phil hughes
-
ఉలిక్కిపడ్డ ఆసీస్ క్రికెట్.. బంతి తగిలి క్రికెటర్‌కు గాయం
ఆస్ట్రేలియా క్రికెట్ మరోసారి ఉలిక్కిపడింది. బంతి తలకు తగిలి 26 ఏళ్ల విల్ పుకోస్కీ అనే క్రికెటర్ గాయపడ్డాడు. అదృష్టవశాత్తు ఎలాంటి హాని జరగనప్పటికీ... ఈ ఉదంతం దివంగత ఫిల్ హ్యూస్ విషాదాన్ని గుర్తు చేసింది. 2014లో హ్యూస్ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో బంతి తలకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు అదే షెఫీల్డ్ షీల్డ్‌లో ఇంచుమించు అలాంటి ఘటనే జరగడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఉలిక్కిపడింది. పుకోస్కీకి తగిలిన గాయం తీవ్రమైంది కానప్పటికీ అతను మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రిలే మెరిడిత్ వేసిన బంతి పుకోస్కీ హెల్మెట్‌ను బలంగా తాకడంతో కొద్దిసేపు అతను నొప్పితో విలవిలలాడిపోయాడు. పుకోస్కీ ఆస్ట్రేలియా తరఫున ఓ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌లు ఆడి 72 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. మ్యాచ్ విషయానికొస్తే.. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టస్మానియా టైగర్స్-విక్టోరియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. పుకోస్కీ విక్టోరియాకు.. మెరిడిత్ టస్మానియాకు ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో విక్టోరియా విజయానికి దగ్గరగా ఉంది. మరో 69 పరుగులు చేస్తే ఈ జట్టు విజయం సాధిస్తుంది. చేతిలో మరో రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో విక్టోరియా కలవరపడుతుంది. కెప్టెన్ సదర్‌ల్యాండ్ (17), టాడ్ మర్ఫీ (0) క్రీజ్‌లో ఉన్నారు. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పుకోస్కీ (0) మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది. టస్మానియా 240 & 307 విక్టోరియా 106 & 373/8 -
'చంపేస్తాననే మాటను నేను వినలేదు'
కేప్ టౌన్:ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మరణించి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. 2014, నవంబర్ 25వ తేదీన సిడ్నీ గ్రౌండ్లో దేశవాళీ మ్యాచ్‌లో పాల్గొన్న హ్యూస్కు చివరి మ్యాచ్ అదే. సీన్ అబాట్ వేసిన బౌన్సర్ కు అతని మెడ వెనుక భాగాన తగిలి హ్యూస్ గ్రౌండ్‌లోనే కుప్పుకూలిపోయాడు. ఆ తరువాత రెండు రోజులకు హ్యూస్ తుదిశ్వాస విడిచాడు. అయితే ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించి న్యాయ విచారణ కొనసాగుతోంది. ప్రత్యర్థి జట్టు వ్యూహంలో భాగంగానే హ్యూస్ కు బౌన్సర్లు సంధించి అతని మృతికి పరోక్షంగా కారణమయ్యారంటూ పలువురు ఆటగాళ్లతో పాటు అతని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో దానిపై విచారణ సాగుతోంది. సీన్ అబాట్ వేసిన బౌన్సర్ కు ముందు హ్యూస్ వద్దకు బొలింజర్ వచ్చి చంపుతానంటూ బెదిరించడంటూ వచ్చిన ఆరోపణలపై ప్రధానంగా విచారణ చేపట్టారు. ఈ మేరకు చివరి రోజు విచారణ మరో మలుపు తిరిగింది. ఆ సమయంలో హ్యూస్ తో క్రీజ్ లో ఉన్న బ్యాటింగ్ పార్టనర్ టామ్ కూపర్ అటువంటిది ఏమీ జరగలేదని పేర్కొన్నాడు. బొలింజర్ నుంచి చంపేస్తానని వ్యాఖ్యలు వినలేదని కూపర్ తాజాగా తెలిపాడు. దీనిపై హ్యూస్ కుటుంబం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానంగా హ్యూస్ తండ్రి గ్రెగ్ హ్యూస్ తీవ్ర ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. -
నేను నిన్ను చంపేస్తా?
సిడ్నీ: దాదాపు రెండేళ్ల క్రితంనాటి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ విషాద మరణాన్ని ఎవరూ మరచిపోలేదు. మైదానంలో బంతి తగిలిన అతను ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. అయితే ఇప్పుడు ఆ ఘటనపై సోమవారం నుంచి న్యాయ విచారణ జరుపుతుండంతో అతని మరణం మళ్లీ వార్తల్లో నిలిచింది. హ్యూస్కు సీన్ అబాట్ బౌన్సర్ విసిరిన ఆ మ్యాచ్‌కు సంబంధించి ప్రత్యర్థి జట్టు వ్యూహ ప్రతివ్యూహాలు, స్లెడ్జింగ్‌కు సంబంధించి అతి చిన్న విషయాలపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. అతనిపై పదే పదే షార్ట్ పిచ్ బంతులు విసరాలని న్యూ సౌత్‌వేల్స్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ చెప్పినట్లు విచారణలో తేలింది. ఒకదశలో హ్యూస్ వద్దకు వచ్చి బొలింజర్ ’నేను నిన్ను చంపబోతున్నాను’ అని కూడా వ్యాఖ్యానించినట్లు మరో క్రికెటర్ విచారణలో వెల్లడించాడు. అయితే బొలింజర్ దీనిని ఖండించాడు. సరిగ్గా ఇవే కారణాలు హ్యూస్ మృతికి కారణమని చెప్పకపోయినా... విచారణ అధికారులు మాత్రం తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. -
'హ్యూస్.. ఇంకా నీ జ్ఞాపకాలతోనే'
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మరణించి దాదాపు ఏడాది కావొస్తోంది. గత సంవత్సరం సిడ్నీలో స్థానిక జట్టుతో క్రికెట్ ఆడుతూ బౌలర్ సియాన్ అబోట్ వేసిన బౌన్సర్ కు గాయపడిన హ్యూస్.. కొన్ని రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. ఆస్ట్రేలియా క్రికెట్ లో చోటు చేసుకున్న ఆ విషాదకర జ్ఞాపకాలు ఆటగాళ్లను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. శుక్రవారం ఫిల్ హ్యూస్ మొదటి వర్థంతి సందర్భంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఆనాటి చేదు జ్ఞాపకాలు తనను ఇంకా కలచి వేస్తూనే ఉన్నాయని తెలిపాడు. ఒకపక్క కూతురు రాకతో తన జీవితంలోకి ఆనంద క్షణాలు రాగా, మరోపక్క తన ప్రియ మిత్రుడు, 'తమ్ముడు' హ్యూస్ వర్థంతి రావడం తీరని బాధను మోసుకొచ్చిందన్నాడు. హ్యూస్ జ్ఞాపకాలు ఎప్పటికీ తనతో ఉంటాయన్నాడు. హ్యూస్ అర్థాంతరంగా మమ్మల్ని వదిలి వెళ్లిపోవడం గురించే ప్రతీ రోజు మదన పడుతూనే ఉంటానని క్లార్క్ తెలిపాడు. హ్యూస్ మరణాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియా తరపున 25 టెస్టు మ్యాచ్ లు ఆడిన ఫిల్ హ్యూస్ గతేడాది నవంబర్ 27 వ తేదీన తుదిశ్వాస విడిచాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలో అబాట్ వేసిన కారణంగా హ్యూస్ కుప్పుకూలిపోయాడు. ఆ తరువాత హ్యూస్ ను బ్రతికేంచేందుకు డాక్టర్లు చేసిన ప్రయోగాలు ఫలించలేదు. -
ఆటకు ప్రాణం ‘అంకితం’!
మైదానంలో గాయపడి మరణించిన బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం కోల్‌కతా: క్రికెట్ మైదానం మరో కుర్రాడిని బలిగొంది. ఆటను ప్రాణంగా ప్రేమించిన ఒక యువ ఆటగాడు చివరకు ఆ ఆటకే ప్రాణాలు అర్పించాడు. ఈ సారి బలమైన బంతి లేదు... బలహీనమైన హెల్మెట్ లేదు... ‘సబ్‌స్టిట్యూట్’గా వచ్చిన ఒక ప్రతిభావంతుడిని మృత్యువు తీసుకుపోయింది. ఆస్ట్రేలియాలో ఫిల్ హ్యూస్ ఉదంతం మది దాటకముందే భారత్‌లో మరో యువ ఆటగాడు మైదానంలో అసువులు బాసాడు. మూడు రోజుల క్రితం జరిగిన మ్యాచ్‌లో గాయపడిన బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి సోమవారం కన్ను మూశాడు. చికిత్స పొందుతూ తీవ్రమైన గుండె నొప్పి రావడంతో అతను మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. 20 ఏళ్ల ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అంకిత్, బెంగాల్ అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2014 అండర్-19 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన భారత ప్రాబబుల్స్‌లో కూడా ఉన్న అతను...తాజా సీజన్లో అండర్-23 సీకే నాయుడు ట్రోఫీలో కూడా పాల్గొన్నాడు. ఒకటి, రెండేళ్లలో బెంగాల్ రంజీ జట్టుకు ఎంపిక కాగలడని భావించిన కేసరి, విషాద రీతిలో చిన్న వయసులోనే లోకం వీడాడు. అసలేం జరిగిందంటే.. బెంగాల్ డివిజన్ 1 నాకౌట్ పోటీల్లో భాగంగా ఈ నెల 17న ఈస్ట్ బెంగాల్, భవానీపూర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈస్ట్ బెంగాల్ తుది జట్టులో కూడా అంకిత్ లేడు. అర్నబ్ నంది స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన అతను...భవానీపూర్ జట్టు ఇన్నింగ్స్ 44వ ఓవర్లో డీప్ కవర్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ బంతిని గాల్లోకి లేపాడు. అంకిత్‌తో పాటు ఆ బంతిని అందుకునేందుకు బౌలర్ సౌరవ్ మొండల్ కూడా పరుగెత్తుకొచ్చాడు. ఒకరిని గుర్తించని మరొకరు ఒక్కసారిగా ఢీకొన్నారు. పాయింట్ ఫీల్డర్ కథనం ప్రకారం మొండల్ మోకాలు...