బౌన్సర్లతోనే మొదలు!
ప్రాక్టీస్‌లో నిమగ్నమైన ఆస్ట్రేలియా
నెట్స్‌లో దూకుడు తగ్గించని క్రికెటర్లు
నేడు క్లార్క్‌కు ఫిట్‌నెస్ టెస్ట్
అడిలైడ్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఎట్టకేలకు విషాదం వీడి ఆట వైపు కదిలింది. ఫిల్ హ్యూస్ మరణం, తదనంతర పరిణామాలు, అంత్యక్రియల తర్వాత జట్టు సభ్యులంతా ఇప్పుడు తొలి సారి పూర్తి స్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెట్టారు. మొదటి టెస్టు మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా ఆటగాళ్లు శుక్రవారం సుదీర్ఘ సమయం పాటు సాధన చేశారు. నెట్స్‌లో ప్రాక్టీస్ సందర్భంగా ఆసీస్ ఆటగాళ్లలోని సహజమైన దూకుడు బయట పడింది. హ్యూస్ దుర్ఘటన నేపథ్యంలో ఆ జట్టు బౌన్సర్లకు దూరంగా ఉండవచ్చని చాలా మంది విశ్లేషించారు.
అయితే దీనిని పటాపంచలు చేస్తూ జట్టు పేసర్లు సెషన్ ఆసాంతం షార్ట్ పిచ్ బంతులే విసిరారు. మిషెల్ జాన్సన్, పీటర్ సిడిల్, జోష్ హాజల్‌వుడ్ తమ బ్యాట్స్‌మెన్‌కు వరుసగా బౌన్సర్లు సంధిం చారు. ప్రాక్టీస్ చూస్తే హ్యూస్ మృతి ప్రభావం ఆసీస్‌పై లేనట్లే కనిపించింది. ‘మేమెప్పుడూ ఇలాగే ఆడతాం. ఇదే తరహాలో ఆడి మేం మంచి ఫలితాలు సాధించాం కాబట్టి మారాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే టెస్టు క్రికెట్‌ను మా శైలిలోనే ఆడతాం. మా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంది’ అని ఈ సందర్భంగా ఆసీస్ కోచ్ డారెన్ లీమన్ వ్యాఖ్యానించారు.
అండగా జూనియర్ బౌలర్లు: భారత జట్టు బలాలు, బలహీనతలపై దృష్టి పెట్టిన ఆస్ట్రేలియా జూనియర్ క్రికెటర్లను తమ ప్రాక్టీస్‌లో భాగం చేసింది. భారత్‌తో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఆడిన ఐదుగురు బౌలర్లు మొదటి టెస్టు వరకు ఆసీస్ టీమ్‌తోనే ఉండి వారికి సహకరిస్తారు.
క్లార్క్ ఆడతాడా!: తొలి టెస్టులో క్లార్క్ బరిలోకి దిగడంపై దోబూచులాట ఇంకా కొనసాగుతోంది. శనివారం అతనికి ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించనున్నారు. బౌన్సర్‌తో ప్రారంభించండి!: భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో విసిరే తొలి బంతి బౌన్సర్ కావాలని మాజీ పేసర్ మెర్వ్ హ్యూస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో వైపు పరిస్థితులను అర్థం చేసుకొని షెడ్యూల్‌లో మార్పులకు అంగీకరించిన భారత జట్టుకు, మేనేజ్‌మెంట్‌కు ఆసీస్ మాజీ క్రికెటర్, సీఏ డెరైక్టర్ మైకేల్ కాస్పరోవిచ్ కృతజ్ఞతలు తెలిపాడు.
ఆ ‘పిచ్’కూ రిటైర్మెంట్...
బౌన్సర్ తగిలి ఫిల్ హ్యూస్ కుప్పకూలిన ఏడో నంబర్ పిచ్‌పై ఇక ముందు ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించబోమని సిడ్నీ మైదానం క్యురేటర్ పార్కర్ చెప్పాడు.