మహిళల యాషెస్ సిరీస్-2025లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఇవాళ (జనవరి 12) జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆష్లే గార్డ్‌నర్ ఆల్‌రౌండ్ షోతో (3/19, 42 నాటౌట్) అదరగొట్టి ఆసీస్‌ను గెలిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 43.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లు తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.
ఆష్లే గార్డ్‌నర్ మూడు, కిమ్ గార్త్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, అలానా కింగ్ తలో రెండు, డార్సీ బ్రౌన్ ఓ వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హీథర్ నైట్ (39), వ్యాట్ హాడ్జ్ (38), ఆమీ జోన్స్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. టామీ బేమౌంట్ (13), నాట్ సీవర్ బ్రంట్ (19), సోఫీ ఎక్లెస్టోన్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. మయా బౌచియర్ 9, అలైస్ క్యాప్సీ 4, చార్లీ డీన్ 1, లారెన్ బెల్ 1, లారెన్ ఫైలర్ 8 (నాటౌట్) పరుగులు చేశారు.
అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 38.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అలైసా హీలీ (70) ఆసీస్ గెలుపుకు పునాది వేయగా.. ఆష్లే గార్డ్‌నర్ (44 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) తన జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 4, ఎల్లిస్ పెర్రీ 14, బెత్ మూనీ 28, అన్నాబెల్ సదర్‌ల్యాండ్ 10, తహిళ మెక్‌గ్రాత్ 2, అలానా కింగ్ 11 (నాటౌట్) పరుగులు చేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్ తలో రెండు, లారెన్ బెల్, చార్లెట్ డీన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మెల్‌బోర్న్ వేదికగా జనవరి 14న జరుగనుంది. కాగా, మూడు వన్డేలు, మూడు టీ20లు, ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఈ మ్యాచ్‌లన్నీ జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment