న్యూఢిల్లీ: అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు క్రీడాలోకం నివాళులు అర్పించింది. పలువురు దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, షట్లర్ సింధు, గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్‌లు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటు. ఆయన సేవల్ని జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.
–సచిన్ టెండూల్కర్
రెస్ట్ ఇన్ పీస్ మన్మోహన్‌జీ. మీ జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకం. 2013లో మీతో ముచ్చటించిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. –షట్లర్ పీవీ సింధు
మన్మోహన్ సింగ్ మరణవార్త నన్ను తీవ్రంగా బాధించింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచాక ఆయనతో నేను భేటీ అయ్యాను. ఆయన నాయకత్వం, ప్రధానిగా ఎంచుకున్న దీర్ఘకాలిక లక్ష్యాలవల్లే భారత్ వృద్ధి సాధించింది. ఆయన సేవలు జాతి ఎన్నటికీ మరువదు. –షూటర్ అభినవ్ బింద్రా
నా జీవితంలో నేను కలిసి అతిగొప్ప వ్యక్తుల్లో మన్మోహన్ ఒకరు. దార్శనికతలో ఆయన్ని మించినవారు లేరు. ప్రపంచం గొప్ప జ్ఞానిని కోల్పోయింది. –గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్
మన్మోహన్ ప్రధాని మాత్రమే కాదు. దేశ ప్రగతి కోసం నిరంతరం పాటుపడిన ఆర్తికవేత్త. ఆయన దూరదృష్టి, ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశాన్ని ముందుకు నడిపించాయి. –మాజీ రెజ్లర్, ఎమ్మెల్యే వినేశ్ ఫొగాట్
మాజీ ప్రధాని మన్మోహన్ గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్‌ను ప్రగతిపథంలో నిలిపేందుకు అలుపెరగని కృషి చేశారు. బరువెక్కిన హృదయంతో ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. –యువరాజ్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment