michael clark
-
‘వాట్ ద హెల్.. అసలేం జరుగుతోంది’
ఆస్ట్రేలియా క్రికెట్ పరువు తీసారంటూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ఆసీస్ జట్టుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన డే- నైట్ వన్డేలో 242 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టిమ్ పెయిన్ సేన దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త ప్రదర్శన కావడంతో ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్... ‘ఇప్పుడే నిద్ర లేచాను. ఇంగ్లండ్ స్కోరు చూశాను. అసలు అక్కడ ఏం జరుగుతోంది. వాట్ ద హెల్ అంటూ’ ట్వీట్ చేశాడు. ఇక ఆసీస్ మాజీ సారథి మైకేల్ క్లార్క్ కూడా ట్విటర్ వేదికగా తమ జట్టు ప్రదర్శనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కాగా 1986లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 206 పరుగులతో ఓడిన ఆసీస్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఆ రికార్డును అధిగమించి మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. Just woke up and saw the score in England. What the hell happened over there & what is going on boys ? Gulp..... — Shane Warne (@ShaneWarne) June 19, 2018 Morning 🏏🤦♂️ — Michael Clarke (@MClarke23) June 19, 2018 -
సహచరులపై మైకేల్ క్లార్క్ ఆగ్రహం!
సిడ్నీ: తన సహచర ఆటగాళ్లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ పదునైన విమర్శలతో విరుచుకుపడ్డాడు. యాషెస్ సిరీస్ ను ఆసీస్ కోల్పోయిన అనంతరం మాజీ ఆటగాళ్లు ఆండ్రూ సైమండ్స్, మ్యాథ్యూ హేడెన్ లు క్లార్క్ శైలిని తప్పుబట్టారు. ఆ ఓటమికి క్లార్క్ ఆటతీరే ప్రధాన కారణం అంటూ విమర్శలు చేశారు. అటు తరువాత క్లార్క్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. కాగా, ఆనాటి విమర్శలను మనసులో పెట్టుకున్న క్లార్క్.. తాజాగా యాషెస్ 2015 పేరిట రాసిన డైరీలోఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు సైమండ్స్ కు తన నాయకత్వంపై మాట్లాడే హోదానే లేదంటూ మండిపడ్డాడు. ఓ టీవీ షో ముందు కూర్చొని మిగతా వారి నాయకత్వాన్ని ప్రశ్నించే అర్హత సైమండ్ కు ఎక్కడిదని ప్రశ్నించాడు. తనపై విమర్శలు చేసే ముందు అతని వ్యక్తిత్వాన్ని ముందుగా తెలుసుకుంటే మంచిదని సూచించాడు. సైమండ్స్ ఆడేటప్పుడు తాగి వచ్చేవాడని క్లార్క్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఆసీస్ జట్టు 2009లో ఇంగ్లండ్ లో పర్యటించినప్పుడు ఆల్కహాల్ ను తీసుకోవద్దంటూ ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా('సీఏ) మార్గదర్శకాలు జారీ చేసిన దాన్ని సైమండ్స్ అతిక్రమించి తన కాంట్రాక్టును కోల్పోయిన సంగతిని గుర్తు చేశాడు. దీంతో పాటు మాథ్యూ హెడెన్ వ్యవహార శైలిపై కూడా క్లార్క్ విరుచుకుపడ్డాడు.కెరీర్ ఆరంభంలో బ్యాట్స్‌మన్‌కు దగ్గరగా ఫీల్డింగ్ చేయడానికి క్లార్క్ నిరాకరించేవాడని, బలవంతంగా హెల్మెట్ అప్పగిస్తే బ్యాగీ గ్రీన్‌ను వెనక్కి ఇచ్చేస్తానని పాంటింగ్‌ను బెదిరించేవాడని అప్పట్లో హేడెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను సాధించింది ఏమైనా ఉంటే అది రికార్డులను చూస్తే అర్ధమవుతుందని హేడెన్ కు క్లార్క్ హితోపదేశం చేశాడు. వీరిద్దరితో పాటు ఆస్ట్రేలియి కోచ్ గా పనిచేసిన జాన్ బుచానన్ పై క్లార్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడూ జాతీయ జట్టుకు ఆడని బూచనన్ ఏమి సాధించడంటూ క్లార్క్ నిలదీశాడు. చివరకు తన ఇంట్లో పెంచుకున్న కుక్క జెర్రీ కూడా కొన్ని విజయాలను సొంతం చేసుకుంటే .. బుచానన్ వెనుక ఎటువంటి సక్సెస్ లేదంటూ క్లార్క్ ఎద్దేవా చేశాడు. -
దుమ్మురేపిన బ్యాట్స్‌మెన్: ఆస్ట్రేలియా 517/7
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. ఒకరిని చూసి మరొకరు సెంచరీలు బాదేశారు. భారత బౌలర్ల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని చెలరేగిపోయారు. వెలుతురు లేక ఆట నిలిచిపోవడంతో రెండోరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 517 పరుగుల భారీ స్కోరు చేశారు. తొలిరోజు ఆటలో వార్నర్ 145 పరుగులతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించగా.. రెండోరోజు వర్షం అడ్డం పడినా కూడా ఏమాత్రం లెక్కచేయకుండా కెప్టెన్ మైఖేల్ క్లార్క్, మరో స్టార్ బ్యాట్స్‌మన్ స్మిత్ భారీగా పరుగుల వర్షం కురిపించారు. క్లార్క్ 128 పరుగులు చేసి కేవీ శర్మ బౌలింగులో పుజారాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. స్మిత్ మాత్రం తన పరుగుల దాహం ఇంకా తీరలేదన్నట్లు 162 పరుగులు చేసి ఇంకా నాటౌట్‌గానే మిగిలాడు. మిగిలిన వాళ్లలో ఒక్క మార్ష్ మినహా ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో షమీ, వరుణ్ ఆరోన్, కేవీ శర్మ రెండేసి వికెట్లు పంచుకోగా లంబూ ఇషాంత్ శర్మకు మాత్రం ఒక్క వికెట్టే దక్కింది. రెండోరోజు వర్షం అడ్డం పడటంతో కేవలం 31 ఓవర్లు మాత్రమే బౌలింగ్ జరిగింది. ఆట ముగిసే సమయానికి స్మిత్ 162 పరుగులతోను, జాన్సన్ 0 పరుగులతోను క్రీజులో ఉన్నారు. -
బౌన్సర్లతోనే మొదలు!
ప్రాక్టీస్‌లో నిమగ్నమైన ఆస్ట్రేలియా నెట్స్‌లో దూకుడు తగ్గించని క్రికెటర్లు నేడు క్లార్క్‌కు ఫిట్నెస్ టెస్ట్ అడిలైడ్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఎట్టకేలకు విషాదం వీడి ఆట వైపు కదిలింది. ఫిల్ హ్యూస్ మరణం, తదనంతర పరిణామాలు, అంత్యక్రియల తర్వాత జట్టు సభ్యులంతా ఇప్పుడు తొలి సారి పూర్తి స్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెట్టారు. మొదటి టెస్టు మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా ఆటగాళ్లు శుక్రవారం సుదీర్ఘ సమయం పాటు సాధన చేశారు. నెట్స్‌లో ప్రాక్టీస్ సందర్భంగా ఆసీస్ ఆటగాళ్లలోని సహజమైన దూకుడు బయట పడింది. హ్యూస్ దుర్ఘటన నేపథ్యంలో ఆ జట్టు బౌన్సర్లకు దూరంగా ఉండవచ్చని చాలా మంది విశ్లేషించారు. అయితే దీనిని పటాపంచలు చేస్తూ జట్టు పేసర్లు సెషన్ ఆసాంతం షార్ట్ పిచ్ బంతులే విసిరారు. మిషెల్ జాన్సన్, పీటర్ సిడిల్, జోష్ హాజల్‌వుడ్ తమ బ్యాట్స్‌మెన్‌కు వరుసగా బౌన్సర్లు సంధిం చారు. ప్రాక్టీస్ చూస్తే హ్యూస్ మృతి ప్రభావం ఆసీస్‌పై లేనట్లే కనిపించింది. ‘మేమెప్పుడూ ఇలాగే ఆడతాం. ఇదే తరహాలో ఆడి మేం మంచి ఫలితాలు సాధించాం కాబట్టి మారాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే టెస్టు క్రికెట్‌ను మా శైలిలోనే ఆడతాం. మా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంది’ అని ఈ సందర్భంగా ఆసీస్ కోచ్ డారెన్ లీమన్ వ్యాఖ్యానించారు. అండగా జూనియర్ బౌలర్లు: భారత జట్టు బలాలు, బలహీనతలపై దృష్టి పెట్టిన ఆస్ట్రేలియా జూనియర్ క్రికెటర్లను తమ ప్రాక్టీస్‌లో భాగం చేసింది. భారత్‌తో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఆడిన ఐదుగురు బౌలర్లు మొదటి టెస్టు వరకు ఆసీస్ టీమ్‌తోనే ఉండి వారికి సహకరిస్తారు. క్లార్క్ ఆడతాడా!: తొలి టెస్టులో క్లార్క్ బరిలోకి దిగడంపై దోబూచులాట ఇంకా కొనసాగుతోంది. శనివారం అతనికి ఫిట్నెస్ టెస్టు నిర్వహించనున్నారు. బౌన్సర్‌తో ప్రారంభించండి!: భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో విసిరే తొలి బంతి బౌన్సర్ కావాలని మాజీ పేసర్ మెర్వ్ హ్యూస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో వైపు పరిస్థితులను అర్థం చేసుకొని షెడ్యూల్లో మార్పులకు అంగీకరించిన భారత జట్టుకు, మేనేజ్మెంట్కు ఆసీస్ మాజీ క్రికెటర్, సీఏ డెరైక్టర్ మైకేల్ కాస్పరోవిచ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఆ ‘పిచ్’కూ రిటైర్మెంట్... బౌన్సర్ తగిలి ఫిల్ హ్యూస్ కుప్పకూలిన ఏడో నంబర్ పిచ్‌పై ఇక ముందు ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించబోమని సిడ్నీ మైదానం క్యురేటర్ పార్కర్ చెప్పాడు. -
ఆస్ట్రేలియా 273/5
అడిలైడ్: బ్యాట్స్‌మెన్ బాధ్యతా యుతంగా ఆడటంతో ఇంగ్లండ్ తో గురువారం మొదలైన యాషెస్ సిరీస్ రెండో టెస్టు తొలి రోజు ఆస్ట్రేలియా గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 91 ఓవర్లలో 5 వికెట్లకు 273 పరుగులు చేసింది. క్లార్క్ (48 బ్యాటింగ్), హాడిన్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు రోజర్స్ (167 బంతుల్లో 11 ఫోర్లతో 72), వాట్సన్ (119 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 51) నిలకడగా ఆడి రెండో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. చివరి సెషన్లో బెయిలీ (93 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53) దూకుడుగా ఆడాడు. 10 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను పనేసర్ వదిలేయడంతో బయటపడిన బెయిలీ ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ 2, అండర్సన్, స్వాన్, పనేసర్ తలా ఓ వికెట్ తీశారు. -
ఆసీస్ ఆధిక్యం కొనసాగేనా?
అడిలైడ్: ప్రతీకార పోరుగా భావిస్తున్న యాషెస్ సిరీస్‌లో రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. తొలి టెస్టులో ఘోరంగా ఓడిన ఇంగ్లండ్ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలని ప్రయత్నిస్తుండగా... సొంతగడ్డపై ఆధిక్యాన్ని కొనసాగించాలని ఆసీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి (గురువారం) నుంచి అడిలైడ్‌లో ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అదరగొడుతున్న ఆసీస్ ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో క్లార్క్, వార్నర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కానీ టాప్ ఆర్డర్లో మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం అందడం లేదు. వాట్సన్, రోజర్స్, స్మిత్‌ల నుంచి భారీ ఇన్నింగ్స్‌లు రావాల్సి ఉంది. మిడిలార్డర్లో హాడిన్, జాన్సన్ రాణిస్తుండటం ఆసీస్‌కు లాభిస్తోంది. ఇక బౌలింగ్‌లో జాన్సన్ ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. స్థిరంగా 150 కి.మీ వేగంతో బంతులు విసురుతూ కుక్ సేనను వణికించాడు. ఓ రకంగా చెప్పాలంటే తొలి టెస్టులో జాన్సన్ బౌలింగ్ వల్లే ఆసీస్ గెలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ టెస్టులో కూడా ఈ యువ బౌలర్ సత్తా చాటుతాడా? ఈ మ్యాచ్‌లోనూ కంగారులకు ఆధిక్యాన్ని అందిస్తాడా? అన్నదే ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్న అంశం. మరోవైపు తొలి టెస్టు ఓటమితో ఇంగ్లండ్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. బ్యాటింగ్‌లో కుక్ మినహా... మిగతా బ్యాట్స్‌మన్ నిరాశపరుస్తున్నారు. పీటర్సన్, బెల్, రూట్లు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. అనుభవజ్ఞుడైన ట్రాట్ మానసిక ఒత్తిడి కారణంగా సిరీస్ నుంచి వైదొలగడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ. అయితే ఈ స్థానంలో బెల్, రూట్, బాలెన్స్లలో ఎవర్ని పంపుతారన్నది ఆసక్తికరం. ఆరంభంలో బ్రాడ్ బంతితో చెలరేగినా.. చివర్లో ప్రభావం చూపలేకపోతున్నాడు.