
సాక్షి, తాడేపల్లి: భారతదేశం గర్వించదగిన మహానాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని ప్రశంసించారు వైఎస్సార్‌సీపీ నాయకులు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగాయి. ఈ వేడుకల్లో మాజీమంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు అరుణ్ కుమార్, రమేష్ యాదవ్ , మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..‘అంటరానితనం , అస్పృశ్యతను ఎదుర్కొని స్వాతంత్ర పోరాటంలో బాబు జగజ్జీవన్ రామ్ పాల్గొన్నారు. ఆయన ఆశయాలు దేశమంతా కొనసాగాలి. ఆయన ఆలోచనలను భుజాన వేసుకున్న నాయకుడు వైఎస్ జగన్. అధికారం వస్తే బడుగు బలహీన వర్గాలను పైకి ఎలా తీసుకురావాలో చేసి చూపిన వ్యక్తి జగన్. గొప్ప ఆలోచనతో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఏర్పాటు చేశారు. కానీ, ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద కరెంట్ లేని పరిస్థితి నెలకొంది. అంబేద్కర్ విగ్రహానికి దండేసే పరిస్థితి లేదు.

ప్రైవేట్ వ్యక్తులతో వ్యాపారం చేయిస్తున్నారు. బాబు జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ ఆలోచనలకు తిలోదకాలిచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దళితులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎంతో మంది దళితులు ఊరు వదిలి వెళ్లిపోవడానికి కారణం ఈ ప్రభుత్వం కాదా. వైఎస్ జగన్ వెంట మనమంతా నడిస్తేనే భావితరాల ఆశయాలు నెరవేరతాయి. మా పార్టీ నాయకులను అన్ని రోజులు జైళ్లలో పెట్టాల్సిన అవసరం ఏముంది?. టీడీపీ నాయకులు తప్పులు చేయడం లేదా?.
మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ..‘బాబు జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన వ్యక్తి వైఎస్ జగన్. గత ఐదేళ్లు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జగన్ కృషి చేశారు. ఐదేళ్ల పాలనలో ఎక్కడా రక్తం చిందిన పరిస్థితి లేదు. రాష్ట్రంలో కూటమి పది నెలల పాలనలో విధ్వంసం జరిగింది. ఎస్పీ, బీసీ, మైనార్టీ, ఎస్టీలపై అక్రమ కేసులు పెట్టారు. దాడులుఉ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోంది.

ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ..‘బాబు జగజ్జీవన్ రామ్ రాజకీయంగా ఎన్నో అత్యున్నత పదవులు అలంకరించారు. ఆ స్థాయిలో దళితులకు అన్ని పదవులు ఇచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్. దళితులను హోంమంత్రి చేసిన ఘనత జగన్‌కే చెల్లింది. దళితులను ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరిగేలా చేశారు. ఆకాశమే హద్దులా దళితులకు జగన్ అవకాశం కల్పించారు. జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్. అందుకు ఉదాహరణే విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు. ఈ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహానికి కనీసం దండ కూడా వేయలేని పరిస్థితిలో ఉంది. ఈ ప్రభుత్వం దళితుల పట్ల చూపుతున్న వివక్షకు చరమగీతం పాడాలి.

మాజీ ఎమ్మెల్యే, టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. ‘దళితులు, బలహీనవర్గాలు సముచితమైన స్థానం సాధించేందుకు బాబు జగజ్జీవన్ రామ్ కృషి చేశారు. జగజ్జీవన్ రామ్ అడుగుజాడల్లో వైఎస్ జగన్ నడుస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ..‘సమాజంలో వెనుకబడిన వర్గాల కోసం పాటుపడిన మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్. చరిత్ర ఉన్నంత వరకూ ఈ సమాజం బాబు జగజ్జీవన్ రామ్ గుర్తుండిపోతారు. జగజ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం జగన్ పనిచేశారు అని అన్నారు.