second Test Match
-
ఇంగ్లండ్‌పై కివీస్ చారిత్రక విజయం.. బ్రిటిష్ మీడియా ఆశ్చర్యకర స్పందన
నరాలు తెగే ఉత్కంఠ నడుమ, నాటకీయ పద్ధతిలో చివరి నిమిషం వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన న్యూజిలాండ్-ఇంగ్లండ్ రెండో టెస్ట్ మ్యాచ్‌పై బ్రిటిష్ మీడియా ఆశ్చర్చకర రీతిలో స్పందించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పరుగు తేడాతో సంచలన విజయం సాధించి, అతి తక్కువ మార్జిన్‌తో విజయం సాధించిన రెండో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ మీడియా ఆతిధ్య న్యూజిలాండ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతూనే, బజ్ బాల్ ఫార్ములా అంటూ ఓవరాక్షన్ చేసి ఓటమిని కొని తెచ్చుకున్న ఇంగ్లండ్‌ను వెనకేసుకొచ్చింది. ఛేదనలో ఇంగ్లండ్ కుప్పకూలిన వైనాన్ని పక్కకు పెట్టిన అంగ్రేజ్ మీడియా.. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో భాగమైనందుకు స్టోక్స్ సేనను ప్రశంసించింది. ప్రముఖ బ్రిటిష్ దినపత్రిక టెలిగ్రాఫ్, చరిత్రలో చిరకాలం నిలబడిపోయే ఈ మ్యాచ్‌పై స్పందిస్తూ.. ఇది న్యూజిలాండ్ విజయమో లేక ఇంగ్లండ్ ఓటమో కాదు.. ఈ విజయం మొత్తంగా టెస్ట్ క్రికెట్‌ది అంటూ కివీస్‌కు దక్కాల్సిన క్రెడిట్‌ను దక్కనీయకుండా సైడ్‌లైన్ చేసింది. ఓవరాక్షన్ (తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి) చేసి ఓటమిపాలైనందుకు గాను సొంత జట్టును నిందించాల్సిన మీడియా.. ఏదో సాధించాం అన్నట్లు స్టోక్స్ సేనకు మద్దతుగా నిలవడంపై యావత్ క్రీడా ప్రపంచం అసహనం వ్యక్తం చేస్తుంది. ఇది చాలదన్నట్లు తమ జట్టే టెస్ట్ క్రికెట్‌ను కాపాడుతుందని ఇంగ్లిష్ మీడియా బిల్డప్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెస్ట్ క్రికెట్‌ను వినోదాత్మకంగా మార్చడమే లక్ష్యంగా ఇంగ్లండ్ జట్టు శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే ఈ మ్యాచ్ జరిగిందని అక్కడి మీడియా డప్పు కొట్టుకోవడం హ్యాస్యాస్పదంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూకే మీడియా నుంచి వచ్చిన ఈ అనూహ్య స్పందన చూసి నివ్వెరపోవడం క్రికెట్ అభిమానుల వంతైంది. కాగా, బజ్ బాల్ ఫార్ములా అంటూ విజయవంతంగా సాగుతున్న ఇంగ్లండ్ జైత్రయాత్రకు వెల్లింగ్టన్ టెస్ట్‌తో బ్రేకులు పడ్డాయి. టెస్ట్ క్రికెట్లో వేగం పెంచి మంచి ఫలితాలు రాబట్టిన ఇంగ్లీష్ జట్టుకు తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఇంగ్లండ్-న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లో అంతిమంగా న్యూజిలాండ్ విజయం సాధించింది. ఫలితంగా 2 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. -
భయపెట్టిన బంగ్లా బౌలర్‌ని ఉతికారేసిన అశ్విన్
-
Mohammad Rizwan: నువ్వు చెప్పు బ్రో.. డీఆర్ఎస్ తీసుకోమంటావా..? వద్దా..?
AUS Vs PAK 2nd Test: డీఆర్ఎస్ విషయంలో ప్రత్యర్ధి బ్యాటర్ అభిప్రాయాన్ని కోరిన విచిత్ర ఘటన పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య కరాచీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఆటలో భాగంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సాగుతుండగా (ఇన్నింగ్స్ 70.3వ ఓవర్) స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ వేసిన బంతి స్టీవ్ స్మిత్ ప్యాడ్‌కు తాకడంతో పాక్ ఆటగాళ్లంతా ఎల్బీ కోసం అప్పీల్ చేశారు. అయితే అంపైర్ ఆ అప్పీల్‌ను తిరస్కరించి నాటౌట్ అని తల ఊపాడు. To DRS or not to DRS 🤔 #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/X3b9mp8uaF — Pakistan Cricket (@TheRealPCB) March 12, 2022 దీంతో నౌమన్ అలీ అక్కడే స్లిప్‌లో ఉన్న సారథి బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌ల వైపు చూస్తూ డీఆర్ఎస్ విషయంలో వారి అభిప్రాయాన్ని కోరాడు. ఈ క్రమంలో రిజ్వాన్.. క్రీజ్‌లో ఉన్న స్మిత్ వద్దకు వెళ్లి, అతడి భుజంపై చేయి వేసి.. ‘నువ్వే చెప్పు బ్రో.. డీఆర్ఎస్కు వెళ్లమంటావా..? వద్దా..? అని ఫన్నీగా అడిగాడు. ఎవరి ఔట్ కోసం అప్పీల్ చేశారో ఆ ఆటగాడి అభిప్రాయాన్నే రిజ్వాన్ కోరడంతో పాక్ ఆటగాళ్లంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుకున్నారు. ఆఖరికి స్మిత్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఫైనల్‌గా స్మిత్ తో చర్చించాక రిజ్వాన్ డీఆర్ఎస్ వద్దని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (127; 13 ఫోర్లు, సిక్స్) అజేయ శతకంతో చెలరేగగా, స్టీవ్ స్మిత్ (72) అర్ధ సెంచరీతో రాణించాడు. మిగిలిన బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (48 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా, లబూషేన్ డకౌటయ్యాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్ తలో వికెట్ దక్కించుకోగా, లబుషేన్ రనౌటయ్యాడు. తొలి టెస్ట్‌లో 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న ఖ్వాజా, ఈ మ్యాచ్‌లో పట్టుదలగా ఆడి కెరీర్లో పదో శతకాన్ని నమోదు చేశాడు. చదవండి: మాతృదేశంపై సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ అరుదైన ఘనత -
కోహ్లి 100వ టెస్ట్ ప్రేక్షకులు లేకుండానే, ఆ మరుసటి మ్యాచ్‌కు మాత్రం..!
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ (మార్చి 4 నుంచి 8 వరకు) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ అన్న విషయం తెలిసిందే. కోహ్లి కెరీర్లో మైలురాయిగా నిలిచే ఈ మ్యాచ్‌ను స్టేడియంలో వీక్షించేందుకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అనుమతించలేదు. కెప్టెన్సీ విషయంలో కోహ్లితో నెలకొన్న వివాదాల కారణంగా బీసీసీఐ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని కోహ్లి అభిమానులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెలువడిన ఓ వార్త కోహ్లి అభిమానులకు పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించేందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అంగీకరించింది. ఈ విషయాన్ని కేసీఏ కార్యదర్శి సంతోష్ మీనన్ ధృవీకరించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకులను అనుమతిస్తామని ఆయన ప్రకటించారు. మార్చి 12 నుంచి 16 వరకు జరగనున్న బెంగళూరు టెస్టు.. డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరగనున్న విషయం తెలిసిందే. చదవండి: విరాట్ కోహ్లి 100వ టెస్ట్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్! -
శార్ధూల్ ఠాకూర్ పేరు ముందు "ఆ ట్యాగ్" వెనుక రహస్యమిదే..!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో చెలరేగిన టీమిండియా పేసర్ శార్ధూల్ ఠాకూర్‌కు సంబంధించిన విషయం ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. శార్ధూల్ పేరుకు ముందు "లార్డ్" అనే ట్యాగ్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందని అభిమానులు ఆరా తీస్తుండగా.. శార్దూలే స్వయంగా "లార్డ్ ట్యాగ్" వెనుక ఉన్న రహస్యాన్ని బహిర్గతం చేశాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ అనంతరం టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో మాట్లాడుతూ.. సదరు విషయంపై వివరణ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. Man of the moment @imShard reacts to the social media frenzy post his 7⃣-wicket haul at The Wanderers. 👏 👍 P.S. How did he get the title of 'Lord'? 🤔 #TeamIndia #SAvIND To find out, watch the full interview by @28anand 🎥 🔽 https://t.co/dkWcqAL3z5 pic.twitter.com/vSIjk2hvyR — BCCI (@BCCI) January 5, 2022 అసలు విషయం ఏంటంటే(శార్ధూల్ మాటల్లో).. నా పేరుకు ముందు లార్డ్ అనే ట్యాగ్ ఎవరు పెట్టారో నాకే తెలీదు. గతేడాది(2021) ఆస్ట్రేలియా పర్యటన అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ సందర్భంగా నా పేరు బాగా పాపులర్ అయ్యింది. ఆ సిరీస్‌లో నేను ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాను. అప్పటి నుంచే నా పేరు లార్డ్ శార్ధూల్ ఠాకూర్‌గా మారిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌లో టీమిండియా.. దక్షిణాఫ్రికాకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. శార్ధూల్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. 24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ సాయంతో 28 పరుగులు చేశాడు. చదవండి: లంక జట్టుకు ఊహించని షాక్.. యువ క్రికెటర్ సంచలన నిర్ణయం -
లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం
లార్డ్స్‌లో మూడో విజయం టీమిండియా చరిత్రాత్మక విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 151 పరుగుల తేడాతో విజయం సాధించి లార్డ్స్ మైదానంలో మూడో విజయాన్ని నమోదు చేసింది. 1986, 2014 తర్వాత లార్డ్స్ మైదానంలో భారత్ మూడో విజయం సాధించింది. దీంతో 5 టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో సిరాజ్ 4, ఇషాంత్ 3, షమీకి 2 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు. స్కోర్ల వివరాలు: భారత్: 364 & 298/8 డిక్లెర్డ్, ఇంగ్లండ్: 391& 120. సిరాజ్ ఆన్ ఫైర్.. వరుస బంతుల్లో వికెట్లు తీసిన హైదరాబాదీ బౌలర్ టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. వరుస బంతుల్లో ప్రమాదకరమైన మొయిన్ అలీ, సామ్ కర్రన్ల వికెట్లు తీసి ఇంగ్లండ్ ఓటమిని దాదాపు ఖరారు చేశాడు. కర్రన్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిరాజ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ గెలవాలంటే 21.4 ఓవర్లలో 182 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. క్రీజ్‌లో బట్లర్(8), రాబిన్సన్(0) ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. మొయిన్ అలీ(13) ఔట్ జడేజా వేసిన అంతకుముందు ఓవర్లో నాలుగు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మొయిన్ అలీ(13) ఎట్టకేలకు సిరాజ్ బౌలింగ్‌లో కోహ్లి చేతికి చిక్కాడు. దీంతో 90 పరుగుల వద్ద ఇంగ్లండ్ జట్టు ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఇంగ్లండ్ గెలవాలంటే 21.5 ఓవర్లలో 182 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. క్రీజ్‌లో బట్లర్(8), సామ్ కర్రన్(0) ఉన్నారు. ఇంగ్లండ్ ఓటమి లాంచనమే.. డేంజరస్ బ్యాట్స్‌మెన్ రూట్(33) ఔట్ క్రీజ్‌లో పాతుకుపోయి ప్రమాదకారిగా మారిన ఇంగ్లండ్ కెప్టెన్ రూట్(33; 5 ఫోర్లు)ను.. బుమ్రా బోల్తా కొట్టించాడు. ఫస్ట్ స్లిప్‌లో కోహ్లి అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో రూట్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 67 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిని దాదాపుగా ఖారారు చేసుకుంది. క్రీజ్‌లో మొయిన్ అలీ, జోస్ బట్లర్ ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 205 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. చెలరేగుతున్న ఇషాంత్.. ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్ టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ చెలరేగి బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇదివరకే హసీబ్ హమీద్‌ను పెవిలియన్‌కు పంపిన లంబూ.. డేంజర్ బ్యాట్స్‌మెన్ బెయిర్‌స్టోను(2)కూడా ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. మరోవైపు కెప్టెన్ జో రూట్(33) క్రీజ్‌లో పాతుకుపోయాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 205 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇరు జట్టు టీ బ్రేక్ తీసుకున్నాయి. మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. హమీద్(9) ఔట్ ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోన్న ఇంగ్లండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ హసీబ్ హమీద్(9)ను ఇషాంత్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 44 పరుగులకే ఇంగ్లండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి డిఫెన్స్‌లో పడింది. క్రీజ్‌లో రూట్(21), బెయిర్‌స్టో(0) ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 228 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. టీమిండియా పేసర్ల విశ్వరూపం.. ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ టీమిండియా నిర్దేశించిన 272 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు కేవలం ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. టీమిండియా పేసర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. తొలి ఓవర్లోనే బుమ్రా ఓపెనర్ రోరి బర్న్స్ ను డకౌట్ చేయగా, రెండో ఓవర్లో షమీ మరో ఓపెనర్ సిబ్లీని డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు ఒక్క పరుగుకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. క్రీజ్‌లో కెప్టెన్ జో రూట్, హసీబ్ హమీద్ ఉన్నారు. టీమిండియా 298/8 డిక్లేర్.. ఇంగ్లండ్ విజయలక్ష్యం 272 లంచ్ విరామం తర్వాత బరిలోకి దిగిన టీమిండియా.. మరో 12 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మహ్మద్ షమీ(70 బంతుల్లో 56; 5 ఫోర్లు, సిక్స్), బుమ్రా(64 బంతుల్లో 34; 3 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచారు. మొత్తం 109.3 ఓవర్లు ఆడిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, ప్రత్యర్ధికి 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అర్ధ సెంచరీతో అదరగొట్టిన షమీ.. 259 పరుగుల ఆధిక్యంలో టీమిండియా టీమిండియా బౌలర్లు మహ్మద్ షమీ(67 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), బుమ్రా(58 బంతుల్లో 30; 2 ఫోర్లు) ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. 209 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్(ఇషాంత్ (16)) కోల్పోయాక వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ.. తొమ్మిదో వికెట్‌కు అజేయమైన 77 పరుగులు జోడించారు. ముఖ్యంగా షమీ ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి కెరీర్లో రెండో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. లంచ్ విరామం సమయానికి టీమిండియా స్కోర్ 286/8. ప్రస్తుతం భారత్ 259 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా.. ఇషాంత్(12) ఔట్ ఇంగ్లండ్ పేసర్ రాబిన్సన్.. ఆఖరి రోజు ఆటలో టీమిండియాను మరో దెబ్బకొట్టాడు. తొలుత కీలకమైన పంత్ వికెట్ పడగొట్టిన రాబిన్సన్.. క్రీజ్‌లో నిలదొక్కుకున్న ఇషాంత్(16; 2 ఫోర్లు)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. 90 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 211/8. ప్రస్తుతం టీమిండియా 184 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో షమీ(7), బుమ్రా(0) ఉన్నారు. లండన్: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసిన భారత్.. ఆఖరి రోజు ఆట ఆరంభం కాగానే కీలకమైన రిషభ్ పంత్ (46 బంతుల్లో 22; ఫోర్) వికెట్‌ను కోల్పోయింది. పంత్ తన ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో ఎనిమిది పరుగులు మాత్రమే జోడించి రాబిన్సన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 86 ఓవర్ల తర్వాత టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 167 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో ఇషాంత్ శర్మ (8), షమీ(0) ఉన్నారు. -
పరిస్థితులతో సంబంధం లేదు.. రెండో టెస్ట్‌కు అతన్ని తీసుకోవాల్సిందే..!
లండన్: ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్ట్‌కు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి కచ్చితంగా తీసుకోవాలని దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రతిపాదించాడు. పరిస్థితులను పట్టించుకోకుండా అతనికి అవకాశమివ్వాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్ అద్భుత ప్రదర్శన చేసినా.. కౌంటీ క్రికెట్లో రాణించినా.. ఇంగ్లండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో అతనికి తుది జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ పై విధంగా స్పందించాడు. ఇదిలా ఉంటే, పిచ్ పేసర్లకు సహకరిస్తుందని తొలి టెస్ట్‌లో కోహ్లీ సేన నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్ ఫార్ములాతో బరిలోకి దిగింది. దాంతో అశ్విన్ స్థానంలో నాలుగో పేసర్ కోటాలో శార్దూల్ ఠాకూర్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ ఫార్ములా సెక్సెస్ కావడంతో సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఇదే ఫార్ములాను కొనసాగిస్తామని మ్యాచ్ అనంతరం కోహ్లీ చెప్పడంతో లక్ష్మణ్ స్పందించాడు. అశ్విన్ జట్టులోకి వస్తే బౌలింగ్ డెప్త్ పెరుగుతుందని, తానైతే పరిస్థితులతో సంబంధం లేకుండా అశ్విన్‌ను జట్టులోకి తీసుకునేవాడినని క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. పరిస్థితులు, వాతావరణం ఎలా ఉన్నా అశ్విన్ మేటి బౌలర్ అని, అద్భుతమైన ప్రదర్శనతో మ్యాచ్ విన్నర్‌గా నిలిచి ఇంగ్లండ్‌పై ఒత్తిడి తీసుకురాగల సమర్థుడని కొనియాడాడు. ఇక తొలి టెస్టులో బౌలింగ్‌లో రాణించిన శార్ధూల్‌పై కూడా లక్ష్మణ్ స్పందించాడు. శార్ధూల్ బ్యాట్‌తో రాణించకపోయినా బంతితో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని కితాబునిచ్చాడు. అశ్విన్, శార్దూల్ ఇద్దరూ సమర్థవంతులే అయినప్పటికీ.. తన ఓటు మాత్రం అశ్విన్‌కే ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా గెలుపుకు వరుణుడు ఆటంకంగా నిలిచిన సంగతి తెలిసిందే. చివరి రోజు తొమ్మిది వికెట్లు చేతిలో ఉండి, కేవలం 157 పరుగులు చేయాల్సిన సందర్భంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. -
ఇంగ్లండ్‌కు షాకిచ్చిన కివీస్.. 21 ఏళ్ల తర్వాత సిరీస్ కైవసం
బర్మింగ్‌హామ్: ఆతిధ్య ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ను అతికష్టం మీద డ్రా చేసుకోగలిగిన ఇంగ్లండ్.. రెండో టెస్ట్‌లో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తేడాతో కైవసం చేసుకున్న పర్యాటక జట్టు.. 21 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో రోరీ బర్న్స్(81), లారెన్స్(81 నాటౌట్) రాణించడంతో 303 పరగులు స్కోర్ చేసింది. బౌల్ట్‌కు 4, హెన్రీ 3, అజాజ్ పటేల్ 2, వాగ్నర్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం కాన్వే(80), యంగ్(82), రాస్ టేలర్(80) అర్ధసెంచరీలతో రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 388 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు 4 వికెట్లు దక్కాయి. అయితే ఆతర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మ్యాట్ హెన్రీ(3/36), వాగ్నర్ (3/18), బౌల్ట్ (2/34) ధాటికి ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 122కే ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మార్క్ వుడ్(29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో న్యూజిలాండ్ గెలుపుకు .. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 85 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి 38 పరగులు అవసరమైంది. ఈ లక్ష్యాన్ని కివీస్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఇంగ్లండ బౌలర్లు బ్రాడ్, స్టోన్‌కు తలో వికెట్ దక్కగా, ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు మ్యాట్ హెన్రీకి, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు డెవాన్ కాన్వే, ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్‌కు సంయుక్తంగా దక్కింది. చదవండి: శతక్కొట్టిన పంత్.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్ -
లెక్క సరిచేశారు..
చెన్నైలో లాంఛనం ముగిసింది... ఎలాంటి ప్రతిఘటన, పోటీ లేకుండా ఇంగ్లండ్ తలవంచడంతో టెస్టు సిరీస్ 1–1తో సమమైంది. అనూహ్య ఓటమి అనంతరం సరిగ్గా వారం రోజులకు టీమిండియా విజేత స్థానంలో నిలవగా, ఈ సారి ఓటమి పర్యాటక జట్టు పక్షాన చేరింది. మిగిలిన ఏడు ఇంగ్లండ్ వికెట్లను పడగొట్టేందుకు భారత్‌కు 35.2 ఓవర్లే సరిపోగా... లంచ్ తర్వాత అర గంట లోపే ఆట ముగిసిపోయింది. తొలి టెస్టు ఆడిన అక్షర్ ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. చాలా కాలం తర్వాత సొంత ప్రేక్షకుల మధ్య సంబరాలు చేసుకున్న కోహ్లి సేన, అహ్మదాబాద్‌లో జరిగే ‘పింక్ టెస్టు’ సవాల్‌కు మరింత ఉత్సాహంతో సిద్ధమైంది. చెన్నై: ఊహించినట్లుగానే ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు భారత్ వశమైంది. నాలుగో రోజే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ 317 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 53/3తో మంగళవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌటైంది. మొయిన్ అలీ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, జో రూట్ (33) కొద్దిగా పోరాడాడు. అక్షర్ పటేల్ 60 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా...అశ్విన్ 3, కుల్దీప్ 2 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో పాటు మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. టపటపా... ఇంగ్లండ్ పతనం మరోసారి అశ్విన్ మాయతోనే మొదలైంది. నాలుగో రోజు ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య బౌలింగ్‌కు దిగిన అశ్విన్ తన తొలి బంతికే లారెన్స్ (26)ను అవుట్ చేశాడు. పంత్ అద్భుత స్టంపింగ్ ఈ వికెట్ దక్కేందుకు ఉపకరించింది. ఆ తర్వాత వచ్చిన స్టోక్స్ (8) కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అశ్విన్ బౌలింగ్‌లో 38 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్ ఒకే ఒక సింగిల్ తీసి చివరకు అశ్విన్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. పోప్ (12)ను అక్షర్ అవుట్ చేయగా, ఒకే స్కోరు వద్ద ఫోక్స్ (2), రూట్ వెనుదిరగడంతో ఇంగ్లండ్ ఆశలు కోల్పోయింది. అయితే చివర్లో అలీ కొన్ని మెరుపులు చూపించాడు. కుల్దీప్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన అతను అక్షర్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌లోనూ అతను వరుస బంతుల్లో 4, 6 కొట్టాడు. చివరకు కుల్దీప్ బౌలింగ్‌లో ముందుకొచ్చి మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన అలీని పంత్ స్టంపౌంట్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. అయితే అలీ మిగిలిన రెండు టెస్టులకు దూరమవుతున్నాడు. కుటుంబంతో గడిపేందుకు అతను స్వదేశానికి తిరిగి వెళుతున్నాడు. శ్రీలంకలో కరోనా బారిన పడిన అలీ, ఐపీఎల్ వేలంలో ఎంపికైతే వరుసగా దాదాపు ఐదు నెలలు ఇంటికి దూరంగా ఉన్నట్లవుతుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 329, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 134, భారత్ రెండో ఇన్నింగ్స్ 286, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 25, సిబ్లీ (ఎల్బీ) (బి) అక్షర్ 3, లారెన్స్ (స్టంప్డ్) పంత్ (బి) అశ్విన్ 26, లీచ్ (సి) రోహిత్ (బి) అక్షర్ 0, రూట్ (సి) రహానే (బి) అక్షర్ 33, స్టోక్స్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 8, పోప్ (సి) ఇషాంత్ (బి) అక్షర్ 12, ఫోక్స్ (సి) అక్షర్ (బి) కుల్దీప్ 2, అలీ (స్టంప్డ్) పంత్ (బి) కుల్దీప్ 43, స్టోన్ (ఎల్బీ) (బి) అక్షర్ 0, బ్రాడ్ (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం (54.2 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–17, 2–49, 3–50, 4–66, 5–90, 6–110, 7–116, 8–116, 9–126, 10–164. బౌలింగ్: ఇషాంత్ 6–3–13–0, అక్షర్ 21–5–60–5, అశ్విన్ 18–5–53–3, సిరాజ్ 3–1–6–0, కుల్దీప్ 6.2–1–25–2. ►పరుగులపరంగా ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. 1986లో భారత్ 279 పరుగులతో గెలిచింది. ఇవి కాక మరో 6 సార్లు భారత్ ఇన్నింగ్స్ విజయాలు సాధించింది. ►తొలి టెస్టులోనే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన తొమ్మిదో భారత బౌలర్‌గా అక్షర్ నిలిచాడు. గతంలో హిర్వాణీ, అశ్విన్, ఆబిద్ అలీ, దిలీప్ దోషి, షమీ, అమిత్ మిశ్రా, నిస్సార్, వామన్ కుమార్ ఈ ఘనత సాధించారు. ►భారత గడ్డపై కెప్టెన్‌గా కోహ్లి సాధించిన టెస్టు విజయాల సంఖ్య. ధోని (21) రికార్డును అతను సమం చేశాడు. ►‘మా నాన్నతో పాటు వచ్చి ఇక్కడి స్టాండ్స్‌లో ఎన్నో మ్యాచ్‌లు చూశాను. ఇక్కడ ఆడిన నాలుగు టెస్టుల్లో ఇదే అన్నింటికంటే ప్రత్యేకం. నేను బ్యాటింగ్‌కు వచ్చినా, బౌలింగ్‌కు దిగినా ప్రేక్షకులంతా నాపై ఎంతో అభిమానం ప్రదర్శించారు. ఏం చెప్పాలో నాకు మాటలు రావడం లేదు. నేనో హీరోననే భావం కలుగుతోంది. ఈ విజయం మా చెన్నై ప్రేక్షకులకు అంకితం’ – అశ్విన్ ►సోమవారం ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శుబ్‌మన్ గిల్‌ను ముందు జాగ్రత్తగా స్కానింగ్‌కు పంపినట్లు బీసీసీఐ వెల్లడించింది. సోమవారం అశ్విన్ బౌలింగ్‌లో లారెన్స్ కొట్టిన షాట్ ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఉన్న గిల్ ఎడమ మోచేతికి బలంగా తాకింది. మంగళవారం అతను ఫీల్డింగ్ చేయలేదు. ‘ఒక జట్టుగా మేం చూపించిన పట్టుదలకు ఈ టెస్టు నిదర్శనం. పరిస్థితులు ఇరు జట్లకూ ఒకేలా ఉన్నాయి. కానీ మేం వాటిని సమర్థంగా ఉపయోగించుకున్నాం. ఈ పిచ్‌పై టాస్ ప్రభావం చూపించదని నా అభిప్రాయం. రెండో ఇన్నింగ్స్‌లోనూ మేం దాదాపు 300 పరుగులు చేశాం. నా బ్యాటింగ్‌లో కూడా ఏమైనా తప్పులుంటే వెంటనే సరి చేసుకుంటున్నాను. పింక్ టెస్టులో ఇంగ్లండ్‌నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని భావిస్తున్నా’ - విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
రెండో టెస్టు ‘డ్రా’
సౌతాంప్టన్: ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ నిస్సారమైన ‘డ్రా’గా ముగిసింది. వర్షం కారణంగా చాలా భాగం తుడిచిపెట్టుకుపోవడంతో రెండు ఇన్నింగ్స్‌లు కూడా పూర్తి కాలేదు. ఓవర్‌నైట్ స్కోరు 7/1తో చివరి రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 110 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. క్రాలీ (53) అర్ధ సెంచరీ చేశాడు. ఆ వెంటనే మ్యాచ్‌ను ముగించేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. చివరి టెస్టు శుక్రవారంనుంచి జరుగుతుంది. -
ఇంగ్లండ్, పాక్ టెస్టుకు వర్షం దెబ్బ
సౌతాంప్టన్: మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు ‘డ్రా’గా ముగియడం ఖాయమైంది. నాలుగో రోజు కేవలం 10.2 ఓవర్ల ఆట సాధ్యమైంది. ఓవర్‌నైట్ స్కోరు 223/9తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ 236 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ రిజ్వాన్ (72; 7 ఫోర్లు) బ్రాడ్ బౌలింగ్‌లో క్రాలీకి క్యాచ్ ఇచ్చి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ (4/56), అండర్సన్ (3/60) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. సోమవారం మ్యాచ్‌కు చివరి రోజు. -
