నేను ‘మర్యాద’ ఇవ్వను! | No reason to respect Johnson - Kohli | Sakshi
Sakshi News home page

నేను ‘మర్యాద’ ఇవ్వను!

Published Mon, Dec 29 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

నేను ‘మర్యాద’ ఇవ్వను!

నేను ‘మర్యాద’ ఇవ్వను!

జాన్సన్‌పై విరుచుకుపడ్డ కోహ్లి
 భారత్ ఇన్నింగ్స్‌లో 83వ ఓవర్... జాన్సన్ బౌలింగ్‌లో కోహ్లి ముందుకొచ్చి నేరుగా షాట్ ఆడాడు. దానిని అందుకున్న జాన్సన్, కోహ్లిని రనౌట్ చేసేందుకు స్ట్రయికింగ్ ఎండ్ వైపు విసిరాడు. అయితే అది నేరుగా కోహ్లి వీపును తాకింది. వెంటనే ఆసీస్ బౌలర్ ‘సారీ’ చెప్పేశాడు. మరొకరైతే జాన్సన్ క్షమాపణను స్వీకరించేవారేమో! కానీ అలా చేస్తే అతను కోహ్లి ఎందుకవుతాడు? వెంటనే ప్రత్యర్థితో వాదనకు దిగాడు.
 
  ఈసారి స్టంప్ వైపు విసిరేందుకు ప్రయత్నించు. నా శరీరంపై కాదు అని ఘాటుగా సమాధానమిచ్చాడు. ‘నా ఉద్దేశ్యం కూడా చెప్పాలి కదా. మైదానంలో అర్థంపర్థం లేని మాటలు నేను మాట్లాడను. క్రికెట్ ఆడటం కోసం క్రీజులో ఉన్నాను. నాకు తగిన మర్యాద ఇవ్వని ఆటగాడికి నేను కూడా ఎలాంటి మర్యాద ఇవ్వాల్సిన అవసరం గానీ కారణం గానీ లేదు’ అని జాన్సన్ గురించి వ్యాఖ్యానించాడు. ఇద్దరి మధ్య ఈ చిటపటలు రోజంతా నడుస్తూనే ఉన్నాయి.
 
 ఒకసారైతే అంపైర్లు కూడా కలగజేసుకోవాల్సి వచ్చింది. తన బౌలింగ్‌లో కోహ్లి విరుచుకుపడ్డ తీరు కూడా జాన్సన్‌కు ఆగ్రహం తెప్పించి ఉంటుంది. అయితే తన ఆట ద్వారానే భారత స్టార్ బదులిచ్చాడు. జాన్సన్ బౌలింగ్‌లో 73 బంతులు ఎదుర్కొన్న విరాట్ 68 పరుగులు చేశాడు. అతను కొట్టిన 18 ఫోర్లలో 11 జాన్సన్ బౌలింగ్‌లోనే వచ్చాయి. ఎలాంటి ఒత్తిడి లేకపోవడం వల్లే గత మ్యాచ్‌లో జాన్సన్ బాగా బ్యాటింగ్ చేశాడని, తన ప్రధాన బాధ్యత అయిన బౌలింగ్‌లో 4.7 రన్‌రేట్‌తో పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయినా జాన్సన్ ఇలా ప్రవర్తించడాన్ని కోహ్లి ఎద్దేవా చేశాడు. ‘ఆసీస్ ఆటగాళ్లు నన్ను చెడిపోయిన పిల్లాడు అన్నారు.
 
  నేను నిజంగా అలాంటివాడినేమో. వారు నన్ను ద్వేషించడమే నాకిష్టం. నన్ను ఎన్ని మాటలు అన్నా అది నాకే లాభించింది. నా అత్యుత్తమ ప్రదర్శన బయటపడింది. అయినా వారు మారరు’ అని కోహ్లి చెప్పాడు. సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉండటం వల్లే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, 1-1తో సమంగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడగలిగేవారా అని ప్రశ్నించిన కోహ్లి, భారత్‌లో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు రావెందుకో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అయితే చివరకు జాన్సన్ బౌలింగ్‌లోనే కోహ్లి వెనుదిరగడం కొసమెరుపు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement