ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ప్రవాస భారతీయుల(ఎన్‌ఆర్‌ఐ) కోటాను 15 శాతానికి పెంచేందుకు ఒప్పుకున్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ).. ఇంజనీరింగ్ ప్రవేశాల మార్గదర్శకాల్లో ‘ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్’ అనే పదాన్ని చేర్చేందుకు మాత్రం అంగీకరించలేదు. ఉన్నత విద్యాశాఖ అధికారులు సంప్రదించిన సందర్భంగా ఏఐసీటీఈ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు మంగళవారం ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
ఈ పరిస్థితుల్లో ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ అనే పదాన్ని ఇంజనీరింగ్ ప్రవేశాల మార్గదర్శకాల్లో చేర్చేలా ప్రముఖ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం స్పాన్సర్డ్ అనే పదాన్ని చేర్చడానికి వీల్లేదని, ఆ పదాన్ని చేర్చితే ప్రముఖ కాలేజీలు సీట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.
మేనేజ్‌మెంట్ కోటాలో చేరే విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను తెలుసుకునేందుకు.. ఫీజు చెల్లిస్తారా? లేదా? అనే అంశాలపై ఓ అవగాహనకు వచ్చేందుకు విద్యార్థులను ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ అనే పదాన్ని మార్గదర్శకాల్లో చేర్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాయి.
మార్గదర్శకాల్లో ‘ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్’ వద్దు!
Published Wed, Jun 11 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM
Advertisement