
చాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్ దశలో తమ జట్టుకు గట్టిపోటీ తప్పదంటున్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed). టీమిండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ల జట్ల రూపంలో కఠిన సవాలు ఎదురుకానుందని పేర్కొన్నాడు. అయితే, సొంతగడ్డపై జరిగే ఈ టోర్నీలో పాకిస్తాన్(Pakistan) తప్పకుండా సెమీ ఫైనల్‌కు మాత్రం చేరుతుందని సర్ఫరాజ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశాడు.
కాగా 2017లో చివరగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్లో పాక్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. నాడు సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో లండన్ వేదికగా జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది.
ఎనిమిదేళ్ల అనంతరం
ఇక ఇప్పుడు.. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం ఈ మెగా టోర్నీ మరోసారి జరుగనుండగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది.
ఇక ఈ ఐసీసీ ఈవెంట్‌కు పాకిస్తాన్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి.
ఈ క్రమంలో ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ , ఇంగ్లండ్‌ను చేర్చారు. ఇక పాక్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడనుంది.
సెమీ ఫైనల్స్‌లో ఆ నాలుగే
ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సెమీస్ చేరే జట్లపై తన అంచనా తెలియజేశాడు. ‘‘పాకిస్తాన్ ఉన్న గ్రూపులో జట్ల నుంచి గట్టి పోటీ తప్పదు. అయితే, నా అభిప్రాయం ప్రకారం... ఈసారి పాకిస్తాన్, ఇండియా, అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా బలమైన జట్లుగా కనిపిస్తున్నాయి. సెమీ ఫైనల్స్ ఈ నాలుగే చేరతాయి’’ అని సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు.
ఇక తమ జట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ టీమ్ పటిష్టంగా ఉంది. సొంతగడ్డపై టోర్నీ ఆడనుండటం అతిపెద్ద సానుకూలాంశం. సొంత మైదానాల్లో ఎలా ఆడాలన్న అంశంపై ప్రతి ఒక్క ఆటగాడికి అవగాహన ఉంది. 2017లో ట్రోఫీ గెలిచిన జట్టుతో పోలిస్తే.. ప్రస్తుత జట్టు మరింత స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది.
ప్రధాన బలం వారే
బాబర్ ఆజం రూపంలో జట్టులో వరల్డ్‌క్లాస్ ప్లేయర్ ఉన్నాడు. ఫఖర్ జమాన్ ఆనాడు కొత్తగా జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు అనుభవం కలిగిన ఆటగాడిగాబరిలోకి దిగబోతున్నాడు. వీళ్దిద్దరు పాకిస్తాన్ జట్టుకు ప్రధాన బలం’’ అని సర్ఫరాజ్ అహ్మద్ చెప్పుకొచ్చాడు.
కాగా 2017లో చివరగా ఐసీసీ టైటిల్ గెలిచిన పాకిస్తాన్ ఇప్పటివరకు మళ్లీ మెగా ఈవెంట్లలో గెలుపు రుచిచూడలేదు. 2023 వన్డే వరల్డ్‌కప్, టీ20 ప్రపంచకప్-2024లో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది.
ఇప్పుడు స్వదేశంలోనైనా.. గత చేదు అనుభవాలను మరిపించేలా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇటీవల వన్డే సిరీస్‌లలో వరుస విజయాలతో జోరు మీదున్న పాక్ జట్టుకు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో పరాభవం ఎదురైంది.
మహ్మద్ రిజ్వాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ విజయం సాధించిన పాక్.. సౌతాఫ్రికాలో 3-0తో క్లీన్‌స్వీప్ చేసి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. అయితే, తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌తో జరిగిన ట్రై సిరీస్‌లో ఫైనల్ చేరుకున్న రిజ్వాన్ బృందం కివీస్ చేతిలో ఓటమిపాలైంది.
చదవండి: డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ మాత్రమే.. మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్ర: నీతా అంబానీ
Comments
Please login to add a commentAdd a comment