స్కిల్డు ఫోర్సు పేరిట... లక్ష మందికి నైపుణ్య శిక్షణ | AICTE Announced Internships For One Lakh Students | Sakshi
Sakshi News home page

లక్ష మందికి నైపుణ్య శిక్షణ

Published Tue, Apr 5 2022 8:13 AM | Last Updated on Tue, Apr 5 2022 8:26 AM

AICTE Announced Internships For One Lakh Students  - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలోని లక్ష మందికి పైగా విద్యార్థులకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణ కోసం ఇంటర్న్‌షిప్‌ను అందించనున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకటించింది. స్కిల్డు ఫోర్సు పేరిట ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది. అమెరికాకు చెందిన మల్టీ నేషనల్‌ టెక్నాలజీ సంస్థ అయిన సిస్కో, మహాత్మా గాంధీ నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌(ఎంజీఎన్‌సీఆర్‌ఈ), ఆరెస్‌బీ ట్రాన్స్‌మిషన్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీ వంటి సంస్థల ద్వారా ఈ శిక్షణ ఇప్పించనుంది.

ఉన్నత విద్యనభ్యసించే ఆసక్తిగల విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌.ఏఐసీటీఈఇండియా.ఓఆర్‌జీ’ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఏఐసీటీఈ సూచించింది. తరగతి గది పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా అమలు చేయడం ద్వారా విద్యార్థులకు సరైన నైపుణ్యావగాహనకు అవకాశం ఉంటుందని ఏఐసీటీఈ అభిప్రాయం. సాంకేతిక విద్యనభ్యసించే వారే కాకుండా ఇతర కోర్సుల వారికీ ఈ ఇంటర్న్‌షిప్‌ మేలు చేయనుంది.  

ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ 
దేశంలో లక్ష మందికి ఏఐసీటీఈ నైపుణ్య శిక్షణకు ఏర్పాట్లు చేస్తుండగా.. అంతకు మించి ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందిస్తుండటం విశేషం. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా లక్షలాది మందికి ప్రముఖ సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలు అమలు చేయిస్తున్నారు. అంతేగాకుండా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ద్వారా ప్రత్యేకంగా పలు ఐటీ ఆధారిత కోర్సులనూ అందిస్తున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ మైక్రోసాఫ్ట్‌ సంస్థ ద్వారా 40కి పైగా ఐటీ కోర్సుల్లో ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తోంది. రాష్ట్రంలోని 1.60 లక్షల మందిని ఇప్పటికే ఈ కోర్సులకు ఎంపిక చేశారు.

వాస్తవానికి ఈ ప్రత్యేక కోర్సులు అభ్యసించాలంటే ఒక్కో విద్యార్థికి రూ.10 వేల నుంచి 15 వేల వరకూ ఖర్చవుతుంది. అయితే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వమే ఈ కోర్సులను ఉచితంగా విద్యార్థులకు అందిస్తోంది. దీనికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి రూ.37 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ శిక్షణ కోసం ఉన్నత విద్యా మండలి, మైక్రోసాఫ్ట్‌ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.  

(చదవండి: వైకల్యంతో పుట్టాడని వదిలేశారు!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement