విమానం ఎక్కాలి.. అమెరికాలో వాలిపోవాలి.. డాలర్లలో డబ్బులు సంపాదించాలనే క్రేజ్ గుజరాత్‌లోకి కొన్ని ప్రాంతాలను పట్టి పీడిస్తోంది. ఎన్నారై మోజులో పడి ఎన్నో కుటుంబాలు అప్పుల పాలు అవుతుండగా... ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ట్రావెల్ ఏజెంట్లు మాఫియాలా మారారు. తుపాకులు చేతబడుతున్నారు.. చంపేందుకు సైతం వెనుకాడటం లేదు.
ట్రావెల్ ఏజెంట్లు
గుజరాత్‌లో ఎన్నారై కావాలనే ఆశతో కెనాడలో అమెరికా సరిహద్దులో ఓ కుటుంబం బలైపోయిన సంఘటన ఇంకా మది నుంచి చెరిగిపోకముందే మరో ఘటన తెర మీదకి వచ్చింది. గుజరాత్‌లోని కలోల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విష్ణుభాయ్ మానేక్‌లాల్ పటేల్ అనే వ్యక్తి కలోల్ పట్టణంలో కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు.అతని మేనల్లుడు విశాల్, అతని భార్య రూపాలిలను అక్రమ పద్దతిలో అమెరికా పంపేందుకు రుత్విక్, దేవమ్ అనే స్థానిక ట్రావెల్ ఏజెంట్లతో ఒప్పందం చేసుకున్నాడు.
డీల్ ఇలా
ఒప్పందం ప్రకారం భార్య భర్తలను ఇల్లీగల్‌గా అమెరికాకు తీసుకెళ్లినందుకు రూ. 1.10 కోట్ల రూపాయలు చెల్లించాలనే నిర్ణయించారు. ఇందులో రూ. 10 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించగా.. అమెరికా చేరుకున్న తర్వాత రెండో విడతగా రూ. 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో సెటిలైన తర్వాత నెలన్నర రోజులులోగా మూడో విడతగా రూ.50 లక్షలు చెల్లించాలని ముందుగా నిర్ణయించుకున్నారు.
ప్లాన్‌లో చేంజ్
ఢిల్లీ మీదుగా విశాల్, రూపాలీలను అమెరికా తీసుకెళ్తామని ట్రావెల్ ఏజెంట్లు రుత్విక్, దేవమ్‌లు తెలిపారు. మీతో పాటు మరికొంతమంది కూడా ఈ టూర్‌లో ఉన్నారని చెప్పారు. అన్నట్టుగానే ఫిబ్రవరి 5న విశాల్, రూపాలీ దంపతులు ఢిల్లీ నుంచి అమెరికా ఫ్లైట్ ఎక్కారు. వీరితో పాటు ట్రావెల్ ఏజెంట్లైన రుత్విక్, దేవమ్‌లు కూడా అమెరికా చేరుకోవాలి. అయితే ఈ ప్రయాణం నుంచి రుత్విక్ ఢిల్లీలోనే డ్రాప్ అయ్యాడు.
డబ్బులు ఇవ్వమంటూ
ఢిల్లీలోనే ఆగిపోయని రుత్విక్ తనతో పాటు అదే సంస్థకు చెందిన మరికొందరు ఏజెంట్లతో అదే రోజు రాత్రి గుజరాత్ చేరుకున్నాడు. కలోల్‌లోని విష్ణుభాయ్ పటేల్ ఇంటికి వెళ్లి ‘ మీ వాళ్లు అమెరికా ఫ్లైట్ ఎక్కారు కాబట్టి మిగిలిన డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారు’. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెరికాలో మా వాళ్లు దిగిన తర్వాతే మిగిలిన డబ్బులు ఇస్తానంటూ విష్ణుభాయ్ బదులిచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది.
ఫైరింగ్
డబ్బులు రాకపోవడంతో రుత్విక్ అతని గ్యాంగ్ విష్ణుభాయ్ పటేల్‌పై తుపాకితో కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఆ బుల్లెట్ అతని శరీరానికి తాకలేదు. వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు గట్టిగా కేకలే వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు. మిగిలిన గ్యాంగ్ సభ్యలు పారిపోగా.. రుత్విక్ దొరికాడు. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.
కోటిన్నర రూపాయలు
ఎలాగైనా ఎన్నారై కావాలనే ఆశతో గుజరాత్‌లో కొందరు అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో భూములు అమ్మడం, లోన్లు తీసుకోవడవం చేస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులను అమెరికా పంపేందుకు కోటిన్నర రూపాయలను ట్రావెల్ ఏజెంట్లు వసూలు చేస్తున్నారు.
చదవండి: ఎన్నారై అమ్మాయి కావాలెను! రూ.30 లక్షల వరకు ఎదురు కట్నం కూడా ఇస్తాం!!
Comments
Please login to add a commentAdd a comment