సాక్షి, అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రమైక జీవన సౌందర్యం వెల్లివిరుస్తోంది. పనిచేసే వయసుగా భావించే 25 నుంచి 59 ఏళ్లలోపు వారు జనాభాలో 70 శాతానికి పైగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక వృద్ధికి కీలకమైన పనిచేసే మానవ వనరులు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నట్టు తేలింది. జాతీయ సగటుతో పోలిస్తే ఈ రెండు రాష్ట్రాల్లో ఆ వయస్కులు ఎక్కువగా ఉన్నారు. జాతీయ జనాభా గణన ఆధారంగా ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం’ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ‘సెన్సస్ కమిషనర్–రిజిస్ట్రార్ జనరల్’ కార్యాలయం గణాంకాల ఆధారంగా రూపొందించిన ఆ నివేదికలోని ప్రధాన అంశాలివీ..
దేశ సగటు 66 శాతం
► దేశవ్యాప్తంగా శ్రమించే మానవ వనరులు పెరుగుతుండటం శుభసూచకం. 25 నుంచి 59 ఏళ్ల లోపు వారు దేశ జనాభాలో 66 శాతం మంది ఉన్నారు.
► అంటే జనాభాలో మూడింట రెండొంతుల మంది పనిచేసే వయసు వారే కావడం విశేషం.
► దేశంలోని 12 రాష్ట్రాల్లో ఈ వయస్కుల వారు మూడింట రెండొంతుల మంది ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
► 2013లో దేశంలో 4 రాష్ట్రాల్లో మాత్రమే ఈ వయసు వారి జనాభా మూడింట రెండొంతులు ఉండేది. ఇప్పుడు 12 రాష్ట్రాలకు పెరగడం గమనార్హం.
► ఈ పరిణామం ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పనిచేసే వారు ఎక్కువమంది ఉంటే వారిపై ఆధారపడే వారు తక్కువ మంది ఉంటారు.
► ఎక్కువ జనాభా ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములైతే.. కుటుంబాలు అభివృద్ధి చెంది దేశ ప్రగతికి సహకరిస్తుంది.
► మొత్తం దేశ జనాభాలో 25 ఏళ్లలోపు వయసు వారు 25.90 శాతం మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరి శాతం 27.50 కాగా.. పట్టణ ప్రాంతాల్లో 22.60 శాతం. ∙60 ఏళ్లు దాటిన వారు 8.10 శాతం మంది ఉన్నారు.
అగ్రపథంలో తెలుగు రాష్ట్రాలు
► పనిచేసే జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలు దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో ఉండటం విశేషం.
► పనిచేసే వయస్కులు తెలంగాణలో 71.10%, ఆంధ్రప్రదేశ్‌లో 70.90% మంది ఉన్నారు.
► 69.90 శాతంతో మూడో స్థానంలో ఢిల్లీ.. 59.90% మందితో చివరి స్థానంలో బిహార్
Comments
Please login to add a commentAdd a comment