మన ఆట మారలేదు  | India VS New Zealand Second Test Match At Christchurch | Sakshi
Sakshi News home page

మన ఆట మారలేదు 

Published Sun, Mar 1 2020 2:49 AM | Last Updated on Sun, Mar 1 2020 5:18 AM

India VS New Zealand Second Test Match At Christchurch - Sakshi

తొలి టెస్టులో భారత జట్టు కావాల్సినంత దూకుడు కనబర్చలేదని మ్యాచ్‌ తర్వాత కెప్టెన్‌ కోహ్లి వ్యాఖ్యానించాడు. దానిని జట్టు సభ్యులు ఎలా తీసుకున్నారో కానీ... రెండో టెస్టులో వారు టెస్టు క్రికెట్‌కు అవసరమైన దానికంటే ఎక్కువ దూకుడుతో ఆడే ప్రయత్నంలో మళ్లీ దెబ్బ తిన్నారు. ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ అర్ధ సెంచరీలు చేశారు. అందులో ఇద్దరు 78కంటే ఎక్కువ స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించారు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లతో పోలిస్తే తక్కువ ఓవర్లే ఆడినా 3.84 రన్‌రేట్‌తో అమిత వేగంగా రన్స్‌ రాబట్టారు. అయినా సరే శనివారం ఆట ముగిసే సరికి భారత్‌పై న్యూజిలాండ్‌దే పైచేయి అయింది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు సార్లు మెరుగైన స్థితిలో నిలిచి కూడా భారీ స్కోరు సాధించడంలో టీమిండియా విఫలమైంది. ఆ తర్వాత ఒక్క కివీస్‌ వికెట్‌ కూడా తీయలేకపోయింది. తర్వాతి రెండు రోజులు పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ప్రత్యర్థిని మన బౌలర్లు ఎంత వరకు నిలువరించగలరో చూడాలి.

క్రైస్ట్‌చర్చ్‌: బౌన్స్, స్వింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్‌ మళ్లీ భంగపడ్డారు. నలుగురు న్యూజిలాండ్‌ పేసర్లు కూడా చెలరేగడంతో శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌటైంది. హనుమ విహారి (70 బంతుల్లో 55; 10 ఫోర్లు), పృథ్వీ షా (64 బంతుల్లో 54; 8 ఫోర్లు, 1 సిక్స్‌), చతేశ్వర్‌ పుజారా (140 బంతుల్లో 54; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అయితే ఈ ముగ్గురూ చెత్త షాట్లకే వెనుదిరగడం భారత్‌ను దెబ్బ తీసింది. కెరీర్‌లో రెండో టెస్టు ఆడుతున్న కైల్‌ జేమీసన్‌ (5/45) తొలిసారి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సత్తా చాటగా...సౌతీ, బౌల్ట్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్‌ ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లు ఆడి వికెట్‌ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. టామ్‌ బ్లన్‌డెల్‌ (29 బ్యాటింగ్‌), టామ్‌ లాథమ్‌ (27 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరిని భారత బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. న్యూజిలాండ్‌ మరో 179 పరుగులు వెనుకబడి ఉంది.

పృథ్వీ సూపర్‌... 

ఉదయం పడిన చినుకుల కారణంగా ఆట కాస్త ఆలస్యంగా మొదలైంది. పిచ్‌ కూడా పేసర్లకు అనుకూలంగా మారిన స్థితిలో భారత్‌కు మరోసారి ఆశించిన ఆరంభం లభించలేదు. మయాంక్‌ (7)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని బౌల్ట్‌ తొలి వికెట్‌ తీశాడు. మయాంక్‌ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. అయితే గత టెస్టు వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న పృథ్వీ షా ఈసారి మెరుగైన ఫుట్‌వర్క్‌ను ప్రదర్శించాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు దూకుడుగా ఆడిన అతను సౌతీ, బౌల్ట్‌ బౌలింగ్‌లో కొన్ని చూడచక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. వాగ్నర్‌ తొలి ఓవర్లో కొట్టిన సిక్స్‌తో 61 బంతుల్లోనే షా అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే తర్వాతి ఓవర్లో దూరంగా వెళుతున్న బంతిని ఆడే ప్రయత్నంలో అతను వెనుదిరిగాడు. స్లిప్స్‌లో లాథమ్‌ ఒంటి చేత్తో పట్టిన అద్భుత క్యాచ్‌ హైలైట్‌గా నిలిచింది. లంచ్‌ సమయానికి స్కోరు 85/2కు చేరింది.

కోహ్లి మళ్లీ... 

లంచ్‌ తర్వాత రెండో ఓవర్లోనే భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సౌతీ చక్కటి బంతితో కోహ్లి (3)ని ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ చేశాడు. ఒకవైపు గట్టి నమ్మకం లేకపోయినా, అన్యమనస్కంగానే చివరి క్షణంలో కోహ్లి రివ్యూ చేశాడు. అయితే ఫలితం మాత్రం ప్రతికూలంగా రావడంతో కెప్టెన్‌ నిరాశగా వెనుదిరిగాడు. టెస్టుల్లో ఎల్బీడబ్ల్యూగా ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు 13 సార్లు డీఆర్‌ఎస్‌ను ఉపయోగించుకున్న కోహ్లి 2 సార్లు మాత్రం అవుట్‌ కాకుండా ఉండగలిగాడు! మరి కొద్ది సేపటికే కోహ్లిని అనుసరిస్తూ వైస్‌ కెప్టెన్‌ రహానే (7) పెవిలియన్‌ చేరాడు. ఈ వికెట్‌ కూడా సౌతీ ఖాతాలోకే చేరింది.

కీలక భాగస్వామ్యం... 
ఈ దశలో పుజారా, విహారి కలిసి జట్టును ఆదుకున్నారు. సీనియర్‌ సహచరుడు పుజారాతో పోలిస్తే విహారి వేగంగా ఆడాడు. విహారి క్రీజ్‌లోకి అడుగుపెట్టినప్పుడు పుజారా స్కోరు 31 పరుగులు కాగా... చివరకు వచ్చేసరికి ఆంధ్ర బ్యాట్స్‌మన్‌ అతడిని దాటేశాడు. 9 పరుగుల వద్ద విహారిని మొదటి స్లిప్‌లోనే క్యాచ్‌ అవుట్‌ చేసే అవకాశం కివీస్‌కు వచ్చినా... కీపర్‌ వాట్లింగ్‌ అత్యుత్సాహంతో ముందుకు దూకి దానిని నేలపాలు చేశాడు. 117 బంతుల్లో పుజారా అర్ధసెంచరీ పూర్తయింది. కివీస్‌ గడ్డపై అతనికి ఇదే తొలి హాఫ్‌ సెంచరీ. ఆ తర్వాత విహారి జోరు కొనసాగింది. ముఖ్యంగా బౌల్ట్‌ వేసిన ఓవర్లో విహారి మూడు ఫోర్లు కొట్టడం విశేషం.

విహారి నిష్క్రమణతో... 
ఐదో వికెట్‌ భాగస్వామ్యం సెంచరీ దిశగా సాగుతున్న దశలో విహారి చేసిన పొరపాటు జట్టును కష్టాల్లోకి నెట్టింది. టీ విరామానికి ముందు చివరి ఓవర్‌ ఆటను మలుపు తిప్పింది. వాగ్నర్‌ వేసిన ఈ ఓవర్లో విహారి రెండు బౌండరీలు బాదాడు. అయితే నాలుగో బంతి అనూహ్య రీతిలో అతని ఆటను ముగించింది. వాగ్నర్‌ వేసిన బౌన్సర్‌కు బదులిచ్చే క్రమంలో పూర్తిగా ఆఫ్‌ స్టంప్‌ మీదకు జరిగి విహారి పుల్‌ షాట్‌ ఆడబోయాడు. అయితే బంతి అతని బ్యాట్‌ను తాకుతూ వెళ్లి కీపర్‌ చేతుల్లో పడింది. విరామం తర్వాత జేమీసన్‌ వేసిన రెండో ఓవర్లోనే పుజారా కూడా అనవసరపు రీతిలో పుల్‌ షాట్‌కు ప్రయత్నించగా బంతి అక్కడే గాల్లోకి లేచింది. ఐదో వికెట్‌కు 81 పరుగులు జోడించి క్రీజ్‌లో పాతుకుపోయిన విహారి, పుజారా మూడు పరుగుల తేడాతో నిష్క్రమించిన తర్వాత భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎంతో సేపు పట్టలేదు. రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నా... పంత్‌ (12) ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. చెలరేగిపోయిన కివీస్‌ బౌలర్లు చకచకా మిగిలిన వికెట్లను పడగొట్టారు.

స్కోరు వివరాలు  
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) లాథమ్‌ (బి) జేమీసన్‌ 54; మయాంక్‌ అగర్వాల్‌ (ఎల్బీ) (బి) బౌల్ట్‌ 7; చతేశ్వర్‌ పుజారా (సి) వాట్లింగ్‌ (బి) జేమీసన్‌ 54; విరాట్‌ కోహ్లి (ఎల్బీ) (బి) సౌతీ 3; రహానే (సి) టేలర్‌ (బి) సౌతీ 7; హనుమ విహారి (సి) వాట్లింగ్‌ (బి) వాగ్నర్‌ 55; రిషభ్‌ పంత్‌ (బి) జేమీసన్‌ 12; రవీంద్ర జడేజా (సి) బౌల్ట్‌ (బి) జేమీసన్‌ 9; ఉమేశ్‌ యాదవ్‌ (సి) వాట్లింగ్‌ (బి) జేమీసన్‌ 0; షమీ (బి) బౌల్ట్‌ 16; బుమ్రా (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (63 ఓవర్లలో ఆలౌట్‌) 242  
వికెట్ల పతనం: 1–30; 2–80; 3–85; 4–113; 5–194; 6–197; 7–207; 8–207; 9–216; 10–242.
బౌలింగ్‌: టిమ్‌ సౌతీ 13–5–38–2; ట్రెంట్‌ బౌల్ట్‌ 17–2–89–2; కొలిన్‌ గ్రాండ్‌హోమ్‌ 9–2–31–0; కైల్‌ జేమీసన్‌ 14–3–45–5; నీల్‌ వాగ్నర్‌ 10–29–1.

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (బ్యాటింగ్‌) 27; బ్లన్‌డెల్‌ (బ్యాటింగ్‌) 29; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (23 ఓవర్లలో వికెట్‌ నష్ట పోకుండా) 63. బౌలింగ్‌: బుమ్రా 7–1–19–0; ఉమేశ్‌ యాదవ్‌ 8–1–20–0; షమీ 7–1–17–0; రవీంద్ర జడేజా 1–1–0–0.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement