వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే..: కోహ్లి
కోల్కతా: గత కొంతకాలంగా టీమిండియా నిలకడగా రాణించడానికి ఆటపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడమేనని కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. గత రెండు సంవత్సరాల క్రితం జట్టుకు, ఇప్పటి జట్టును చూస్తే ఆ విషయం అర్దమవుతుందన్నాడు. తాను ఎప్పుడూ ర్యాంకుల గురించి పెద్దగా ఆలోచించనని కోహ్లి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. అసలు ర్యాంకులు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఏమి చేయాలనే విషయం పూర్తిగా మరచిపోతామని కోహ్లి ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
'నేను ర్యాంకులను అస్సలు లెక్కచేయను. దాంతోపాటు రికార్డులను కూడా పెద్దగా పట్టించుకోను. ఒకవేళ ర్యాంకుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మన సహజసిద్ధమైన ఆటను మరచిపోతాం. ఇప్పుడు ఎలా ఆడాం. వచ్చే మ్యాచ్ కు ఎలా ఆడాలి అనే దానిపైనే మా దృష్టి. ర్యాంకింగ్స్ అనేవి తాత్కాలికం. ఒకవేళ ర్యాంక్ పై దృష్టి పెడితే ప్రత్యర్థి జట్లు బలపడటానికి అవకాశం ఇచ్చిన వాళ్లమవుతాం' అని కోహ్లి తెలిపాడు.
న్యూజిలాండ్తో శుక్రవారం నుంచి ఈడెన్ గార్డెన్లో ఆరంభం కానున్న టెస్టు మ్యాచ్లో టీమిండియా గెలిస్తే తిరిగి నంబర్ వన్ ర్యాంకును చేజిక్కించుకుంటుంది. దీనిలో భాగంగా అడిగిన ప్రశ్నకు విరాట్ పై విధంగా స్పందించాడు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం భారత్ నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ర్యాంకును వారం రోజుల వ్యవధిలో కోల్పోయి ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది.