ఫిల్ హ్యూస్(ఫైల్ ఫోటో)
కేప్ టౌన్:ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మరణించి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. 2014, నవంబర్ 25వ తేదీన సిడ్నీ గ్రౌండ్లో దేశవాళీ మ్యాచ్లో పాల్గొన్న హ్యూస్కు చివరి మ్యాచ్ అదే. సీన్ అబాట్ వేసిన బౌన్సర్ కు అతని మెడ వెనుక భాగాన తగిలి హ్యూస్ గ్రౌండ్లోనే కుప్పుకూలిపోయాడు. ఆ తరువాత రెండు రోజులకు హ్యూస్ తుదిశ్వాస విడిచాడు. అయితే ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించి న్యాయ విచారణ కొనసాగుతోంది.
ప్రత్యర్థి జట్టు వ్యూహంలో భాగంగానే హ్యూస్ కు బౌన్సర్లు సంధించి అతని మృతికి పరోక్షంగా కారణమయ్యారంటూ పలువురు ఆటగాళ్లతో పాటు అతని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో దానిపై విచారణ సాగుతోంది. సీన్ అబాట్ వేసిన బౌన్సర్ కు ముందు హ్యూస్ వద్దకు బొలింజర్ వచ్చి చంపుతానంటూ బెదిరించడంటూ వచ్చిన ఆరోపణలపై ప్రధానంగా విచారణ చేపట్టారు. ఈ మేరకు చివరి రోజు విచారణ మరో మలుపు తిరిగింది.
ఆ సమయంలో హ్యూస్ తో క్రీజ్ లో ఉన్న బ్యాటింగ్ పార్టనర్ టామ్ కూపర్ అటువంటిది ఏమీ జరగలేదని పేర్కొన్నాడు. బొలింజర్ నుంచి చంపేస్తానని వ్యాఖ్యలు వినలేదని కూపర్ తాజాగా తెలిపాడు. దీనిపై హ్యూస్ కుటుంబం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానంగా హ్యూస్ తండ్రి గ్రెగ్ హ్యూస్ తీవ్ర ఆవేదన చెందినట్లు తెలుస్తోంది.