ఆసీస్ ఆధిక్యం కొనసాగేనా?
అడిలైడ్: ప్రతీకార పోరుగా భావిస్తున్న యాషెస్ సిరీస్‌లో రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. తొలి టెస్టులో ఘోరంగా ఓడిన ఇంగ్లండ్ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలని ప్రయత్నిస్తుండగా... సొంతగడ్డపై ఆధిక్యాన్ని కొనసాగించాలని ఆసీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి (గురువారం) నుంచి అడిలైడ్‌లో ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అదరగొడుతున్న ఆసీస్ ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో క్లార్క్, వార్నర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.
కానీ టాప్ ఆర్డర్‌లో మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం అందడం లేదు. వాట్సన్, రోజర్స్, స్మిత్‌ల నుంచి భారీ ఇన్నింగ్స్‌లు రావాల్సి ఉంది. మిడిలార్డర్‌లో హాడిన్, జాన్సన్ రాణిస్తుండటం ఆసీస్‌కు లాభిస్తోంది. ఇక బౌలింగ్‌లో జాన్సన్ ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. స్థిరంగా 150 కి.మీ వేగంతో బంతులు విసురుతూ కుక్ సేనను వణికించాడు. ఓ రకంగా చెప్పాలంటే తొలి టెస్టులో జాన్సన్ బౌలింగ్ వల్లే ఆసీస్ గెలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ టెస్టులో కూడా ఈ యువ బౌలర్ సత్తా చాటుతాడా? ఈ మ్యాచ్‌లోనూ కంగారులకు ఆధిక్యాన్ని అందిస్తాడా? అన్నదే ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్న అంశం.
మరోవైపు తొలి టెస్టు ఓటమితో ఇంగ్లండ్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. బ్యాటింగ్‌లో కుక్ మినహా... మిగతా బ్యాట్స్‌మన్ నిరాశపరుస్తున్నారు. పీటర్సన్, బెల్, రూట్‌లు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. అనుభవజ్ఞుడైన ట్రాట్ మానసిక ఒత్తిడి కారణంగా సిరీస్ నుంచి వైదొలగడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ. అయితే ఈ స్థానంలో బెల్, రూట్, బాలెన్స్‌లలో ఎవర్ని పంపుతారన్నది ఆసక్తికరం. ఆరంభంలో బ్రాడ్ బంతితో చెలరేగినా.. చివర్లో ప్రభావం చూపలేకపోతున్నాడు.