Non resident of india
-
ఎన్నారై మాఫియా? అక్రమ రవాణాకు కోట్ల రూపాయల వసూలు
విమానం ఎక్కాలి.. అమెరికాలో వాలిపోవాలి.. డాలర్లలో డబ్బులు సంపాదించాలనే క్రేజ్ గుజరాత్‌లోకి కొన్ని ప్రాంతాలను పట్టి పీడిస్తోంది. ఎన్నారై మోజులో పడి ఎన్నో కుటుంబాలు అప్పుల పాలు అవుతుండగా... ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ట్రావెల్ ఏజెంట్లు మాఫియాలా మారారు. తుపాకులు చేతబడుతున్నారు.. చంపేందుకు సైతం వెనుకాడటం లేదు. ట్రావెల్ ఏజెంట్లు గుజరాత్లో ఎన్నారై కావాలనే ఆశతో కెనాడలో అమెరికా సరిహద్దులో ఓ కుటుంబం బలైపోయిన సంఘటన ఇంకా మది నుంచి చెరిగిపోకముందే మరో ఘటన తెర మీదకి వచ్చింది. గుజరాత్‌లోని కలోల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విష్ణుభాయ్ మానేక్‌లాల్ పటేల్ అనే వ్యక్తి కలోల్ పట్టణంలో కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు.అతని మేనల్లుడు విశాల్, అతని భార్య రూపాలిలను అక్రమ పద్దతిలో అమెరికా పంపేందుకు రుత్విక్, దేవమ్ అనే స్థానిక ట్రావెల్ ఏజెంట్లతో ఒప్పందం చేసుకున్నాడు. డీల్ ఇలా ఒప్పందం ప్రకారం భార్య భర్తలను ఇల్లీగల్‌గా అమెరికాకు తీసుకెళ్లినందుకు రూ. 1.10 కోట్ల రూపాయలు చెల్లించాలనే నిర్ణయించారు. ఇందులో రూ. 10 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించగా.. అమెరికా చేరుకున్న తర్వాత రెండో విడతగా రూ. 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో సెటిలైన తర్వాత నెలన్నర రోజులులోగా మూడో విడతగా రూ.50 లక్షలు చెల్లించాలని ముందుగా నిర్ణయించుకున్నారు. ప్లాన్‌లో చేంజ్ ఢిల్లీ మీదుగా విశాల్, రూపాలీలను అమెరికా తీసుకెళ్తామని ట్రావెల్ ఏజెంట్లు రుత్విక్, దేవమ్‌లు తెలిపారు. మీతో పాటు మరికొంతమంది కూడా ఈ టూర్లో ఉన్నారని చెప్పారు. అన్నట్టుగానే ఫిబ్రవరి 5న విశాల్, రూపాలీ దంపతులు ఢిల్లీ నుంచి అమెరికా ఫ్లైట్ ఎక్కారు. వీరితో పాటు ట్రావెల్ ఏజెంట్లైన రుత్విక్, దేవమ్‌లు కూడా అమెరికా చేరుకోవాలి. అయితే ఈ ప్రయాణం నుంచి రుత్విక్ ఢిల్లీలోనే డ్రాప్ అయ్యాడు. డబ్బులు ఇవ్వమంటూ ఢిల్లీలోనే ఆగిపోయని రుత్విక్ తనతో పాటు అదే సంస్థకు చెందిన మరికొందరు ఏజెంట్లతో అదే రోజు రాత్రి గుజరాత్ చేరుకున్నాడు. కలోల్‌లోని విష్ణుభాయ్ పటేల్ ఇంటికి వెళ్లి ‘ మీ వాళ్లు అమెరికా ఫ్లైట్ ఎక్కారు కాబట్టి మిగిలిన డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారు’. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెరికాలో మా వాళ్లు దిగిన తర్వాతే మిగిలిన డబ్బులు ఇస్తానంటూ విష్ణుభాయ్ బదులిచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఫైరింగ్ డబ్బులు రాకపోవడంతో రుత్విక్ అతని గ్యాంగ్ విష్ణుభాయ్ పటేల్‌పై తుపాకితో కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఆ బుల్లెట్ అతని శరీరానికి తాకలేదు. వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు గట్టిగా కేకలే వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు. మిగిలిన గ్యాంగ్ సభ్యలు పారిపోగా.. రుత్విక్ దొరికాడు. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. కోటిన్నర రూపాయలు ఎలాగైనా ఎన్నారై కావాలనే ఆశతో గుజరాత్లో కొందరు అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో భూములు అమ్మడం, లోన్లు తీసుకోవడవం చేస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులను అమెరికా పంపేందుకు కోటిన్నర రూపాయలను ట్రావెల్ ఏజెంట్లు వసూలు చేస్తున్నారు. చదవండి: ఎన్నారై అమ్మాయి కావాలెను! రూ.30 లక్షల వరకు ఎదురు కట్నం కూడా ఇస్తాం!! -
నాట్స్.. ఆర్థిక పాఠాలు.. మహిళలకు ప్రత్యేకం
ఫైనాన్షియల్ వెల్నెస్ బేసిక్స్ ఫర్ విమెన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తెలిపింది. 2022 జనవరి 29వ తేదిన అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో ఆర్థిక అంశాలపై విమన్ ఎంపర్మెంట్ లీడర్ గంది దుర్గాప్రశాంతి సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ ప్రోగ్రామ్‌కి మాధవి మోడరేటర్‌గా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు www.NATSWORLD.ORD/WOMEN_EMPOWERMENT లింకులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. -
ఆకలిపై పోరులో డ్రీమ్ కేర్
వాషింగ్టన్ : అమెరికా లోని వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాకి చెందిన కుషాల్ దొండేటి నిర్వహిస్తోన్న డ్రీం కేర్ ఫౌండేషన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజషన్ ఆహార ప్యాకెట్లను సరఫరా చేసింది. ఫండ్ రైజింగ్ ద్వారా సుమారు రూ. 2.62 లక్షలను డ్రీం కేర్ ఫౌండేషన్ సమీకరించింది. ఈ నిధులతో పది వేల మీల్ ప్యాకెట్లను తయారు చేశారు. ఒక్కో ప్యాకెట్లో ఆరుగురికి సరిపడా ఆహారం ఉంటుంది. దీన్ని అమెరికా, ఇండియాతో పాటు పలు దేశాల్లోని అవసరం ఉన్న చోటుకి పంపారు. ఈ కార్యక్రమంలో రైజ్ ఎగైనెస్ట్హంగర్ అనే స్వచ్చంధ సంస్థ సైతం సహాయ సహకారాలు అందించింది. హై స్కూల్ స్థాయిలోనే ఫండ్ రైజింగ్ ద్వారా అమెరికా, ఇండియాలతో పాటు ఆకలితో ఉన్న వారికి సాయపడే విధంగా కార్యక్రమాలు చేపడుతున్న కుషాల్‌ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో 60 మంది స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్లమంది ఎన్ఆర్ఐలు
విశ్వవ్యాప్తంగా అధిక సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిశీలించి ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ, 1990 డిసెంబర్ 18న జరిగిన సమావేశంలో ‘వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాని మేరకు డిసెంబర్ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా ప్రకటించింది. వలస అంటే బతుకుదెరువు కోసం, లేదా ఆర్థికాభివృద్ధి కోసం చేసుకునే ‘నివాస మార్పు‘గా భావించవచ్చు. ప్రజలు వలసలతో పలు అవకాశాలను పొందగలుగుతున్నప్పటికీ కష్టాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. వలసలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. వలస వెళ్లేలా ‘నెట్టివేయబడే’ పరిస్థితులు కొన్నైతే, వున్నచోట పరిస్థితులు అనుకూలంగా లేక మరొక చోట ‘ఆకర్షణీయంగా’ ఉండడం మరొక కారణం. చదవండి:డాక్టర్ ఫస్ట్ లేడీ అంటే తప్పేంటి!? పని కోసం, బతుకుదెరువు కోసం పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు గానీ, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి గానీ వలస వెళ్లడాన్ని ‘అంతర్గత వలసలు’ అంటారు. ఒకదేశం నుంచి మరొకదేశానికి వెళ్లడాన్ని ‘అంతర్జాతీయ వలసలు’ అంటారు. ప్రవాసులకు రాయితీలు కల్పిస్తూ వారిని ప్రాత్సహిస్తే అభివృద్ధి సాధించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాలలో 3 కోట్లమంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారని అంచనా. తెలంగాణ ప్రాంతం నుంచి 1970లో వలసలు ప్రారంభమయ్యాయి. అప్పుడే గల్ఫ్ దేశాల్లో పెట్రోల్ నిల్వలు బయటపడటంతో అక్కడ కూలీల అవసరం ఏర్పడింది. ఇక్కడ బతుకు దెరువులేని రైతులకు, వ్యవసాయ కూలీలకు అక్కడ మంచి అవకాశం దొరికింది. పొట్టకూటి కోసం వెళ్లిన వలస కార్మికులకు అక్కడి, ఇక్కడి ప్రభుత్వాలు అండగా ఉండాలి. తమ ఉనికిని కాపాడుకుంటూ, మాతృదేశంపై మమకారం చూపుతూ మరెందరికో సహకారాన్ని అందిస్తున్న, ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. అనే మాటను నిజం చేయాల్సిన బాధ్యత కూడా ప్రవాసుల మీదవుంది. – రఘుపతిరావు గడప మొబైల్ : 99634 99282 -
మార్గదర్శకాల్లో ‘ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్’ వద్దు!
ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ప్రవాస భారతీయుల(ఎన్ఆర్ఐ) కోటాను 15 శాతానికి పెంచేందుకు ఒప్పుకున్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ).. ఇంజనీరింగ్ ప్రవేశాల మార్గదర్శకాల్లో ‘ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్’ అనే పదాన్ని చేర్చేందుకు మాత్రం అంగీకరించలేదు. ఉన్నత విద్యాశాఖ అధికారులు సంప్రదించిన సందర్భంగా ఏఐసీటీఈ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు మంగళవారం ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ అనే పదాన్ని ఇంజనీరింగ్ ప్రవేశాల మార్గదర్శకాల్లో చేర్చేలా ప్రముఖ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం స్పాన్సర్డ్ అనే పదాన్ని చేర్చడానికి వీల్లేదని, ఆ పదాన్ని చేర్చితే ప్రముఖ కాలేజీలు సీట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. మేనేజ్మెంట్ కోటాలో చేరే విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను తెలుసుకునేందుకు.. ఫీజు చెల్లిస్తారా? లేదా? అనే అంశాలపై ఓ అవగాహనకు వచ్చేందుకు విద్యార్థులను ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ అనే పదాన్ని మార్గదర్శకాల్లో చేర్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాయి. -
జైలుకు పంపిన జల్సా జీవితం
సాక్షి, హైదరాబాద్: తండ్రి పోలీసుశాఖలో ఎస్సై... ఉన్నత విద్య చదువుకుంది... అయినా జల్సాకు అలవాటు పడింది... డబ్బు కోసం సొంత బంధువు కుటుంబాన్ని మట్టుపెట్టింది... చివరకు ఆమె జైలు పాలైంది. ప్రవాస భారతీయుడు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కడలి నాగలక్ష్మీవరప్రసాద్ను, అతని భార్యాపిల్లలను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితులు కొప్పిశెట్టి మాధవీదేవి అలియాస్ మధు, ఆమె భర్త జాన్ అబ్రహాంలకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 15 వేల చొప్పున జరిమానా విధిస్తూ నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే) రజిని సోమవారం తీర్పునిచ్చారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు క్రాంతి కిరణ్ రాథోడ్, కె.ప్రదీప్‌కుమార్‌లకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 7 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉప్పు బాలబుచ్చయ్య వాదనలు వినిపించారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రామచంద్రన్, రాందాస్‌తేజ ఈ కేసును దర్యాప్తు చేశారు. కానిస్టేబుళ్లు నందగోపాల్‌రెడ్డి, అమీర్అలీలు ప్రాసిక్యూషన్‌కు సహకరించారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి... రాజోలు దరి మేడిచర్లపాలేనికి చెందిన వరప్రసాద్ 20 ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఇంజనీర్‌గా స్థిరపడ్డారు. అతని తోడల్లుడు కె.నాగరాజుబాబు విశాఖపట్నంలో ఎస్సైగా, అతడి కుమార్తె మాధవి ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పనిచేసేది. ఆమె బలవంతం మేరకు నెలకు రూ. 20 వేల చొప్పున చెల్లించే విధంగా వరప్రసాద్ ఓ పాలసీ కోసం డబ్బు పంపారు. తర్వాత మరికొన్ని చోట్ల పెట్టుబడుల కోసమంటూ భారీగానే వరప్రసాద్ నుంచి మాధవి డబ్బు తీసుకుంది. తీరా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకపోగా, ఆ డబ్బుతో జల్సా చేసింది. ఈ విషయం గుర్తించిన వరప్రసాద్, ఆయన భార్య విజయలక్ష్మి తాము పంపిన డబ్బు రూ. 80 లక్షలు తిరిగి ఇవ్వాలని మాధవిని కోరారు. ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని భావించిన మాధవి తన భర్త జాన్ అబ్రహం కలసి వరప్రసాద్ కుటుంబాన్ని మట్టుపెట్టేందుకు కుట్ర పన్నింది. విద్యార్థులైన క్రాంతికిరణ్ రాథోడ్ (నిజామాబాద్), కె.ప్రదీప్‌కుమార్ (గుంటూరు)లకు డబ్బు ఆశ చూపి ఈ హత్యకు సహకరించేలా ఒప్పించింది. డబ్బులిస్తామని రప్పించి: 2009, ఆగస్టులో తల్లిదండ్రులను చూసేందుకు వరప్రసాద్ సొంతూరికి రావడంతో మాధవి, జాన్ అబ్రహం కుట్ర అమలుకు సిద్ధమయ్యారు. ఆ నెల 20న సికింద్రాబాద్‌లోని ఒక లాడ్జిలో మారు పేర్లతో మూడు గదులు బుక్ చేశారు. డబ్బు ఇచ్చేస్తామని నమ్మించి వరప్రసాద్ కుటుంబాన్ని అక్కడికి రప్పించారు. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన రూ. 80 లక్షల చెక్కును ఓ మిత్రుడి సహకారంతో వరప్రసాద్‌కు ఇప్పించారు. తర్వాత జాన్అబ్రహం, ప్రదీప్, వరప్రసాద్ ఓ గదిలో మద్యం తాగారు. ఆ సమయంలో వరప్రసాద్ మద్యం గ్లాసులో ప్రదీప్ తాను కళాశాల ల్యాబ్ నుంచి తెచ్చిన ఈథైల్ ఆల్కహాల్‌ను కలిపాడు. దీని ప్రభావంతో మత్తులోకి జారుకున్న వరప్రసాద్‌ను చున్నీని మెడకు బిగించి హత్య చేశారు. తర్వాత మరో గదిలో ఉన్న వరప్రసాద్ భార్య విజయలక్ష్మిని, వారి కుమారుడు కేతన్ (15)లను హతమార్చారు. ఆ తర్వాత వారి కుమార్తె కవిత(10)ను గొంతుకు చున్నీ బిగించి చంపేశారు. మృతుల ఒంటిపై ఉన్న 25 తులాల బంగారంతో పాటు సెల్ఫోన్లు, ఇతర విలువైన వస్తువులు తీసుకొని నిందితులు విశాఖపట్నం పారిపోయారు. ఈ ఘటన సమయంలో మాధవి ఐదు నెలల గర్భిణిగా ఉన్న విజయలక్ష్మి, వరప్రసాద్, వారి పిల్లలను హత్య చేయడం, ఆమె తండ్రి పోలీసు శాఖలో ఎస్సైగా ఉండటం, ఆమె భర్త జాన్‌పై పలు కేసులు ఉండటం తదితర కారణాలతో అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. -
విదేశాల్లో పనిచేసే భారతీయ కార్మికులకు ‘భద్రత’
దుబాయ్‌లో ఎంజీపీఎస్‌వై పథకాన్ని ప్రవేశపెట్టిన వాయలార్ రవి దుబాయ్: విదేశాల్లో పనిచేసే ప్రవాస భారతీయులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ ప్రవాసి సురక్ష యోజన (ఎంజీపీఎస్‌వై) పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ మంత్రి వాయలార్ రవి సోమవారం దుబాయ్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈసీఆర్ (ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్) దేశాల్లో పనిచేసే దాదాపు 50 లక్షల మంది కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొంద నున్నారు. ఎంజీపీఎస్‌వైలో చేరే కార్మికులు సంవత్సరానికి రూ.1,000 నుంచి రూ.12,000 చందా కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం తన వాటాగా రూ.1,000 కడుతుంది. మహిళా కార్మికులు అయితే అదనంగా మరో రూ.1,000 చెల్లిస్తుంది. దీంతోపాటు కార్మికులు విదేశాల్లో పనిచేస్తున్నంతకాలం జీవిత బీమా సౌకర్యం కల్పిస్తుంది. పని పూర్తయ్యాక భారత్‌కు తిరిగి రాగానే వారికి సొమ్ము అందజేస్తుంది. గల్ఫ్ దేశాల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం, భద్రతకు పెద్దపీట వేస్తున్నామని ఈ సందర్భంగా వాయలార్ రవి చెప్పారు. -
ఆమెరికాలో దసరా, బతుకమ్మ సంబరాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో(టీఏజీసీ), అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) సంయుక్త ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు దసరా ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఇల్లినాయిస్ రాష్ట్రం నుంచి 500లకు పైగా తెలుగువారు చికాగోలోని ఆరోర వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మలను ఆకర్షణీయంగా రూపొందించిన వారికి న్యూయార్క్ లైఫ్ కృష్ణ రంగరాజు స్పాన్సర్ చేసిన బహుమతులను ఆటా వ్యవస్థాపకులు హన్మంత్‌రెడ్డి, మాధవరెడ్డిలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని టీఏజీసీ అధ్యక్షుడు రమేష్ గారపాటి, ఆటా అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం పర్యవేక్షించారు. -
వైఎస్సార్ కాంగ్రెస్ ఇంటర్నేషనల్ వెబ్సైట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కెనడాకు చెందిన ప్రవాస భారతీయుడు వి.వి.రామారావు రూపొందించిన వైఎస్సార్ కాంగ్రెస్ ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ వెబ్‌సైట్‌ను పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శనివారం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఏర్పడిన పార్టీ కమిటీలను సమన్వయం చేస్తూ పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఈ వెబ్సైట్ (ఐసీసీవైఎస్ఆర్సీపీ డాట్‌కామ్)ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. 2014 ఎన్నికల్లో పార్టీ విజయసాధన, పార్టీ సిద్ధాంతాల ప్రచారం ప్రధాన ఆశయాలుగా ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు కొణతాల రామకృష్ణ, షర్మిల, జూపూడి ప్రభాకర్‌రావు, ఐటీ విభాగం నేతలు చల్లా మధుసూదన్‌రెడ్డి, హర్ష, వి.రమేష్‌బాబు, కె.వెంకటరెడ్డి పాల్గొన్నారు.