సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉందని బీఆర్‌ఎస్ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం మంచిది కాదని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓయూ ఫేక్ సర్క్యూలర్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిషాంక్ అరెస్ట్‌పై బుధవారం ఆయన స్పందించారు.
అధికారం శాశ్వతం కాదని, తప్పకుండా మేము బదులు చెబుతామన్నారు. వడ్డీతో సహా చెల్లించే సమయం వస్తుందని తెలిపారు. క్రీషాంక్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన సర్క్యులర్ తప్పుడు అయితే తాను చంచల్ గూడా జైలుకు వెళ్ళడానికి సిద్ధమని అన్నారు. ఒకవేళ సర్క్యులర్ నిజమని తాము రుజువు చేపిస్తే సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ శ్రేణులకు కేసులు కొత్తేమి కాదని, దైర్యంగా ఎదుర్కొంటామని, తమది ఉద్యమ పార్టీ అని కేటీఆర్ అన్నారు.
‘‘బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌పై ఒక పనికిమాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుంది. అసలు తప్పు చేసి రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సింది పోయి, బయట తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు పెట్టిన సర్క్యూలర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యూలర్‌ను నిపుణుల ముందు పెడతాం. ఏదీ ఒరిజినల్? ఏదీ డూప్లికేటో తేలుద్దాం. ఆ తర్వాత ఎవరు చంచల్‌గూడలో ఉండాలో తేలిపోతది.
క్రిశాంక్ పోస్ట్ చేసిన సర్క్యూలర్ తప్పా..! చేయని తప్పుకు క్రిశాంక్‌ను జైల్లో వేశారు. క్రిశాంక్‌ను ఉద్దేశ పూర్వకంగానే జైల్లో వేశారు. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకో. సర్కార్ చేసిన వెదవ పనికి వెంటనే క్షమాపణ చెప్పండి. ఏ తప్పు చేయని క్రిశాంక్‌ను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా’’అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఓయూ పేరిట ఫేక్ సర్క్యూలర్‌ను సోషల్ మీడియాలో సర్యూలేట్ చేసిన కేసులో మన్నె క్రిశాంక్‌పై పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. చంచల్ గూడ జైలులో ఉన్నారు.
క్రిషాంక్ బయట పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను చంచల్ గూడ జైలుకు వెళ్ళడానికి సిద్దం.. నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైలుకు వెళ్ళడానికి సిద్ధమా?
- రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. pic.twitter.com/Eq0BjbD3tx— BRS Party (@BRSparty) May 8, 2024
Comments
Please login to add a commentAdd a comment