11 ఏళ్లకు వచ్చి ‘సున్నా’చుట్టి | England Played First Day Second Test Against Pakistan | Sakshi
Sakshi News home page

11 ఏళ్లకు వచ్చి ‘సున్నా’చుట్టి

Published Fri, Aug 14 2020 2:07 AM | Last Updated on Fri, Aug 14 2020 8:46 AM

England Played First Day Second Test Against Pakistan - Sakshi

సౌతాంప్టన్‌: పాకిస్తాన్‌ జట్టు పేలవ బ్యాటింగ్‌ ప్రదర్శన రెండో టెస్టులోనూ కొనసాగింది.  ఫలితంగా మ్యాచ్‌ తొలి రోజే ఆ జట్టు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్‌తో గురువారం  ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి తమ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆబిద్‌ అలీ (111 బంతుల్లో 60; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం బాబర్‌ ఆజమ్‌ (25 బ్యాటింగ్‌), రిజ్వాన్‌ (4 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. అండర్సన్‌కు 2 వికెట్లు దక్కాయి. వర్షం పదే పదే అంతరాయం కలిగించడంతో మొదటి రోజు 45.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.  

కెప్టెన్‌ మళ్లీ విఫలం... 
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. తన రెండో ఓవర్లోనే అండర్సన్‌... గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన షాన్‌ మసూద్‌ (1)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ దశలో ఆబిద్‌ అలీ, కెప్టెన్‌ అజహర్‌ అలీ (20) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆబిద్‌ ఇచ్చిన రెండు క్యాచ్‌లను ఇంగ్లండ్‌ ఫీల్డర్లు స్లిప్‌లో వదిలేశారు. వీరిద్దరు కుదురుకుంటున్న దశలో వర్షం రాగా... అంపైర్లు లంచ్‌ విరామాన్ని ప్రకటించారు.  

టపటపా... 
విరామం తర్వాత ఒక్కసారిగా పాక్‌ బ్యాటింగ్‌ తడబడింది. ఇంగ్లండ్‌ బౌలర్లు చెలరేగిపోవడంతో తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ముందుగా అజహర్‌ను అవుట్‌ చేసి అండర్సన్‌ ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టాడు.వర్షం కారణంగా మరోసారి సుదీర్ఘ సమయం పాటు ఆగినా, అది పాక్‌కు మేలు చేయలేకపోయింది. 99 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకొన్న కొద్ది సేపటికే ఆబిద్‌ను కరన్‌ పెవిలియన్‌ పంపించగా... అసద్‌ షఫీక్‌ (5) వికెట్‌ బ్రాడ్‌ ఖాతాలో చేరింది. సుమారు 11 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఆలమ్‌ (0) ఆ వెంటనే వోక్స్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూలో ఇంగ్లండ్‌కు అనుకూల ఫలితం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ వర్షం కురవడంతో తొలి రోజు ఆటను రద్దు చేయక తప్పలేదు.

11 ఏళ్లకు వచ్చి ‘సున్నా’చుట్టి
10 సంవత్సరాల 259 రోజులు... సరిగ్గా చెప్పాలంటే 3911 రోజులు... పాకిస్తాన్‌ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌ ఫవాద్‌ ఆలమ్‌ తన చివరి టెస్టు మ్యాచ్‌ తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్‌ ఆడటానికి మధ్య ఉన్న వ్యవధి ఇది. గురువారం సౌతాంప్టన్‌లో ప్రారంభమైన రెండో టెస్టులో బరిలోకి దిగిన ఫవాద్, దీనికి ముందు తన ఆఖరి టెస్టును 28 నవంబర్, 2009న  ఆడాడు. ఈ మధ్య కాలంలో పాక్‌ ఆడిన 88 టెస్టుల్లో అతనికి అవకాశం దక్కలేదు.

తన తొలి 3 టెస్టుల్లో 1 సెంచరీ సహా 41.66 సగటుతో 250 పరుగులు చేసినా... దురదృష్టవశాత్తూ అతనికి వేర్వేరు కారణాలతో మళ్లీ టెస్టు ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత పాక్‌ దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు సాధించి పలు రికార్డులు నెలకొల్పిన తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు మళ్లీ దేశం తరఫున టెస్టు ఆడాడు.  కానీ తొలి ఇన్నింగ్స్‌లో ‘డకౌట్‌’గా వెనుదిరిగాడు. రివ్యూ తర్వాత అం పైర్‌ అవుట్‌గా ప్రకటించిన సమయంలో అతని మొహంలో కనిపించిన విషాద భావాన్ని మాటల్లో వర్ణించలేం.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement