సాక్షి, హైదరాబాద్: ఉబర్, ఓలా, జొమాటో, స్విగ్గీ, అర్బన్ కంపెనీ లాంటి యాప్ ఆధారిత సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లు, బాయ్‌లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ కోసం వెళ్లినప్పుడు కుక్క తరమడంతో కంగారులో భవనం పైనుంచి పడి మరణించిన ఓ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్యాబ్ సంస్థలు నిర్వహిస్తున్న తరహాలో ఓ యాప్‌ను టీ–హబ్ ద్వారా సిద్ధం చేసి అవకాశం ఉన్న వారికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించినప్పుడు నవంబర్ 27న కొందరు ఫుడ్ డెలివరీ బాయ్‌లతో భేటీ కావడం తెలిసిందే. అప్పుడు వారి సమస్యలను అడిగి తెలుసుకున్న రాహుల్... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆయా సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తిని ఈ మేరకు ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఓలా, ఉబర్ ద్వారా పనిచేసే ఆటో డ్రైవర్లతోపాటు క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్‌ల సమస్యలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న బాయ్‌లతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
సామాజిక బాధ్యతలో భాగంగా ఆయా సంస్థల్లో పనిచేస్తూ రక్షణ లేకుండా ఇబ్బందులు పడుతున్న వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నామని వెల్లడించారు. అసంఘటిత రంగ కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని... ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాజస్తాన్‌లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అంతకంటే మెరుగైన విధంగా చట్టం తయారీకి బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు.
కార్మికుల సంక్షేమంపై దృష్టిపెట్టని సంస్థలపై చర్యలు..
‘సంస్థలు కూడా లాభాపేక్ష మాత్రమే చూడకుండా కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. సిబ్బంది సంక్షేమాన్ని విస్మరించే ఎంత పెద్ద సంస్థలపైనైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోం. నాలుగు నెలల క్రితం ఓ స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనం పైనుంచి పడి మృతి చెందాడు. అప్పటి ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందుతుందేమోనని చూశా. కానీ ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు.
ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవత్వంతో వ్యవహరించాలి. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి మృతుని కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజాపాలన గ్రామసభల్లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్‌లకు సీఎం సూచించారు.
డిజిటల్, మాన్యువల్ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, మాధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
ఆటోవాలాలు ఆందోళన పడొద్దు
మంత్రి పొన్నం ప్రభాకర్
ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని ఆటోవాలాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఆటోవాలాలతోనూ త్వరలో చర్చించి వారికి ఇబ్బంది లేని రీతిలో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్యాబ్, ఫుడ్ డెలివరీ బాయ్స్‌తో సమావేశం అనంతరం పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం వల్ల ఆటోవాలాల ఉపాధి పడిపోదని, బస్సులు దిగాక ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రయాణికులు మళ్లీ ఆటోలనే కదా ఆశ్రయించాల్సిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment