సాక్షి, హైదరాబాద్: తండ్రి పోలీసుశాఖలో ఎస్సై... ఉన్నత విద్య చదువుకుంది... అయినా జల్సాకు అలవాటు పడింది... డబ్బు కోసం సొంత బంధువు కుటుంబాన్ని మట్టుపెట్టింది... చివరకు ఆమె జైలు పాలైంది. ప్రవాస భారతీయుడు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కడలి నాగలక్ష్మీవరప్రసాద్‌ను, అతని భార్యాపిల్లలను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితులు కొప్పిశెట్టి మాధవీదేవి అలియాస్ మధు, ఆమె భర్త జాన్ అబ్రహాంలకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 15 వేల చొప్పున జరిమానా విధిస్తూ నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే) రజిని సోమవారం తీర్పునిచ్చారు.
ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు క్రాంతి కిరణ్ రాథోడ్, కె.ప్రదీప్‌కుమార్‌లకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 7 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉప్పు బాలబుచ్చయ్య వాదనలు వినిపించారు. సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు రామచంద్రన్, రాందాస్‌తేజ ఈ కేసును దర్యాప్తు చేశారు. కానిస్టేబుళ్లు నందగోపాల్‌రెడ్డి, అమీర్‌అలీలు ప్రాసిక్యూషన్‌కు సహకరించారు.
ఈ కేసు వివరాలిలా ఉన్నాయి... రాజోలు దరి మేడిచర్లపాలేనికి చెందిన వరప్రసాద్ 20 ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఇంజనీర్‌గా స్థిరపడ్డారు. అతని తోడల్లుడు కె.నాగరాజుబాబు విశాఖపట్నంలో ఎస్సైగా, అతడి కుమార్తె మాధవి ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పనిచేసేది. ఆమె బలవంతం మేరకు నెలకు రూ. 20 వేల చొప్పున చెల్లించే విధంగా వరప్రసాద్ ఓ పాలసీ కోసం డబ్బు పంపారు. తర్వాత మరికొన్ని చోట్ల పెట్టుబడుల కోసమంటూ భారీగానే వరప్రసాద్ నుంచి మాధవి డబ్బు తీసుకుంది. తీరా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకపోగా, ఆ డబ్బుతో జల్సా చేసింది.
ఈ విషయం గుర్తించిన వరప్రసాద్, ఆయన భార్య విజయలక్ష్మి తాము పంపిన డబ్బు రూ. 80 లక్షలు తిరిగి ఇవ్వాలని మాధవిని కోరారు. ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని భావించిన మాధవి తన భర్త జాన్ అబ్రహం కలసి వరప్రసాద్ కుటుంబాన్ని మట్టుపెట్టేందుకు కుట్ర పన్నింది. విద్యార్థులైన క్రాంతికిరణ్ రాథోడ్ (నిజామాబాద్), కె.ప్రదీప్‌కుమార్ (గుంటూరు)లకు డబ్బు ఆశ చూపి ఈ హత్యకు సహకరించేలా ఒప్పించింది.
డబ్బులిస్తామని రప్పించి: 2009, ఆగస్టులో తల్లిదండ్రులను చూసేందుకు వరప్రసాద్ సొంతూరికి రావడంతో మాధవి, జాన్ అబ్రహం కుట్ర అమలుకు సిద్ధమయ్యారు. ఆ నెల 20న సికింద్రాబాద్‌లోని ఒక లాడ్జిలో మారు పేర్లతో మూడు గదులు బుక్ చేశారు. డబ్బు ఇచ్చేస్తామని నమ్మించి వరప్రసాద్ కుటుంబాన్ని అక్కడికి రప్పించారు.
ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన రూ. 80 లక్షల చెక్కును ఓ మిత్రుడి సహకారంతో వరప్రసాద్‌కు ఇప్పించారు. తర్వాత జాన్‌అబ్రహం, ప్రదీప్, వరప్రసాద్ ఓ గదిలో మద్యం తాగారు. ఆ సమయంలో వరప్రసాద్ మద్యం గ్లాసులో ప్రదీప్ తాను కళాశాల ల్యాబ్ నుంచి తెచ్చిన ఈథైల్ ఆల్కహాల్‌ను కలిపాడు. దీని ప్రభావంతో మత్తులోకి జారుకున్న వరప్రసాద్‌ను చున్నీని మెడకు బిగించి హత్య చేశారు. తర్వాత మరో గదిలో ఉన్న వరప్రసాద్ భార్య విజయలక్ష్మిని, వారి కుమారుడు కేతన్ (15)లను హతమార్చారు. ఆ తర్వాత వారి కుమార్తె కవిత(10)ను గొంతుకు చున్నీ బిగించి చంపేశారు. మృతుల ఒంటిపై ఉన్న 25 తులాల బంగారంతో పాటు సెల్‌ఫోన్లు, ఇతర విలువైన వస్తువులు తీసుకొని నిందితులు విశాఖపట్నం పారిపోయారు. ఈ ఘటన సమయంలో మాధవి ఐదు నెలల గర్భిణిగా ఉన్న విజయలక్ష్మి, వరప్రసాద్, వారి పిల్లలను హత్య చేయడం, ఆమె తండ్రి పోలీసు శాఖలో ఎస్సైగా ఉండటం, ఆమె భర్త జాన్‌పై పలు కేసులు ఉండటం తదితర కారణాలతో అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది.
జైలుకు పంపిన జల్సా జీవితం
Published Tue, Jan 14 2014 4:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement
Advertisement