పాకిస్తాన్ 223/9
సౌతాంప్టన్: ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట కూడా వానబారిన పడింది. శుక్రవారం 40.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌ను నిలిపివేసే సమయానికి పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (116 బంతుల్లో 60 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, బాబర్ ఆజమ్ (47) ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, బ్రాడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. మైదానం చిత్తడిగా ఉండటంతో ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి సెషన్లో 29 పరుగులు చేసిన పాక్ వికెట్ మాత్రం కోల్పోలేదు. అయితే లంచ్ తర్వాత తక్కువ వ్యవధిలో యాసిర్ షా (5), షాహిన్ అఫ్రిది (0), అబ్బాస్ (2) వెనుదిరిగారు. ఈ దశలో మరో ఎండ్‌లో ఉన్న రిజ్వాన్ దూకుడు ప్రదర్శించాడు. చకచకా పరుగులు సాధించిన రిజ్వాన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. -
11 ఏళ్లకు వచ్చి ‘సున్నా’చుట్టి
సౌతాంప్టన్: పాకిస్తాన్ జట్టు పేలవ బ్యాటింగ్ ప్రదర్శన రెండో టెస్టులోనూ కొనసాగింది. ఫలితంగా మ్యాచ్ తొలి రోజే ఆ జట్టు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి తమ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆబిద్ అలీ (111 బంతుల్లో 60; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం బాబర్ ఆజమ్ (25 బ్యాటింగ్), రిజ్వాన్ (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అండర్సన్‌కు 2 వికెట్లు దక్కాయి. వర్షం పదే పదే అంతరాయం కలిగించడంతో మొదటి రోజు 45.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. కెప్టెన్ మళ్లీ విఫలం... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. తన రెండో ఓవర్లోనే అండర్సన్... గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన షాన్ మసూద్ (1)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ దశలో ఆబిద్ అలీ, కెప్టెన్ అజహర్ అలీ (20) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆబిద్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను ఇంగ్లండ్ ఫీల్డర్లు స్లిప్‌లో వదిలేశారు. వీరిద్దరు కుదురుకుంటున్న దశలో వర్షం రాగా... అంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు. టపటపా... విరామం తర్వాత ఒక్కసారిగా పాక్ బ్యాటింగ్ తడబడింది. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగిపోవడంతో తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ముందుగా అజహర్‌ను అవుట్ చేసి అండర్సన్ ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టాడు.వర్షం కారణంగా మరోసారి సుదీర్ఘ సమయం పాటు ఆగినా, అది పాక్‌కు మేలు చేయలేకపోయింది. 99 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకొన్న కొద్ది సేపటికే ఆబిద్‌ను కరన్ పెవిలియన్ పంపించగా... అసద్ షఫీక్ (5) వికెట్ బ్రాడ్ ఖాతాలో చేరింది. సుమారు 11 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఆలమ్ (0) ఆ వెంటనే వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూలో ఇంగ్లండ్‌కు అనుకూల ఫలితం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ వర్షం కురవడంతో తొలి రోజు ఆటను రద్దు చేయక తప్పలేదు. 11 ఏళ్లకు వచ్చి ‘సున్నా’చుట్టి 10 సంవత్సరాల 259 రోజులు... సరిగ్గా చెప్పాలంటే 3911 రోజులు... పాకిస్తాన్ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ ఫవాద్ ఆలమ్ తన చివరి టెస్టు మ్యాచ్ తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడటానికి మధ్య ఉన్న వ్యవధి ఇది. గురువారం సౌతాంప్టన్‌లో ప్రారంభమైన రెండో టెస్టులో బరిలోకి దిగిన ఫవాద్, దీనికి ముందు తన ఆఖరి టెస్టును 28 నవంబర్, 2009న ఆడాడు. ఈ మధ్య కాలంలో పాక్ ఆడిన 88 టెస్టుల్లో అతనికి అవకాశం దక్కలేదు. తన తొలి 3 టెస్టుల్లో 1 సెంచరీ సహా 41.66 సగటుతో 250 పరుగులు చేసినా... దురదృష్టవశాత్తూ అతనికి వేర్వేరు కారణాలతో మళ్లీ టెస్టు ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత పాక్ దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించి పలు రికార్డులు నెలకొల్పిన తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు మళ్లీ దేశం తరఫున టెస్టు ఆడాడు. కానీ తొలి ఇన్నింగ్స్‌లో ‘డకౌట్’గా వెనుదిరిగాడు. రివ్యూ తర్వాత అం పైర్ అవుట్‌గా ప్రకటించిన సమయంలో అతని మొహంలో కనిపించిన విషాద భావాన్ని మాటల్లో వర్ణించలేం. -
ఇంగ్లండ్ సాధించింది
మాంచెస్టర్: వెస్టిండీస్‌తో రెండో టెస్టును ఎలాగైనా నెగ్గి సిరీస్ సమం చేయాలనుకున్న ఇంగ్లండ్ దానిని చేసి చూపించింది. మ్యాచ్ చివరి రోజు సోమవారం దూకుడైన బ్యాటింగ్‌తో 11 ఓవర్లకే డిక్లేర్ చేసి ప్రత్యర్థికి 85 ఓవర్లు ఆడే అవకాశం ఇచ్చి ఇంగ్లండ్ సవాల్ విసరగా... 312 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అటు ధాటిగా ఆడలేక, ఇటు ‘డ్రా’ కోసం పూర్తి ఓవర్లు ఎదుర్కోలేక ఒత్తిడిలో విండీస్ తలవంచింది. చివరకు 113 పరుగులతో గెలిచిన రూట్ సేన సిరీస్‌ను 1–1తో సజీవంగా ఉంచింది. ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 19 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 70.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. చివరిదైన మూడో టెస్టు ఇదే మైదానంలో శుక్రవారం నుంచి జరుగుతుంది. 11 ఓవర్లలో 92 పరుగులు... వెస్టిండీస్‌కు ఊరించే లక్ష్యం విధించి ఒత్తిడిలోకి నెట్టాలని భావించిన ఇంగ్లండ్ అందుకు తగినట్లుగానే చివరి రోజు బ్యాటింగ్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 37/2తో ఆట కొనసాగగా, స్టోక్స్ దూకుడైన షాట్లతో చెలరేగడంతో వేగంగా పరుగులు వచ్చాయి. ఏకంగా ఓవర్‌కు 8.36 రన్‌రేట్‌తో ఇంగ్లండ్ ఆడటం విశేషం. ఈ క్రమంలో స్టోక్స్‌కు రూట్ (22), పోప్ (12 నాటౌట్) సహకరించారు. కేవలం 11 ఓవర్లు సాగిన ఆటలో స్టోక్స్ జోరు ప్రదర్శించాడు. రోచ్ వేసిన తొలి ఓవర్లోనే వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన అతను గాబ్రియెల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత హోల్డర్ బౌలింగ్‌లోనూ స్టోక్స్ వరుసగా సిక్స్, ఫోర్ బాదడంతో ఆధిక్యం 300 పరుగులు దాటింది. అనంతరం కొద్దిసేపటికే రూట్ జట్టు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. బ్రాడ్ జోరు... స్టువర్ట్ బ్రాడ్ (3/42) అద్భుత బౌలింగ్‌తో ఆరంభంలోనే వెస్టిండీస్‌ను దెబ్బ తీశాడు. అతని ధాటికి విండీస్ 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే బ్రూక్స్ (136 బంతుల్లో 62; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్లాక్‌వుడ్ (88 బంతుల్లో 55; 7 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించారు. ఈ దశలో విండీస్ మ్యాచ్‌ను కాపాడుకొని ‘డ్రా’గా ముగించగలదని అనిపించింది. అయితే బ్లాక్‌వుడ్‌ను స్టోక్స్ అవుట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత టపటపా వికెట్లు చేజార్చుకున్న విండీస్ ఓటమిని ఆహ్వనించింది. కెప్టెన్ హోల్డర్ (35) కొద్దిగా పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. -
‘డ్రా’నా... డ్రామానా!
మాంచెస్టర్: తొలి టెస్టులో ఓడిపోయిన ఇంగ్లండ్ రెండో టెస్టులో ఫలితాన్ని శాసించే స్థితిలో నిలిచింది. మ్యాచ్ చివరిరోజు సోమవారం నింపాదిగా ఆడి ‘డ్రా’తో సరిపెట్టుకోవాలా... లేదంటే ఊరించే లక్ష్యాన్ని నిర్దేశించి వెస్టిండీస్‌పై ఒత్తిడి తెచ్చి అనుకూల ఫలితం పొందాలా అనేది ఇంగ్లండ్ జట్టు చేతిలోనే ఉంది. నాలుగోరోజు ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 32/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ జట్టు 99 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు బ్రాడ్ (3/66), వోక్స్ (3/42), స్యామ్ కరన్ (2/70) రాణించారు. విండీస్ జట్టులో బ్రాత్‌వైట్ (75; 8 ఫోర్లు), బ్రూక్స్ (68; 11 ఫోర్లు), చేజ్ (51; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. 182 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 37 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 219 పరుగుల ఆధిక్యంలో ఉంది. నేడు చివరిరోజు ఇంగ్లండ్ ధాటిగా ఆడి మరో 75 పరుగులు జోడించి విండీస్ ముందు ఊరించే లక్ష్యం పెడుతుందో లేదో చూడాలి. -
‘బుడగ’ దాటి బయటకొచ్చాడు...
మాంచెస్టర్: కరోనా నేపథ్యంలో పలు కట్టుబాట్లతో, ‘బయో సెక్యూరిటీ’ మధ్య కట్టుదిట్టంగా సాగుతున్న ఇంగ్లండ్, వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో అనూహ్య ఘటన! ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ జట్టు నిబంధనలు ఉల్లంఘించాడు. అనుమతించిన చోటుకు కాకుండా ‘బయో సెక్యూర్ బబుల్’ను దాటి బయటకు వెళ్లాడు. దాంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గురువారం తక్షణ క్రమశిక్షణ చర్యగా రెండో టెస్టు ఆరంభానికి ముందు అతడిపై వేటు వేసింది. బుధవారం రాత్రి ప్రకటించిన 13 మంది సభ్యుల జట్టులో ఉన్న ఆర్చర్‌ను తప్పించి అతని స్థానంలో స్యామ్ కరన్‌ను ఎంపిక చేసింది. నిబంధనల ప్రకారం ఆర్చర్ ఇప్పుడు ఐదు రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ సమయంలో అతనికి రెండు సార్లు కోవిడ్–19 పరీక్షలు నిర్వహిస్తారు. రెండు సార్లు కూడా నెగిటివ్‌గా తేలితేనే జట్టుతో చేరేందుకు అనుమతిస్తారు. ఈ టెస్టు సిరీస్‌లో ఆటగాళ్లు, సిబ్బంది అంతా జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలను వాడుతున్నారు. మ్యాచ్ వేదికల్లో మాత్రమే ఇవి పని చేస్తాయి. అయితే తొలి టెస్టు ముగిసిన సౌతాంప్టన్‌నుంచి రెండో టెస్టు జరిగే మాంచెస్టర్ వరకు ఆటగాళ్లు విడివిడిగా ప్రయాణించేందుకు అనుమతించారు. మధ్యలో భోజనం కోసం మాత్రం ఆగవచ్చు. ఇదే దారిలో ఉన్న ‘బ్రైటన్’లో ఆర్చర్ ఫ్లాట్ ఉంది. అతను సుమారు గంట సేపు తన ఇంటికి వెళ్లినట్లు బయటపడింది. అయితే అక్కడ ఉన్నంత సేపు ఎవరితోనూ సన్నిహితంగా మెలగలేదని, సొంతిల్లు సహజంగానే సురక్షితం కాబట్టి ప్రమాదం ఉండదని ఆర్చర్ భావించినట్లు అతని సన్నిహితుడొకరు వెల్లడించారు. చర్య తప్పలేదు... కోవిడ్–19 బారిన పడకుండా ఈ టెస్టు సిరీస్‌ను విజయవంతంగా నిర్వహించడంలో ఇంగ్లండ్ బోర్డు తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. కఠిన నిబంధనలతో కూడిన ‘బయో బబుల్’ వివరాలు వెల్లడించిన తర్వాతే ఇంగ్లండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్కో టెస్టుపై 20 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 190 కోట్లు) ఆదాయం ముడిపడి ఉంది. ఇలాంటి స్థితిలో నిబంధనలు ఉల్లంఘించడం తీవ్రమైన తప్పుగా ఈసీబీ పరిగణించింది. ఆర్చర్ ‘మతి లేని పని’ చేశాడంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ ఆథర్టన్ తీవ్రంగా విమర్శించారు. ‘క్షమించండి’ నేను చేసిన తీవ్రమైన తప్పును మన్నించమని కోరుతున్నా. నా చర్యతో నాతో పాటు జట్టు సభ్యులు, మేనేజ్మెంట్ను కూడా ప్రమాదంలో పడేశాను. నా తప్పును అంగీకరిస్తూ బయో సెక్యూర్ బబుల్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నా. సిరీస్ కీలక దశలో టెస్టుకు దూరం కావడం చాలా బాధగా ఉంది. నా పొరపాటుతో ఇరు జట్లను నిరాశపర్చినందుకు మళ్లీ సారీ’ – ఆర్చర్ -
ఆలౌట్ చేసి... ఆలౌట్ దారిలో...
