ఇక పేస్ పరీక్ష | India vs Australia 2014-15: Hosts carry advantage into 2nd Test at Brisbane | Sakshi
Sakshi News home page

ఇక పేస్ పరీక్ష

Published Tue, Dec 16 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

ఇక పేస్ పరీక్ష

ఇక పేస్ పరీక్ష

సాధారణంగా ఆస్ట్రేలియా జట్టు ఎవరు తమ దేశానికి వచ్చినా తొలి టెస్టును బ్రిస్బేన్‌లోనే ఏర్పాటు చేస్తుంది. కారణం... సంప్రదాయబద్ధంగా గాబా పిచ్ మీద విపరీతమైన వేగం ఉంటుంది. బౌన్సర్లతో సీమర్లు చుక్కలు చూపిస్తుంటారు. దీనిని తట్టుకోలేక ప్రత్యర్థులు మ్యాచ్‌ను అప్పగిస్తారు. సిరీస్‌ను ఆసీస్ ఘనంగా ప్రారంభిస్తుంది.
 
ఈసారి భారత్‌కు తొలి టెస్టును బ్రిస్బేన్‌లోనే ఏర్పాటు చేశారు. కానీ హ్యూస్ మరణానంతర పరిణామాల నేపథ్యంలో వేదిక అడిలైడ్‌కు మారింది. అక్కడి పిచ్ సంప్రదాయ బద్దంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలం. ఈసారీ అదే జరిగింది. అయితే ఆస్ట్రేలియా ఆఖరి రోజు అనూహ్యంగా గెలిచింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వచ్చింది.
 
ఇక భారత్‌కు అసలైన పరీక్ష రేపటి నుంచి మొదలు కానుంది. రెండో టెస్టు బుధవారం నుంచి గాబా మైదానంలో జరగనుంది. జాన్సన్, హారిస్, సిడిల్‌లు బౌన్సర్ల వర్షం కురిపించడం ఖాయం. మన బ్యాట్స్‌మెన్ ఎలా స్పందిస్తారు? పిచ్‌ను మన పేసర్లు ఎలా వినియోగించుకుంటారు? అనే అంశాలపై భారత భవితవ్యం ఆధారపడి ఉంది.

రేపటి నుంచి రెండో టెస్టు
* ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్మిత్
* బరిలోకి దిగనున్న ధోని!


బ్రిస్బేన్: టెస్టు మ్యాచ్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు భారత్, ఆస్ట్రేలియా జట్లు అడిలైడ్‌లో అద్భుతమైన వినోదాన్ని అందించాయి. ఆ మ్యాచ్ జ్ఞాపకాలను నెమరువేసుకుంటుండగానే మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్ బుధవారం నుంచి గాబా మైదానంలో జరుగుతుంది. ఈ టెస్టుకు ఇద్దరు కెప్టెన్లు మారబోతున్నారు. గాయంతో సిరీస్‌కు దూరమైన క్లార్క్ స్థానంలో స్టీవెన్ స్మిత్ ఆస్ట్రేలియాకు సారథ్యం వహిస్తుంటే... భారత్ తరఫున రెగ్యులర్ కెప్టెన్ ధోని బరిలోకి దిగబోతున్నాడు.

క్లార్క్ స్థానంలో హాడిన్ కెప్టెన్ అవుతాడని భావించినా... దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా స్మిత్‌ను సారథిగా ఎంపిక చేశారు. ఇటీవల భిన్నమైన షాట్లతో అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్న స్మిత్... ఈ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తాడనేది ఆసక్తికరం. మరోవైపు తొలి టెస్టులో ఆకట్టుకున్న కోహ్లి స్థానంలో... సారథిగా ధోని రాబోతున్నాడు. ఒకవేళ ధోని మరింత విశ్రాంతి అవసరమని భావిస్తే మాత్రం కోహ్లి కొనసాగుతాడు.
 
ఓడితే కోలుకోవడం కష్టం
నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టు నెగ్గితే 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళుతుంది. అప్పుడు ఇక సిరీస్‌ను కోల్పోయే ప్రమాదం ఉండదు. కాబట్టి చివరి రెండు టెస్టుల్లో మరింత దూకుడుగా ఆడుతుంది. అలా కాకుండా సిరీస్‌లో ఆసక్తి బాగా ఉండాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలి. కనీసం ‘డ్రా’ చేసుకున్నా సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి.  
 
మార్పులు ఎన్ని?
తొలి టెస్టు ఆడిన భారత జట్టు రెండో మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. ధోని తిరిగి వస్తే సాహా బెంచ్ మీదకు వెళ్లాలి. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా కరణ్ శర్మ స్థానంలో అశ్విన్ రావచ్చు. ఒకవేళ నలుగురు పేసర్లతో ఆడాలనుకుంటే కరణ్ శర్మ స్థానంలో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యాటింగ్ విభాగంలో మార్పులు లేకపోవచ్చు.

తొలి టెస్టులో ఆకట్టుకున్న విజయ్‌తో పాటు శిఖర్ ధావన్ కూడా కొత్త బంతిని మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. కోహ్లి సూపర్ ఫామ్ జట్టుకు కలిసొచ్చే అంశం. రహానే, రోహిత్, పుజారా ముగ్గురూ మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రాణించినా... రెండో ఇన్నింగ్స్‌లో విఫలమయ్యారు. ఈ ముగ్గురిలో కనీసం ఒక్కరు నిలబడి ఉంటే ఈ పాటికి భారత్ సిరీస్‌లో ఆధిక్యంలో ఉండేది. గాబా పిచ్ మీద భారత పేస్ త్రయం ఇషాంత్, షమీ, ఆరోన్ రాణించడంపైనే భారత అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
 
కొత్త సారథి నేతృత్వంలో...
కెప్టెన్‌గా మైకేల్ క్లార్క్‌ది ఆస్ట్రేలియా జట్టుపై తిరుగులేని ముద్ర. మ్యాచ్‌లో ప్రత్యర్థులకు సవాళ్లను నిర్దేశించడంలో తను దిట్ట. మరి స్మిత్ ఆ బాధ్యతలో ఏ మేరకు విజయం సాధిస్తాడో చూడాలి. క్లార్క్ స్థానంలో షాన్ మార్ష్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక తమను ఊరిస్తున్న పిచ్‌పై కచ్చితంగా ఆస్ట్రేలియా సీమర్లు జాన్సన్, సిడిల్, హారిస్ చెలరేగుతారు.

ముఖ్యంగా జాన్సన్ గత యాషెస్‌లో ఈ పిచ్‌పై ఇంగ్లండ్ బౌలర్లకు తన బౌన్సర్లతో చుక్కలు చూపించాడు. దీనికి భారత బ్యాట్స్‌మెన్ సన్నద్ధం కావాలి. సిడిల్ అనారోగ్యం నుంచి కోలుకోకుంటే అతని స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ మిషెల్ స్టార్క్ వస్తాడు. ఏమైనా పేస్ పరీక్షగా నిలవబోతున్న ఈ టెస్టు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
 
 రేపు ఉదయం గం. 5.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement