దుమ్మురేపిన బ్యాట్స్మెన్: ఆస్ట్రేలియా 517/7
ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు. ఒకరిని చూసి మరొకరు సెంచరీలు బాదేశారు. భారత బౌలర్ల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని చెలరేగిపోయారు. వెలుతురు లేక ఆట నిలిచిపోవడంతో రెండోరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 517 పరుగుల భారీ స్కోరు చేశారు. తొలిరోజు ఆటలో వార్నర్ 145 పరుగులతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించగా.. రెండోరోజు వర్షం అడ్డం పడినా కూడా ఏమాత్రం లెక్కచేయకుండా కెప్టెన్ మైఖేల్ క్లార్క్, మరో స్టార్ బ్యాట్స్మన్ స్మిత్ భారీగా పరుగుల వర్షం కురిపించారు. క్లార్క్ 128 పరుగులు చేసి కేవీ శర్మ బౌలింగులో పుజారాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
స్మిత్ మాత్రం తన పరుగుల దాహం ఇంకా తీరలేదన్నట్లు 162 పరుగులు చేసి ఇంకా నాటౌట్గానే మిగిలాడు. మిగిలిన వాళ్లలో ఒక్క మార్ష్ మినహా ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో షమీ, వరుణ్ ఆరోన్, కేవీ శర్మ రెండేసి వికెట్లు పంచుకోగా లంబూ ఇషాంత్ శర్మకు మాత్రం ఒక్క వికెట్టే దక్కింది. రెండోరోజు వర్షం అడ్డం పడటంతో కేవలం 31 ఓవర్లు మాత్రమే బౌలింగ్ జరిగింది. ఆట ముగిసే సమయానికి స్మిత్ 162 పరుగులతోను, జాన్సన్ 0 పరుగులతోను క్రీజులో ఉన్నారు.