సహచరులపై మైకేల్ క్లార్క్ ఆగ్రహం!
సిడ్నీ: తన సహచర ఆటగాళ్లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ పదునైన విమర్శలతో విరుచుకుపడ్డాడు. యాషెస్ సిరీస్ ను ఆసీస్ కోల్పోయిన అనంతరం మాజీ ఆటగాళ్లు ఆండ్రూ సైమండ్స్, మ్యాథ్యూ హేడెన్ లు క్లార్క్ శైలిని తప్పుబట్టారు. ఆ ఓటమికి క్లార్క్ ఆటతీరే ప్రధాన కారణం అంటూ విమర్శలు చేశారు. అటు తరువాత క్లార్క్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. కాగా, ఆనాటి విమర్శలను మనసులో పెట్టుకున్న క్లార్క్.. తాజాగా యాషెస్ 2015 పేరిట రాసిన డైరీలోఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు సైమండ్స్ కు తన నాయకత్వంపై మాట్లాడే హోదానే లేదంటూ మండిపడ్డాడు. ఓ టీవీ షో ముందు కూర్చొని మిగతా వారి నాయకత్వాన్ని ప్రశ్నించే అర్హత సైమండ్ కు ఎక్కడిదని ప్రశ్నించాడు. తనపై విమర్శలు చేసే ముందు అతని వ్యక్తిత్వాన్ని ముందుగా తెలుసుకుంటే మంచిదని సూచించాడు.
సైమండ్స్ ఆడేటప్పుడు తాగి వచ్చేవాడని క్లార్క్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఆసీస్ జట్టు 2009లో ఇంగ్లండ్ లో పర్యటించినప్పుడు ఆల్కహాల్ ను తీసుకోవద్దంటూ ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా('సీఏ) మార్గదర్శకాలు జారీ చేసిన దాన్ని సైమండ్స్ అతిక్రమించి తన కాంట్రాక్టును కోల్పోయిన సంగతిని గుర్తు చేశాడు. దీంతో పాటు మాథ్యూ హెడెన్ వ్యవహార శైలిపై కూడా క్లార్క్ విరుచుకుపడ్డాడు.కెరీర్ ఆరంభంలో బ్యాట్స్‌మన్‌కు దగ్గరగా ఫీల్డింగ్ చేయడానికి క్లార్క్ నిరాకరించేవాడని, బలవంతంగా హెల్మెట్ అప్పగిస్తే బ్యాగీ గ్రీన్‌ను వెనక్కి ఇచ్చేస్తానని పాంటింగ్‌ను బెదిరించేవాడని అప్పట్లో హేడెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను సాధించింది ఏమైనా ఉంటే అది రికార్డులను చూస్తే అర్ధమవుతుందని హేడెన్ కు క్లార్క్ హితోపదేశం చేశాడు.
వీరిద్దరితో పాటు ఆస్ట్రేలియి కోచ్ గా పనిచేసిన జాన్ బుచానన్ పై క్లార్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడూ జాతీయ జట్టుకు ఆడని బూచనన్ ఏమి సాధించడంటూ క్లార్క్ నిలదీశాడు. చివరకు తన ఇంట్లో పెంచుకున్న కుక్క జెర్రీ కూడా కొన్ని విజయాలను సొంతం చేసుకుంటే .. బుచానన్ వెనుక ఎటువంటి సక్సెస్ లేదంటూ క్లార్క్ ఎద్దేవా చేశాడు.