బాధను మరచి... బ్యాట్ తో మెరిసి | Australia aggressive batting in first day | Sakshi
Sakshi News home page

బాధను మరచి... బ్యాట్ తో మెరిసి

Published Wed, Dec 10 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

బాధను మరచి... బ్యాట్ తో  మెరిసి

బాధను మరచి... బ్యాట్ తో మెరిసి

ఆస్ట్రేలియా దూకుడు
     
తొలి ఇన్నింగ్స్‌లో 354/6
వార్నర్ అద్భుత సెంచరీ
రాణించిన స్మిత్, క్లార్క్

 
భావోద్వేగాలు ఉన్నాయి... బౌన్సర్లూ ఉన్నాయి...
గుండెల్లో అభిమానం ఉంది... మైదానంలో దూకుడూ ఉంది...
ఆటలో ఆస్ట్రేలియన్లు తమ శైలిని మార్చుకోలేదు... అటు భారత ఆటగాళ్లూ వెనక్కి తగ్గలేదు...  అడిలైడ్‌లో తొలి రోజు దృశ్యాలివి...
 
 గత రెండు వారాల పరిణామాల అనంతరం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరినీ ఆట మరో సారి ఒక చోటికి చేర్చింది. ‘63’కు వందనం చేసినా... అందరూ ‘408’గా మారిపోయినా...విషాదం దాటి చివరకు క్రికెట్ విజేతగా నిలిచింది.
 
సహచరుడికి ఆటతోనే నివాళి ఇవ్వాలనుకుంటూ మైదానంలో దిగిన ఆస్ట్రేలియా మొదటి టెస్టులో తొలి రోజును తమదిగా మార్చుకుంది. చివర్లో టీమిండియా కూడా తేరుకొని కొంత వరకు పుంజుకుంది. అందరి అంచనాలకు అనుగుణంగా సిరీస్‌కు రసవత్తర ఆరంభం లభించింది.
 
అడిలైడ్: ఆత్మీయ స్నేహితుడు, సహచరుడు ఫిల్ హ్యూస్ రూపం మనసులో కదలాడుతుండగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన ఆటతోనే అతనికి సరైన నివాళి అందించాడు. వేడుక చేసుకోవాలో, లేదో తెలీని సందిగ్ధ స్థితిలోనూ తన అద్భుత ప్రదర్శనతో ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. వార్నర్ (163 బంతుల్లో 145; 19 ఫోర్లు) సూపర్ బ్యాటింగ్‌తో మంగళవారం భారత్‌తో ఇక్కడ ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆసీస్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు మంగళవారం ఆట ముగిసే సమయానికి 89.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్ (130 బంతుల్లో 72 బ్యాటింగ్; 9 ఫోర్లు) క్రీజ్‌లో ఉండగా... కెప్టెన్ క్లార్క్ (84 బంతుల్లో 60 రిటైర్డ్ హర్ట్; 9 ఫోర్లు) వెన్ను నొప్పి తిరగబెట్టడంతో మైదానం వీడాడు. ఒక దశలో 345/3తో ఉన్న ఆసీస్, 9 పరుగుల వ్యవధిలో తర్వాతి 3 వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో షమీ, ఆరోన్ చెరో రెండు వికెట్లు తీశారు. కరణ్, ఇషాంత్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.  రెండో రోజు బుధవారం ఆసీస్‌ను తొందరగా ఆలౌట్ చేస్తే భారత్ ఈ మ్యాచ్‌లో నిలబడే అవకాశం ఉంటుంది.

కెప్టెన్‌గా తొలి టెస్టులో కోహ్లి వ్యూహాలు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇచ్చాయి. తొలి సెషన్ అంతా దాదాపు భారత బౌలర్లంతా రౌండ్ ద వికెట్ వేశారు. వార్నర్ బ్యాటింగ్ సమయంలో ఎక్కువగా డీప్‌లో ఫీల్డింగ్ పెట్టడం కూడా కలిసి రాలేదు. రెండు సెషన్లలో కలిపి 50 ఓవర్లే వేయడంతో ఓవర్ రేట్ కూడా సమస్యగా మారింది. దాంతో కొత్త బంతికి ముందు అతను పార్ట్ టైమర్ విజయ్‌తో వరుసగా 12 ఓవర్లు వేయించాల్సి వచ్చింది. బౌలింగ్‌లో ఇషాంత్ కట్టడి చేసినా... షమీ, ఆరోన్ కలిసి వేసిన 34.2 ఓవర్లలో ఆసీస్ ఏకంగా 178 పరుగులు పిండుకుంది.  

 స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రోజర్స్ (సి) ధావన్ (బి) ఇషాంత్ 9; వార్నర్ (సి) ఇషాంత్ (బి) కరణ్ 145; వాట్సన్ (సి) ధావన్ (బి) ఆరోన్ 14; క్లార్క్ (రిటైర్డ్‌హర్ట్) 60; స్మిత్ (బ్యాటింగ్) 72; మిషెల్ మార్ష్ (సి) కోహ్లి (బి) ఆరోన్ 41; లయోన్ (బి) షమీ 3; హాడిన్ (సి) సాహా (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (89.2 ఓవర్లలో 6 వికెట్లకు) 354.
 వికెట్ల పతనం: 1-50; 2-88; 2-206 (రిటైర్డ్ నాటౌట్), 3-258; 4-345; 5-352; 6-354.
 బౌలింగ్: షమీ 17.2-1-83-2; ఆరోన్ 17-1-95-2; ఇషాంత్ 20-4-56-1; కరణ్ 23-1-89-1; విజయ్ 12-3-27-0.
 
‘జీవితాంతం నాకు తోడుగా నిలిచే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇది. 63 వద్ద ఆడుతున్న సమయంలో నా పరిస్థితి ఎలా ఉందో చెప్పలేను. స్పిన్నర్ బౌలింగ్ చేస్తున్నా నాకు నాటి భయంకర ఘటనే గుర్తుకొచ్చింది. కోలుకోవడానికి నాకు కొన్ని క్షణాలు పట్టింది. మేం పైకి చూసినప్పుడల్లా హ్యూస్ కూడా మా వైపే చూస్తూ ఉంటాడనే  నమ్ముతున్నా. సెంచరీ చేశాక వేడుక చేసుకోవాలా, వద్దా అని నాలో నేను చాలా మధన పడ్డాను. కానీ నా శైలి హ్యూస్‌కు చాలా ఇష్టం. నేను ఎప్పుడూ ఇలాగే జంప్ చేయాలని అతను ఎప్పుడూ అతనికే అంకితమిస్తున్నా’
 - డేవిడ్ వార్నర్
 
 
 సెషన్ 1:   బౌండరీల హోరు


వార్మప్ మ్యాచ్‌లలో ఆకట్టుకున్న ఆరోన్, షమీ... భారీగా పరుగులు ఇచ్చారు. ఆరోన్ తొలి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన వార్నర్, ఆ తర్వాతి షమీ ఓవర్లో కూడా మరో మూడు ఫోర్లు బాది దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. మరో వైపు ఇషాంత్ తన రెండో ఓవర్లో రోజర్స్ (9)ను అవుట్ చేసి తొలి వికెట్ అందించాడు. 45 బంతుల్లోనే వార్నర్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ వెంటనే వాట్సన్ (14) వెనుదిరిగాడు.
 ఓవర్లు: 24, పరుగులు: 113, వికెట్లు: 2
 
 సెషన్ 2:  భారీ భాగస్వామ్యం...

లంచ్ తర్వాత వార్నర్, క్లార్క్ కలిసి మరింత స్వేచ్ఛగా ఆడారు. ఏ బౌలర్ కూడా వీరిని ఇబ్బంది పెట్టలేకపోయారు. ఇదే క్రమంలో కరణ్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా సింగిల్ తీసి వార్నర్ 106 బంతుల్లో సెంచరీ మార్క్‌ను చేరుకోగా, 69 బంతుల్లో క్లార్క్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 118 పరుగులు జోడించిన తర్వాత వెన్ను నొప్పితో క్లార్క్ రిటైర్డ్‌హర్ట్ అయ్యాడు.
 ఓవర్లు: 26, పరుగులు: 125, వికెట్లు: 0
 
 సెషన్ 3:    కోలుకున్న భారత్

విరామం అనంతరం ఎట్టకేలకు భారత్‌కు బ్రేక్ లభించింది. భారీ షాట్ ఆడబోయిన వార్నర్, డీప్ మిడ్‌వికెట్‌లో ఇషాంత్‌కు క్యాచ్ ఇవ్వడంతో కరణ్‌కు టెస్టుల్లో తొలి వికెట్ దక్కింది. మరో వైపు స్మిత్ మాత్రం తగ్గలేదు. ఇటీవలి తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మిచెల్ మార్ష్ (87 బంతుల్లో 41; 5 ఫోర్లు)తో కలిసి స్కోరు బోర్డును నడిపించాడు. అయితే సరిగ్గా 80 ఓవర్ల తర్వాత తీసుకున్న కొత్త బంతి భారత్‌కు కలిసొచ్చింది. మార్ష్‌ను అవుట్ చేసి ఆరోన్ ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, షమీ వరుస ఓవర్లలో లయోన్ (3), హాడిన్ (0)లను అవుట్ చేసి సెషన్‌ను ముగించాడు.
 ఓవర్లు: 39.2, పరుగులు: 116, వికెట్లు: 4
 
 
 
ఘనంగా నివాళి

 రాకాసి బౌన్సర్‌కు తీవ్రంగా గాయపడి మృతి చెందిన తమ సహచరుడు ఫిలిప్ హ్యూస్‌కు ఆసీస్ క్రికెటర్లు ఘనంగా నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. తొలి రోజు ఆటలో వార్నర్, స్టీవెన్ స్మిత్ 63 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద బ్యాట్లు పెకైత్తి ఆకాశం వైపు చూసిస్తూ సహచరుడిని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో స్టేడియంలోని అభిమానులు కూడా లేచి నిలబడి తమ నివాళులు అర్పించారు. మ్యాచ్‌కు ముందు కూడా మైదానంలో భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. టర్ఫ్‌పై రాసిన ‘408’ నంబర్ ముందు ఆటగాళ్లు వరుసగా నిలబడి సరిగ్గా 63 సెకన్ల పాటు మౌనం పాటించారు. మ్యాచ్‌కు హాజరైన ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించారు. ఆటగాళ్ల కోరిక మేరకు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో 13వ ఆటగాడిగా హ్యూస్ పేరును అధికారికంగా ప్రకటించింది. క్లార్క్‌సేన తమ జెర్సీలపై 408 నంబర్‌ను రాసుకోగా... ఇరుజట్ల ఆటగాళ్లు భుజాలకు నల్లని బ్యాండ్లు ధరించారు. టాస్ వేసే సందర్భంగా కూడా కెప్టెన్లు క్లార్క్, కోహ్లిలు హ్యూస్‌ను మననం చేసుకున్నారు.
 
 హ్యూస్ లాకర్ వాట్సన్‌కి...

హ్యూస్ మృతి చెంది రెండు వారాలు అవుతున్నా... సహచరుడి జ్ఞాపకాలను ఆసీస్ క్రికెటర్లు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అడిలైడ్ ఓవల్ మైదానంలో హ్యూస్ పేరిట ఉన్న లాకర్‌ను, డ్రెసింగ్ రూమ్‌లో అతనికి కేటాయించిన సీట్‌ను ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఉపయోగించుకుంటున్నాడు. దక్షిణ ఆస్ట్రేలియాను సొంత గడ్డగా చేసుకున్న హ్యూస్‌కు అడిలైడ్ ఓవల్ మైదానంతో ప్రత్యేక అనుబంధం ఉంది. దీంతో సహచరులు కూడా వాటిని గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు కెప్టెన్ క్లార్క్... టామ్ కూపర్‌కు చెందిన లాకర్‌లో తన వస్తువులను భద్రపర్చుకున్నాడు. హ్యూస్ మైదానంలో కుప్పకూలినప్పుడు రెండో ఎండ్‌లో ఉన్నది కూపరే. ఇతను హ్యూస్‌కు హౌస్‌మేట్‌తో పాటు మంచి స్నేహితుడు కూడా.
 
తిరగబెట్టిన గాయం

చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న మైకేల్ క్లార్క్‌కు మరోసారి గాయం తిరగబెట్టింది. పూర్తి ఫిట్‌గా లేకపోయినా హ్యూస్ స్మృతి కారణంగా కావచ్చు అతను అడిలైడ్ టెస్టు బరిలోకి దిగాడు. ఇషాంత్ వేసిన 44వ ఓవర్లో షార్ట్ బాల్‌ను తప్పించుకునే క్రమంలో వెనక్కి వంగిన క్లార్క్ నొప్పితో విలవిల్లాడాడు. స్వల్ప ఎక్సర్‌సైజ్‌ల తర్వాత కూడా ఇబ్బందిగా అనిపించడంతో అతను మైదానం వీడాడు. అనంతరం ఇంజక్షన్‌లు తీసుకున్న క్లార్క్ రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించే అవకాశం ఉంది. అయితే తాజా గాయం క్లార్క్ రెండో టెస్టు ఆడటంపై సందేహాలు పెంచింది.
 
 19వ బంతికి...

 హ్యూస్ ఉదంతం నేపథ్యంలో టెస్టు సిరీస్ ఆరంభంలో బౌన్సర్లపై తీవ్ర చర్చ జరిగింది. అయితే ఆసీస్ సంగతేమో గానీ భారత్ మాత్రం వెనకడుగు వేయలేదు. తొలి మూడు ఓవర్లు సాధారణంగా గడిచాయి. నాలుగో ఓవర్ తొలి బంతికి ఆరోన్ బౌన్సర్ వేయడం, వార్నర్ కిందికి వంగి దానిని తప్పించుకోవడం వేగంగా జరిగాయి. ఆ సమయంలో మైదానమంతా హోరెత్తింది. వాట్సన్‌కు ఇషాంత్, క్లార్క్‌కు ఆరోన్ తొలి బంతిని బౌన్సర్లు వేశారు.  
 
 కరణ్ శర్మ: నం. 283


ఈ మ్యాచ్‌తో లెగ్‌స్పిన్నర్ కరణ్ శర్మ టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. భారత్ తరఫున టెస్టు ఆడుతున్న 283వ ఆటగాడు కరణ్. 1990లో కుంబ్లే (మాంచెస్టర్) తర్వాత ఒక భారత స్పిన్నర్ ఉపఖండం బయట టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఇదే తొలి సారి. కరణ్‌కు ధోని క్యాప్‌ను అందజేశాడు. ‘ఈ టూర్‌లో ఒక్కసారైనా అవకాశం దక్కుతుందని ఆశ పడ్డాను. అది తొలి మ్యాచ్‌కే కావడం ఆనందంగా ఉంది.  నాదైన శైలిలో బౌలింగ్ చేసేలా అంతా ప్రోత్సహించారు. దేశం తరఫున ఆడుతున్నప్పుడు ఉద్వేగాలను నియంత్రించుకోవాలి’అని కరణ్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement