కోర్సులకు రూపకల్పన. 
► మైక్రోసాఫ్ట్‌ ద్వారా 1.62 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధిపై ఉచిత శిక్షణ.  
► నాస్కామ్, ఏపీఎస్‌ఎస్‌డీసీ సంస్థల ద్వారా యువతకు శిక్షణ కార్యక్రమాలు.  
► 2018–19లో రాష్ట్రంలో ప్లేస్‌మెంట్ల సంఖ్య 37 వేలు కాగా 2019–20లో 52 వేలకు, 2020–21లో 69 వేలకు,  2021–22లో 85 వేలకు పెరగడం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయనేందుకు 
నిదర్శనం.

నాడు 65 కాలేజీల మూసివేత
టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో 65 కాలేజీల యాజమాన్యాలు తమ విద్యా సంస్థలను మూసివేసినట్లు ఏఐసీటీఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత సర్కారు విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో ఇంజనీరింగ్‌ విద్య ప్రమాణాలు కొరవడి అధ్వానంగా మారింది. కాలేజీల ఫీజు ఎంత ఉన్నా రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తామనడం, అరకొర ఫీజులు కూడా ఏటా సక్రమంగా ఇవ్వకపోవడంతో ఇంజనీరింగ్‌ విద్య అస్తవ్యస్థమైంది. 2019లో టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి కాలేజీలకు రూ.1,800 కోట్ల మేర ఫీజులు బకాయి పెట్టడం గమనార్హం. దీంతో మూసివేత దిశగా విద్యాసంస్థలు సాగాయి.

► పుట్టగొడుగుల్లా వెలిసిన కాలేజీల్లో ఏఐసీటీఈ / ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రకారం మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది ఉండడం లేదు. ధనార్జనే ధ్యేయంగా మొక్కుబడిగా నిర్వహించడంతో ప్రమాణాలు పడిపోయి విద్యార్థులకు నైపుణ్యాలు కొరవడ్డాయి. ఫలితంగా ప్లేస్‌మెంట్లు సన్నగిల్లాయి. చదువులు ముగి­యగానే ఉద్యోగావకాశాలు దొరక­డం గగనంగా మారింది. అదనపు నైపు­ణ్యాలు, సర్టిఫికేషన్‌ కోర్సులను కూడా పూర్తి చేస్తే కానీ ఉద్యోగాలు దక్కడం లేదు.  

► ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతూ నిరంతరం కొత్త అంశాలు రూపుదిద్దుకుంటున్నా­యి. వాటిలో నైపుణ్యాలను సాధించిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. పలు కాలేజీల్లో కోర్సులు, బోధనా వనరులు, సదుపా­యాలు లేవు. వరు­సగా మూడేళ్లు 25 శాతం కన్నా చేరికలు తక్కువగా ఉండే కాలేజీలు, కోర్సు­లకు ఏఐసీటీఈ అనుమతులు రద్దు చేస్తోంది.  

► ఇండియా స్కిల్‌ నివేదిక ప్రకారం ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన వారిలో 48శాతం మందికే ఉద్యోగాలు దక్కుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement