ఆరు వికెట్లతో చెలరేగిన వెబ్‌స్టర్(PC: cricket.com.au X)
ఆస్ట్రేలియా దేశీ టోర్నీ వన్డే కప్‌లో వెస్టర్న్ ఆస్ట్రేలియాకు ఊహించని పరాభవం ఎదురైంది. టాస్మానియాతో మ్యాచ్‌లో 52 పరుగుల వద్ద కేవలం రెండు వికెట్లు కోల్పోయిన ఈ జట్టు.. ఈ స్కోరుకు కేవలం ఒక్క పరుగు జతచేసి మిగిలిన ఎనిమిది వికెట్లు నష్టపోయింది. ఆ ఒక్క రన్ కూడా వైడ్ రూపంలో విశేషం. మరి డిఫెండింగ్ చాంపియన్ వెస్టర్న్ ఆస్ట్రేలియాకు ఇంత భారీ షాకిచ్చిన ఆ బౌలర్లు ఎవరంటే?!
లిస్ట్-ఏ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన టాస్మానియా కెప్టెన్ జోర్డాన్ సిల్క్.. వెస్టర్న్ ఆస్ట్రేలియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో ఓపెనర్ ఆరోన్ హార్డీ(7)ని పేసర్ టామ్ రోజర్స్ అవుట్ చేయగా.. మరో ఓపెనర్ ఆర్సీ షార్ట్(22) వికెట్‌ను బ్యూ వెబ్‌స్టర్ పడగొట్టాడు.
వన్‌డౌన్ బ్యాటర్ బాన్‌క్రాఫ్ట్(14) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకన్నాడు. ఈ క్రమంలో వెస్టర్న్ ఆస్ట్రేలియా 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. అయితే, ఆ తర్వాతి ఓవర్ నుంచే టాస్మానియా స్పిన్నర్ బ్యూ వెబ్‌స్టర్ తన మ్యాజిక్ మొదలుపెట్టాడు.
16వ ఓవర్లో రెండు వికెట్లు తీయగా.. వెస్టర్న్ ఆస్ట్రేలియా స్కోరు 52-4గా మారింది. ఇక ఆ తర్వాత వెబ్‌స్టర్ వెనుదిరిగి చూడలేదు. పేసర్ బిల్లీ స్టాన్‌లేక్‌తో కలిసి.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దిమ్మతిరిగేలా షాకిస్తూ వరుసగా పెలివియన్‌కు పంపాడు.
వెస్టర్న్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బిల్లీ స్టాన్‌లేక్ రెండు వికెట్లు కూల్చగా.. 18వ ఓవర్ ఆఖరి బంతికి వెబ్‌స్టర్ తనఖాతాలో మరో వికెట్ జమచేసుకున్నాడు. అదే విధంగా.. 20వ ఓవర్లో మరో రెండు వికెట్లు తీసిన ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్.. ఆ మరుసటి ఓవర్లో పదో వికెట్‌ను కూల్చాడు. దీంతో వెస్టర్న్ ఆస్ట్రేలియా 20.1 ఓవర్లలో 53 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ క్రమంలో 28 బంతుల వ్యవధిలో వైడ్ రూపంలో ఒక్క పరుగు పొంది.. వెస్టర్న్ ఆస్ట్రేలియా ఏకంగా ఎనిమిది వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఇక 53 పరుగులకే చాప చుట్టేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా వన్డే కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.
మరోవైపు.. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టాస్మానియా కేవలం 8.3 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 55 పరుగులు చేసింది. వెస్టర్న్ ఆస్ట్రేలియాపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
ఆరు వికెట్లతో చెలరేగిన బ్యూ వెబ్‌స్టర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక వెస్టర్న్ ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ఆర్సీ షార్ట్ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: IND vs NZ 2nd Test: చెత్త షాట్ ఆడి క్లీన్ బౌల్డ్ అయిన కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment