మైదానంలోనే తుది శ్వాస...
గుండెపోటుతో ముంబైలో క్రికెటర్ మృతి
ముంబై: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ దుర్మరణం సంఘటన ఇంకా మదిలో మెదులుతుండగానే... మరో యువ క్రికెటర్ మైదానంలో తుది శ్వాస విడిచాడు. ఈ సంఘటన ముంబైలోని ఓవల్ మైదాన్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. టాటా గ్రూప్ ఆధ్వరంలో జరిగిన ఇంటర్ ఆఫీస్ టోర్నీ సందర్భంగా ఈ దుస్సంఘటన చోటు చేసుకుంది. పవర్ ట్రాంబే స్టేషన్ జట్టుకు చెందిన 29 ఏళ్ల రత్నాకర్ మోరె వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా గుండెలో నొప్పి రావడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. నిర్వాహకులు అప్పటికప్పుడు రత్నాకర్‌ను ఆసుపత్రికి తరలించగా... అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
రత్నాకర్ మృతితో టోర్నమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు టాటా స్పోర్ట్స్ క్రికెట్ వ్యవహారాలను పర్యవేక్షించే భారత జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ తెలిపారు. ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) గుర్తింపు పొందిన ఈ టోర్నీని టాటా పవర్ కంపెనీ గత రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తోంది.