అంకిత్ తల, మెడ భాగానికి గట్టిగా తగిలింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అంకిత్ ఊపిరి తీసుకోలేకపోగా...అతని నోట్లోంచి రక్తం రావడం మొదలైంది. దాంతో జట్టు సభ్యుడొకరు తన నోటి ద్వారా అతనికి శ్వాస అందించే (సీపీఆర్) ప్రయత్నం చేశాడు. దీంతో స్పృహలోకి వచ్చిన అంకిత్‌ను వెంటనే దగ్గరిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోలుకున్నట్లు కనిపించినా.... స్థానిక ఆస్పత్రిలో అంకిత్‌కు మూడు రోజులుగా చికిత్స అందిస్తున్నారు. ఆదివారం కూడా అతని పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)కు సమాచారం అందించారు. సోమవారం దీనిపై స్పెషలిస్ట్‌లతో మాట్లాడాలని కూడా వారు నిర్ణయించారు. అయితే ఒక్కసారిగా ‘కార్డియాక్ అరెస్ట్’తో అంకిత్ సోమవారం తెల్లవారు జామున కన్ను మూశాడు. అయితే వైద్య సేవల్లో నిర్లక్ష్యమే తన కొడుకు ప్రాణం తీసిందని అతని తండ్రి రాజ్‌కుమార్ కేసరి ఆరోపించారు. ‘శుక్రవారం పరీక్షల తర్వాత అంతా బాగుందని డాక్టర్లు చెప్పారు. ఐసీయూనుంచి జనరల్ వార్డుకు మారుస్తామని కూడా చెప్పారు. ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా జ్వరం పెరిగిందని అన్నారు. దాంతో మేం మరో ఆస్పత్రికి మార్పించాం. వారు కూడా చిన్న గాయమేనని, 3-4 రోజుల్లో తగ్గుతుందని చెప్పారు. చికిత్స బాగా జరిగితే నా కొడుకు ప్రాణాలు దక్కేవి’ అని ఆయన ఆవేదనగా చెప్పారు. క్రికెట్ ప్రపంచం నివాళి అంకిత్ కేసరి మృతితో అతని సహచరులు, బెంగాల్ క్రికెటర్లంతా విషాదంలో మునిగిపోయారు. సచిన్ టెండూల్కర్ మొదలు మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు అంతా సంతాపం ప్రకటించారు. ‘మైదానంలోని అనూహ్య ఘటన ఒక మంచి కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించింది’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ తారలు సంతాపం తెలిపారు. -
హ్యూస్ జ్ఞాపకాలు వెంటాడుతాయి!
నాలుగో టెస్టుపై వాట్సన్ సిడ్నీ: ఫిల్ హ్యూస్ మైదానంలో బౌన్సర్ దెబ్బకు కుప్పకూలినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. హ్యూస్ అంత్యక్రియల తర్వాత మొదటిసారి ఇక్కడికి వచ్చాడు. ఇలాంటి స్థితిలో టెస్టు మ్యాచ్ ఆడనున్న షేన్ వాట్సన్ తన దివంగత మిత్రుడిని గుర్తు చేసుకున్నాడు. ‘ఫిల్ అంత్యక్రియల తర్వాత ఇప్పుడే సిడ్నీ గ్రౌండ్‌కు వచ్చాను. నాటి ఘటనను మరిచేందుకు గత కొద్ది రోజులుగా నేను ప్రయత్నిస్తున్నాను. అయితే ఒక్కసారి క్రీజ్‌లోకి వెళితే ఆ దృశ్యమే కళ్ల ముందు కదలాడుతుంది. ముఖ్యంగా మా నలుగురం ఎలా ఉండగలమో చెప్పలేను. అయితే జట్టుగా మేమంతా స్థైర్యంగా ఉండి దానిని అధిగమిస్తాం’ అని వాట్సన్ అన్నాడు. ఫామ్‌లోకి వస్తా... ఈ సిరీస్‌లో మూడు టెస్టులు ముగిసినా వాట్సన్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. దీన్నుంచి బయటపడి నాలుగో టెస్టులో రాణిస్తానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘నేను తీవ్రంగా కష్టపడుతున్నా సిరీస్‌లో మాత్రం అనుకున్న రీతిలో ఆడలేకపోయాను. పరుగులు చేయకపోవడంతో నాపై ఒత్తిడి ఉంది. రెండు విభాగాల్లోనూ జట్టు విజయంలో నా పాత్ర కూడా ఉండేందుకు సిడ్నీ టెస్టులో ప్రయత్నిస్తా’ అని అతను చెప్పాడు. షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో ఇప్పుడు హాడిన్‌ను ఆదర్శంగా తీసుకుంటానని, అతనిలాగే పట్టుదలగా ఆడి నిలబడతానని వాట్సన్ అన్నాడు. -
ఎవరెస్ట్‌పైకి హ్యూస్ బ్యాట్
మెల్బోర్న్: మైదానంలో బంతి తగిలి మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్కు నేపాల్ క్రికెట్ సంఘం (సీఏఎన్) ఘనంగా నివాళి అర్పించనుంది. హ్యూస్ ఆడిన ఏదైనా ఒక బ్యాట్, అతని క్రికెట్ దుస్తులను తమకు ఇస్తే వాటిని ఎవరెస్ట్ శిఖరంపైకి చేరుస్తామని సీఏఎన్... ఆస్ట్రేలియా బోర్డు (సీఏ)కు లేఖ రాసింది. దీనికి సీఏ స్పందించింది. మార్చి-ఏప్రిల్ నెలలో ఎవరెస్ట్ ఎక్కే సీజన్ సమయానికి సీఏ అధికారులు హ్యూస్ బ్యాట్‌ను నేపాల్‌కు పంపుతారు. కామెంటేటర్‌గా ఆకట్టుకున్న క్లార్క్ గాయం కారణంగా క్రికెట్ కెరీర్ సందేహంలో పడినా... ఆస్ట్రేలియా స్టార్ మైకేల్ క్లార్క్ కొత్త కెరీర్లో నిలదొక్కుకోవచ్చు. భారత్, ఆస్ట్రేలియాల మూడో టెస్టు తొలి రోజున కామెంటేటర్ అవతారం ఎత్తిన క్లార్క్ ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లు షమీ, ఉమేశ్‌లను క్లార్క్ కామెంటరీలో ప్రశంసించాడు. -
మైదానంలోనే తుది శ్వాస...
గుండెపోటుతో ముంబైలో క్రికెటర్ మృతి ముంబై: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ దుర్మరణం సంఘటన ఇంకా మదిలో మెదులుతుండగానే... మరో యువ క్రికెటర్ మైదానంలో తుది శ్వాస విడిచాడు. ఈ సంఘటన ముంబైలోని ఓవల్ మైదాన్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. టాటా గ్రూప్ ఆధ్వరంలో జరిగిన ఇంటర్ ఆఫీస్ టోర్నీ సందర్భంగా ఈ దుస్సంఘటన చోటు చేసుకుంది. పవర్ ట్రాంబే స్టేషన్ జట్టుకు చెందిన 29 ఏళ్ల రత్నాకర్ మోరె వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా గుండెలో నొప్పి రావడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. నిర్వాహకులు అప్పటికప్పుడు రత్నాకర్‌ను ఆసుపత్రికి తరలించగా... అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రత్నాకర్ మృతితో టోర్నమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు టాటా స్పోర్ట్స్ క్రికెట్ వ్యవహారాలను పర్యవేక్షించే భారత జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ తెలిపారు. ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) గుర్తింపు పొందిన ఈ టోర్నీని టాటా పవర్ కంపెనీ గత రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తోంది. -
బాధను మరచి... బ్యాట్ తో మెరిసి
ఆస్ట్రేలియా దూకుడు తొలి ఇన్నింగ్స్‌లో 354/6 వార్నర్ అద్భుత సెంచరీ రాణించిన స్మిత్, క్లార్క్ భావోద్వేగాలు ఉన్నాయి... బౌన్సర్లూ ఉన్నాయి... గుండెల్లో అభిమానం ఉంది... మైదానంలో దూకుడూ ఉంది... ఆటలో ఆస్ట్రేలియన్లు తమ శైలిని మార్చుకోలేదు... అటు భారత ఆటగాళ్లూ వెనక్కి తగ్గలేదు... అడిలైడ్‌లో తొలి రోజు దృశ్యాలివి... గత రెండు వారాల పరిణామాల అనంతరం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరినీ ఆట మరో సారి ఒక చోటికి చేర్చింది. ‘63’కు వందనం చేసినా... అందరూ ‘408’గా మారిపోయినా...విషాదం దాటి చివరకు క్రికెట్ విజేతగా నిలిచింది. సహచరుడికి ఆటతోనే నివాళి ఇవ్వాలనుకుంటూ మైదానంలో దిగిన ఆస్ట్రేలియా మొదటి టెస్టులో తొలి రోజును తమదిగా మార్చుకుంది. చివర్లో టీమిండియా కూడా తేరుకొని కొంత వరకు పుంజుకుంది. అందరి అంచనాలకు అనుగుణంగా సిరీస్‌కు రసవత్తర ఆరంభం లభించింది. అడిలైడ్: ఆత్మీయ స్నేహితుడు, సహచరుడు ఫిల్ హ్యూస్ రూపం మనసులో కదలాడుతుండగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన ఆటతోనే అతనికి సరైన నివాళి అందించాడు. వేడుక చేసుకోవాలో, లేదో తెలీని సందిగ్ధ స్థితిలోనూ తన అద్భుత ప్రదర్శనతో ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. వార్నర్ (163 బంతుల్లో 145; 19 ఫోర్లు) సూపర్ బ్యాటింగ్‌తో మంగళవారం భారత్‌తో ఇక్కడ ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆసీస్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు మంగళవారం ఆట ముగిసే సమయానికి 89.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్ (130 బంతుల్లో 72 బ్యాటింగ్; 9 ఫోర్లు) క్రీజ్‌లో ఉండగా... కెప్టెన్ క్లార్క్ (84 బంతుల్లో 60 రిటైర్డ్ హర్ట్; 9 ఫోర్లు) వెన్ను నొప్పి తిరగబెట్టడంతో మైదానం వీడాడు. ఒక దశలో 345/3తో ఉన్న ఆసీస్, 9 పరుగుల వ్యవధిలో తర్వాతి 3 వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో షమీ, ఆరోన్ చెరో రెండు వికెట్లు తీశారు. కరణ్, ఇషాంత్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. రెండో రోజు బుధవారం ఆసీస్‌ను తొందరగా ఆలౌట్ చేస్తే భారత్ ఈ మ్యాచ్‌లో నిలబడే అవకాశం ఉంటుంది. కెప్టెన్‌గా తొలి టెస్టులో కోహ్లి వ్యూహాలు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇచ్చాయి. తొలి సెషన్ అంతా దాదాపు భారత బౌలర్లంతా రౌండ్ ద వికెట్ వేశారు. వార్నర్ బ్యాటింగ్ సమయంలో ఎక్కువగా డీప్‌లో ఫీల్డింగ్ పెట్టడం కూడా కలిసి రాలేదు. రెండు సెషన్లలో కలిపి 50 ఓవర్లే వేయడంతో ఓవర్ రేట్ కూడా సమస్యగా మారింది. దాంతో కొత్త బంతికి ముందు అతను పార్ట్ టైమర్ విజయ్‌తో వరుసగా 12 ఓవర్లు వేయించాల్సి వచ్చింది. బౌలింగ్‌లో ఇషాంత్ కట్టడి చేసినా... షమీ, ఆరోన్ కలిసి వేసిన 34.2 ఓవర్లలో ఆసీస్ ఏకంగా 178 పరుగులు పిండుకుంది. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రోజర్స్ (సి) ధావన్ (బి) ఇషాంత్ 9; వార్నర్ (సి) ఇషాంత్ (బి) కరణ్ 145; వాట్సన్ (సి) ధావన్ (బి) ఆరోన్ 14; క్లార్క్ (రిటైర్డ్‌హర్ట్) 60; స్మిత్ (బ్యాటింగ్) 72; మిషెల్ మార్ష్ (సి) కోహ్లి (బి) ఆరోన్ 41; లయోన్ (బి) షమీ 3; హాడిన్ (సి) సాహా (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (89.2 ఓవర్లలో 6 వికెట్లకు) 354. వికెట్ల పతనం: 1-50; 2-88; 2-206 (రిటైర్డ్ నాటౌట్), 3-258; 4-345; 5-352; 6-354. బౌలింగ్: షమీ 17.2-1-83-2; ఆరోన్ 17-1-95-2; ఇషాంత్ 20-4-56-1; కరణ్ 23-1-89-1; విజయ్ 12-3-27-0. ‘జీవితాంతం నాకు తోడుగా నిలిచే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇది. 63 వద్ద ఆడుతున్న సమయంలో నా పరిస్థితి ఎలా ఉందో చెప్పలేను. స్పిన్నర్ బౌలింగ్ చేస్తున్నా నాకు నాటి భయంకర ఘటనే గుర్తుకొచ్చింది. కోలుకోవడానికి నాకు కొన్ని క్షణాలు పట్టింది. మేం పైకి చూసినప్పుడల్లా హ్యూస్ కూడా మా వైపే చూస్తూ ఉంటాడనే నమ్ముతున్నా. సెంచరీ చేశాక వేడుక చేసుకోవాలా, వద్దా అని నాలో నేను చాలా మధన పడ్డాను. కానీ నా శైలి హ్యూస్కు చాలా ఇష్టం. నేను ఎప్పుడూ ఇలాగే జంప్ చేయాలని అతను ఎప్పుడూ అతనికే అంకితమిస్తున్నా’ - డేవిడ్ వార్నర్ సెషన్ 1: బౌండరీల హోరు వార్మప్ మ్యాచ్‌లలో ఆకట్టుకున్న ఆరోన్, షమీ... భారీగా పరుగులు ఇచ్చారు. ఆరోన్ తొలి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన వార్నర్, ఆ తర్వాతి షమీ ఓవర్లో కూడా మరో మూడు ఫోర్లు బాది దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. మరో వైపు ఇషాంత్ తన రెండో ఓవర్లో రోజర్స్ (9)ను అవుట్ చేసి తొలి వికెట్ అందించాడు. 45 బంతుల్లోనే వార్నర్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ వెంటనే వాట్సన్ (14) వెనుదిరిగాడు. ఓవర్లు: 24, పరుగులు: 113, వికెట్లు: 2 సెషన్ 2: భారీ భాగస్వామ్యం... లంచ్ తర్వాత వార్నర్, క్లార్క్ కలిసి మరింత స్వేచ్ఛగా ఆడారు. ఏ బౌలర్ కూడా వీరిని ఇబ్బంది పెట్టలేకపోయారు. ఇదే క్రమంలో కరణ్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా సింగిల్ తీసి వార్నర్ 106 బంతుల్లో సెంచరీ మార్క్‌ను చేరుకోగా, 69 బంతుల్లో క్లార్క్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 118 పరుగులు జోడించిన తర్వాత వెన్ను నొప్పితో క్లార్క్ రిటైర్డ్‌హర్ట్ అయ్యాడు. ఓవర్లు: 26, పరుగులు: 125, వికెట్లు: 0 సెషన్ 3: కోలుకున్న భారత్ విరామం అనంతరం ఎట్టకేలకు భారత్‌కు బ్రేక్ లభించింది. భారీ షాట్ ఆడబోయిన వార్నర్, డీప్ మిడ్వికెట్లో ఇషాంత్‌కు క్యాచ్ ఇవ్వడంతో కరణ్‌కు టెస్టుల్లో తొలి వికెట్ దక్కింది. మరో వైపు స్మిత్ మాత్రం తగ్గలేదు. ఇటీవలి తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మిచెల్ మార్ష్ (87 బంతుల్లో 41; 5 ఫోర్లు)తో కలిసి స్కోరు బోర్డును నడిపించాడు. అయితే సరిగ్గా 80 ఓవర్ల తర్వాత తీసుకున్న కొత్త బంతి భారత్‌కు కలిసొచ్చింది. మార్ష్‌ను అవుట్ చేసి ఆరోన్ ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, షమీ వరుస ఓవర్లలో లయోన్ (3), హాడిన్ (0)లను అవుట్ చేసి సెషన్‌ను ముగించాడు. ఓవర్లు: 39.2, పరుగులు: 116, వికెట్లు: 4 ఘనంగా నివాళి రాకాసి బౌన్సర్‌కు తీవ్రంగా గాయపడి మృతి చెందిన తమ సహచరుడు ఫిలిప్ హ్యూస్కు ఆసీస్ క్రికెటర్లు ఘనంగా నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. తొలి రోజు ఆటలో వార్నర్, స్టీవెన్ స్మిత్ 63 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద బ్యాట్లు పెకైత్తి ఆకాశం వైపు చూసిస్తూ సహచరుడిని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో స్టేడియంలోని అభిమానులు కూడా లేచి నిలబడి తమ నివాళులు అర్పించారు. మ్యాచ్‌కు ముందు కూడా మైదానంలో భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. టర్ఫ్‌పై రాసిన ‘408’ నంబర్ ముందు ఆటగాళ్లు వరుసగా నిలబడి సరిగ్గా 63 సెకన్ల పాటు మౌనం పాటించారు. మ్యాచ్‌కు హాజరైన ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించారు. ఆటగాళ్ల కోరిక మేరకు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో 13వ ఆటగాడిగా హ్యూస్ పేరును అధికారికంగా ప్రకటించింది. క్లార్క్‌సేన తమ జెర్సీలపై 408 నంబర్‌ను రాసుకోగా... ఇరుజట్ల ఆటగాళ్లు భుజాలకు నల్లని బ్యాండ్లు ధరించారు. టాస్ వేసే సందర్భంగా కూడా కెప్టెన్లు క్లార్క్, కోహ్లిలు హ్యూస్‌ను మననం చేసుకున్నారు. హ్యూస్ లాకర్ వాట్సన్‌కి... హ్యూస్ మృతి చెంది రెండు వారాలు అవుతున్నా... సహచరుడి జ్ఞాపకాలను ఆసీస్ క్రికెటర్లు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అడిలైడ్ ఓవల్ మైదానంలో హ్యూస్ పేరిట ఉన్న లాకర్‌ను, డ్రెసింగ్ రూమ్‌లో అతనికి కేటాయించిన సీట్‌ను ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఉపయోగించుకుంటున్నాడు. దక్షిణ ఆస్ట్రేలియాను సొంత గడ్డగా చేసుకున్న హ్యూస్కు అడిలైడ్ ఓవల్ మైదానంతో ప్రత్యేక అనుబంధం ఉంది. దీంతో సహచరులు కూడా వాటిని గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు కెప్టెన్ క్లార్క్... టామ్ కూపర్‌కు చెందిన లాకర్లో తన వస్తువులను భద్రపర్చుకున్నాడు. హ్యూస్ మైదానంలో కుప్పకూలినప్పుడు రెండో ఎండ్‌లో ఉన్నది కూపరే. ఇతను హ్యూస్కు హౌస్‌మేట్‌తో పాటు మంచి స్నేహితుడు కూడా. తిరగబెట్టిన గాయం చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న మైకేల్ క్లార్క్‌కు మరోసారి గాయం తిరగబెట్టింది. పూర్తి ఫిట్‌గా లేకపోయినా హ్యూస్ స్మృతి కారణంగా కావచ్చు అతను అడిలైడ్ టెస్టు బరిలోకి దిగాడు. ఇషాంత్ వేసిన 44వ ఓవర్లో షార్ట్ బాల్‌ను తప్పించుకునే క్రమంలో వెనక్కి వంగిన క్లార్క్ నొప్పితో విలవిల్లాడాడు. స్వల్ప ఎక్సర్సైజ్ల తర్వాత కూడా ఇబ్బందిగా అనిపించడంతో అతను మైదానం వీడాడు. అనంతరం ఇంజక్షన్లు తీసుకున్న క్లార్క్ రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించే అవకాశం ఉంది. అయితే తాజా గాయం క్లార్క్ రెండో టెస్టు ఆడటంపై సందేహాలు పెంచింది. 19వ బంతికి... హ్యూస్ ఉదంతం నేపథ్యంలో టెస్టు సిరీస్ ఆరంభంలో బౌన్సర్లపై తీవ్ర చర్చ జరిగింది. అయితే ఆసీస్ సంగతేమో గానీ భారత్ మాత్రం వెనకడుగు వేయలేదు. తొలి మూడు ఓవర్లు సాధారణంగా గడిచాయి. నాలుగో ఓవర్ తొలి బంతికి ఆరోన్ బౌన్సర్ వేయడం, వార్నర్ కిందికి వంగి దానిని తప్పించుకోవడం వేగంగా జరిగాయి. ఆ సమయంలో మైదానమంతా హోరెత్తింది. వాట్సన్‌కు ఇషాంత్, క్లార్క్‌కు ఆరోన్ తొలి బంతిని బౌన్సర్లు వేశారు. కరణ్ శర్మ: నం. 283 ఈ మ్యాచ్‌తో లెగ్‌స్పిన్నర్ కరణ్ శర్మ టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టాడు. భారత్ తరఫున టెస్టు ఆడుతున్న 283వ ఆటగాడు కరణ్. 1990లో కుంబ్లే (మాంచెస్టర్) తర్వాత ఒక భారత స్పిన్నర్ ఉపఖండం బయట టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఇదే తొలి సారి. కరణ్‌కు ధోని క్యాప్‌ను అందజేశాడు. ‘ఈ టూర్లో ఒక్కసారైనా అవకాశం దక్కుతుందని ఆశ పడ్డాను. అది తొలి మ్యాచ్‌కే కావడం ఆనందంగా ఉంది. నాదైన శైలిలో బౌలింగ్ చేసేలా అంతా ప్రోత్సహించారు. దేశం తరఫున ఆడుతున్నప్పుడు ఉద్వేగాలను నియంత్రించుకోవాలి’అని కరణ్ చెప్పాడు. -
బౌన్సర్లతోనే మొదలు!
ప్రాక్టీస్‌లో నిమగ్నమైన ఆస్ట్రేలియా నెట్స్‌లో దూకుడు తగ్గించని క్రికెటర్లు నేడు క్లార్క్‌కు ఫిట్నెస్ టెస్ట్ అడిలైడ్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఎట్టకేలకు విషాదం వీడి ఆట వైపు కదిలింది. ఫిల్ హ్యూస్ మరణం, తదనంతర పరిణామాలు, అంత్యక్రియల తర్వాత జట్టు సభ్యులంతా ఇప్పుడు తొలి సారి పూర్తి స్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెట్టారు. మొదటి టెస్టు మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా ఆటగాళ్లు శుక్రవారం సుదీర్ఘ సమయం పాటు సాధన చేశారు. నెట్స్‌లో ప్రాక్టీస్ సందర్భంగా ఆసీస్ ఆటగాళ్లలోని సహజమైన దూకుడు బయట పడింది. హ్యూస్ దుర్ఘటన నేపథ్యంలో ఆ జట్టు బౌన్సర్లకు దూరంగా ఉండవచ్చని చాలా మంది విశ్లేషించారు. అయితే దీనిని పటాపంచలు చేస్తూ జట్టు పేసర్లు సెషన్ ఆసాంతం షార్ట్ పిచ్ బంతులే విసిరారు. మిషెల్ జాన్సన్, పీటర్ సిడిల్, జోష్ హాజల్‌వుడ్ తమ బ్యాట్స్‌మెన్‌కు వరుసగా బౌన్సర్లు సంధిం చారు. ప్రాక్టీస్ చూస్తే హ్యూస్ మృతి ప్రభావం ఆసీస్‌పై లేనట్లే కనిపించింది. ‘మేమెప్పుడూ ఇలాగే ఆడతాం. ఇదే తరహాలో ఆడి మేం మంచి ఫలితాలు సాధించాం కాబట్టి మారాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే టెస్టు క్రికెట్‌ను మా శైలిలోనే ఆడతాం. మా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంది’ అని ఈ సందర్భంగా ఆసీస్ కోచ్ డారెన్ లీమన్ వ్యాఖ్యానించారు. అండగా జూనియర్ బౌలర్లు: భారత జట్టు బలాలు, బలహీనతలపై దృష్టి పెట్టిన ఆస్ట్రేలియా జూనియర్ క్రికెటర్లను తమ ప్రాక్టీస్‌లో భాగం చేసింది. భారత్‌తో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఆడిన ఐదుగురు బౌలర్లు మొదటి టెస్టు వరకు ఆసీస్ టీమ్‌తోనే ఉండి వారికి సహకరిస్తారు. క్లార్క్ ఆడతాడా!: తొలి టెస్టులో క్లార్క్ బరిలోకి దిగడంపై దోబూచులాట ఇంకా కొనసాగుతోంది. శనివారం అతనికి ఫిట్నెస్ టెస్టు నిర్వహించనున్నారు. బౌన్సర్‌తో ప్రారంభించండి!: భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో విసిరే తొలి బంతి బౌన్సర్ కావాలని మాజీ పేసర్ మెర్వ్ హ్యూస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో వైపు పరిస్థితులను అర్థం చేసుకొని షెడ్యూల్లో మార్పులకు అంగీకరించిన భారత జట్టుకు, మేనేజ్మెంట్కు ఆసీస్ మాజీ క్రికెటర్, సీఏ డెరైక్టర్ మైకేల్ కాస్పరోవిచ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఆ ‘పిచ్’కూ రిటైర్మెంట్... బౌన్సర్ తగిలి ఫిల్ హ్యూస్ కుప్పకూలిన ఏడో నంబర్ పిచ్‌పై ఇక ముందు ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించబోమని సిడ్నీ మైదానం క్యురేటర్ పార్కర్ చెప్పాడు. -
ఎప్పటికీ మా మనస్సులోనే...
ఫిల్ హ్యూస్ మరణంతో క్రికెట్ ప్రపంచమే కాదు... యావత్ క్రీడాలోకం షాక్‌కు లోనయ్యింది. ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు... హాంకాంగ్ నుంచి హైదరాబాద్ దాకా ప్రతి క్రీడాకారుడు, క్రీడాభిమాని హ్యూస్కు ఘన నివాళి అర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లు తాము ఆడుతున్న, ఆడిన బ్యాట్లను ఇళ్ల బయట ఉంచి ‘పుట్ యువర్ బ్యాట్స్’ పేరుతో అతడిని స్మరించుకున్నారు. సిడ్నీ: ‘మరణంతో భౌతికంగా నువ్వు మాకు దూరమైనా... ఎప్పటికీ మా మనసుల్లో నిలిచే ఉంటావు....’ ఫిల్ హ్యూస్కు క్రీడాప్రపంచం అర్పించిన నివాళి ఇది. 25 ఏళ్ల చిన్నవయసులోనే మైదానంలో గాయపడి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన హ్యూస్... గురువారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్‌ల మొదలు స్కూల్ స్థాయి క్రికెట్ వరకు ప్రపంచంలో అన్ని మూలలా ఆటగాళ్లు హ్యూస్కు శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్యంగా ‘పుట్ యువర్ బ్యాట్స్’ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో సాగిన ప్రచారంలో ప్రముఖులంతా భాగమయ్యారు. తాము ఆడిన/ఆడుతున్న బ్యాట్లను ఇంటి బయట, మైదానంలో ఉంచి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆస్ట్రేలియా జట్టులో హ్యూస్ జెర్సీ నంబర్‌తో 408 ఫర్ ఎవర్, అతని ఆఖరి ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తూ 63 నాటౌట్ ఫర్ ఎవర్ అంటూ తమ ఆవేదనను పంచుకున్నారు. ఆస్ట్రేలియా మీడియా కూడా ఈ దురదృష్టకర వార్తను ప్రముఖంగా ప్రచురించి హ్యూస్కు తగిన విధంగా శ్రద్ధాంజలి ఘటించింది. శుక్రవారం ఉదయం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మొత్తం సిడ్నీ క్రికెట్ మైదానంలో సమావేశమైంది. ఈ సందర్భంగా హ్యూస్‌తో తమకున్న అనుబంధం, జ్ఞాపకాలను జట్టు సభ్యులు పంచుకున్నారు. దుబాయ్‌లోని ప్రధాన కార్యాలయం ముందు తమ సభ్య దేశాలైన 105 జట్ల తరఫున ఐసీసీ 105 బ్యాట్లను ఉంచింది. గూగుల్ ఆస్ట్రేలియా హోంపేజ్‌లో కూడా బ్యాట్‌ను ఉంచిన ఫోటోను డూడుల్‌గా పెట్టింది. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రధాన కార్యాలయంలో హ్యూస్ ఆఖరి స్కోరును గుర్తు చేస్తూ 63 బ్యాట్లను బయట ప్రదర్శించారు. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు కూడా ఆట ప్రారంభానికి ముందు ఇదే విధంగా చేశాయి. అనంతరం నిమిషం పాటు మౌనం పాటించి నివాళి అర్పించాయి. ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. కివీస్ క్రికెటర్లు తమ జెర్సీలపై పీ. హెచ్. (ఫిల్ హ్యూస్) అక్షరాలను రాసి మైదానంలోకి అడుగు పెట్టారు. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు జట్టు సభ్యుల సంతకాలతో కూడిన బ్యాట్‌ను బీసీసీఐ ప్రదర్శించింది. ఇందులో హ్యూస్ కూడా ఉన్నాడు. చాంపియన్ క్రికెటర్‌కు ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు బోర్డు పేర్కొంది. సచిన్ టెండూల్కర్ తన 25వ ఏట (హ్యూస్ వయసు) వాడిన బ్యాట్‌ను పుట్ యువర్ బ్యాట్స్ కోసం ప్రదర్శించాడు. భారత హాకీ జట్టు తమ హాకీ స్టిక్‌లను ఉంచగా, ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారులు ఆడమ్ స్కాట్, రోరీ మెకిల్రాయ్ తమ క్యాప్‌లకు నల్ల బ్యాండ్‌ను ధరించి నివాళి అర్పించారు. అమెరికాలోనూ పలువురు క్రీడాకారులు సంతాపం తెలిపారు. దక్షిణాఫ్రికా క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు రిచర్డ్స్, గిల్‌క్రిస్ట్, డీన్జోన్స్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు రైనా, రహానే తదితరులు కూడా తమ బ్యాట్‌ను ఉంచి సంఘీభావం ప్రకటించారు. టెన్నిస్ స్టార్స్ నాదల్, ముర్రే క్రికెటర్ కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు. ఆస్ట్రేలియాలో క్లబ్ క్రికెట్లో కొన్ని మ్యాచ్‌లను 63 ఓవర్ల పాటు నిర్వహించగా... ఓ మ్యాచ్‌లో జూనియర్ క్రికెటర్లు 63 పరుగులు చేయగానే రిటైర్ అయ్యారు. స్కూల్ క్రికెట్లో పిల్లలు ధరించేందుకు 408 నంబర్ ఉన్న క్యాప్‌లను అందించారు. సిడ్నీలో స్మారక సభ ఫిల్ హ్యూస్‌ను స్మరించుకునేందుకు వీలుగా త్వరలోనే స్మారక సభ నిర్వహించనున్నట్లు న్యూసౌత్‌వేల్స్ ప్రీమియర్ మైక్ బెయిర్డ్ ప్రకటించారు. హ్యూస్ కుటుంబ సభ్యులతో చర్చించి తేదీని ఖరారు చేస్తామని, సిడ్నీ క్రికెట్ మైదానంలో ఇది జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ మైదానంతో ఫిల్కు ఎంతో అనుబంధం ఉందని, అతడిని అభిమానించేవారంతా పెద్ద సంఖ్యలో రావాలని మైక్ కోరారు. -
ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ పరిస్థితి విషమం!
సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సిడ్నీలో స్థానిక జట్లతో క్రికెట్ ఆడుతున్న సందర్భంగా అతని తలకు బంతి తాకింది. సియాన్ అబోట్ వేసిన బౌన్సర్‌ను ఎదుర్కొంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఫిలిప్ హ్యూస్ తలకు తీవ్రంగా గాయమైంది. బంతి తలకు తాకగానే అతడు కుప్పకూలిపోయాడు. దాంతో హ్యూస్ ను హుటాహుటీన చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో సెయింట్ విన్సెంట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేశారు. కాగా హ్యూస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఆసీస్ కెప్టెన్ క్లార్క్.... హ్యూస్ ఆరోగ్యంపై వాకబు చేశాడు. ఈ సంఘటన జరిగినప్పుడు హ్యూస్ తల్లి, సోదరి క్రికెట్ గ్రౌండ్‌లోనే ఉన్నారు. కాగా ఫిల్ హ్యూస్ ఇప్పటివరకూ 25 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్ క్రికెట్లో పదో వికెట్‌కు 163 పరుగుల భాగస్వామ్యం అందించి రికార్డు సృష్టించాడు. గతనెల పాకిస్తాన్‌తో జరిగిన వన్డేల్లో అతను పాల్గొన్నాడు. అలాగే టీమిండియాతో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్‌కు హ్యూస్ పేరు పరిశీలనలోకి వచ్చింది. -
ఆసీస్ క్రికెటర్ హ్యూగ్స్ పరిస్థితి విషమం