కోహ్లి, రహానే ‘జుగల్‌బందీ’
సెంచరీలతో చెలరేగిన బ్యాట్స్‌మెన్
రికార్డు భాగస్వామ్యం నమోదు
మూడో రోజు భారత్ 462/8
మెల్‌బోర్న్ టెస్టులో ఆసీస్‌కు కంగారు
కుర్రాళ్లు కుమ్మేశారు... దాదాపు నాలుగు గంటల అద్భుత భాగస్వామ్యంతో భారత జట్టు భవిష్యత్తు తమ చేతిలో ఉందని చూపించారు. ప్రత్యర్థి బౌలింగ్‌కు అదరక, మాటలకు బెదరక కోహ్లి, రహానే అలవోకగా పరుగులు సాధించారు. ఆడుతోంది ఆసీస్ గడ్డపైనా... లేక భారత్‌లోనా అన్నట్లు ఆసీస్‌కు ‘కంగారు’ పుట్టించారు. ఏకపక్షంగా మారుతుందనుకున్న మ్యాచ్‌లో జీవం తెచ్చి అభిమానులకు ఆనందాన్ని పంచారు.
24 గంటల్లో ఎంత మార్పు... మా ఆటకు భారత్ వద్ద జవాబు లేదన్న ఆస్ట్రేలియా కెప్టెన్‌కు మూడో రోజు నోటి మాట పడిపోయింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ చెలరేగుతుంటే... తమ ప్రధాన బౌలర్లు ఏమీ చేయలేక నిస్సహాయులైపోతే... అలవాటైన దూషణ అక్కరకు రాకపోతే... ఎలా నిలువరించాలో తెలీక స్మిత్ తలపట్టుకున్న క్షణాన... టీమిండియా సత్తా కనిపించింది.
అయితే అద్వితీయ ప్రదర్శన వెంటే భారత జట్టుకు కాస్త అలసత్వం వెంట వచ్చినట్లుంది. ఫలితమే 53 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు... ఇంకా మనకు ఆధిక్యం దక్కలేదు. అయితే ఆదివారం ఆట మాత్రం ఆసీస్ గడ్డపై టీమిండియా ఏ సవాల్‌కైనా సిద్ధమేనని చూపించింది. గతానికి భిన్నంగా, ప్రత్యర్థికి ఏ మాత్రం తగ్గకుండా ఆడగలమని మెల్‌బోర్న్‌లో సందేశం ఇచ్చినట్లయింది.
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ క్రికెటర్లు మెరిశారు. తీవ్రమైన ఒత్తిడిలో మైదానంలోకి అడుగుపెట్టి అద్భుత శతకాలతో టీమిండియాను మెరుగైన స్థితిలో నిలిపారు. విరాట్ కోహ్లి (272 బంతుల్లో 169; 18 ఫోర్లు), అజింక్య రహానే (171 బంతుల్లో 147; 21 ఫోర్లు) భారీ సెంచరీలతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 126.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 462 పరుగులు చేసి ప్రత్యర్థికి దీటుగా సమాధానం ఇచ్చింది. కోహ్లి, రహానే ధాటిగా ఆడి నాలుగో వికెట్‌కు 262 పరుగులు జోడించడం విశేషం. భారత్ ఇన్నిం గ్స్‌ను నడిపించిన కోహ్లి, చివరి ఓవర్‌లో అవుట్ కావడం కాస్త నిరాశపరచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి జట్టు మరో 68 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుత స్థితిలో భారత్ చివరి 2 వికెట్లు ఆధిక్యాన్ని ఎంతవరకు తగ్గించగలవో చూడాలి. నాలుగో రోజంతా స్మిత్ సేన బ్యాటింగ్ చేసి భారత్‌కు సవాల్ విసిరితే టెస్టు ఆసక్తికరంగా మారవచ్చు. లేదంటే ‘డ్రా’కే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 530; భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) మార్ష్ (బి) వాట్సన్ 68; ధావన్ (సి) స్మిత్ (బి) హారిస్ 28; పుజారా (సి) హాడిన్ (బి) హారిస్ 25; కోహ్లి (సి) హాడిన్ (బి) జాన్సన్ 169; రహానే (ఎల్బీ) (బి) లయోన్ 147; రాహుల్ (సి) హాజల్‌వుడ్ (బి) లయోన్ 3; ధోని (సి) హాడిన్ (బి) హారిస్ 11; అశ్విన్ (సి) అండ్ (బి) హారిస్ 0; షమీ (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (126.2 ఓవర్లలో 8 వికెట్లకు) 462
వికెట్ల పతనం: 1-55; 2-108; 3-147; 4-409; 5-415; 6-430; 7-434; 8-462.
బౌలింగ్: జాన్సన్ 29.2-5-133-1; హారిస్ 25-7-69-4; హాజల్‌వుడ్ 25-6-75-0; వాట్సన్ 16-3-65-1; లయోన్ 29-3-108-2; స్మిత్ 2-0-11-0.
ఆ రెండు క్యాచ్‌లు...
భారత్ ఇన్నింగ్స్‌కు ఊపిరి పోసిన కోహ్లి, రహానేలు కీలక సమయాల్లో ఇచ్చిన క్యాచ్‌లను ఆసీస్ నేలపాలు చేసింది. రహానే 70 పరుగుల వద్ద లయోన్ తన బౌలింగ్‌లోనే నేరుగా వచ్చిన సునాయాస క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. కోహ్లి 88 పరుగుల వద్ద జాన్సన్ బౌలింగ్‌లో స్లిప్‌లో వాట్సన్ వదిలేశాడు. అది కీపర్‌కు అందాల్సిన క్యాచ్ కాగా, వాట్సన్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. మన బ్యాట్స్‌మెన్ ఆ తర్వాత ఆయా స్కోర్లకు దాదాపు రెట్టింపు పరుగులు చేయడం విశేషం. రాహుల్ క్యాచ్‌ను సిడిల్ వదిలేసినా, తర్వాతి బంతికే అవుట్ కావడంతో ఆసీస్‌పై దాని ప్రభావం పడలేదు.
2 గవాస్కర్ (1977) తర్వాత ఆసీస్ గడ్డపై ఒకే సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడు కోహ్లి.
9 కోహ్లి కెరీర్‌లో ఇది 9వ సెంచరీ. ఆస్ట్రేలియాపైనే ఐదోది. ఈ మ్యాచ్‌లో తన అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు (169) కూడా సాధించాడు.
4 గత పదేళ్లలో ఉపఖండం బయట భారత్‌కిదే (262) అత్యుత్తమ భాగస్వామ్యం. నాలుగుసార్లు మాత్రమే భారత్ 250కి పైగా భాగస్వామ్యాలు నమోదు చేసింది.
4 టెస్టుల్లో 250కి పైగా వికెట్లలో భాగం పంచుకున్న నాలుగో ఆస్ట్రేలియా వికెట్ కీపర్‌గా హాడిన్ నిలిచాడు. ఓవరాల్‌గా 9వ కీపర్.
1వందకు పైగా పరుగులిచ్చి కనీసం 2 వికెట్లు కూడా తీయకపోవడం జాన్సన్ కెరీర్‌లో ఇదే తొలిసారి.
సెషన్-1: కోహ్లి నిలకడ
ఓవర్‌నైట్ స్కోరు 108/1తో భారత్ ఆట ప్రారంభించింది. అయితే రెండో బంతికి పుజారా (25)ను హారిస్ అవుట్ చేశాడు. ఆ తర్వాత విజయ్ (68) కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఈ దశలో జత కలిసిన కోహ్లి, రహానే ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. రహానే రావడంతోనే దూకుడుగా ఆడగా, చక్కటి నియంత్రణతో బ్యాటింగ్ చేసిన కోహ్లి 86 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఓవర్లు: 29, పరుగులు: 116, వికెట్లు: 2
సెషన్-2: సూపర్ జోడి
లంచ్ తర్వాత భారత ద్వయం అసలు జోరు చూపించింది. 60 బంతుల్లో రహానే అర్ధ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఏ ఆసీస్ బౌలర్ కూడా ఈ జంటపై ప్రభావం చూపించలేకపోయాడు. ఆఫ్, ఆన్‌సైడ్ తేడా లేకుండా... పాయింట్, కవర్స్, స్క్వేర్ లెగ్ భేదం లేకుండా మైదానమంతా వీరు షాట్లతో చెలరేగారు. ఆసీస్ ఆటగాళ్లు క్యాచ్‌లు వదిలేయడం కూడా ఈ ఇద్దరికి కలిసొచ్చింది. క్రీజ్‌లోకి తర్వాత వచ్చినా... రహానే ముందుగా 127 బంతుల్లో, ఆ తర్వాత కోహ్లి 166 బంతుల్లో సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ సెషన్‌లో భారత జంట పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
ఓవర్లు: 29, పరుగులు: 112, వికెట్లు: 0
సెషన్-3: కోలుకున్న ఆసీస్
విరామం తర్వాత కూడా కోహ్లి, రహానే తగ్గలేదు. జాన్సన్ వేసిన ఒక ఓవర్లో కోహ్లి వరుసగా మూడు ఫోర్లు బాదగా, మరో ఓవర్లో రహానే మూడు ఫోర్లు కొట్టాడు. చివరకు లయోన్, రహానేను ఎల్బీగా అవుట్ చేసి ఈ భారీ భాగస్వామ్యాన్ని విడదీశాడు. తొలి టెస్టు ఆడుతున్న లోకేశ్ రాహుల్ (3) అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. అనవసరపు స్వీప్ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. ఆ తర్వాత ధోని (11), అశ్విన్ (0) అవుటయ్యారు. చివర్లో కోహ్లి వికెట్ తీసి ఆసీస్ రోజును సంతృప్తిగా ముగించింది.
ఓవర్లు: 31.2, పరుగులు: 126, వికెట్లు: 5
‘ఈ రోజు మా ఆటతో గర్వంగా ఉన్నా. నేను, రహానే మా సహజ శైలిలో ఆడాలని భావించి ఒకరినొకరు ప్రోత్సహించుకున్నాం. ఒక పెద్ద భాగస్వామ్యం వస్తేనే నిలబడగలం. భారీ సెంచరీ చేయాలని కూడా పట్టుదలగా ఆడా. వచ్చేసారి దీనిని డబుల్ సెంచరీగా మారుస్తా. జాన్సన్‌పై రహానే దూకుడు ప్రదర్శించడం నన్నూ చాలా ఆశ్చర్యపరి చింది. ఫీల్డింగ్‌లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన ఆసీస్ ఇలా క్యాచ్‌లు వదిలి, సునాయాసంగా సింగిల్స్ ఇవ్వడం అరుదు. ఇంత నిలకడలేమితో వారు ఎప్పుడు ఆడారో గుర్తు లేదు. నేను చివర్లో అవుట్ కాకుండా ఉండాల్సింది. అయితే నాలుగో రోజు మరి కొన్ని పరుగులు జత చేసి, 2-3 వికెట్లు తీయగలిగితే మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుంది.’
-విరాట్ కోహ్లి, భారత బ్యాట్స్‌మన్
‘మా ఫీల్డింగ్ నాసిరకంగా ఉంది. ఆ క్యాచ్‌లు పట్టుంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. మేం కొన్ని సార్లు మంచి బౌలింగ్ చేయగలిగినా... కోహ్లి, రహానే చాలా బాగా ఆడారు. తగిన వ్యూహాలతో ఆ సమయంలో మేం చేయగలిగిందంతా చేసినా లాభం లేకపోయింది. కోహ్లిలాంటి ఆటగాడిని మేం గౌరవిస్తాం. మైదానంలో కొన్ని సార్లు మాటలు అనుకుంటారు. అదేమీ వ్యక్తిగతం కాదు. ఆటలో భాగం మాత్రమే. కోహ్లి ఆ విషయం గురించి ఎంత మాట్లాడితే అది అతనిపై అంత ప్రభావం చూపించిందనేగా అర్థం.’
-ర్యాన్ హారిస్, ఆసీస్ బౌలర్