ఎప్పటికీ మా మనస్సులోనే...
ఫిల్ హ్యూస్ మరణంతో క్రికెట్ ప్రపంచమే కాదు... యావత్ క్రీడాలోకం షాక్‌కు లోనయ్యింది. ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు... హాంకాంగ్ నుంచి హైదరాబాద్ దాకా ప్రతి క్రీడాకారుడు, క్రీడాభిమాని హ్యూస్‌కు ఘన నివాళి అర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లు తాము ఆడుతున్న, ఆడిన బ్యాట్లను ఇళ్ల బయట ఉంచి ‘పుట్ యువర్ బ్యాట్స్’ పేరుతో అతడిని స్మరించుకున్నారు.
సిడ్నీ: ‘మరణంతో భౌతికంగా నువ్వు మాకు దూరమైనా... ఎప్పటికీ మా మనసుల్లో నిలిచే ఉంటావు....’ ఫిల్ హ్యూస్‌కు క్రీడాప్రపంచం అర్పించిన నివాళి ఇది. 25 ఏళ్ల చిన్నవయసులోనే మైదానంలో గాయపడి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన హ్యూస్... గురువారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్‌ల మొదలు స్కూల్ స్థాయి క్రికెట్ వరకు ప్రపంచంలో అన్ని మూలలా ఆటగాళ్లు హ్యూస్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.
ముఖ్యంగా ‘పుట్ యువర్ బ్యాట్స్’ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో సాగిన ప్రచారంలో ప్రముఖులంతా భాగమయ్యారు. తాము ఆడిన/ఆడుతున్న బ్యాట్‌లను ఇంటి బయట, మైదానంలో ఉంచి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆస్ట్రేలియా జట్టులో హ్యూస్ జెర్సీ నంబర్‌తో 408 ఫర్ ఎవర్, అతని ఆఖరి ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తూ 63 నాటౌట్ ఫర్ ఎవర్ అంటూ తమ ఆవేదనను పంచుకున్నారు. ఆస్ట్రేలియా మీడియా కూడా ఈ దురదృష్టకర వార్తను ప్రముఖంగా ప్రచురించి హ్యూస్‌కు తగిన విధంగా శ్రద్ధాంజలి ఘటించింది.
శుక్రవారం ఉదయం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మొత్తం సిడ్నీ క్రికెట్ మైదానంలో సమావేశమైంది. ఈ సందర్భంగా హ్యూస్‌తో తమకున్న అనుబంధం, జ్ఞాపకాలను జట్టు సభ్యులు పంచుకున్నారు.
దుబాయ్‌లోని ప్రధాన కార్యాలయం ముందు తమ సభ్య దేశాలైన 105 జట్ల తరఫున ఐసీసీ 105 బ్యాట్లను ఉంచింది.
గూగుల్ ఆస్ట్రేలియా హోంపేజ్‌లో కూడా బ్యాట్‌ను ఉంచిన ఫోటోను డూడుల్‌గా పెట్టింది. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రధాన కార్యాలయంలో హ్యూస్ ఆఖరి స్కోరును గుర్తు చేస్తూ 63 బ్యాట్‌లను బయట ప్రదర్శించారు.
పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు కూడా ఆట ప్రారంభానికి ముందు ఇదే విధంగా చేశాయి. అనంతరం నిమిషం పాటు మౌనం పాటించి నివాళి అర్పించాయి. ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగారు. కివీస్ క్రికెటర్లు తమ జెర్సీలపై పీ. హెచ్. (ఫిల్ హ్యూస్) అక్షరాలను రాసి మైదానంలోకి అడుగు పెట్టారు.
రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు జట్టు సభ్యుల సంతకాలతో కూడిన బ్యాట్‌ను బీసీసీఐ ప్రదర్శించింది. ఇందులో హ్యూస్ కూడా ఉన్నాడు. చాంపియన్ క్రికెటర్‌కు ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు బోర్డు పేర్కొంది.
సచిన్ టెండూల్కర్ తన 25వ ఏట (హ్యూస్ వయసు) వాడిన బ్యాట్‌ను పుట్ యువర్ బ్యాట్స్ కోసం ప్రదర్శించాడు.
భారత హాకీ జట్టు తమ హాకీ స్టిక్‌లను ఉంచగా, ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారులు ఆడమ్ స్కాట్, రోరీ మెకిల్‌రాయ్ తమ క్యాప్‌లకు నల్ల బ్యాండ్‌ను ధరించి నివాళి అర్పించారు. అమెరికాలోనూ పలువురు క్రీడాకారులు సంతాపం తెలిపారు.
దక్షిణాఫ్రికా క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు రిచర్డ్స్, గిల్‌క్రిస్ట్, డీన్‌జోన్స్‌లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు రైనా, రహానే తదితరులు కూడా తమ బ్యాట్‌ను ఉంచి సంఘీభావం ప్రకటించారు.
టెన్నిస్ స్టార్స్ నాదల్, ముర్రే క్రికెటర్ కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు.
ఆస్ట్రేలియాలో క్లబ్ క్రికెట్‌లో కొన్ని మ్యాచ్‌లను 63 ఓవర్ల పాటు నిర్వహించగా... ఓ మ్యాచ్‌లో జూనియర్ క్రికెటర్లు 63 పరుగులు చేయగానే రిటైర్ అయ్యారు. స్కూల్ క్రికెట్‌లో పిల్లలు ధరించేందుకు 408 నంబర్ ఉన్న క్యాప్‌లను అందించారు.
సిడ్నీలో స్మారక సభ
ఫిల్ హ్యూస్‌ను స్మరించుకునేందుకు వీలుగా త్వరలోనే స్మారక సభ నిర్వహించనున్నట్లు న్యూసౌత్‌వేల్స్ ప్రీమియర్ మైక్ బెయిర్డ్ ప్రకటించారు. హ్యూస్ కుటుంబ సభ్యులతో చర్చించి తేదీని ఖరారు చేస్తామని, సిడ్నీ క్రికెట్ మైదానంలో ఇది జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ మైదానంతో ఫిల్‌కు ఎంతో అనుబంధం ఉందని, అతడిని అభిమానించేవారంతా పెద్ద సంఖ్యలో రావాలని మైక్ కోరారు.