బౌలర్లు కష్టపడి ప్రత్యర్థిని తమకంటే తక్కువ స్కోరుకే ఆలౌట్ చేస్తే... మన బ్యాట్స్‌మెన్ మళ్లీ కష్టాలపాలు చేశారు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ టెయిలెండర్ జేమీసన్ చక్కగా 49 పరుగులు చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మన స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా (14), మయాంక్ అగర్వాల్ (3), కోహ్లి (14), రహానే (9)లు అంతా కలిసి 40 పరుగులు చేయడం టీమిండియా ‘పటిష్టమైన బ్యాటింగ్’ లైనప్ ముద్రకు పెను సవాల్ విసురుతోంది. క్రీజులో ఉన్న విహారి, రిషభ్ పంత్ మూడో రోజు భారీ ఇన్నింగ్స్ ఆడితే తప్పించి రెండో టెస్టులోనూ భారత్‌కు భంగపాటు తప్పేలా లేదు. క్రైస్ట్‌చర్చ్: భారత బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటింగ్ జోరుకు కళ్లెం వేశారు. అయితే తొలి టెస్టులాగే టెయిలెండర్లను ఆపలేకపోయినా... మొత్తం మీద చెమటోడ్చి తమ తొలి ఇన్నింగ్స్ కంటే తక్కువ స్కోరుకే ప్రత్యర్థిని ఆలౌట్ చేశారు. కానీ బ్యాట్స్‌మెన్ మళ్లీ బాధ్యత మరిచారు. సమం చేసేందుకు పురోగమించే చోట సమర్పించుకునేందుకే తిరోగమించారు. 36వ ఓవర్ పూర్తవకముందే 6 కీలక వికెట్లను అప్పగించేశారు. రెండో టెస్టులో బౌలర్ల శ్రమతో పట్టు చిక్కినట్లే చిక్కి పేలవ బ్యాటింగ్‌తో భారత్ కష్టాల్లో పడింది. స్థూలంగా చెప్పాలంటే రెండో రోజు ఆటను ఇరు జట్ల బౌలర్లు శాసించారు. ఏకంగా 16 వికెట్లను పడేశారు. దీంతో ఈ టెస్టు నేడే ముగిసినా ఆశ్చర్యం లేదు. ఆదివారం మొదట 63/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 73.1 ఓవర్లలో 235 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ లాథమ్ (52; 5 ఫోర్లు) అర్ధ శతకం సాధించాడు. భారత బౌలర్లలో షమీ 4, బుమ్రా 3 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ ఆట నిలిచే సమయానికి 36 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. అవుటైన ఆరుగురితో పాటు క్రీజ్‌లో ఉన్న ఇద్దరు... మొత్తం 8 మందిలో ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. బౌల్ట్ (3/12) భారత ఇన్నింగ్స్‌ను దెబ్బ తీశాడు. రాణించిన లాథమ్... ఆటమొదలైన కాసేపటికే న్యూజిలాండ్ రెండు కీలక వికెట్లను కోల్పోయింది. బ్లన్‌డెల్ (30; 4 ఫోర్లు)ను ఉమేశ్... కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను (3)ను బుమ్రా అవుట్ చేశాడు. జట్టు స్కోరు వంద పరుగులు దాటాక... షమీ విజృంభించాడు. దీంతో స్వల్ప వ్యవధిలో రాస్ టేలర్ (15; 1 ఫోర్), ఫిఫ్టీ పూర్తి చేసుకున్న లాథమ్, నికోల్స్ (14; 1 ఫోర్) పెవిలియన్ చేరారు. టేలర్‌ను జడేజా బోల్తా కొట్టించగా... లాథమ్, నికోల్స్‌లను షమీ అవుట్ చేశాడు. లంచ్ విరామానికి కివీస్ స్కోర్ 142/5. రెండో సెషన్లో కివీస్ పతనం కొనసాగింది. బుమ్రా ఒకే ఓవర్లో వాట్లింగ్ (0), సౌతీ (0)లను డకౌట్‌గా పంపాడు. ఈ దశలో గ్రాండ్‌హోమ్ (26; 4 ఫోర్లు), టెయిలెండర్ జేమీసన్ (49; 7 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడినప్పటికీ ఈ జోడీ ఎంతోసేపు నిలువలేదు. జడేజా... గ్రాండ్‌హోమ్‌ను బౌల్డ్ చేశాడు. 177 పరుగులకే 8 వికెట్లను కోల్పోయినా కూడా కివీస్ కథ అప్పుడే ముగిసిపోలేదు. జేమీసన్, వాగ్నర్ (21; 3 ఫోర్లు)తో కలిసి 9వ వికెట్‌కు 51 పరుగుల కీలక భాగస్వామ్యం అందించడంతో భారత్ భారీ ఆధిక్యానికి గండిపడింది. ఎట్టకేలకు షమీ తన వరుస ఓవర్లలో వాగ్నర్, జేమీసన్‌లను అవుట్ చేయడంతో 235 పరుగుల వద్ద కివీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. కష్టాలతో రెండో ఇన్నింగ్స్... తమకన్నా తక్కువ స్కోరుకే ప్రత్యర్థిని కట్టడి చేశామన్న భారత్ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. తీరు మారని బ్యాటింగ్‌తో రెండో ఇన్నింగ్స్ కష్టాలతోనే మొదలైంది. రెండో ఓవర్లోనే బౌల్ట్ బౌలింగ్‌లో మయాంక్ (3) వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా (14) కాసేపే ఆడగలిగాడు. ఇతన్ని సౌతీ అవుట్ చేయగా... కెప్టెన్ కోహ్లి (14; 3 ఫోర్లు), పుజారా (24; 2 ఫోర్లు) జట్టు స్కోరును కష్టమ్మీద 50 పరుగులు దాటించారు. దీనికి మరో పరుగు జతయ్యాక విరాట్ కోహ్లి ఎల్బీగా పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత రహానే (9) వచ్చినా... ఉమేశ్ (1)ను నైట్‌వాచ్‌మన్‌గా పంపించినా ఫలితం లేకపోయింది. కుదురుకుంటాడనుకున్న పుజారా కూడా బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డవ్వడం భారత్ కష్టాల్ని మరింత పెంచింది. ఆట నిలిచే సమయానికి హనుమ విహారి (5 బ్యాటింగ్), రిషభ్ పంత్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఓవరాల్ ఆధిక్యం 97 పరుగులకు చేరింది. సౌతీ, వాగ్నర్, గ్రాండ్‌హోమ్ తలా ఒక వికెట్ తీశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 242; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (బి) షమీ 52; బ్లన్‌డెల్ ఎల్బీడబ్ల్యూ (బి) ఉమేశ్ 30; విలియమ్సన్ (సి) పంత్ (బి) బుమ్రా 3; రాస్ టేలర్ (సి) ఉమేశ్ (బి) జడేజా 15; నికోల్స్ (సి) కోహ్లి (బి) షమీ 14; వాట్లింగ్ (సి) జడేజా (బి) బుమ్రా 0; గ్రాండ్‌హోమ్ (బి) జడేజా 26; సౌతీ (సి) పంత్ (బి) బుమ్రా 0; జేమీసన్ (సి) పంత్ (బి) షమీ 49; వాగ్నర్ (సి) జడేజా (బి) షమీ 21; బౌల్ట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (73.1 ఓవర్లలో ఆలౌట్) 235 వికెట్ల పతనం: 1–66, 2–69, 3–109, 4–130, 5–133, 6–153, 7–153, 8–177, 9–228, 10–235. బౌలింగ్: బుమ్రా 22–5–62–3, ఉమేశ్ యాదవ్ 18–2–46–1, షమీ 23.1–3–81–4, జడేజా 10–2–22–2. భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) లాథమ్ (బి) సౌతీ 14; మయాంక్ ఎల్బీడబ్ల్యూ (బి) బౌల్ట్ 3; పుజారా (బి) బౌల్ట్ 24; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) గ్రాండ్‌హోమ్ 14; రహానే (బి) వాగ్నర్ 9; ఉమేశ్ (బి) బౌల్ట్ 1; విహారి (బ్యాటింగ్) 5, పంత్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (36 ఓవర్లలో 6 వికెట్లకు) 90. వికెట్ల పతనం: 1–8, 2–26, 3–51, 4–72, 5–84, 6–89. బౌలింగ్: సౌతీ 6–2–20–1, బౌల్ట్ 9–3–12–3, జేమీసన్ 8–4–18–0, గ్రాండ్‌హోమ్ 5–3–3–1, వాగ్నర్ 8–1–18–1. -
మన ఆట మారలేదు
తొలి టెస్టులో భారత జట్టు కావాల్సినంత దూకుడు కనబర్చలేదని మ్యాచ్ తర్వాత కెప్టెన్ కోహ్లి వ్యాఖ్యానించాడు. దానిని జట్టు సభ్యులు ఎలా తీసుకున్నారో కానీ... రెండో టెస్టులో వారు టెస్టు క్రికెట్‌కు అవసరమైన దానికంటే ఎక్కువ దూకుడుతో ఆడే ప్రయత్నంలో మళ్లీ దెబ్బ తిన్నారు. ముగ్గురు బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీలు చేశారు. అందులో ఇద్దరు 78కంటే ఎక్కువ స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించారు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లతో పోలిస్తే తక్కువ ఓవర్లే ఆడినా 3.84 రన్‌రేట్‌తో అమిత వేగంగా రన్స్ రాబట్టారు. అయినా సరే శనివారం ఆట ముగిసే సరికి భారత్‌పై న్యూజిలాండ్‌దే పైచేయి అయింది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు సార్లు మెరుగైన స్థితిలో నిలిచి కూడా భారీ స్కోరు సాధించడంలో టీమిండియా విఫలమైంది. ఆ తర్వాత ఒక్క కివీస్ వికెట్ కూడా తీయలేకపోయింది. తర్వాతి రెండు రోజులు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ప్రత్యర్థిని మన బౌలర్లు ఎంత వరకు నిలువరించగలరో చూడాలి. క్రైస్ట్‌చర్చ్: బౌన్స్, స్వింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ మళ్లీ భంగపడ్డారు. నలుగురు న్యూజిలాండ్ పేసర్లు కూడా చెలరేగడంతో శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌటైంది. హనుమ విహారి (70 బంతుల్లో 55; 10 ఫోర్లు), పృథ్వీ షా (64 బంతుల్లో 54; 8 ఫోర్లు, 1 సిక్స్), చతేశ్వర్ పుజారా (140 బంతుల్లో 54; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అయితే ఈ ముగ్గురూ చెత్త షాట్లకే వెనుదిరగడం భారత్‌ను దెబ్బ తీసింది. కెరీర్లో రెండో టెస్టు ఆడుతున్న కైల్ జేమీసన్ (5/45) తొలిసారి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సత్తా చాటగా...సౌతీ, బౌల్ట్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లు ఆడి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. టామ్ బ్లన్‌డెల్ (29 బ్యాటింగ్), టామ్ లాథమ్ (27 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరిని భారత బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. న్యూజిలాండ్ మరో 179 పరుగులు వెనుకబడి ఉంది. పృథ్వీ సూపర్... ఉదయం పడిన చినుకుల కారణంగా ఆట కాస్త ఆలస్యంగా మొదలైంది. పిచ్ కూడా పేసర్లకు అనుకూలంగా మారిన స్థితిలో భారత్‌కు మరోసారి ఆశించిన ఆరంభం లభించలేదు. మయాంక్ (7)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని బౌల్ట్ తొలి వికెట్ తీశాడు. మయాంక్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. అయితే గత టెస్టు వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న పృథ్వీ షా ఈసారి మెరుగైన ఫుట్‌వర్క్‌ను ప్రదర్శించాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు దూకుడుగా ఆడిన అతను సౌతీ, బౌల్ట్ బౌలింగ్‌లో కొన్ని చూడచక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. వాగ్నర్ తొలి ఓవర్లో కొట్టిన సిక్స్‌తో 61 బంతుల్లోనే షా అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే తర్వాతి ఓవర్లో దూరంగా వెళుతున్న బంతిని ఆడే ప్రయత్నంలో అతను వెనుదిరిగాడు. స్లిప్స్‌లో లాథమ్ ఒంటి చేత్తో పట్టిన అద్భుత క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. లంచ్ సమయానికి స్కోరు 85/2కు చేరింది. కోహ్లి మళ్లీ... లంచ్ తర్వాత రెండో ఓవర్లోనే భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సౌతీ చక్కటి బంతితో కోహ్లి (3)ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఒకవైపు గట్టి నమ్మకం లేకపోయినా, అన్యమనస్కంగానే చివరి క్షణంలో కోహ్లి రివ్యూ చేశాడు. అయితే ఫలితం మాత్రం ప్రతికూలంగా రావడంతో కెప్టెన్ నిరాశగా వెనుదిరిగాడు. టెస్టుల్లో ఎల్బీడబ్ల్యూగా ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు 13 సార్లు డీఆర్ఎస్ను ఉపయోగించుకున్న కోహ్లి 2 సార్లు మాత్రం అవుట్ కాకుండా ఉండగలిగాడు! మరి కొద్ది సేపటికే కోహ్లిని అనుసరిస్తూ వైస్ కెప్టెన్ రహానే (7) పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ కూడా సౌతీ ఖాతాలోకే చేరింది. కీలక భాగస్వామ్యం... ఈ దశలో పుజారా, విహారి కలిసి జట్టును ఆదుకున్నారు. సీనియర్ సహచరుడు పుజారాతో పోలిస్తే విహారి వేగంగా ఆడాడు. విహారి క్రీజ్‌లోకి అడుగుపెట్టినప్పుడు పుజారా స్కోరు 31 పరుగులు కాగా... చివరకు వచ్చేసరికి ఆంధ్ర బ్యాట్స్‌మన్ అతడిని దాటేశాడు. 9 పరుగుల వద్ద విహారిని మొదటి స్లిప్‌లోనే క్యాచ్ అవుట్ చేసే అవకాశం కివీస్‌కు వచ్చినా... కీపర్ వాట్లింగ్ అత్యుత్సాహంతో ముందుకు దూకి దానిని నేలపాలు చేశాడు. 117 బంతుల్లో పుజారా అర్ధసెంచరీ పూర్తయింది. కివీస్ గడ్డపై అతనికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఆ తర్వాత విహారి జోరు కొనసాగింది. ముఖ్యంగా బౌల్ట్ వేసిన ఓవర్లో విహారి మూడు ఫోర్లు కొట్టడం విశేషం. విహారి నిష్క్రమణతో... ఐదో వికెట్ భాగస్వామ్యం సెంచరీ దిశగా సాగుతున్న దశలో విహారి చేసిన పొరపాటు జట్టును కష్టాల్లోకి నెట్టింది. టీ విరామానికి ముందు చివరి ఓవర్ ఆటను మలుపు తిప్పింది. వాగ్నర్ వేసిన ఈ ఓవర్లో విహారి రెండు బౌండరీలు బాదాడు. అయితే నాలుగో బంతి అనూహ్య రీతిలో అతని ఆటను ముగించింది. వాగ్నర్ వేసిన బౌన్సర్‌కు బదులిచ్చే క్రమంలో పూర్తిగా ఆఫ్ స్టంప్ మీదకు జరిగి విహారి పుల్ షాట్ ఆడబోయాడు. అయితే బంతి అతని బ్యాట్‌ను తాకుతూ వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. విరామం తర్వాత జేమీసన్ వేసిన రెండో ఓవర్లోనే పుజారా కూడా అనవసరపు రీతిలో పుల్ షాట్‌కు ప్రయత్నించగా బంతి అక్కడే గాల్లోకి లేచింది. ఐదో వికెట్‌కు 81 పరుగులు జోడించి క్రీజ్‌లో పాతుకుపోయిన విహారి, పుజారా మూడు పరుగుల తేడాతో నిష్క్రమించిన తర్వాత భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టలేదు. రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నా... పంత్ (12) ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. చెలరేగిపోయిన కివీస్ బౌలర్లు చకచకా మిగిలిన వికెట్లను పడగొట్టారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) లాథమ్ (బి) జేమీసన్ 54; మయాంక్ అగర్వాల్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 7; చతేశ్వర్ పుజారా (సి) వాట్లింగ్ (బి) జేమీసన్ 54; విరాట్ కోహ్లి (ఎల్బీ) (బి) సౌతీ 3; రహానే (సి) టేలర్ (బి) సౌతీ 7; హనుమ విహారి (సి) వాట్లింగ్ (బి) వాగ్నర్ 55; రిషభ్ పంత్ (బి) జేమీసన్ 12; రవీంద్ర జడేజా (సి) బౌల్ట్ (బి) జేమీసన్ 9; ఉమేశ్ యాదవ్ (సి) వాట్లింగ్ (బి) జేమీసన్ 0; షమీ (బి) బౌల్ట్ 16; బుమ్రా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (63 ఓవర్లలో ఆలౌట్) 242 వికెట్ల పతనం: 1–30; 2–80; 3–85; 4–113; 5–194; 6–197; 7–207; 8–207; 9–216; 10–242. బౌలింగ్: టిమ్ సౌతీ 13–5–38–2; ట్రెంట్ బౌల్ట్ 17–2–89–2; కొలిన్ గ్రాండ్‌హోమ్ 9–2–31–0; కైల్ జేమీసన్ 14–3–45–5; నీల్ వాగ్నర్ 10–29–1. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (బ్యాటింగ్) 27; బ్లన్‌డెల్ (బ్యాటింగ్) 29; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (23 ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా) 63. బౌలింగ్: బుమ్రా 7–1–19–0; ఉమేశ్ యాదవ్ 8–1–20–0; షమీ 7–1–17–0; రవీంద్ర జడేజా 1–1–0–0. -
ఇషాంత్ అవుట్
క్రైస్ట్‌చర్చ్: కివీస్ పర్యటనలో ఆఖరి పోరుకు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. అతని కుడి చీలమండకు గాయం కావడంతో రెండో టెస్టుకు అతను అందుబాటులో లేకుండా పోయాడు. ఇతని స్థానంలో ఉమేశ్ యాదవ్ బరిలోకి దిగే అవకాశముంది. ఇషాంత్‌కు అయిన గాయం కొత్తదేం కాదు. జనవరిలో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో గాయపడ్డాడు. అప్పుడే అతను కివీస్ పర్యటనకు అనుమానమేనని వార్తలొచ్చాయి. అయితే చక్కటి ఫామ్‌లో ఉన్న ఇషాంత్‌ను... వేగంగా కోలుకున్నాడనే కారణంతో టెస్టు జట్టులోకి తీసుకున్నారు. టీమ్ మేనేజ్మెంట్ ఆశించినట్లుగానే తొలిటెస్టులో ఇషాంత్ (5/68) రాణించాడు. బ్యాటింగ్ వైఫల్యంతో భారత్ ఈ మ్యాచ్ ఓడింది. శుక్రవారం జట్టు సభ్యులు ప్రాక్టీసు చేస్తుండగా... అతను కూడా వచ్చాడు. కానీ అసౌకర్యంగా కనిపించడంతో నెట్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో జట్టు మేనేజ్మెంట్ ముందు జాగ్రత్తగా అతని కుడి చీలమండకు స్కానింగ్ కూడా తీయించింది. రిపోర్టులు ప్రతికూలంగా వచ్చినట్లు సమాచారం. బౌలింగ్‌లో ఎదురుదెబ్బ తగిలినా... బ్యాటింగ్‌లో మాత్రం యువ ఓపెనర్ పృథ్వీ షా ఫిట్నెస్తో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. అతని ఎడమ పాదానికి అయిన వాపు మానిందని, రెండో టెస్టు ఆడతాడని భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. ఫామ్‌లోలేని వెటరన్ స్పిన్నర్ అశ్విన్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ జడేజాను తీసుకునేది ఖాయమైంది. జడేజా బ్యాటింగ్ చేయగల సమర్థుడు కావడంతో అతన్ని తీసుకోవాలని కోచ్‌తో పాటు కెప్టెన్ కోహ్లి నిర్ణయించినట్లు తెలిసింది. బ్యాటింగ్ పిచ్! క్రైస్ట్‌చర్చ్ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలం. గత టెస్టులా కాకుండా ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశముంది. ఇది బ్యాట్స్‌మెన్‌కు ఊరటనిచ్చే అంశం. ప్రత్యేకించి భారత బ్యాట్స్‌మెన్ ఆఖరి పోరులో అదిరిపోయే ఆట ఆడేందుకు ఇది చక్కని వేదిక. -
సమం చేస్తారా?
విదేశీ గడ్డపై సిరీస్‌లో తొలి టెస్టు ఓడిన తర్వాత భారత జట్టు కోలుకొని మ్యాచ్ గెలుచుకోవడం, సిరీస్‌ను కాపాడుకోవడం చాలా అరుదు. ఇప్పుడు మరోసారి అదే స్థితిలో టీమిండియా నిలిచింది. తొలి టెస్టులో పది వికెట్ల భారీ పరాజయం తర్వాత ఇప్పుడు రెండో టెస్టును కచ్చితంగా నెగ్గాల్సిన ఒత్తిడిలో టీమిండియా బరిలోకి దిగుతోంది. మరో వైపు సొంతగడ్డపై అమితోత్సాహంతో ఉన్న న్యూజిలాండ్ తమ ప్రత్యర్థికి అలాంటి అవకాశం ఇస్తుందా చూడాలి. క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు తమ చివరి పోరుకు సన్నద్ధమైంది. ఇక్కడి హాగ్లీ ఓవల్ మైదానంలో రేపటి (శనివారం)నుంచి జరిగే రెండో టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. టి20 సిరీస్‌ను భారత్, వన్డే సిరీస్‌ను కివీస్ క్లీన్‌స్వీప్ చేయగా...టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం 1–0తో ఆతిథ్య జట్టు ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్ చెలరేగి సిరీస్‌ను సమం చేస్తుందా, లేక విలియమ్సన్ సేన తమ జోరును కొనసాగించి మ్యాచ్‌ను గెలుచుకుంటుందా అనేది ఆసక్తికరం. పృథ్వీ అవుట్! తొలి టెస్టులో భారత్ ప్రదర్శనను విశ్లేషిస్తే ఏ ఒక్కరూ గొప్పగా ఆడారని చెప్పడానికి లేదు. మయాంక్, రహానే కొంత ప్రతిఘటన కనబర్చినా అది ఏమాత్రం జట్టుకు ఉపయోగపడలేదు. ఇక కెప్టెన్ కోహ్లి తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పర్యటనలో మూడు ఫార్మాట్లలో కూడా తన ముద్ర చూపించలేకపోయిన విరాట్ ఇప్పుడైనా ఫినిషింగ్ టచ్ ఇస్తాడో చూడాలి. ఆరో స్థానంలో విహారికి మరో అవకాశం లభించవచ్చు. ఇక బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అశ్విన్ స్థానంలో జడేజాకు చోటు దక్కడం దాదాపుగా ఖాయమైంది. అయితే ఈ టెస్టుకు కీలక మార్పు ఓపెనింగ్‌లో కావచ్చు. కాలి గాయంతో పృథ్వీ షా ఇబ్బంది పడుతున్నాడు. గురువారం అతను ప్రాక్టీస్ కూడా చేయలేదు. గాయం తీవ్రతను పరిశీలించి నేడు టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అతను ఫిట్‌గా లేకపోతే శుబ్‌మన్ గిల్ అరంగేట్రం చేయడం ఖాయం. సీనియర్ పుజారానుంచి కూడా టీమ్ భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. పేసర్ ఇషాంత్ శర్మ తొలి టెస్టులో సత్తా చాటాడు. షమీ, బుమ్రా విఫలమైనా...ఈ త్రయంలో మార్పుకు అవకాశం లేదు కాబట్టి ఉమేశ్ యాదవ్ మళ్లీ బెంచీకి పరిమితం కానున్నాడు. వాగ్నర్ వచ్చేశాడు! భారీ విజయం తర్వాత న్యూజిలాండ్ మళ్లీ చెలరేగాలని పట్టుదలగా ఉంది. ఆ జట్టు బ్యాటింగ్ మెరుగ్గానే కనిపిస్తోంది. ఓపెనర్లు లాథమ్, బ్లన్‌డెల్ శుభారంభం ఇవ్వగల సమర్థులు. మూడో స్థానంలో విలియమ్సన్కు తిరుగు లేదు. రాస్ టేలర్ కూడా మిడిలార్డర్లో జట్టు భారం మోస్తున్నాడు. నికోల్స్, వాట్లింగ్‌లతో జట్టు బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో సౌతీ, బౌల్ట్ జోడి మరోసారి భారత్‌ను దెబ్బ తీసేందుకు సిద్ధమైంది. వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్‌కు దూరమైన ప్రధాన పేసర్ నీల్ వాగ్నర్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయితే ఎవరి స్థానంలో అతడిని ఆడించాలనేది మేనేజ్మెంట్కు సమస్యగా మారింది. తొలి టెస్టులో జేమీసన్ ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో కీలకం కాబట్టి ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోమ్‌ను కూడా పక్కన పెట్టడం కష్టమే. అయితే గురువారంనాడు హాగ్లీ ఓవల్ పిచ్ పరిస్థితి చూస్తే పూర్తిగా పేసర్లకు అనుకూలించేలా కనిపిస్తోంది. అదే జరిగితే తొలి టెస్టులో కేవలం 6 ఓవర్లు వేసిన స్పిన్నర్ ఎజాజ్ పటేల్ స్థానంలో వాగ్నర్‌ను తీసుకొని నలుగురు పేసర్లతో కివీస్ దాడికి సిద్ధమైనట్లే. -
దక్షిణాఫ్రికా లక్ష్యం 438
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ 438 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. డొమినిక్ సిబ్లీ అజేయ శతకానికి (311 బంతుల్లో 133 నాటౌట్; 19 ఫోర్లు, సిక్స్)... స్టోక్స్ ధనాధన్ ఇన్నింగ్స్ (47 బంతుల్లో 72; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) తోడవ్వడంతో... ఓవర్‌నైట్ స్కోర్ 218/4తో సోమవారం బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు 8 వికెట్లకు 391 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఫలితంగా 437 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. సిబ్లీకిదే తొలి టెస్టు సెంచరీ కావటం విశేషం. కెప్టెన్ రూట్ (61; 7 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. నోర్జే 3 వికెట్లతో రాణించాడు. అనంతరం ఛేదన ప్రారంభించిన ప్రొటీస్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎల్గర్ (34; 2 ఫోర్లు,), మలాన్ (62 బ్యాటింగ్; 2 ఫోర్లు) తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించి శుభారంభం చేశారు. ప్రస్తుతం పీటర్ మలాన్‌కు తోడుగా మహరాజ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఆటకు నేడు చివరి రోజు కాగా విజయానికి 312 పరుగుల దూరంలో దక్షిణాఫ్రికా... 8 వికెట్ల దూరంలో ఇంగ్లండ్ ఉన్నాయి. -
లాథమ్ అజేయ శతకం
హామిల్టన్: ఓపెనర్ లాథమ్ (101 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ సెంచరీతో న్యూజిలాండ్‌ను ఆదుకున్నాడు. ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన ఈ రెండో టెస్టులో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 54.3 ఓవర్లలో 3 వికెట్లకు 173 పరుగులు చేసింది. వర్షం వల్లా చివరి సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కివీస్ జట్టులో జీత్ రావల్ (5), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (4) ఆరంభంలోనే నిష్క్రమించారు. ఆ తర్వాత లాథమ్, రాస్ టేలర్ (53; 8 ఫోర్లు) మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న టేలర్‌ను వోక్స్ పెవిలియన్ చేర్చాడు. నికోల్స్ (5 బ్యాటింగ్) క్రీజులోకి రాగా 173/3 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. ఆ తర్వాత ఓ మూడు బంతులే పడగా వర్షం వల్ల ఆట సాధ్యపడలేదు. -
వార్నర్, లబ్‌షేన్ సెంచరీలు
అడిలైడ్: తొలి టెస్టులో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగించింది. పింక్ బాల్‌తో ‘డే అండ్ నైట్’ టెస్టుగా సాగుతున్న ఈ మ్యాచ్ మొదటి రోజు ఆసీస్ అదరగొట్టింది. ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో వికెట్ నష్టపోయి 302 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (228 బంతుల్లో 166 బ్యాటింగ్; 19 ఫోర్లు), మార్నస్ లబ్‌షేన్ (205 బంతుల్లో 126 బ్యాటింగ్; 17 ఫోర్లు) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీలు బాదారు. వార్నర్ కెరీర్లో ఇది 23వ సెంచరీ కావడం విశేషం. నాలుగో ఓవర్లోనే బర్న్స్ (4)ను షాహిన్ అఫ్రిది అవుట్ చేసిన తర్వాత వార్నర్, లబ్‌షేన్ చెలరేగారు. -
టీమిండియా భారీ గెలుపు
కింగ్స్టన్ (జమైకా): వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా గెలిచింది. రెండో టెస్ట్ మ్యాచ్‌లో విండీస్‌ను 257 పరుగుల భారీ తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. 468 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 59.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. బ్రూక్స్(50) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్లాక్‌వుడ్(38), హోల్డర్(39), బ్రేవో(23) పరుగులు చేశారు. మహ్మద్ షమి, జడేజా మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీయగా, బుమ్రాకు ఒక వికెట్ దక్కింది. సెంచరీ, అర్ధసెంచరీతో సత్తా చాటిన తెలుగు తేజం గాదె హనుమ విహారి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. మొదటి టెస్ట్‌లో 318 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ విజయంతో ఐసీసీ వరల్డ్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో టీమిండియా టాప్‌లో నిలిచింది. 60 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. శ్రీలంక, ఆస్ట్రేలియా.. మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉంది. (చదవండి: ధోని రికార్డును దాటేసిన పంత్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కివీస్ ఆలౌట్, లంక టాపార్డర్ ఔట్
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్టు బౌలింగ్ గర్జనతో మొదలైంది. తొలిరోజు ఆటను పూర్తిగా బౌలర్లే శాసించడంతో ఏకంగా 14 వికెట్లు నేలకూలాయి. మొదట సురంగ లక్మల్ (5/54) కివీస్ ఆలౌట్‌కు నాంది పలికితే... తర్వాత టిమ్ సౌతీ (3/29) లంక టాపార్డర్‌ను పడేశాడు. బుధవారం ముందుగా బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లలో 178 పరుగుల వద్ద ఆలౌటైంది. లోయర్ ఆర్డర్లో టిమ్ సౌతీ (68; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాటంతో ఆ మాత్రం స్కోరు సాధ్యమైంది. లహిరు కుమార 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక తొలిరోజు ఆట నిలిచే సమయానికి 32 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో నిలబడిన సౌతీ తన బౌలింగ్‌తో లంకను దెబ్బమీద దెబ్బ తీశాడు. ఓపెనర్లు గుణతిలక (8), కరుణరత్నే (7), కెప్టెన్ చండిమల్ (6)లను 21 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. మాథ్యూస్ (27 బ్యాటింగ్), రోషన్ సిల్వా (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
ఆసీస్‌తో రెండో టెస్టు మొదటి రోజు
-
రెండో టెస్టు.. బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
సాక్షి స్పోర్ట్స్: పెర్త్‌లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా మొదటి టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుండగా..భారత్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. గాయాలతో రెండో టెస్టుకు దూరమైన అశ్విన్, రోహిత్ శర్మ స్థానంలో హనుమ విహారి, ఉమేశ్ యాదవ్‌లకు కోహ్లి స్థానం కల్పించారు. మొదటి టెస్టులో భారత్ విజయం సాధించిన సంగతి తెల్సిందే. అదే ఊపులో రెండో టెస్టు గెలిచేందుకు భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. తుది జట్లు భారత్ : కేఎల్ రాహుల్, విజయ్, కోహ్లి(కెప్టెన్), పుజారా, రహానె, హనుమ విహారి, రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్‌యాదవ్ . ఆస్ట్రేలియా: ఫించ్, హారిస్, ఖవాజా, షాన్ మార్ష్, హ్యాండ్స్కాంబ్, ట్రావిస్ హెడ్, టిమ్ పెయిన్(కెప్టెన్), లైయన్, హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ . -
పాకిస్తాన్ ఘనవిజయం
అబుదాబి: పేస్ బౌలర్ మొహమ్మద్ అబ్బాస్ మళ్లీ విజృంభించడంతో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ 373 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు ‘డ్రా’ కాగా... చివరి టెస్టులో గెలిచి పాక్ 1–0తో సిరీస్ సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో (5/33) అదరగొట్టిన అబ్బాస్ రెండో ఇన్నింగ్స్ (5/62)లోనూ చెలరేగడంతో ఆసీస్ కుప్పకూలింది. 538 పరుగుల లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 47/1తో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 49.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. అబ్బాస్‌తో పాటు స్పిన్నర్ యాసిర్ షా (3/45) చెలరేగడంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. లబ్‌షేన్ (43), హెడ్ (36) ఫించ్ (31)లకు మంచి ఆరంభాలు లభించినా... వాటిని భారీ ఇన్నింగ్స్‌లుగా మలచడంలో విఫలమయ్యారు. రెండు టెస్టుల్లో కలిపి 17 వికెట్లు తీసిన అబ్బాస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు దక్కాయి. అంతకుముందు గురువారం మూడో రోజు ఆటలో పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 400 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అజహర్ అలీ (64; 4 ఫోర్లు), బాబర్ ఆజమ్ (99; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ సర్ఫరాజ్ (81; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇలా కూడా రనౌట్ అవుతారా? ఈ మ్యాచ్‌లో అరుదైన రనౌట్ చోటు చేసుకుంది. తాను బాదిన బంతి బౌండరీ దాటిందనే ధీమాతో బ్యాట్స్‌మన్ పిచ్ మధ్యలో నాన్స్ట్రయికర్తో ముచ్చటిస్తున్న సమయంలో... బౌండరీకి ముందే ఆగిపోయిన బంతిని ఫీల్డర్ అందుకొని వికెట్ కీపర్‌కు విసరగా... అతను ఎంచక్కా వికెట్లు గిరాటేశాడు. దీంతో బ్యాట్స్‌మన్ తెల్లముఖం వేసి వెనుదిరగాల్సి వచ్చింది. గురువారం మూడో రోజు ఆటలో భాగంగా పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 53వ ఓవర్ మూడో బంతిని అజహర్ అలీ థర్డ్ మ్యాన్ దిశగా షాట్ ఆడాడు. ఆ బంతి కాస్తా బౌండరీ దగ్గర వరకూ వెళ్లి ఆగింది. ఇది గమనించని అజహర్ నాన్ స్ట్రయికర్ అసద్‌తో కలిసి పిచ్ మధ్యలో ముచ్చటిస్తున్నాడు. ఇదే అదునుగా భావించిన ఫీల్డర్ స్టార్క్ బంతిని కీపర్ పైన్‌కు అందించడం... అతను వికెట్లు పడగొట్టడం చకచకా జరిగిపోయాయి. దీంతో షాక్‌కు గురైన అజహర్ భారంగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. -
కూర్పులో మార్పు!
‘ఈ కుర్రాళ్లకు కావాల్సినంత స్వేచ్ఛనిస్తాం. సరిపడా అవకాశాలిస్తాం. కుదురుకునేంత వరకు వారు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాం’ తొలి టెస్టు అనంతరం ఓపెనింగ్ స్థానాల విషయమై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యలివి. అతడి ఆలోచనలకు తగ్గట్లు యువ ఓపెనర్ పృథ్వీ షాకు ఇప్పటికే అనూహ్యంగా అవకాశం దక్కింది. ఇక మిగిలింది మయాంక్ అగర్వాల్! టన్నులకొద్దీ పరుగులతో జాతీయ జట్టు తలుపును బలంగా బాదిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ రాజ్‌కోట్‌లోనే అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. చివరి క్షణంలో బెంచ్‌కు పరిమితమైనా... హైదరాబాద్‌లో మాత్రం అతడి కల నెరవేరే సూచన కనిపిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడినీ పరీక్షించి చూద్దామని భావిస్తుండటం దీనికి ఓ కారణంగా తెలుస్తోంది. ఇదే జరిగితే... ఉప్పల్‌లో కోహ్లి సేన తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. సాక్షి క్రీడా విభాగం: ఐదుగురు బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్, ఐదుగురు బౌలర్ల వ్యూహంతో తొలి టెస్టు బరిలో దిగి మూడు రోజుల్లోపే ప్రత్యర్థి చుట్టేసిన టీమిండియా... సిరీస్‌లో చివరిదైన హైదరాబాద్ టెస్టులో మాత్రం భిన్న కూర్పుతో ఆడనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరంగేట్రం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. అయితే, అతడు ఇన్నింగ్స్ ప్రారంభించకపోవచ్చు. ఆ బాధ్యతను లోకేశ్ రాహుల్, పృథ్వీ షాల పైనే ఉంచి మయాంక్‌ను వన్‌డౌన్‌లో పంపాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తోంది. అలాగైతే, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు తప్పనిసరి అవుతోంది. మయాంక్‌ను తీసుకుంటూనే, ఐదుగురు బౌలర్లూ ఉండాలనుకుంటే ఒక బ్యాట్స్‌మన్‌పై వేటు వేయాలి. అలా కాదంటే బౌలర్ (బహుశా పేసర్)ను కుదించుకుని బరిలో దిగాలి. దీనికి కోహ్లి పెద్దగా మొగ్గుచూపడు. ఎలాగూ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి, ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బ్యాటింగ్ బలాన్ని పరీక్షించుకోవాలని భావిస్తే తప్ప... బలహీనమైన విండీస్‌పై ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో ఆడటం అనవసరం. ఈ నేపథ్యంలో పక్కనపెట్టేది ఎవరినో? అతడివైపే వేళ్లన్నీ... ఇప్పుడున్న పరిస్థితుల్లో జట్టులో ఇబ్బంది నెలకొంది వైస్ కెప్టెన్ అజింక్య రహానేకే. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో ఒక్క శతకం కూడా చేయలేక నిరాశపర్చిన అతడికి రాజ్‌కోట్‌లో భారీ ఇన్నింగ్స్‌తో ఆ లోటు పూడ్చే అవకాశం దక్కింది. ఉన్నంతసేపు బాగానే ఆడినా మోస్తరు స్కోరు మాత్రమే చేసి తేలిగ్గా వికెట్ ఇచ్చేశాడు. విండీస్‌పై ఓ పెద్ద ఇన్నింగ్స్‌తో ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవడంతో పాటు బ్యాట్స్‌మన్‌గానూ టచ్‌లోకి వచ్చే మంచి చాన్స్‌ను అతడు చేజార్చుకున్నాడు. ఇప్పుడు మయాంక్ రాకతో తప్పించే బ్యాట్స్‌మన్ ఎవరంటే ముందుగా అందరి వేళ్లు రహానేనే చూపుతున్నాయి. కావాలనుకుంటే చతేశ్వర్ పుజారానూ పక్కన పెట్టొచ్చు కానీ, ఇంగ్లండ్ పర్యటన నుంచి చూపుతున్న ఫామ్‌రీత్యా దానిపై ఆలోచన చేయపోవచ్చు. ఇలా చూస్తే మిగులుతోంది రహానేనే. అయితే, కీలకమైన ఆసీస్ పర్యటనకు ముందు అతడిని తీయడం అంటే కొంత ఆలోచించాల్సిన విషయమే. లోపాన్ని అధిగమించు... రాహుల్ గత 8 ఇన్నింగ్స్‌ల్లో అయితే బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ. ఇదీ కేఎల్ రాహుల్ ఔటైన తీరు. వీటిలో కొన్ని మంచి బంతులున్నాయని సర్దిచెప్పుకొన్నా... రాహుల్ స్థాయి నాణ్యమైన ఆటగాడు వాటిని ఆడగలడు. అయితే, పాదాలను ఆలస్యంగా కదుపుతూ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే బౌలర్లకు దొరికిపోతున్నాడు. ఇప్పటివరకు 30 టెస్టుల్లో 49 ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్... 23 సార్లు 25 బంతులు కూడా ఆడకుండానే అవుటయ్యాడు. దీన్నిబట్టి ఒకటీ అరా సాంకేతిక లోపాలను దిద్దుకుని ‘ప్రారంభ బలహీనత’ను అధిగమించాల్సి ఉంది. కొంత ఆత్మవిశ్వాస లోపంతోనూ కనిపిస్తున్న రాహుల్ మరిన్ని ఓవర్లు ఆడటం ద్వారా దానిని దాటే వీలుంది. పైగా, హైదరాబాద్ వికెట్ ఓపెనర్లకు బాగా కలిసొస్తుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే ఉప్పల్ పిచ్‌పై గత ఐదేళ్ల ఓపెనింగ్ సగటు భాగ స్వామ్యం 40 కావడం గమనార్హం. ఇదే అనుకూలతతో లోకేశ్ రాహుల్ ఓ చక్కటి ఇన్నింగ్స్ ఆడతాడేమో చూద్దాం. ఆసీస్ టూర్ సన్నాహాలపై చర్చ! సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్‌కు సంబంధించి కొన్ని కీలకాంశాలను చర్చించేందుకు పరిపాలకుల కమిటీ (సీఓఏ) బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశంలో కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి, సెలక్షన్ కమిటీ సభ్యులతో వేర్వేరు అంశాలపై సీఓఏ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ చర్చిస్తారు. ఇటీవల జట్టులో స్థానం కోల్పోయిన అనంతరం సెలక్టర్లు తమతో మాట్లాడలేదంటూ మురళీ విజయ్, కరుణ్ నాయర్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాలకు సంబంధించి ఆటగాళ్లు, సెలక్టర్ల మధ్య మరింత మెరుగ్గా సమాచార మార్పిడి ఉండాలని సీఓఏ భావిస్తోంది. ఈ సమావేశంలోనే రాబోయే ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు సంబంధించి సన్నాహకాలపై కూడా చర్చ జరగనుంది. దీంతో పాటు విదేశాల్లో మన స్పిన్నర్ల ప్రదర్శనను మెరుగుపర్చేందుకు స్పెషలిస్ట్ స్పిన్ బౌలింగ్ కోచ్‌ను తీసుకోవాలనే చర్చ నడుస్తోంది. -
దక్షిణాఫ్రికా ‘ఎ’ 294/7
బెంగళూరు: భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు ‘డ్రా’ దిశగా పయనిస్తోంది. కీలకమైన మూడో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. 219/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 92.3 ఓవర్లలో 7 వికెట్లకు 294 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ డసెన్ (22; 2 ఫోర్లు), రూడీ సెకండ్ (47; 7 ఫోర్లు)లను భారత బౌలర్ అంకిత్ రాజ్‌పుత్ ఔట్ చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 51 పరుగులు వెనుకంజలోనే ఉంది. -
‘లార్డ్స్’లో రాత మారేనా!
తొలి టెస్టులో కోహ్లికి కనీసం మరో బ్యాట్స్‌మన్ సహకరించి ఉంటే... ఇంగ్లండ్ ఇచ్చిన క్యాచ్‌లను మన ఫీల్డర్లు మొదటి ప్రయత్నంలోనే అందుకొని ఉంటే... క్రికెట్లో ఇలా జరిగి ఉంటే, అలా చేసి ఉంటే లాంటి మాటలకు తావు లేదు. కానీ తాము అత్యుత్తమంగా ఆడకపోయినా మ్యాచ్‌ను గెలుచుకోగలిగామని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ చేసిన వ్యాఖ్యను బట్టి చూస్తే భారత్ గెలిచే అవకాశాలు పోగొట్టుకొని చేతులారా పరాజయం కొనితెచ్చుకుందనేది వాస్తవం. ఇప్పుడు సరైన జట్టును ఎంచుకొని ఆ తప్పులను సరిదిద్దుకుంటూ లెక్క సరి చేసేందుకు టీమిండియా సిద్ధమైంది. గత పర్యటనలో ఏకైక విజయం అందించిన చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో మన రాత మారుతుందా అనేది చూడాలి. మరోవైపు సొంతగడ్డపై కూడా తడబడుతున్న ఇంగ్లండ్ ఈసారి ఎలాంటి పోటీనిస్తుందనేది ఆసక్తికరం. లండన్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌లో 0–1తో వెనుకబడిన భారత్ లెక్క సరి చేయా లని పట్టుదలగా ఉంది. 2014 సిరీస్‌లో ఇదే మైదానంలో ఇషాంత్ శర్మ జోరుతో విజయం సాధించిన టీమిండియా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోంది. మరోవైపు ‘హోం ఆఫ్ క్రికెట్’లో గత కొంత కాలంగా నిరాశాజనక ప్రదర్శనను కనబరుస్తున్న ఇంగ్లండ్‌ను చిత్తు చేసేందుకు టీమిండియాకు ఇంతకంటే మంచి అవకాశం దక్కదు. ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగే రెండో టెస్టుకు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. కుల్దీపా... జడేజానా? ఎడ్జ్‌బాస్టన్‌లో చేదు ఫలితం భారత తుది జట్టులో కచ్చితంగా మార్పులు చేయాలనే పరిస్థితిని కల్పించింది. ఆ మ్యాచ్‌లో పుజారాను ఆడించకపోవడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే బయటి వ్యక్తుల వ్యాఖ్యలకు స్పందించి మార్పులు చేసే తత్వం కోహ్లిది కాదు కాబట్టి ఇప్పటికీ పుజారా స్థానంపై సందేహమే. కాబట్టి రాహుల్, ధావన్‌లలో ఒకరిని తప్పించే అవకాశం కూడా లేదు. బర్మింగ్‌హామ్‌లో ధావన్, విజయ్, రాహుల్, రహానే పూర్తిగా నిరాశపర్చారు. సిరీస్‌లో మనకు విజయావకాశాలు ఉండాలంటే వీరు ఇక్కడైనా తమ ఆటకు పదును పెట్టాల్సిందే. అదనపు బ్యాట్స్‌మన్ తప్పనిసరి అనుకుంటేనే గత మ్యాచ్‌లో పెద్దగా బౌలింగ్ చేయని హార్దిక్ పాండ్యాను తప్పించవచ్చు. అయితే లార్డ్స్ పిచ్ ఆట సాగినకొద్దీ పొడిబారుతుందని భావిస్తుండటంతో అదనపు స్పిన్నర్ వైపే జట్టు మొగ్గు చూపవచ్చు. అదే జరిగితే పేసర్ ఉమేశ్‌పై ముందుగా వేటు పడుతుంది. రెండో స్పిన్నర్‌గా కుల్దీప్ లేదా జడేజాను ఎంచుకోవచ్చు. 2014లో లార్డ్స్‌లో విజయంలో జడేజా కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే తాజా ఫామ్‌ను బట్టి చూస్తే కుల్దీప్ వైపు మొగ్గు కనిపిస్తోంది. బుధవారం ప్రాక్టీస్ సెషన్లో కెప్టెన్‌ను కూడా కుల్దీప్ ఇబ్బంది పెట్టాడు. పైగా ఇంగ్లండ్‌పై మానసికంగా కూడా అతనిదే పైచేయి. ప్రధాన స్పిన్నర్‌గా అశ్విన్ పాత్ర మరోసారి కీలకం కానుంది. పోప్‌కు చోటు... తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆట కూడా గొప్పగా ఏమీ లేదు. అయితే అదృష్టం కలిసొచ్చి ఆ జట్టు గట్టెక్కింది. అత్యంత సీనియర్ కుక్ కూడా అశ్విన్ బంతులకు జవాబివ్వలేకపోతున్నాడు. మరో ఓపెనర్ జెన్నింగ్స్ది కూడా అదే పరిస్థితి. ఫలితంగా మరోసారి కెప్టెన్ రూట్, ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టోలపైనే భారం పడుతోంది. మలాన్‌ను తప్పించడంతో 20 ఏళ్ల ఒలివర్ పోప్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు. గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన బట్లర్ ఈసారైనా రాణించాలని జట్టు ఆశిస్తోంది. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లకు తోడు కొత్త కుర్రాడు స్యామ్ కరన్ బౌలింగ్‌లో కూడా పదును ఉండటం ఇంగ్లండ్ బలాన్ని పెంచింది. అనేక విమర్శల మధ్య జట్టులోకి వచ్చిన లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి వేసిన ఓవర్లు 12 మాత్రమే! ఈసారి అతడిని ఇంగ్లండ్ ఎలా వాడుకుంటుందో చూడాలి. అయితే ఇంగ్లండ్‌కు అతి పెద్ద దెబ్బ బెన్ స్టోక్స్ దూరం కావడంతో తగిలింది. బ్రిస్టల్ గొడవకు సంబంధించి కోర్టు విచారణ కొనసాగుతుండటంతో స్టోక్స్ టెస్టుకు దూరం కావడం ఖాయమైపోయింది. అతని స్థానంలో సరిగ్గా అదే శైలి ఉన్న క్రిస్ వోక్స్‌కు అవకాశం దక్కవచ్చు. అయితే రెండో స్పిన్నర్ కావాలని భావిస్తే బ్యాటింగ్ సత్తా ఉన్న మొయిన్ అలీ వైపు మొగ్గు చూపవచ్చు. ఒక్క మ్యాచ్‌లో మా ప్రదర్శనను చూసి జట్టుపై అంచనాకు రావద్దు. వైఫల్యానికి ఫలానా కారణమని చెప్పలేం. సాంకేతిక లోపాలకంటే మానసిక బలహీనత వల్లే మేం వికెట్లు కోల్పోయామని భావిస్తున్నాం. తొలి 20–30 బంతులు ఎలా ఆడాలనే దానిపై దృష్టి పెట్టాం. ఇక్కడ దూకుడుకంటే సంయమనమే కీలక పాత్ర పోషిస్తుంది. కెప్టెన్‌గా నేను ఏం చేయగలనో అది చేస్తున్నాను. నేను ఎంత బాగా ఆడినా జట్టు గెలవడం ముఖ్యం. అది నేను కాకుండా ఎవరు గెలిపించినా సరే. నేను విఫలమై మ్యాచ్ గెలిచి ఉంటే అస్సలు బాధపడకపోయేవాడిని. ఇక్కడ పిచ్‌ను బట్టి చూస్తే ఇద్దరు స్పిన్నర్ల అవసరం కనిపిస్తోంది. –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ పిచ్, వాతావరణం ఇంగ్లండ్‌లో ప్రస్తుతం తీవ్ర ఎండలు కొనసాగుతుండగా పిచ్‌పై పచ్చికను నిలిపి ఉంచేందుకు లార్డ్స్ క్యురేటర్లు గత కొద్ది రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంత చేసినా పిచ్ వేగంగా పొడిబారవచ్చని తెలుస్తోంది. కాబట్టి స్పిన్‌కు అనుకూలించవచ్చు. అయితే మొదటి రెండు రోజులు మాత్రం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దాంతో స్వింగ్‌కు కూడా అవకాశం ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, విజయ్, రాహుల్, రహానే, కార్తీక్, పాండ్యా, కుల్దీప్/జడేజా, అశ్విన్, ఇషాంత్, షమీ. ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), కుక్, జెన్నింగ్స్, పోప్, బెయిర్‌స్టో, బట్లర్, వోక్స్/అలీ, రషీద్, కరన్, బ్రాడ్, అండర్సన్. ►లార్డ్స్ మైదానంలో 17 టెస్టులు ఆడిన భారత్ 2 గెలిచి, 11 ఓడింది. మరో 4 డ్రాగా ముగిశాయి ►మధ్యాహ్నం గం. 3.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లలో ప్రత్యక్ష ప్రసారం -
పాఠాలు నేర్చుకుంటారా?
ప్రస్తుతం టెస్టు క్రికెట్లో నిఖార్సయిన విదేశీ జట్లేవంటే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్. ఇంటాబయటా పోటీ ఇవ్వగల సత్తా వీటి సొంతం. నాలుగేళ్ల క్రితం ఆసీస్ పర్యటన మధ్యలో కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు కాబట్టి ఆ సిరీస్‌ను వదిలేస్తే.., విరాట్ కోహ్లికి ఈ ఏడాది ప్రారంభంలో సఫారీ పర్యటన రూపంలో తొలి కఠిన సవాల్ ఎదురైంది. అదే సమయంలో సిరీస్ గెలిచేంత చక్కటి అవకాశం సైతం దక్కింది. కానీ, పరిస్థితులకు తగని నిర్ణయాలతో దానిని చేజార్చుకున్నాడు. వాటిని సరి చేసుకున్నాక కాని విజయం దక్కలేదు. ప్రస్తుతం ఇంగ్లండ్ రూపంలో ముందున్న రెండో సవాల్లోనూ గత తప్పులనే చేస్తున్నాడు. పూర్తిగా కాకున్నా, తొలి టెస్టు ఓటమికి అవీ కొంత కారణమే. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకైనా పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. సాక్షి క్రీడా విభాగం బర్మింగ్‌హామ్ టెస్టులో పేస్ విభాగంలో భువనేశ్వర్, బుమ్రా లేకున్నా భారత్‌కు ఆ లోటు కనిపించలేదు. అశ్విన్ ప్రతిభతో రెండో స్పిన్నర్ అవసరం అన్న మాటే వినిపించలేదు. అటు ప్రత్యర్థి జట్టు ప్రధాన బౌలర్లు అండర్సన్, బ్రాడ్ భీకరంగా విరుచుకుపడలేదు. వారి మేటి బ్యాట్స్‌మెన్ కూడా విశేషంగా ఏమీ రాణించలేదు. అయినా టీమిండియా ఓడింది. కారణం, ఎప్పుడూ చెప్పుకొనే బ్యాటింగ్ వైఫల్యమే. పైకి కనిపించేది కూడా ఇదే. కోహ్లి మినహా నలుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరైనా కనీసం అర్ధ శతకం సాధిస్తే మ్యాచ్ ఫలితం వేరేగా ఉండేది. అందుకే వీరి ఆటతో చిర్రెత్తిందేమో? టెయిలెండర్లను చూసి నేర్చుకోవాలంటూ కెప్టెన్ చురకేశాడు. మరోవైపు బ్యాట్స్‌మన్‌గా కోహ్లి అద్వితీయంగా ఆడినా, సారథిగా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. ఇందులో ప్రధానమైనవి ఓపెనర్ శిఖర్ ధావన్ కొనసాగింపు, పుజారాను పక్కన పెట్టడం. మ్యాచ్ మూడో రోజు కీలక సమయంలో ప్రత్యర్థి కోలుకునేంతవరకు ఉపేక్షించడం మరో తప్పిదం. ఈ ఫలితంతో అయినా రెండో టెస్టుకు జట్టు ఎంపికలో పొరపాటు లేకుండా చూసుకోవాలి. లేదంటే సిరీస్‌లో 0–2తో వెనుకబడటం ఖాయం. ధావన్ ఇంకా ఎందుకు? విదేశీ గడ్డపై టెస్టుల్లో ధావన్‌ది పూర్తి నిరాశాజనక ప్రదర్శన. ఎస్సెక్స్‌తో సన్నాహక మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌తోనే అతడిపై ఆశలు సన్నగిల్లాయి. కానీ తుది జట్టులో కొనసాగించారు. బ్యాట్స్‌మన్‌గానే తన స్థానం ప్రశ్నార్థకంగా ఉన్న స్థితిలో... ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా మూడు క్యాచ్‌లు జారవిడిచి ఫీల్డర్‌గానూ మైనస్ మార్కులు వేసుకున్నాడు. రెండోది... రాహుల్ స్థానం. ఓపెనింగ్ తప్ప అతడు మరెక్కడా ఇమడలేనన్నట్లున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో దూరంగా వెళ్తున్న బంతిని వికెట్ల మీదకు ఆడుకుని, రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ ఇన్ స్వింగర్‌కు ఔటయ్యాడు. పుజారా వంటి టెస్టు స్పెషలిస్ట్‌ను వదిలేసి మరీ తనను ఎంపిక చేస్తే... అందుకు న్యాయం చేయలేకపోయాడు. రహానే... మరీ ఇలానా? ఇక వైస్ కెప్టెన్‌గా తన బాధ్యతలకు న్యాయం చేయలేని రహానేని ఏమని చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. విదేశాల్లో కోహ్లి తర్వాత మంచి రికార్డున్నరహానే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కీలక సమయంలో క్రీజులోకి వచ్చి తనపై తనకే నమ్మకం సన్నగిల్లేలా ఆడాడు. ఓ సులువైన క్యాచ్‌ను జారవిడిచాడు. ఉపేక్షించి... చేతులు కాల్చుకున్నారు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో స్యామ్ కరన్ క్రీజులోకి వచ్చేటప్పటికి జట్టు స్కోరు 87/7. లక్ష్యం 150 దాటితే ఛేదన కష్టంగా మారుతుంది. సరిగ్గా ఇక్కడే కోహ్లి మరో తప్పిదం చేశాడు. వరుసగా ఓవర్లు వేసి అలసిపోయిన షమీ, ఇషాంత్లనే కొనసాగించి... కరన్‌కు పరుగులు చేసే అవకాశమిచ్చాడు. 36వ ఓవర్ తర్వాత కాని ఉమేశ్ యాదవ్‌కు బంతినివ్వాలని కోహ్లికి అనిపించలేదు. తాజాగా వచ్చిన ఉమేశ్ మంచి పేస్‌తో కరన్‌ను ఇబ్బందిపెట్టాడు. ఆఖరికి అతడే వికెట్‌ను పడగొట్టాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. కరన్ టెయిలెండర్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి చేయాల్సినంత నష్టం చేసేశాడు. చివరి మూడు వికెట్లకు ఇంగ్లండ్ 93 పరుగులు జత చేస్తే అందులో కరన్వే 63. దీనిని బట్టి కోహ్లి సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోయాడని చెప్పవచ్చు. -
లంకతో రెండో టెస్టు : పటిష్ట స్థితిలో భారత్
శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ నిలకడగా రాణిస్తోంది. భోజన విరామానికి 39 ఓవర్లలో 97పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. తొలిరోజు తక్కువ స్కోరుకే రాహుల్ వికెట్ కొల్పోయినా విజయ్, పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. క్రీజులో నిలబడటానికి ప్రాధాన్యం ఇచ్చిన ఇద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. భోజన విరామానికి పుజారా 33(92 బంతులు 5ఫోర్లు), మురళీ విజయ్ 56(129 బంతులు 6ఫోర్లు)లతో క్రీజులో ఉన్నారు. తొలిరోజు 11/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్‌కు విజయ్, పుజారాలు బలమైన పునాది వేశారు. రెండోరోజు అసలైన టెస్టుమ్యాచ్ మజాను క్రికెట్ అభిమానులకు అందించారు. ఈదశలో విజయ్ 53 (112 బంతులు 6ఫోర్లు) హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్నాడు. 34 ఓవర్లో షనక వేసిన తొలిబంతిని బౌండరీకి తరలించడం ద్వారా మురళీ విజయ్ యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇది మురళీ విజయ్‌కు టెస్టు మ్యాచ్‌లో 16వ హాఫ్ సెంచరీ. మరోవైపు వికెట్లకోసం లంక బౌలర్లు చెమటోడుస్తున్నారు. లంక తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక 205పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్పిన్నర్లు అశ్విన్, జడేజాలతోపాటు ఇశాంత్ శర్మ చెలరేగడంతో లంక స్వల్ప స్కోరుకే చాప చుట్టేసింది. -
దుమ్మురేపిన భారత బౌలర్లు
నాగపూర్: భారత బౌలర్ల ధాటికి లంక బ్యాట్స్‌మెన్ తోక ముడిచారు. స్వల్ప స్కోరుకే చాప చుట్టేశారు. శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 205 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న లంక టీమ్ 20 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది. లంక ఆటగాళ్లలో కరుణరత్నె(51), చందిమాల్(57) మాత్రమే రాణించారు. మిగతా ఆటగాళ్లు అందరూ విఫలమవడంతో లంక స్పల్ప స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు నేలకూల్చాడు. జడేజా, ఇషాంత్ శర్మ మూడేసి వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఏడు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ 7 పరుగులు చేసి అవుటయ్యాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 8 ఓవర్లు ఆడి 11 పరుగులు చేసింది. విజయ్(2), పుజారా(2) క్రీజ్‌లో ఉన్నారు. -
బంగ్లాదేశ్ విలవిల
బ్లూమ్‌ఫాంటీన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులోనూ బంగ్లాదేశ్ పరాజయం దిశగా పయనిస్తోంది. రెండో రోజే ఫాలోఆన్ ఆడుతోంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 428/3తో శనివారం ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 573 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆమ్లా (132; 17 ఫోర్లు), కెప్టెన్ డు ప్లెసిస్ (135 నాటౌట్; 15 ఫోర్లు) సెంచరీలు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే కుప్పకూలింది. లిటన్ దాస్ (70) రాణించాడు. రబడా 5, ఒలివియర్ 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీకి 426 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడిన బంగ్లా ఆట నిలిచే సమయానికి వికెట్ కోల్పోకుండా 7 పరుగులు చేసింది. -
ఒక సెషన్..మూడు వికెట్లు
కోల్‌కతా: భారత్‌తో ఇక్కడ ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టు పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. 376 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ టీ విరామానికి మూడు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. రెండో సెషన్లో సగం భాగం వరకూ పూర్తి నిలకడగా ఆడిన న్యూజిలాండ్ ఒక్కసారిగా కీలక వికెట్లను చేజార్చుకుంది. నాల్గో రోజు ఆటలో భాగంగా లంచ్ తరువాత గప్టిల్(24) వికెట్ ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టుకు లాథమ్-నికోలస్లు మరమ్మత్తులు చేపట్టారు. అయితే నికోలస్(24)ను రెండో వికెట్ గా కోల్పోయిన తరువాత కెప్టెన్ రాస్ టేలర్(4) కూడా ఎంత సేపో క్రీజ్‌లో నిలబడలేదు. కాగా లాథమ్ హాఫ్ సెంచరీతో క్రీజ్ లో నిలబడి భారత బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. ప్రత్యేకంగా రెండో సెషన్ లో న్యూజిలాండ్ కోల్పోయిన మూడు వికెట్లలో అశ్విన్ కు రెండు, జడేజాకు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌటైంది. భారత కీపర్ సాహా(58 నాటౌట్) రాణించాడు. -
తొలిరోజు కలిసి రాలేదు.. బ్యాడ్ డే: రహానే
కోల్ కతా: పరుగులు చేయడానికి ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ అంత కష్టమైన పిచ్ కాదని టీమిండియా బ్యాట్స్ మన్ అజింక్యా రహానే అన్నాడు. తొలిరోజు ఆట నిలిపివేసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడాడు. చతేశ్వర్ పుజారా(87)తో కలిసి విలువైన 141 పరుగుల భాగస్వామ్యం అందించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయామని రహానే(77) అసంతృప్తిని వ్యక్తం చేశాడు. బౌలర్ల లయ దెబ్బతీసేందుకు చాలా ప్రయత్నించామని, అందులో భాగంగానే స్పిన్నర్ల బంతులను బ్యాక్ ఫుట్ తీసుకుని ఆడినట్లు వివరించాడు. రెండో రోజు వృద్ధిమాన్ సాహా(14), రవీంద్ర జడేజా(0) చేసే స్కోర్లు జట్టుకు ఎంతో కీలకమని, దాంతో కివీస్ పై సులువుగా ఒత్తిడి పెంచుతామన్నాడు. బ్యాట్స్ మన్ అవుట్ కావడానికి కేవలం ఒక్క బంతి చాలునని, అయితే అదే అతగాడు సెంచరీ సాధిస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నాడు. గతంలో కంటే ఈడెన్ పిచ్ భిన్నంగా ఉందని, పేస్ బౌలర్లుకు అనుకూలించిందన్నాడు. రెండో సెషన్లో ఉక్కపోత, భారీగా వేడి ఉండటంతో బ్యాట్స్ మన్ ఇబ్బందులు పడ్డారని తెలిపాడు. తొలుత మంచి బ్యాటింగ్ వికెట్ అని భావించామని, అయితే ఈ రోజు మాకు బ్యాడ్ డే అయిందన్నాడు. తొలి రోజు ఆట నిలిపివేసే సమయానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసిన విషయం తెలిసిందే. -
టీమిండియా తడబాటు
కోల్ కతా: న్యూజిల్యాండ్ తో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో తొలిరోజు భారత క్రికెటర్లు తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా టాప్ ఆర్డర్ వికెట్లను త్వరగా చేజార్చుకుంది. మొదటి ఇన్నింగ్స్ ను ఆరంభించిన భారత ఓపెనర్లు శిఖర్ ధావన్(1), మురళి విజయ్(9), కెప్టెన్ విరాట్ కోహ్లీ(9) పరుగులకే అవుటయ్యారు. దీంతో కష్టాల్లో చిక్కుకున్న భారత్ ను పూజారా(87), రహానే(77)లు మరో వికెట్ పడకుండా పరుగులు జోడించారు. టీ విరామానికి భారత్ గౌరవప్రదమైన చేస్తుందని అనిపించే దశకు తెచ్చారు. తర్వాత వాగ్నర్ బౌలింగ్ లో పూజారా వెనుదిరిగాడు. ఒక్కసారిగా కివీస్ బౌలర్లు విజృంభించడంతో మరో మూడు వికెట్లు త్వరగా నేల కూలాయి. కివీస్ బౌలర్లలో ఎంజే హెన్రీ మూడు వికెట్లు, జేఎస్ పటేల్ రెండు వికెట్లు, బౌల్ట్, వాగ్నెర్ లు చెరో వికెట్ తీశారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా(14), రవీంద్ర జడేజా(0)లతో క్రీజులో ఉన్నారు. వెలుతురు సరిగా లేని కారణంగా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే అంపైర్లు తొలిరోజు ఆటను నిలిపివేశారు. -
ఇంగ్లండ్ 182/3
పాకిస్తాన్‌తో రెండో టెస్టు దుబాయ్: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ కోలుకుంది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో రూట్ (118 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు), కుక్ (117 బంతుల్లో 65; 10 ఫోర్లు) మూడో వికెట్‌కు 113 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ మరో 196 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందు పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిస్బావుల్ హక్ (197 బంతుల్లో 102; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. 41 ఏళ్ల వయసు దాటాక ఒక బ్యాట్స్‌మన్ శతకం సాధించడం 1981 తర్వాత ఇదే మొదటి సారి కావడం విశేషం. ఇతర బ్యాట్స్‌మెన్ అసద్ షఫీఖ్ (178 బంతుల్లో 83; 9 ఫోర్లు), యూనిస్ ఖాన్ (56), మసూద్ (54) కూడా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వుడ్, అలీలకు చెరో 3 వికెట్లు దక్కాయి. -
బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ తీసుకున్నాడు. టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, వరుణ్ ఆరోన్ స్థానంలో మురళీ విజయ్, స్టువర్ట్ బిన్నీ, ఉమేష్ యాదవ్ జట్టులోకి వచ్చారు. శ్రీలంక జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయపడిన నవాబ్ ప్రదీప్ స్థానంలో దుషమంత చమేరాను జట్టులోకి తీసుకున్నారు. గాలెలో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
శాకాహారం లేదని.. అలిగిన ఇషాంత్
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకు కోపం వచ్చింది. రెండో టెస్టు మ్యాచ్ మూడోరోజు.. శుక్రవారం నాడు గాబాలో తమకు పెట్టిన భోజనంలో ఎక్కడా అసలు శాకాహారం అన్నదే కనిపించకపోవడంతో ఇషాంత్ అలిగి అక్కడినుంచి వెళ్లిపోయాడు. వాస్తవానికి గాబాకు వచ్చినప్పటి నుంచి కూడా భారతజట్టు తమకు చేసిన ఆహార ఏర్పాట్ల మీద తీవ్ర అసంతృప్తితో ఉంది. గ్లెనెల్గ్ ఓవల్ మైదానంలో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల సందర్భంగా కూడా ఇలాగే ఆహార నాణ్యత నాసిగా ఉందని జట్టు సభ్యులు అన్నారు. అదే విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ, హ్యూస్ మరణంతో విషాదంలో ఉన్న జట్టు మీద ఫిర్యాదు చేయడం ఎందుకని ఊరుకున్నారు. అడిలైడ్ టెస్టులో చేసిన ఏర్పాట్లు బాగున్నాయని జట్టు సభ్యులు తెలిపారు. అక్కడ ఓ ఇండియన్ చెఫ్‌ను నియమించారు. కానీ బ్రిస్బేన్‌లో మాత్రం పరిస్థితులు దారుణంగా మారాయి. మీడియా రూంలో కూడా శాకాహారం కనిపించలేదు. దీనిగురించి ఇషాంత్ శర్మ, సురేష్ రైనా ఫిర్యాదు చేశారు. తర్వాత స్టేడియం వెలుపలకు వెళ్లి తమకు కావల్సిన ఆహారం కొనుక్కున్నారు. కానీ తిరిగి వస్తుంటే బయటి ఆహారం స్టేడియంలోకి తేకూడదని అడ్డగించారు. దాంతో బయట కూర్చుని శాకాహారం తిని.. తర్వాత లోపలకు వచ్చారు. -
ఇక పేస్ పరీక్ష
సాధారణంగా ఆస్ట్రేలియా జట్టు ఎవరు తమ దేశానికి వచ్చినా తొలి టెస్టును బ్రిస్బేన్‌లోనే ఏర్పాటు చేస్తుంది. కారణం... సంప్రదాయబద్ధంగా గాబా పిచ్ మీద విపరీతమైన వేగం ఉంటుంది. బౌన్సర్లతో సీమర్లు చుక్కలు చూపిస్తుంటారు. దీనిని తట్టుకోలేక ప్రత్యర్థులు మ్యాచ్‌ను అప్పగిస్తారు. సిరీస్‌ను ఆసీస్ ఘనంగా ప్రారంభిస్తుంది. ఈసారి భారత్‌కు తొలి టెస్టును బ్రిస్బేన్‌లోనే ఏర్పాటు చేశారు. కానీ హ్యూస్ మరణానంతర పరిణామాల నేపథ్యంలో వేదిక అడిలైడ్‌కు మారింది. అక్కడి పిచ్ సంప్రదాయ బద్దంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలం. ఈసారీ అదే జరిగింది. అయితే ఆస్ట్రేలియా ఆఖరి రోజు అనూహ్యంగా గెలిచింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వచ్చింది. ఇక భారత్‌కు అసలైన పరీక్ష రేపటి నుంచి మొదలు కానుంది. రెండో టెస్టు బుధవారం నుంచి గాబా మైదానంలో జరగనుంది. జాన్సన్, హారిస్, సిడిల్‌లు బౌన్సర్ల వర్షం కురిపించడం ఖాయం. మన బ్యాట్స్‌మెన్ ఎలా స్పందిస్తారు? పిచ్‌ను మన పేసర్లు ఎలా వినియోగించుకుంటారు? అనే అంశాలపై భారత భవితవ్యం ఆధారపడి ఉంది. రేపటి నుంచి రెండో టెస్టు * ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్మిత్ * బరిలోకి దిగనున్న ధోని! బ్రిస్బేన్: టెస్టు మ్యాచ్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు భారత్, ఆస్ట్రేలియా జట్లు అడిలైడ్‌లో అద్భుతమైన వినోదాన్ని అందించాయి. ఆ మ్యాచ్ జ్ఞాపకాలను నెమరువేసుకుంటుండగానే మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్ బుధవారం నుంచి గాబా మైదానంలో జరుగుతుంది. ఈ టెస్టుకు ఇద్దరు కెప్టెన్లు మారబోతున్నారు. గాయంతో సిరీస్‌కు దూరమైన క్లార్క్ స్థానంలో స్టీవెన్ స్మిత్ ఆస్ట్రేలియాకు సారథ్యం వహిస్తుంటే... భారత్ తరఫున రెగ్యులర్ కెప్టెన్ ధోని బరిలోకి దిగబోతున్నాడు. క్లార్క్ స్థానంలో హాడిన్ కెప్టెన్ అవుతాడని భావించినా... దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా స్మిత్‌ను సారథిగా ఎంపిక చేశారు. ఇటీవల భిన్నమైన షాట్లతో అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్న స్మిత్... ఈ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తాడనేది ఆసక్తికరం. మరోవైపు తొలి టెస్టులో ఆకట్టుకున్న కోహ్లి స్థానంలో... సారథిగా ధోని రాబోతున్నాడు. ఒకవేళ ధోని మరింత విశ్రాంతి అవసరమని భావిస్తే మాత్రం కోహ్లి కొనసాగుతాడు. ఓడితే కోలుకోవడం కష్టం నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టు నెగ్గితే 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళుతుంది. అప్పుడు ఇక సిరీస్‌ను కోల్పోయే ప్రమాదం ఉండదు. కాబట్టి చివరి రెండు టెస్టుల్లో మరింత దూకుడుగా ఆడుతుంది. అలా కాకుండా సిరీస్‌లో ఆసక్తి బాగా ఉండాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలి. కనీసం ‘డ్రా’ చేసుకున్నా సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. మార్పులు ఎన్ని? తొలి టెస్టు ఆడిన భారత జట్టు రెండో మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. ధోని తిరిగి వస్తే సాహా బెంచ్ మీదకు వెళ్లాలి. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా కరణ్ శర్మ స్థానంలో అశ్విన్ రావచ్చు. ఒకవేళ నలుగురు పేసర్లతో ఆడాలనుకుంటే కరణ్ శర్మ స్థానంలో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యాటింగ్ విభాగంలో మార్పులు లేకపోవచ్చు. తొలి టెస్టులో ఆకట్టుకున్న విజయ్‌తో పాటు శిఖర్ ధావన్ కూడా కొత్త బంతిని మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. కోహ్లి సూపర్ ఫామ్ జట్టుకు కలిసొచ్చే అంశం. రహానే, రోహిత్, పుజారా ముగ్గురూ మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రాణించినా... రెండో ఇన్నింగ్స్‌లో విఫలమయ్యారు. ఈ ముగ్గురిలో కనీసం ఒక్కరు నిలబడి ఉంటే ఈ పాటికి భారత్ సిరీస్‌లో ఆధిక్యంలో ఉండేది. గాబా పిచ్ మీద భారత పేస్ త్రయం ఇషాంత్, షమీ, ఆరోన్ రాణించడంపైనే భారత అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కొత్త సారథి నేతృత్వంలో... కెప్టెన్‌గా మైకేల్ క్లార్క్ది ఆస్ట్రేలియా జట్టుపై తిరుగులేని ముద్ర. మ్యాచ్‌లో ప్రత్యర్థులకు సవాళ్లను నిర్దేశించడంలో తను దిట్ట. మరి స్మిత్ ఆ బాధ్యతలో ఏ మేరకు విజయం సాధిస్తాడో చూడాలి. క్లార్క్ స్థానంలో షాన్ మార్ష్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక తమను ఊరిస్తున్న పిచ్‌పై కచ్చితంగా ఆస్ట్రేలియా సీమర్లు జాన్సన్, సిడిల్, హారిస్ చెలరేగుతారు. ముఖ్యంగా జాన్సన్ గత యాషెస్‌లో ఈ పిచ్‌పై ఇంగ్లండ్ బౌలర్లకు తన బౌన్సర్లతో చుక్కలు చూపించాడు. దీనికి భారత బ్యాట్స్‌మెన్ సన్నద్ధం కావాలి. సిడిల్ అనారోగ్యం నుంచి కోలుకోకుంటే అతని స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ మిషెల్ స్టార్క్ వస్తాడు. ఏమైనా పేస్ పరీక్షగా నిలవబోతున్న ఈ టెస్టు ఆసక్తికరంగా సాగడం ఖాయం. రేపు ఉదయం గం. 5.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో -
ఆసక్తికరంగా రెండో టెస్టు
రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 167/6 దుబాయ్: పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ నాలుగో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. రాస్ టేలర్ (93 బంతుల్లో 77 బ్యాటింగ్; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, మెకల్లమ్ (45) ఫర్వాలేదనిపించాడు. పాక్ స్పిన్నర్లు బాబర్, యాసిర్ షా చెరో 3 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో నాలుగు వికెట్లు ఉన్న కివీస్ 177 పరుగుల ఆధిక్యంలో ఉంది. శుక్రవారం మ్యాచ్‌కు చివరి రోజు. అంతకు ముందు 281/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 393 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కివీస్‌కు 10 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే దక్కింది. పాక్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (195 బంతుల్లో 112; 16 ఫోర్లు) సెంచరీ సాధించడం విశేషం. మూడు టెస్టుల ఈ సిరీస్‌లో పాక్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. -
భువి భళా.. ఇంగ్లండ్ 'బాలెన్స్'
లండన్: భారత్‌తో రెండో టెస్టులో గ్యారీ బాలెన్స్ (110) సెంచరీతో రాణించి ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. మ్యాచ్ రెండో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 76 పరుగులు వెనకబడి ఉంది. 290/9 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 5 పరుగులకు ఆలౌటైంది. ఆండర్సన్ నాలుగు, బ్రాడ్, స్టోక్స్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మొదట్లో తడబడింది. భారత యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లీష్ మెన్‌కు వణుకు పుట్టించాడు. భువి వరుసగా కుక్, రాబ్సన్, ఇయానె బెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇంగ్లండ్ 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రూట్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. అయితే ఈ దశలో బాలెన్స్ సంయమనంతో ఆడుతూ ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. బాలెన్స్‌కు కాసేపు అలీ అండగా నిలిచాడు. వీరిద్దరూ వికెట్లు కాపాడుకోవడానికి ప్రాధానమిస్తూ ఆచితూచి ఆడారు. బాలెన్స్ సెంచరీ చేయడంతో స్కోరు 200 దాటింది. అయితే చివర్లో వీరిద్దరినీ అవుట్ చేసి భారత్ మ్యాచ్ పై పట్టు చేజారకుండా కాపాడుకుంది.